Skip to main content

Education Commission: విశ్వవిద్యాలయాల పరిస్థితిపై విద్యా కమిషన్‌ సూచన!.. వర్సిటీలకు న్యాక్‌ గుర్తింపు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిధులు, నియామకాల లేమితో కునారిల్లుతున్నాయని.. వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విద్యా కమిషన్‌ తేల్చినట్టు సమాచారం.
EDUCATION COMMISSIONS REFERENCE ON THE CONDITION OF UNIVERSITIES IN THE STATE

బోధన సిబ్బంది కొరత, తాత్కాలిక అధ్యాపకులతో నెట్టుకురావడం, అరకొర నిధులు వంటి కారణాలతో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు దెబ్బతింటున్నాయని గుర్తించినట్టు తెలిసింది. ప్రస్తుతం కనీస స్థాయి పరిశోధనలైనా చేపట్టలేని దైన్య స్థితిలో వర్సిటీలు ఉన్నాయని.. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తక్షణమే చర్యలు చేపట్టకుంటే కనీస ప్రమాణాలు కూడా కరువయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి స్పష్టం చేయనున్నట్టు సమాచారం.

చదవండి: TG Universities: యూనివర్సిటీల్లో నాణ్యత మెరుగుకు కావాల్సినవి ఇవే.. బోధన సిబ్బంది పరిస్థితి ఇదీ..

ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనున్నట్టు కమిషన్‌ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి.. వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలు, నేరుగా పరిశీలించిన అంశాలు, తీసుకోవాల్సిన చర్యలతో ఈ నివేదికను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి.

పోటీ ఎక్కడ?

మన వర్సిటీలు కనీసం జాతీయ స్థాయిలోనూ పోటీ పడలేని పరిస్థితి ఉందని విద్యా కమిషన్‌ గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో రెండింటికి ‘జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్‌ (న్యాక్‌)’ గ్రేడ్‌ కూడా రాలేదని.. ‘ఎ’ ప్లస్‌ గ్రేడ్‌ దక్కించుకున్న వర్సిటీలు కేవలం రెండేనని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. వర్సిటీల్లో 2,825 అధ్యాపక పోస్టులుండగా.. ప్రస్తుతమున్న రెగ్యులర్‌ సిబ్బంది 873 మంది మాత్రమేనని.. బోధన, బోధనేతర సిబ్బందిని కలిపి చూసినా 74 శాతం పోస్టులు ఖాళీయేనని పేర్కొన్నాయి. అంతా తాత్కాలిక సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారని తెలిపాయి.

చదవండి: NAAC: పారితోషికం రూ.లక్ష ఇస్తామన్నా ఆసక్తి చూపని యాజమాన్యాలు

ప్రాజెక్టులు డొల్ల.. పరిశోధనలు కల్ల..

  • వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కీలకమైన పరిశోధనలు క్రమంగా తగ్గుతున్నాయి. 2020–21లో రూ.52.45 కోట్ల విలువైన ప్రాజెక్టులొస్తే.. 2022–23 నాటికి ఇది రూ.24.75 కోట్లకు తగ్గింది. ఇక్కడ 1,267 మంది బోధన సిబ్బందికిగాను 340 మందే రెగ్యులర్‌ వారున్నారు. మిగతా అంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారే. వారికి పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించే అవకాశం లేదు. జాతీయ స్థాయిలో గుర్తింపున్న ఈ వర్సిటీకి గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వ శాఖల పరిశోధన ప్రాజెక్టులూ అరకొరగానే వస్తున్నాయి.
  • రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్యకు ఆయువు పట్టు అయిన జేఎన్టీయూహెచ్‌ కొత్త సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.200 కోట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకున్నవారు లేరు. వర్సిటీలో 410 మంది ఫ్యాకల్టీకిగాను ఉన్నది 169 మందే. దీనితో కీలకమైన ఇంజనీరింగ్‌ బోధనలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి.
  • మెరికల్లాంటి గ్రామీణ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాసరలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) క్రమంగా వైభవాన్ని కోల్పోతోంది. 2008 నుంచి 2024 ఏప్రిల్‌ వరకూ ఇక్కడ 21 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం దారుణం. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ లేదు. ల్యాప్‌టాప్‌లు, ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.
  • పాలమూరు వర్సిటీలో పరిస్థితి దారుణంగా ఉందని కమిషన్‌ దృష్టికొచ్చింది. పేరుకు రూ.10 కోట్ల నిధులు కేటాయించినా రూ.7 కోట్లు కూడా అందడం లేదని.. కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకే నెలకు రూ.1.28 కోట్లు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. నిధుల కోసం విద్యార్థుల పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, బోధన రుసుములపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోందని అంటున్నారు. 
  • తెలంగాణ వర్సిటీకి 152 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరైతే... ఉన్నది 61 మందే. 12 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులున్న ఈ వర్సిటీని అకడమిక్‌ కన్సల్టెంట్లు, పార్ట్‌ టైం అధ్యాపకులతో నెట్టకొస్తున్నారు. వర్సిటీకి కనీసం రూ.250 కోట్ల తక్షణ నిధులు అవసమని అంచనా.
  • కాకతీయ వర్సిటీలోనూ పరిశోధనలు సగం మేర తగ్గిపోయాయి. 405 అధ్యాపక పోస్టులకుగాను 83 మందే రెగ్యులర్‌ వారు. మిగతా అంతా తాత్కాలిక సిబ్బందే. నిజానికి ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులను కలిపితే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలని అంచనా.
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

రాష్ట్రంలోని వర్సిటీలకు న్యాక్‌ గుర్తింపు ఇదీ..

యూనివర్సిటీ

న్యాక్‌ గ్రేడ్‌

ఓయూ

ఏ ప్లస్‌

కాకతీయ

ఏ ప్లస్‌

జేఎన్టీయూహెచ్‌

పీయూ, ఎంజీయూ

బి

తెలంగాణ

బి

ఆర్జీయూకేటీ

బి

ఆర్కిటెక్చర్‌

బి

అంబేడ్కర్‌

శాతవాహన

యూనివర్సిటీలలో బోధన సిబ్బంది పరిస్థితి ఇదీ..

యూనివర్సిటీ

మొత్తం పోస్టులు

ఉన్న సిబ్బంది

ఖాళీలు

ఉస్మానియా

1,257

376

891

కాకతీయ

409

86

323

జేఎన్టీయూహెచ్‌

410

169

241

అంబేడ్కర్‌

86

34

52

తెలంగాణ

152

61

91

మహాత్మాగాంధీ

70

35

35

పాలమూరు

95

21

74

శాతవాహన

63

16

47

జేఎన్‌ ఫైనార్ట్స్‌

55

17

58

పీఎస్‌టీయూ

72

14

58

ఆర్జీయూకేటీ

146

19

127

యూనివర్సిటీల స్థాయి పెరగాలి
విశ్వవిద్యాలయాలకు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు కాదు.. అంతర్జాతీయ గుర్తింపు అవసరం. అది సాధ్యం కావాలంటే వర్సిటీల స్థాయి, ప్రమాణాలు పెరగాలి. బోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలి. లైబ్రరీ, పరిశోధన అవకాశాలు, సరికొత్త టెక్నాలజీలను సమకూర్చాలి. ఈ అంశాలన్నింటిపై సమగ్ర అధ్యయనం చేశాం. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నాం.
– ఆకునూరి మురళి, విద్యా కమిషన్‌ చైర్మన్‌  

Published date : 20 Jan 2025 01:12PM

Photo Stories