Skip to main content

ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..

ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ వంటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ఐటీ రంగంలో అవకాశాలకు కొదవలేదు.

అయితే ఐటీ రంగంలో చోటుచేసుకుంటున్న తాజా మార్పులకు అనుగుణంగా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలపై పట్టు సాధించడం ప్రధానం అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఎలాంటి నైపుణ్యాలు ఉన్న వారికి అవకాశాలు దక్కుతున్నాయి.. ఏయే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై పట్టు సాధించడం లాభిస్తుందో తెలుసుకుందాం...

కొత్త టెక్నాలజీ:
ఐటీ రంగంలో టెక్నాలజీ ఒరవడి నిరంతరం మారుతూనే ఉంటుంది. నూతన టెక్నాలజీలు, కంప్యూటర్ లాంగ్వేజెస్ ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటాయి. సరికొత్త కంప్యూటర్ లాంగ్వేజెస్ మార్కెట్‌లో హడావుడి చేస్తుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, బ్లాక్ చెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఏఆర్, వీఆర్ రియాలిటీ, క్లౌడ్ టెక్నాలజీలు ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఉపాధి కల్పనలో ముందు వరుసలో నిలుస్తున్నాయి.

పైథాన్ :
ఉద్యోగ సాధనలో కీలకమైన కంప్యూటర్ లాంగ్వేజ్.. పైథాన్. డేటాసైన్స్‌లో అనలిటిక్స్, కోడింగ్‌కు పైథాన్ లాంగ్వేజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డేటాసైన్స్‌లో పైథాన్‌తోపాటు ఆర్, మట్‌ల్యాబ్, అక్టేవ్, మ్యాథమెటికా/సాగా వంటి టెక్నాలజీలు వస్తున్నా.. పైథాన్‌లో ఉన్న లైబ్రరీలు, కమ్యూనిటీ మద్దతు వల్ల జాబ్ మార్కెట్‌లో దీనికే ఆదరణ ఎక్కువగా ఉంది. పైగా పైథాన్‌ను సులువుగా నేర్చుకోవచ్చనేది సాఫ్ట్‌వేర్ నిపుణులు చెబుతున్న మాట. కోడింగ్ రాయడానికి సమర్థవంతమైన లైబ్రరీలు అందుబాటులో ఉండటం వల్ల సీ, సీ++, జావా కంటే పైథాన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జాబ్ మార్కెట్‌లో అత్యంత ఆదరణ కలిగిన కంప్యూటర్ లాంగ్వేజ్‌గా పైథాన్‌ను పేర్కొనొచ్చు.

జావా స్క్రిప్ట్ :
హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్ తెలిసి ఉంటే.. జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం సులువు. జావాస్క్రిప్ట్‌ను క్లైయిండ్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌గా ఉపయోగిస్తారు. హెచ్‌టీఎంఎల్ పేజీల్లో జావాస్క్రిప్ట్‌ను రాస్తే.. అది బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారు. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌లో.. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్ కంటే శక్తివంతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. హెచ్‌టీఎంఎల్‌లో వెబ్ కంటెంట్‌లో పేరాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, డేటాటేబుల్స్, ఎంబడెడ్ ఇమేజెస్, వీడియోస్ వంటివి పేజీలో కుదర్చవచ్చు. సీఎస్‌ఎస్‌లో ఆ కంటెంట్‌కు బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, ఫాంట్స్, లేఅవుట్ లాంటి డిజైన్లు చేసే అవకాశం ఉంది. జావాస్క్రిప్ట్‌తో వెబ్‌పేజీలకు ‘డైనమిజం’ ఇవ్వొచ్చు. ఇంకా మల్టీమీడియా కంట్రోల్,2డీ,3డీ యానిమేషన్ ఇమేజ్‌లు ప్రవేశపెట్టే ఆధునిక ఫీచర్లుంటాయి. మొత్తంగా వెబ్‌సైట్‌ను ఆకర్షణీయంగా, రిచ్‌గా తీర్చిదిద్ది, యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించడంలో జావాస్క్రిప్ట్ ఉత్తమ టూల్. ఈ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్‌పై పట్టు సాధిస్తే.. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. డెస్క్‌టాప్, గేమ్ డెవలప్‌మెంట్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తారు.

జావా :
ఐటీ రంగంలో జావా కంప్యూటర్ లాంగ్వేజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా కంప్యూటర్ లాంగ్వేజ్‌లు కొంతకాలానికే కనుమరుగైపోతాయి. కానీ జావా మాత్రం మరింత ఆదరణ పొందుతూ వస్తోంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో జావా లాంగ్వేజ్‌దే అగ్రస్థానం. ప్రపంచంలోని అత్యధిక మంది సాఫ్ట్‌వేర్ నిపుణులు కలిగి ఉన్న స్కిల్ జావా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటి మంది జావా డెవలపర్లు ఉన్నట్లు అంచనా. జావా లాంగ్వేజ్ నైపుణ్యాలుంటే.. మార్కెట్‌లో వచ్చే ఇతర టెక్నాలజీలను సులువుగా నేర్చుకోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఫ్రెషర్స్.. కోర్‌జావా, అడ్వాన్స్‌డ్ జావాపై శిక్షణ పొందితే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.

క్లౌడ్ టెక్నాలజీలు :
ప్రపంచవ్యాప్తంగా సంస్థలన్నీ తమ కార్యకలాపాల నిర్వహణకు క్లౌడ్ టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి. ప్రముఖ కంపెనీల క్లౌడ్ సర్వీసెస్‌పై శిక్షణ పొందిన మానవ వనరులకు డిమాండ్ ఏర్పడింది. సేల్స్‌ఫోర్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థల క్లౌడ్ టెక్నాలజీపై ఉద్యోగాలు లభిస్తాయి.

డెవాప్స్ :
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్లాన్, కోడింగ్, టెస్టింగ్, ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేయడం, డిప్లాయ్, ఆపరేషన్, మానిటరింగ్, మార్పులు-చేర్పులు.. ఇలా అనేక దశలు. సాఫ్ట్‌వేర్ సంస్థలు కొన్ని ‘మోడల్స్’ ప్రకారం మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తాయి. అందులో భాగంగా వాటర్‌ఫాల్ మోడల్, ఏజైల్ మోడల్స్ లాంటి వాటిని సంస్థలు అనుసరిస్తూ ఉంటాయి. ఆయా ‘మోడల్స్’లోని కొన్ని ప్రతికూలతలు సంస్థలకు సవాలుగా మారుతున్నాయి. వాటిని అధిగమించేందుకు ‘డెవాప్స్ (ఈ్ఛఠిౌఞట)’ ఉపయోగపడుతుంది. ఇందులో డెవలపర్స్, ఆపరేషన్స్ విభాగాల సభ్యులు కలిసి ‘ఉత్పాదకత’ పెంచేందుకు కృషి చేస్తారు. అంటే.. ఏ ఒక్క ఉద్యోగి పని ఒక దశలోనే ఆగిపోకుండా.. ఒక జట్టుగా సాఫ్ట్‌వేర్ డెలివరీ, మెయింటెనెన్స్ వరకు కలిసి పనిచేస్తారు. డెవలపర్స్, సిస్టమ్ అడ్మిన్స్, టెస్టర్స్.. మొదలైన వాళ్లందరూ డెవాప్స్ ఇంజనీర్లుగా కలిసి పనిచేస్తారు. డెవాప్స్ నైపుణ్యాలు ఉన్నవారు ప్రస్తుతం ఉద్యోగం పొందడం సులభం.

యూఐ, యూఎక్స్ :
వెబ్‌సైట్లు, యాప్స్ రూపకల్పనలో యూజర్ ఇంటర్‌ఫేస్(యూఐ), యూజర్ ఎక్స్‌పీరియెన్స్(యూఎక్స్) టెక్నాలజీలకు డిమాండ్ అధికం. వీరికి మొబైల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే ట్రెండింగ్ టెక్నాలజీలైన వీఆర్, ఏఆర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఐవోటీ టెక్నాలజీల్లో..యూఐ, యూఎక్స్ టెక్నాలజీ తెలిసిన వారికి చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌గా పిలిచే ఈ టెక్నాలజీల్లో బహుళ నైపుణ్యాలు అవసరం. జావా స్క్రిప్ట్ స్కిల్స్ ఉన్న వారు ఉద్యోగం సొంతం చేసుకోవడం తేలిక. ఇక హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడతాయి. ప్రధానంగా యాంగులర్ జేఎస్, రియాక్ట జేఎస్, నోడ్ జేఎస్, జెక్వెరీ తదితర టెక్నాలజీలపై దృష్టి పెట్టడం మేలు.

హెచ్‌టీఎంఎల్ :
వెబ్ పేజీలను డెవలప్ చేయడంలో హెచ్‌టీఎంఎల్(హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్)ది ప్రధాన పాత్ర. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాకున్నా.. వెబ్ అప్లికేషన్లు క్రియేట్‌చేయడంలో హెచ్‌టీఎంఎల్‌ని ఉపయోగిస్తారు. దీనితో ప్రత్యేకంగా ఉద్యోగాలు పొందే అవకాశం లేకున్నా.. వెబ్ డిజైనర్‌గా, వెబ్ డెవలపర్‌గా రాణించాలంటే.. మాత్రం హెచ్‌టీఎంఎల్ పరిజ్ఞానం అవసరం.

సీఎస్‌ఎస్ :
కాస్కేడింగ్ స్టైల్ షీట్స్(సీఎస్‌ఎస్)ను హెచ్‌టీఎంఎల్ వెబ్‌పేజీలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం కోసం ఉపయోగిస్తారు. వెబ్‌పేజీలో కలర్స్, ఫాంట్, టెక్ట్స్, ఇమేజ్, లింక్స్, టేబుల్స్, బార్డర్స్, మార్జిన్స్, ఔట్‌లైన్స్, డెమైన్షన్స్, స్క్రోల్‌బార్, పొజిషనింగ్, యానిమేషన్స్.. మొదలైన ఎన్నో ఫీచర్లు హెచ్‌టీఎంఎల్ పేజీలకు సీఎస్‌ఎస్ ద్వారా ఇచ్చే వీలుంది. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లను డిజైనింగ్, డెవలప్‌మెంట్ కోసం వినియోగించే ఇతర సాఫ్ట్‌వేర్‌లలోనూ ఉపయోగిస్తారు. యాంగులర్ జేఎస్, పీహెచ్‌పీ టెక్నాలజీలపై పనిచేసే క్రమంలో.. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌లు ఉపయోగించాల్సి ఉంటుంది.

ఎస్‌క్యూఎల్ :
డేటాబేస్ డెవలప్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. వీరికి వేతనాలు కూడా ఎక్కువే. డేటాబేస్‌కు సంబంధించి ఎస్‌క్యూఎల్ (స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్)ను ప్రాథమిక లాంగ్వేజ్‌గా చెప్పొచ్చు. డేటాబేస్‌లో సమాచారాన్ని స్టోర్ చేయడానికి, దాన్ని అవసరాల మేరకు వినియోగించుకోవడానికి క్వెరీ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. సంస్థల రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టం (డీబీఎంఎస్)ల నుంచి డేటాయాక్సెస్, స్టోరింగ్ కోసం ఎస్‌క్యూఎల్‌ను ఉపయోగిస్తున్నారు. మైఎస్‌క్యూఎల్, ఒరాకిల్, ఇన్ఫోమిక్స్, సైబేస్, ఎంఎస్ యాక్సెస్ వంటివన్నీ ఆర్(రిలేషనల్) డీబీఎంఎస్‌లు ఎస్‌క్యూఎల్‌ను ప్రామాణిక డేటా క్వెరీ లాంగ్వేజ్‌గా ఉపయోగిస్తున్నాయి. ఐటీ రంగంలో ఇతర కోర్సులు, టెక్నాలజీలు కొత్తగా ప్రవేశిస్తున్నా... రిలేషనల్ డీబీఎంఎస్‌కు సంబంధించి ఎస్‌క్యూఎల్‌కు ఉన్న ఫీచర్స్ దృష్ట్యా ఉత్తమ కోర్సుగా నిలుస్తోంది. ఎస్‌క్యూఎల్‌తోపాటు ఇతర డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులకు ఐటీ రంగంలో ఎప్పటికీ అవకాశాలు తగ్గవని నిపుణులు చెబుతున్నారు.

పీహెచ్‌పీ :
వెబ్ డెవలప్‌మెంట్‌లో పీహెచ్‌పీతోనూ అవకాశాలు అందుకోవచ్చు. వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి పీహెచ్‌పీ (హైపర్ టెక్ట్స్ ప్రీ-ప్రాసెసర్) ఉపయోగిస్తారు. డైనమిక్ కంటెంట్ క్రియేట్ చేసి.. దాన్ని డేటాబేస్‌తో అనుసంధానం చేయడానికి పీహెచ్‌పీని వినియోగిస్తారు. దీన్ని సర్వర్ సైడ్ లాంగ్వేజ్‌గా పరిగణిస్తారు. ఇది ఉచిత లాంగ్వేజ్ కావడంతో మార్కెట్‌లో, వెబ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది మై ఎస్‌క్యూఎల్, ఓరాకిల్, సైబేస్ లాంటి ఆర్‌డీబీఎంఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. పీహెచ్‌పీలో ఉన్న సులువైన ఫంక్షన్స్, మెథడ్స్, సింటాక్స్ వల్ల ఈ లాంగ్వేజ్‌కు మార్కెట్‌లో ఆదరణ ఎక్కువ. ఇతర టెక్నాలజీలు, లాంగ్వేజ్‌లతో పోలిస్తే పీహెచ్‌పీ నేర్చుకోవడం సులువు.

ఏఐతో అవకాశాలు :
ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ కామర్స్ రంగాల్లో ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డేటాసైన్స్ మొదలైన ట్రెండింగ్ కోర్సులపై కనీస అవగాహన ఉన్నా.. ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్‌లో ఏఐ ప్రొఫెషనల్స్‌కు విస్తృత అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఫ్రెషర్స్ ఏఐ స్కిల్స్ పొందేందుకు కృషి చేయాలి.
-జాయిస్ మాస్టర్, సీఈవో, షైన్ డాట్ కామ్.

Published date : 11 Dec 2019 12:17PM

Photo Stories