Skip to main content

Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

దేశవాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ఊపందుకుంటోంది. బీటెక్‌ అడ్మిషన్ల సందడి నెలకొంది! దాంతో ఏ బ్రాంచ్‌తో భవిష్యత్తు బాగుంటుంది..? ఎలాంటి కాలేజీలో జాయిన్ అయితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..? నాలుగేళ్ల తర్వాత జాబ్‌ మార్కెట్లో ఎలాంటి ట్రెండ్‌ ఉంటుంది.. ప్రస్తుతం ఎలా ఉంది.. ఏ బ్రాంచ్‌ ఎంచుకుంటే మంచిది.. కాలేజీ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలా ఎన్నో సందేహాలు విద్యార్థులకు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో.. బీటెక్‌ ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు బ్రాంచ్, కాలేజీ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆయా బ్రాంచ్‌లతో అవకాశాలు,  జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌ తదితర అంశాలపై ప్ర‌త్యేక గైడెన్స్ మీకోసం..

దేనికి ప్రాధాన్యం ఇవ్వాలంటే..?
☛ ప్రస్తుతం పదుల సంఖ్యలో ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లు.. వందల సంఖ్యలో కళాశాలలు. దాంతో విద్యార్థులు బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీ ముఖ్యమా.. అనే సందిగ్ధంలో ఉంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం–బ్రాంచ్‌ ఎంపికలో విద్యార్థులు.. ఆసక్తికి, అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
☛ బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏ బ్రాంచ్‌లో చేరినా.. సదరు ఇన్‌స్టిట్యూట్‌కున్న ప్రామాణికత ఆధారంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కానీ.. విద్యార్థులు తమకు ఆసక్తి లేని బ్రాంచ్‌లో చేరితే.. నాలుగేళ్ల పాటు సదరు సబ్జెక్టులను చదవడం కష్టతరంగా మారే ఆస్కారముంది.

బ్రాంచ్‌లపైనా కూడా..
విద్యార్థులకు తమకు నచ్చిన బ్రాంచ్‌లో సీటు లభించే అవకాశాలు తక్కువగా ఉంటే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. ప్రధాన బ్రాంచ్‌లకు అనుబంధంగా కొత్త బ్రాంచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సీఎస్‌ఈకి అనుబంధంగా ఐటీని; ఈసీఈకి అనుబంధంగా ఈటీఎం(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికం మేనేజ్‌మెంట్‌)ను; మెకానికల్‌కు అనుబంధంగా ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ లేదా ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌ వంటివి. వీటిని ఎంచుకోవచ్చు. 

కాలేజీ ఎంపికలో..

Engineering colleges Admissions


ఇన్‌స్టిట్యూట్‌ ఎంపికలో.. విద్యార్థులు ప్రధానంగా నిబంధనలకు అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించాలి. ఫ్యాకల్టీ అర్హతలు, ప్రొఫెసర్ల సంఖ్య, న్యాక్, ఎన్‌బీఏ తదితర సంస్థల గుర్తింపు సదరు ఇన్‌స్టిట్యూట్‌కు ఉందా అనేది తెలుసుకోవాలి. అకడెమిక్‌రికార్డ్, ప్లేస్‌మెంట్స్, పీహెచ్‌డీ ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ, మౌలిక వసతుల ఆధారంగా ఇన్‌స్టిట్యూట్స్‌జాబితా రూపొందించుకోవాలి. ఆయా కళాశాలలకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించాలి.

తొలి ప్రాధాన్యం దీనికే..
బీటెక్‌లో చేరనున్న విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. బీటెక్‌లో చేరిన విద్యార్థులు కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో అవకాశం వచ్చిన విద్యార్థులు.. బ్రాంచ్‌విషయంలో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న కరిక్యులం ప్రకారం–ఇంటర్‌డిసిప్లినరీ విధానంలో బోధన సాగుతోంది. దీంతో విద్యార్థులు మేజర్‌తోపాటు మైనర్‌గా తమకు నచ్చిన బ్రాంచ్‌కు సంబంధించిన అంశాల్లో నైపుణ్యం పొందే అవకాశం ఉంది.
                                                                        - ప్రొ.ఎన్‌.వి.రమణరావు, డైరెక్టర్, నిట్‌ వరంగల్‌

Published date : 08 Aug 2022 02:56PM

Photo Stories