Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!
పదోతరగతి.. ఇంటర్మీడియెట్.. విద్యార్థుల భవిష్యత్తుకు కీలక మలుపు. ఈ కోర్సుల తర్వాత వేసే అడుగులు కెరీర్‌ను నిర్దేశిస్తాయి! టెన్త్, ఇంటర్ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించే వీలు లేని వారు లేదా.. పదో తరగతి, ఇంటర్ అర్హతతోనే.. ‘కొలువులో చేరిపోదాం’ అనే ఆలోచనతో ఉన్న అభ్యర్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. అవకాశాలు ఏంటి.. ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకొని ముందడుగు వేయాలి. పది, ఇంటర్ అర్హతతో.. అందుబాటులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొలువుల గురించి తెలుసుకుందాం...
- పదో తరగతి, ఇంటర్మీడియెట్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో పలు అవకాశాలు
పదో తరగతి ఉత్తీర్ణుల నుంచి డిగ్రీ అభ్యర్థుల వరకూ.. ఎక్కువ మంది సర్కారీ కొలువు కోరుకుంటున్నారనడంలో సందేహం లేదు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతతో పలు ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తే.. 18 లేదా 21 ఏళ్ల వయసులోనే ప్రభుత్వ కొలువు దక్కించుకోవచ్చు.
చదవండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ కొలువు
ఎస్‌ఎస్‌సీ.. సీహెచ్‌ఎస్‌ఎల్
దేశంలోనే అతిపెద్ద రిక్రూట్‌మెంట్ ఏజెన్సీగా గుర్తింపు పొందిన సంస్థ.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ). ప్రతి ఏటా ఇంటర్మీడియెట్ అర్హతగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(సీహెచ్‌ఎస్‌ఎల్) పేరుతో ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో ఎల్‌డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్ వంటి పలు ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపడుతుంది.
- టైర్–1, టైర్–2, టైర్–3 పేరుతో మూడు దశలుగా ఉండే సీహెచ్‌ఎస్‌ఎల్ ఎంపిక ప్రక్రియలో.. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో రాత పరీక్షలు, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- టైర్–1 దశలో.. 200 మార్కులకు నిర్వహించే పరీక్షలో.. ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్‌ల్లో ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు చొప్పున వంద ప్రశ్నలు అడుగుతారు.
- టైర్–1లో చూపిన ప్రతిభ ఆధారంగా.. డిస్క్రిప్టివ్ విధానంలో టైర్–2 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్,ప్రెసిస్ రైటింగ్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వంద మార్కులకు ఉంటుంది.
- టైర్–2లోనూ నిర్దేశిత మార్కులతో విజయం సాధించిన వారికి ఆయా పోస్ట్‌లకు అనుగుణంగా టైర్–3 దశలో స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. టైర్–2లో పొందిన మార్కుల ఆధారంగా.. ఆయా పోస్ట్‌లకు ఎంపిక చేసే ముందు స్కిల్ టెస్ట్ పేరుతో డేటాఎంట్రీ స్కిల్స్, టైపింగ్ స్కిల్స్‌లో పరీక్ష నిర్వహిస్తారు. కొన్ని నిర్దేశిత పోస్ట్‌లకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధించిన వారికి కొలువులు ఖరారు చేస్తారు.
- వివరాలకు వెబ్‌సైట్: https://www.ssc.nic.in/
ఆర్‌ఆర్‌బీ.. టెక్నికల్ ఉద్యోగాలు
ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో భారతీయ రైల్వే ముందంజలో ఉంటుందని చెప్పొచ్చు. ఇండియన్ రైల్వేలోని గ్రూప్–సి ఉద్యోగాలు ఈ కోవలోకి వస్తాయి. ఇందుకోసం సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇంటర్‌తోపాటు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా అర్హతతోనూ గ్రూప్–సి ఉద్యోగాల భర్తీ చేపడతారు. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్–3 పేరుతో పలు టెక్నికల్ విభాగాల్లో సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగాలు గ్రూప్–సి పరిధిలోకి వస్తాయి. ఇంటర్మీడియెట్ అర్హతతో ట్రాఫిక్ అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్ వంటి నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు కూడా పోటీ పడొచ్చు.
- ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తారు. అసిస్టెంట్ లోకో పైలెట్, టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడిగా రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) ఉంటుంది.
- మొదటి దశలో జనరల్ అవేర్‌నెస్(40 ప్రశ్నలు), మ్యాథమెటిక్స్(30 ప్రశ్నలు); జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(30 ప్రశ్నలు) విభాగాల్లో మొత్తం వంద మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
- మొదటి దశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులోనూ జనరల్ అవేర్‌నెస్(50 ప్రశ్నలు), మ్యాథమెటిక్స్(35 ప్రశ్నలు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(35 ప్రశ్నలు) విభాగాల్లో 120 ప్రశ్నలు ఉంటాయి.
- వివరాలకు వెబ్‌సైట్: https://indianrailways.gov.in/
ఎన్‌డీఏతో.. డిగ్రీ + కొలువు
ఇంటర్మీడియెట్ అర్హతతో అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్న మరో పరీక్ష.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్(ఎన్‌డీఏ). యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఏటా నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధించడం ద్వారా.. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవల్ అకాడమీల్లో కొలువుతోపాటు డిగ్రీ సర్టిఫికెట్ కూడా సొంతమవుతుంది.
- ఆర్మీ కేడెట్స్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఎస్సీ/బీఏ డిగ్రీ; నేవల్, ఎయిర్‌ఫోర్స్ కేడెట్‌గా శిక్షణ పొందిన వారికి బీటెక్ పట్టా లభిస్తుంది. అంతేకాకుండా పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో త్రివిధ దళాల్లో కెరీర్ ప్రారంభమవుతుంది.
- ఎన్‌డీఏ నియామక విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. తొలిదశలో 900 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన వారికి తదుపరి దశలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల ఆధ్వర్యంలోని సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌లు మరో 900 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వీటిలో విజయం సాధించిన వారికి ఆయా అకాడమీల్లో క్యాడెట్ ట్రైనీలుగా అవకాశం కల్పిస్తారు.
- వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in
చదవండి: Indian Navy Agniveer Recruitment: 2,800 అగ్నివీర్–ఎస్‌ఎస్‌ఆర్ పోస్ట్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
ఆర్మీ.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్
ఇంటర్ అర్హతతో అందుబాటులో ఉన్న మరో చక్కటి అవకాశం..ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణత సాధించి.. జేఈఈ–మెయిన్ ఉత్తీర్ణత పొందిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు త్రివిధ దళాలలకు చెందిన మిలటరీ అకాడమీలలో శిక్షణ లభిస్తుంది. ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే.. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, మెకానికల్, నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో బీటెక్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కెరీర్ ప్రారంభించొచ్చు. వీటికోసం ఇండియన్ ఆర్మీ, నేవీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.
రాష్ట్ర స్థాయిలో.. పోలీస్ కానిస్టేబుల్స్
రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియెట్ అర్హతతో పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్‌లు అందుబాటులో ఉంటాయి. మూడు దశలుగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలి దశలో ప్రిలిమినరీ రాత పరీక్ష, రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మూడో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. తొలి దశ ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. వీటిలోనూ సత్తా చాటిన వారికి చివరగా మెయిన్ ఎగ్జామినేషన్ 200 మార్కులకు ఉంటుంది. ఈ మూడు దశల్లోనూ విజేతలుగా నిలిచిన వారికి కానిస్టేబుల్‌గా కొలువు ఖరారు చేస్తారు.
అబ్కారీ, రవాణా శాఖలో కానిస్టేబుల్
రాష్ట్ర స్థాయిలోనే ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్, రవాణా శాఖలో ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరుగుతుంది. ఇంటర్‌తోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి.. విద్యార్హతలతోపాటు లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగుండటం తప్పనిసరి. రాత పరీక్ష, ఫిజికల్ క్వాలిఫైయింగ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మాత్రం కేవలం రాత పరీక్ష ఆధారంగానే తుది జాబితా రూపొందిస్తారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్
- పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు శాఖల్లో కొలువుదీరేందుకు మార్గం.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే మల్టీ టాస్కింగ్ ఉద్యోగ నియామకాలు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేపడతారు.
- ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే పేపర్–1 రాత పరీక్షలో.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(25 ప్రశ్నలు); న్యూమరికల్ ఎబిలిటీ(25 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్(25 ప్రశ్నలు) విభాగాల నుంచి వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- ఇటీవల కాలంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ లెవల్ రిక్రూట్‌మెంట్ పేరుతో ఒకే నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపడుతోంది. తొలి దశలో నాలుగు విభాగాల్లో.. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి తదుపరి దశలో అవసరమైతే స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- వివరాలకు వెబ్‌సైట్: www.ssc.nic.in
చదవండి: What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం