What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం
పదో తరగతి.. ప్రతి విద్యార్థి జీవితంలో.. కీలకమైన దశ! భవిష్యత్తును దిశానిర్దేశం చేసే దశ! పదో తరగతి తర్వాత.. అకడమిక్‌గా వేసే అడుగులే.. విద్యార్థి కెరీర్ అవకాశాలను, భవిష్యత్తునూ నిర్ణయిస్తాయి! ఇంతటి కీలకమైన.. పదోతరగతి దశ దాటిన విద్యార్థులు.. తమకు సరితూగే కోర్సు ఏది? అని ఆరా తీస్తున్నారు! ఏ కోర్సులో అడుగుపెడితే.. భవిష్యత్తు అవకాశాలు బాగుంటాయనే అన్వేషణ సాగిస్తున్నారు! తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్నారు. ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో.. పదోతరగతి తర్వాత అందుబాటులో ఉన్న అకడమిక్ మార్గాలు.. భవిష్యత్తు అవకాశాలు.. ఆయా కోర్సులను ఎంచుకోవడానికి ఉండాల్సిన లక్షణాలు తదితర అంశాలపై విశ్లేషణ..
- ఇంటర్ మొదలు ఎన్నో అవకాశాలు
- ఇంటర్మీడియెట్..ప్రతి గ్రూప్‌లోనూ ప్రత్యేకత
- టెక్నికల్ నైపుణ్యాలకు దారి చూపే ఐటీఐ, పాలిటెక్నిక్
- కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం అంటున్న నిపుణులు
పదో తరగతి తర్వాత.. అనేక ఉన్నత విద్య మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో తాను ఎటువైపు అడుగులు వేయాలి.. ఏ కోర్సును ఎంచుకుంటే.. భవిత బంగారమవుతుంది.. ఎంచుకునే కోర్సు మన ఆసక్తికి, లక్ష్యాలకు తగినదేనా? ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో తలెత్తున్న సందేహాలివి!!
ఏపీ 10వ తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)
ఇంటర్మీడియెట్
పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ప్రథమ గమ్యంగా నిలుస్తున్న కోర్సు.. ఇంటర్మీడియెట్. ఈ కోర్సులో విభిన్న గ్రూప్‌లు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్.. ఇలా.. అనేక గ్రూప్‌లు! గ్రూప్ ఎంపిక కెరీర్ పరంగా కీలకంగా మారుతుంది. ఆయా గ్రూప్‌లతో లభించే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై పూర్తి అవగాహనతో విద్యార్థులు సరైన గ్రూప్‌ను ఎంచుకోవాలి.
ఎంపీసీ–ఎక్కువ మంది ఎంపిక
- పదో తరగతి ఉత్తీర్ణుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్న గ్రూప్.. ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ). కారణం.. ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఈ గ్రూప్ అర్హతగా ఉండటమే! ఎంపీసీ గ్రూప్.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల కలయికగా ఉంటుంది. ఎంపీసీలో చేరాలనుకునే విద్యార్థులకు సహజంగా కొన్ని లక్షణాలు ఉండాలి అంటున్నారు నిపుణులు. అవి.. కంప్యుటేషనల్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్. మన కళ్ల ముందు కనిపించే పరికరాలు, వాటి పనితీరు తెలుసుకునే ఆసక్తి, అకడమిక్‌గా ప్రయోగాల పట్ల ఇష్టమున్న వారు ఎంపీసీ గ్రూప్‌నకు సరితూగుతారు.
- ఎంపీసీ గ్రూప్‌తో ఎంసెట్, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ తదితర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. ఐఐటీలు, నిట్‌లు తదితర ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరడం ద్వారా ఉజ్వల కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం వంటి పరీక్షల ద్వారా డిఫెన్స్ రంగంలో కెరీర్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో సైన్స్ రంగంలో స్థిరపడాలనుకుంటే.. ఇంటర్ ఎంపీసీతో బీఎస్సీ, ఆ తర్వాత ఎమ్మెస్సీ, రీసెర్చ్ కోర్సులు చేస్తే.. అవకాశాలు పుష్కలం.
బైపీసీ –మెడికల్‌తోపాటు మరెన్నో
- ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సులను లక్ష్యంగా నిర్ణయించుకున్న విద్యార్థులకు ప్రధాన వేదిక ఇంటర్ బైపీసీ(బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ). ఈ కోర్సును ఎంపిక చేసుకునే ముందు వ్యక్తిగతంగా కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అవి.. లైఫ్ సైన్సెస్‌పై సహజ ఆసక్తి, పర్యావరణ స్పృహ వంటివి. సహనం, ఓర్పు అనేవి బైపీసీ విద్యార్థులకు ఉండాల్సిన ఇతర ముఖ్య లక్షణాలు.
- జాతీయ స్థాయిలో నిర్వహించే మెడికల్ ఎంట్రెన్స్ నీట్‌లో ర్యాంకు ద్వారా.. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. మెడికల్ కోర్సులతోపాటు వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, ఆయుష్, ఫార్మసీ వంటి కోర్సుల్లోనూ చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత దశలో పీజీ, పీహెచ్‌డీ చేయొచ్చు. లైఫ్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్‌లో కెరీర్ కోరుకునే అభ్యర్థులకు మార్గం.. బీఎస్సీ(బీజెడ్‌సీ).
After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?
కామర్స్ కెరీర్స్‌కు సీఈసీ
- భవిష్యత్తులో వ్యాపార, వాణిజ్య రంగాల్లో కెరీర్ కోరుకునే విద్యార్థులకు సరితూగే గ్రూప్.. సీఈసీ. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌ల కలయికగా ఉండే ఈ గ్రూప్ ద్వారా కార్పొరేట్ కొలువుల దిశగా అడుగులు వేయొచ్చు. ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు ప్రధానంగా కాలిక్యులేషన్ స్కిల్స్, గణాంకాల విశ్లేషణ నైపుణ్యాలు, సూక్ష్మ స్థాయి పరిశీలన వంటివి ఉండాలి.
- సీఈసీ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా బీకామ్ కోర్సు ప్రధాన మార్గంగా నిలుస్తోంది. బీకాం చదువుతూనే.. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకునే వీలుంది. ఈ కోర్సుల ఉత్తీర్ణులకు కంపెనీల్లో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతమవడం ఖాయం.
- బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్, అకౌంటింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఎంబీఏ ఫైనాన్స్ స్పెషలైజేషన్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే ఐసెట్‌లో ర్యాంకు సాధించాలి. ఐఐఎంలు, ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ కోసం క్యాట్, మ్యాట్, సీమ్యాట్ వంటి ప్రవేశ పరీక్షల్లో రాణించాల్సి ఉంటుంది.
మెరుగైన గ్రూప్.. ఎంఈసీ
ఇంటర్మీడియెట్‌లో అందుబాటులో ఉన్న మరో గ్రూప్..ఎంఈసీ. ఇది మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్‌ల కలయికగా ఉంటుంది. ఈ గ్రూప్‌ను ఎంపిక చేసుకొని.. ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇటు మ్యాథమెటిక్స్ అర్హతగా ప్రవేశం లభించే బీఎస్సీలో..అటు కామర్స్ అర్హతగా బీకాంలోనూ అడుగుపెట్టొచ్చు. ముఖ్యంగా వీరికి చార్టర్డ్ అకౌంటెన్సీ,కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సుల్లో రాణించే అవకాశం లభిస్తుంది. కంప్యుటేషనల్, కాలిక్యులేషనల్ స్కిల్స్‌తోపాటు ఏకాగ్రత, ఒక పనిపై సుదీర్ఘ సమయం వెచ్చించే ఓర్పు, సహనం ఉన్న విద్యార్థులు ఎంఈసీ గ్రూప్‌నకు సరితూగుతారు.
పోటీ పరీక్షలకు హెచ్‌ఈసీ
భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకున్న విద్యార్థులకు అనుకూలించే గ్రూప్.. హెచ్‌ఈసీ. ఈ గ్రూప్‌లో ఉండే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌లపై పట్టు ద్వారా.. పలు ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. ఇటీవల కాలంలో హెచ్‌ఈసీ అర్హతగా ప్రవేశం లభించే బీఏ కోర్సులోనూ పలు జాబ్ ఓరియెంటెడ్ గ్రూప్ కాంబినేషన్స్(ఉదా: సోషల్ స్టడీస్, సోషల్ సైన్సెస్, ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ తదితర) అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గ్రూప్ సబ్జెక్ట్‌లతో బీఏ పూర్తి చేయడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతమవుతున్నాయి.
After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్ పైలట్.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
సత్వర ఉపాధికి ఒకేషనల్
- ఇంటర్మీడియెట్‌తోనే ఉన్నత విద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి మార్గాలు ఖాయం చేస్తున్న కోర్సులు.. ఒకేషనల్ కోర్సులు. ఆఫీస్ అడ్మిస్ట్రేషన్‌షిప్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వరకూ.. టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు అవసరమైన స్కిల్స్ పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి ఒకేషనల్ కోర్సులు.
- ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్ బోర్డ్‌లు.. అగ్రికల్చర్; బిజినెస్ అండ్ కామర్స్; ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ; హోంసైన్స్; హ్యుమానిటీస్; పారా మెడికల్ విభాగాలుగా మొత్తం 27 ఒకేషనల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసిన వారికి సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
- ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలోని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్; రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేస్తే..ఎలాంటి ప్రవేశ పరీక్షల అవసరం లేకుండానే సంబంధిత బ్రాంచ్‌లో నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు.
పాలిటెక్నిక్స్
పదో తరగతి అర్హతతోనే ఇంజనీరింగ్ కెరీర్ దిశగా బాటలు వేసుకునేందుకు మార్గం.. పాలిటెక్నిక్ కోర్సులు. మూడు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సులుగా పేర్కొనే ఈ పాలిటెక్నిక్ కోర్సులను పూర్తి చేస్తే.. ఇటు ఉద్యోగాలతోపాటు అటు ఉన్నత విద్యకు అనేక మార్గాలు అందుబాటులోకి వస్తాయి. తాము పూర్తి చేసుకున్న కోర్సు ఆధారంగా పరిశ్రమల్లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతగా నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈ–సెట్)లో ర్యాంకు ఆధారంగా.. లేటరల్ ఎంట్రీ పేరుతో నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు.
Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వచ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీకోసమే..
ఐటీఐ
పదో తరగతి అర్హతగా వృత్తి విద్య శిక్షణ అందించి విద్యార్థులను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు..ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్(ఐటీఐ). నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్ తదితర పదుల సంఖ్యలో ట్రేడులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వెలువడుతుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ పరిధిలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న ప్రాంతీయ ఒకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్స్ ఈ ప్రవేశ ప్రక్రియలను నిర్వహిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పారిశ్రామిక సంస్థల్లో ఎంట్రీ లెవల్లో టెక్నీషియన్స్‌గా అడుగు పెట్టొచ్చు. అదే విధంగా అప్రెంటీస్ పూర్తి చేసుకుని ఎన్‌సీవీటీ అందించే సర్టిఫికెట్ పొందితే.. ఉద్యోగ సాధనలో మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఉన్నత విద్య పరంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది.
అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్
గ్రామీణ యువత స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా నెలకొల్పిన ఇన్‌స్టిట్యూట్‌లు..అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్. వీటిలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా తదితర కోర్సులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది. ఇలా..పదో తరగతి విద్యార్థులకు విభిన్న మార్గాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచి మేరకు గ్రూప్ ఎంపిక చేసుకోవాలి. దానికి అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలు పొందేందుకు సంసిద్ధులై ఉండాలి.
తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం
పదో తరగతి తర్వాత కోర్సుల ఎంపికలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే.. పదో తగరతి పూర్తి చేసేనాటికి విద్యార్థుల వయసు పదిహేను నుంచి పదహారేళ్ల మధ్యలో ఉంటుంది. ఈ వయసులో భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆలోచించే స్థాయిలో వారి మానసిక పరిణితి ఉంటుందని భావించలేం. కాబట్టి తల్లిదండ్రులే తమ పిల్లలతో మాట్లాడి వారి ఆసక్తిని తెలుసుకోవాలి. నిజ జీవితంలో ఏ విషయాల పట్ల ఆసక్తిగా ఉంటున్నారో గమనిస్తుండాలి. అందుకు అనుగుణంగా వారికి అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తెలియజేయాలి.
– లీలాధర్ రావు, కెరీర్ కౌన్సెలర్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్