Skip to main content

After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్‌ పైలట్‌.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..

Job and Employment Opportunities with Drone Pilot
Job and Employment Opportunities with Drone Pilot

డ్రోన్స్‌.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే! వ్యవసాయం నుంచి కీలకమైన రక్షణ రంగం వరకు.. అనేక రంగాల్లో డ్రోన్‌ల వినియోగం పెరుగుతోంది. ఇటీవల డ్రోన్‌ పాలసీని కేంద్రం సరళీకృతం చేసింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా డ్రోన్‌ రంగానికి ప్రోత్సాహం ఇస్తోంది. ఫలితంగా స్టార్టప్స్‌ ఏర్పాటుకు చేయూత లభిస్తోంది. దాంతో రానున్న రోజుల్లో డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో విస్తృతంగా కొలువులు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యువత డ్రోన్‌ పైలట్, డ్రోన్‌ పైలట్‌ సర్టిఫైయర్స్, డ్రోన్‌ అసెంబ్లింగ్‌ నిపుణులు, డ్రోన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్, డ్రోన్‌ రీసైకలర్స్‌ కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. డ్రోన్‌ టెక్నాలజీ, తాజా నిబంధనలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం...

  • డ్రోన్‌ విభాగంలో పెరుగుతున్న కొలువులు
  • స్టార్టప్స్‌కు దన్నుగా నిబంధనల సరళీకరణ
  • ఉద్యోగాలతోపాటు స్వయం ఉపాధికీ మార్గం

డ్రోన్‌ అనగానే మనందరికీ గుర్తొచ్చేది.. పెద్ద, పెద్ద వేడుకలు, సమావేశాల్లో డ్రోన్‌ల ఆధారంగా కెమెరాలతో ఫొటోలు చిత్రీకరించడం. ప్రస్తుతం డ్రోన్‌ల వినియోగం వ్యవస్థీకృతం అవుతోంది. అనేక రంగాల్లో వీటి వాడకం పెరుగుతోంది. విదేశాల్లో డ్రోన్‌ల ద్వారా మెడిసిన్‌ సరఫరా, వస్తువుల డెలివరీ,డ్రోన్‌ ట్యాక్సీ వంటివి వినియోగంలోకి వస్తున్నాయి. దాంతో డ్రోన్‌ల తయారీ, వీటిని ఆపరేట్‌ చేసే పైలట్స్‌కు ఉండాల్సిన అర్హతలు తదితర అంశాలపై ప్రభుత్వం నిబంధనలు సరళీకృతం చేసింది. 

మరింత సరళంగా

అన్‌ మ్యాన్డ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌(యూఏఎస్‌ రూల్స్‌)–2021. ఇది ఈ ఏడాది మార్చి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం. వాస్తవానికి సాధారణ పరిభాషలో పిలిచే డ్రోన్‌లను సాంకేతికంగా అన్‌ మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌గా(మానవ రహిత విమానం) పిలుస్తారు. యూఏఎస్‌ రూల్స్‌–2021 స్థానంలో కొద్ది రోజుల క్రితం నిబంధనలను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది.

చ‌ద‌వండి: Government Jobs: పది, ఇంటర్ అర్హ‌తతోనే సర్కారీ కొలువులెన్నో..!

అన్ని రంగాలకు విస్తరణ

ఇప్పటికే పలు రంగాల్లో డ్రోన్‌ల సేవలు విస్తరిస్తున్నాయి. తాజా సరళ డ్రోన్‌ విధానంతో ఇవి మరింత విస్తృతం కానున్నాయి. ముఖ్యంగా డ్రోన్‌ల పరిమాణం, వాటి బరువు ఆధారంగా.. కొన్ని విషయాల్లో డీజీసీఏ అనుమతుల నుంచి మినహాయింపు ఇచ్చారు. దాంతో డ్రోన్‌ల వినియోగం అన్ని రంగాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

పైలట్‌ లైసెన్స్‌

డ్రోన్‌లు అంటే మానవ రహిత విహంగాలని తెలిసిందే. ఇవి గాలిలో నిర్ణీత పరిధిలో.. నిర్దిష్ట ప్రాంతంలో గమ్యం దిశగా పయనించాలంటే.. వీటిని రిమోట్‌ ఆధారంగా సమర్థంగా ఆపరేట్‌ చేసే నైపుణ్యాలు ఉండాలి. అలాంటి స్కిల్స్‌ సొంతం చేసుకున్న వారినే డ్రోన్‌ పైలట్‌లుగా పిలుస్తారు. డ్రోన్‌ పైలట్‌గా గుర్తింపు పొందాలంటే.. ముందుగా లైసెన్స్‌ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. డీజీసీఏ గుర్తింపు పొందిన డ్రోన్‌ ట్రైనింగ్‌ కేంద్రాల్లో శిక్షణ పొంది.. ఆ తర్వాత డీజీసీఏ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైతేనే ఈ లైసెన్స్‌ లభిస్తుంది. 

పదో తరగతి అర్హత

  • డ్రోన్‌ పైలట్‌గా లైసెన్స్‌ పొందాలంటే.. టెక్నికల్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీలు అవసరం లేదు.కేవలం పదో తరగతి అర్హతతోనే డ్రోన్‌ పైలట్‌గా లైసెన్స్‌ సొంతం చేసుకోవచ్చు.
  • డ్రోన్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందే విధానం: డీజీసీఏ నిబంధనల ప్రకారం–డ్రోన్‌ ఆపరేట్‌ చేసే వ్యక్తి డీజీసీఏ నుంచి రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందాలి. ఇందుకోసం ముందుగా డీజీసీఏ గుర్తింపు పొందిన ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌లో అయిదు నుంచి ఏడు రోజుల పాటు శిక్షణ పొందాలి. 
  • రేడియో టెలిఫోనీ టెక్నిక్స్, ఫ్లయిట్‌ ప్లానింగ్‌ అండ్‌ ఏటీసీ ప్రొసీజర్స్, డీజీసీఏ రెగ్యులేషన్స్‌ తదితర విమానయాన సంబంధిత టెక్నికల్‌ అంశాల్లో థియరీ, ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకోవాలి.

లైసెన్స్‌ ఎగ్జామ్‌

డీజీసీఏ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత.. డ్రోన్‌ పైలట్‌గా కెరీర్‌ ప్రారంభించొచ్చు. అందుకోసం ముందుగా డీజీసీఏ నుంచి లైసెన్స్‌ పొందాలి. ఇందుకోసం డీజీసీఏ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అలా ఉత్తీర్ణత సాధిస్తే స్టూడెంట్‌ రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ సొంతమవుతుంది. ఈ సర్టిఫికెట్‌కు అయిదేళ్ల వరకూ గుర్తింపు ఉంటుంది. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగిస్తారు. 

రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌

రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ పేరుతో మరో కేటగిరీలో లైసెన్స్‌ మంజూరు చేసే విధానం అమలవుతోంది. డీజీసీఏ గుర్తింపు పొందిన శిక్షణ సంస్థలో నిర్ణీత వ్యవధిలో శిక్షణ పూర్తి చేసుకుని.. ఆ తర్వాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ లభిస్తుంది. ఈ లైసెన్స్‌ కాల వ్యవధి పదేళ్లు. ఆ తర్వాత దీన్ని రెన్యూవల్‌ చేసుకోవచ్చు. 

శిక్షణ సంస్థలు తక్కువే

జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఏడు ఇన్‌స్టిట్యూట్స్‌కు మాత్రమే డ్రోన్‌ పైలట్‌ లైసెన్స్‌ శిక్షణ ఇచ్చేందుకు అనుమతి ఉంది. డ్రోన్‌ విధానాలను సరళీకృతం చేసిన తరుణంలో ఈ శిక్షణ సంస్థల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు దక్కించుకునేందుకు వీలవుతుందని చెబుతున్నారు. 

స్టార్టప్‌లకు ప్రోత్సాహం

  • కేంద్ర ప్రభుత్వం డ్రోన్‌ స్టార్టప్స్‌కు ఊతమిచ్చేలా నిబంధనలు సరళీకృతం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 200 డ్రోన్‌ తయారీ సంస్థలున్నాయి. నూతన విధానాలతో ఈ సంఖ్య మరింత పెరగనుందని నాస్‌కామ్‌ తదితర సంస్థల అంచనా. 
  • మెకానికల్, ఏవియానిక్స్, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ తదితర కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు డ్రోన్‌ తయారీ స్టార్టప్‌లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయా రంగాలకు సంబంధించిన కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుంటూ.. వారికి అవసరమైన రీతిలో డ్రోన్‌లను డిజైన్‌ చేసి, ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన టెక్నికల్‌ స్కిల్స్‌ ఉంటే స్టార్టప్‌ల ద్వారా ఉపాధి పొందొచ్చు. దీంతోపాటు డీజీసీఏ గుర్తింపు పొందిన డ్రోన్‌ తయారీ సంస్థల్లో డిజైన్, మోడలింగ్, 3–డి ప్రింటింగ్, అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్‌ వంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చు.

పెరుగుతున్న డిమాండ్‌

ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో డ్రోన్‌ల వినియోగం శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా విస్తృతమవుతున్నాయి. ఇటీవల మార్కెట్‌ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. వ్యవసాయం, మైనింగ్, రియల్‌ ఎస్టేట్, జియో సెన్సింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎనర్జీ అండ్‌ టెలికమ్యూనికేషన్స్, ఫిల్మ్‌ మేకింగ్, ఫొటోగ్రఫీ, ఈ–కామర్స్, ఫార్మా రంగాల్లో డ్రోన్‌ల ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఫలితంగా డ్రోన్‌ పైలట్‌లకు, అదే విధంగా డ్రోన్‌ తయారీ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. డ్రోన్‌ కెమెరాలు పంపే చిత్రాలను విశ్లేషించి.. సంస్థలకు నివేదికలు ఇవ్వాల్సిన క్రమంలో అనలిస్ట్‌లకు కూడా డిమాండ్‌ పెరగనుంది. ముఖ్యంగా ల్యాండ్‌ సర్వేయింగ్, మైనింగ్‌ వంటి రంగాలకు సంబంధించిన అంశాల్లో ఈ అనలిస్ట్‌ల అవసరం ఎక్కువగా ఉంటోంది.

  • డ్రోన్‌ పైలట్లకు విదేశాల్లోనూ డిమాండ్‌ నెలకొంది. అసోసియేషన్‌ ఆఫ్‌ అన్‌ మ్యాన్డ్‌ వెహికిల్‌ సిస్టమ్స్‌ ఇంటర్నేషనల్‌ అంచనాల ప్రకారం–2025 నాటికి అంతర్జాతీయంగా లక్ష మంది డ్రోన్‌ పైలట్ల అవసరం ఏర్పడనుంది. 


చ‌ద‌వండి: After 10th Class : `పది` తర్వాత ఉన్నత విద్యావకాశాలకు స‌రైన దారి...

వేలల్లో వేతనం

ప్రస్తుతం ఆయా రంగాల్లో నెలకొన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే..డీజీసీఏ లైసెన్స్‌ పొందిన డ్రోన్‌ పైలట్‌లకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే కనీసం రూ.25 వేల జీతం అందుతోంది. సొంతంగా డ్రోన్‌ ఉంటే.. మరింతగా సంపాదించే అవకాశం ఉంది. 

డ్రోన్‌ పాలసీ.. ముఖ్యాంశాలు

  • పదో తరగతి అర్హతతో డ్రోన్‌ పైలట్‌గా అవకాశం.
  • నెలకు సగటున రూ.25 వేల వేతనం.
  • డ్రోన్‌ తయారీ సంస్థల్లో ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఉపాధి.
  • ప్రపంచంలో డ్రోన్‌ల వినియోగంలో రెండో పెద్ద దేశంగా భారత్‌.
  • అంతర్జాతీయంగా 2025నాటికి  లక్ష మంది డ్రోన్‌ పైలట్స్‌ అవసరం.
  • స్టార్టప్స్‌కు నిధులు ఇచ్చేందుకు ముందుకొస్తున్న సీడ్‌ ఫండింగ్‌ సంస్థలు.
  • ఒక్కో స్టార్టప్‌ ద్వారా సగటున 150 మందికి ఉపాధి.

అవకాశాలు విస్తృతం

ప్రభుత్వం తాజాగా రూపొందించిన డ్రోన్‌ పాలసీ ద్వారా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. సంబంధిత నైపుణ్యాల, శిక్షణ పొందితే పదో తరగతితోనే ఈ రంగంలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. 
–సుధీర్, డ్రోన్‌ టెక్నాలజీ నిపుణులు

చ‌ద‌వండి: After Class 10th

Published date : 08 Jan 2024 05:08PM

Photo Stories