Skip to main content

TS/AP Polycet 2024: సత్వర ఉపాధికి మార్గం.. పాలిటెక్నిక్స్‌

పదో తరగతి తర్వాత సత్వర ఉపాధికి మార్గం.. పాలిటెక్నిక్‌ కోర్సులు!! పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్నాక.. ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్య కోసం బీటెక్‌లో చేరే అవకాశం కూడా ఉంది. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం.. పాలిసెట్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ పాలిసెట్‌-2024, టీఎస్‌ పాలిసెట్‌-2024లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. పాలిసెట్‌ల వివరాలు, పరీక్ష విధానం, పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులతో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం..
Employment Opportunities for Polytechnic Graduates  AP Polyset-2024 Application Process   TS Polyset-2024 Application Process   Polycet 2024 Details and Exam Pattern and Higher Education with Polytechnic Diploma Courses and Employment Opportunities
  • 2024కు ఏపీ, టీఎస్‌లో పాలిసెట్‌ నోటిఫికేషన్స్‌ విడుదల
  • డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్స్‌ నిర్వహణ
  • కోర్సులు పూర్తి చేసుకుంటే సత్వర ఉపాధి, ఉన్నత విద్య
  • బీటెక్‌లో నేరుగా రెండో ఏడాదిలో అడుగు పెట్టే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో 267 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 31 బ్రాంచ్‌ల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో 118 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 32 బ్రాంచ్‌లలో మొత్తం 29,790 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని 11 అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్స్‌లో అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో 280 సీట్లు, రెండేళ్ల వ్యవధిలోని అగ్రికల్చరల్‌ డిప్లొమా కోర్సుల్లో 450 సీట్లు; అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా (ఇంగ్లిష్‌ మీడియం)లో 90 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పాలిటెస్‌లో ర్యాంకుతో సీట్ల భర్తీ
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాలిటెక్నిక్‌ కాలేజీలు అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌)ను నిర్వహిస్తున్నారు.

ఏపీ, టీఎస్‌ పాలిసెట్‌కు అర్హతలు
పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. 2024లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

చదవండి: TS EAPCET 2024 Notification: ఈసారి ఏ కోర్సులు ఉన్నాయంటే..

పరీక్ష విధానం ఇలా

  • ఏపీ పాలిసెట్‌ను మూడు సబ్జెక్ట్‌లలో 120 మార్కులకు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఫిజిక్స్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు; కెమిస్ట్రీ 30 ప్రశ్నలు-30 మార్కులకు ప్రశ్నా పత్రం ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. 
  • టీఎస్‌ పాలిసెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్‌ 60 ప్రశ్నలు -60 మార్కు­లు; ఫిజిక్స్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు; కెమిస్ట్రీ 30 ప్రశ్నలు-30 మార్కులు; బయాలజీ 30 ప్రశ్నలు-30 మార్కులకు ప్రశ్నా పత్రం ఉంటుంది. రెండున్నర గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది.

ఉమ్మడి కౌన్సెలింగ్‌
పాలిసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించి.. అభ్యర్థులు పొందిన మార్కు­లు, అందుబాటులో ఉన్న సీట్లను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తారు. సీట్‌ అలాట్‌మెంట్‌ పొందిన విద్యార్థులు సంబంధిత పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్దేశిత తేదీలోగా రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

డిప్లొమా కోర్సులు ఇవే
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సుల వివరాలు.. సివిల్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరరల్‌ అసిస్టెంట్‌షిప్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌; ఎలక్ట్రికల్‌ వెహికిల్‌ టెక్నాలజీ; ఈసీఈ; ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్‌); ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌; అప్లైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌; కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌; ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌; 3-డి యానిమేషన్‌ అండ్‌ గ్రాఫిక్స్‌; ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌; కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌); క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా; కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌; మైనింగ్‌ ఇంజనీరింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌; అపరెల్‌ డిజైన్‌ అండ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ; మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌; టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌; బయో మెడికల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్‌ (ఆయిల్‌ టెక్నాలజీ); కెమికల్‌ ఇంజనీరింగ్‌ (పెట్రో కెమికల్స్‌), కెమికల్‌ ఇంజనీరింగ్‌ (ప్లాస్టిక్‌ అండ్‌ పాలిమర్స్‌); కెమికల్‌ ఇంజనీరింగ్‌ (షుగర్‌ టెక్నాలజీ); సెరామిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ; ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, లెదర్‌ అండ్‌ గూడ్స్‌ టెక్నాలజీ; ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీడియో ఇంజనీరింగ్‌; సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా; ప్రింటింగ్‌ టెక్నాలజీ; హోమ్‌ సైన్స్‌; మైనింగ్‌ ఇంజనీరింగ్‌.

చదవండి: TS POLYCET Previous Papers

ఉన్నత విద్య.. ఉద్యోగాలు

  • పాలిసెట్‌ ర్యాంకు ఆధారంగా ఆయా డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరు పరిశ్రమల్లో సూపర్‌వైజర్‌ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. అదే విధంగా.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే ఏఈఈ పోస్ట్‌లకు, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే ఏఈఈ పోస్ట్‌లకు పోటీ పడొచ్చు.
  • ఉన్నత విద్య: పాలిటెక్నిక్‌ డిప్లొమా అర్హతతో నిర్వహించే ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈ-సెట్‌)లో ర్యాంకు ఆధారంగా లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో అడుగు పెట్టే అవకాశం ఉంది. 

స్కాలర్‌షిప్‌ సదుపాయం

  • పాలిసెట్‌ ర్యాంకుతో డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • ఏఐసీటీఈ-ప్రగతి స్కాలర్‌షిప్‌ పేరుతో.. దేశవ్యాప్తంగా అయిదు వేల మంది మహిళా విద్యార్థులకు సంవత్సరానికి రూ.50 వేలు చొప్పున స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని అందిస్తారు.
  • అదే విధంగా సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో దివ్యాంగ విద్యార్థులకు సంవత్సరానికి రూ.50 వేల మొత్తాన్ని స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 

చదవండి: AP POLYCET Previous Papers

పరీక్షలో రాణించేలా
మ్యాథమెటిక్స్‌

పదో తరగతి పాఠ్య పుస్తకంలోని ప్రతి చాప్టర్‌ను చదివి.. వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ ప్రాక్టీస్‌ చేయాలి. సంఖ్యా వ్యవస్థ; బీజగణితం; నిరూపక రేఖాగణితం; క్షేత్రమితి;త్రికోణమితి; సంభావ్యత, సాంఖ్యకశాస్త్రంపై పట్టు సాధించాలి. అదేవిధంగా ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్‌ రూపంలో రాసుకుంటే రివిజన్‌ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. పాఠ్యపుస్తకంలోని ప్రతి చాప్టర్‌ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్‌ చేయాలి. గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు; సమితులు; బహుపదులు; రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్‌ ఆధారిత సమస్యలు; సంభావ్యత; సాంఖ్యక శాస్త్రం; త్రికోణమితి; క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలపై పట్టు సాధించాలి. 

ఫిజిక్స్‌
ఈ సబ్జెక్ట్‌కు సంబంధించి.. ప్రయోగాలు-క్షేత్ర పర్యటనలు; సమాచార నైపుణ్యాలు -ప్రాజెక్ట్‌ పనులు; పటాలు-వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా కృషి చేయాలి. కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్‌ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్‌ సమ్మేళనాలను శ్రద్ధతో చదవాలి. అదే విధంగా.. మూలకాల ధర్మాలు-వర్గీకరణ, రసాయన సమీకరణాలను ప్రాక్టీస్‌ చేయాలి.

కెమిస్ట్రీ
ఆమ్లాలు, క్షారాలు; లవణాలు, పరమాణు నిర్మా ణం, పి-బ్లాక్‌ ఎలిమెంట్స్, పిరియాడిక్‌ టేబుల్, మూలకాల వర్గీకరణ, అయోనైజేషన్‌ ఎనర్జీ, ఎలక్ట్రోనెగెటివిటీ, మెటాలిక్, నాన్‌-మెటాలిక్‌ ప్రాపర్టీస్, కెమికల్‌ బాండింగ్, ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ మెటలర్జీ, కార్బన్‌ కాంపౌండ్స్‌ తదితర ముఖ్యమైన యూనిట్లలోని అన్ని అంశాలను అధ్యయనం చేయాలి.

బయాలజీ
ఈ సబ్జెక్ట్‌లో మంచి స్కోర్‌ కోసం ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత.. దాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయించే నేర్పు సొంతం చేసుకోవాలి. డయాగ్రమ్స్‌ను ప్రాక్టీస్‌ చేసి.. భాగాలను గుర్తించడమే కాకుండా..వాటి ప్రాముఖ్యతను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా పదో తరగతి చాప్టర్స్‌లోని ప్రయోగ నిర్వహణ ప్రక్రియపై అవగాహన పొందడం మేలు చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి చాప్టర్‌లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, బేధాలు తెలుసుకుంటూ చదవాలి. 

ముఖ్య సమాచారం
ఏపీ పాలిసెట్‌ ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్‌ 5
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌: 2024, ఏప్రిల్‌ 20 నుంచి
పాలిసెట్‌ పరీక్ష తేదీ: 2024, ఏప్రిల్‌ 27 (ఉదయం 11 నుంచి 1 వరకు)
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://polycetap.nic.in/Default.aspx

టీఎస్‌ పాలిసెట్‌ ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్‌ 22
పాలిసెట్‌ తేదీ: 2024, మే 17
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://polycet.sbtet.telangana.gov.in/#!/index

Published date : 05 Mar 2024 03:24PM

Photo Stories