Best Career Options After 10th Class: పది తర్వాత.. కోర్సులు, కెరీర్ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!
- అందుబాటులో పలు కోర్సులు, ఉపాధి మార్గాలు
- ఎక్కువ మంది తొలి గమ్యం ఇంటర్మీడియెట్
- ఇంజనీరింగ్‌కు మార్గంగా పాలిటెక్నిక్స్
- సత్వర ఉపాధితో ఐటీఐల వైపు మొగ్గు
పదో తరగతి తర్వాత అధిక శాతం మంది ఇంటర్మీడియెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ ఎంపీసీ, బైపీసీల్లో చేరి భవిష్యత్తులో ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో ప్రవేశం పొందాలనే ఆలోచనతో ఉంటున్నారు. మరికొంతమంది విద్యార్థులు మాత్రం సత్వరం ఉపాధి కల్పించే ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సు పట్ల ఆసక్తి చూపుతున్నారు.
తొలి గమ్యం.. ఇంటర్
ఇంటర్(ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ)లో ప్రతి గ్రూప్ దేనికదే ప్రత్యేకమైనవి. అత్యధిక శాతం మంది ఎంపీసీలో చేరుతున్నారు. ఆ తర్వాత బైపీసీతోపాటు సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ వంటి గ్రూప్‌లతోనూ ఉజ్వల అవకాశాలు సొంతం చేసుకునే వీలుంది. అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్, వృత్తి నైపుణ్యాలు అందించే ఒకేషనల్ కోర్సుల్లోనూ చేరే వీలుంది.
చదవండి: Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్ అవకాశాలు ఇవే..
ఇంజనీరింగ్‌కు కేరాఫ్ ఎంపీసీ
- ఎంపీసీ.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల కలయికగా ఉండే గ్రూప్ ఇది. ఈ గ్రూప్‌తో ఈఏపీసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, బిట్‌శ్యాట్ వంటి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్‌లో కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీంల ద్వారా డిఫెన్స్ రంగంలో కెరీర్ ప్రయత్నాలు చేయొచ్చు. వీటితోపాటు భవిష్యత్తులో సైన్స్ రంగంలో స్థిరపడాలనుకుంటే.. బీఎస్సీ, ఆ తర్వాత ఎమ్మెస్సీ, రీసెర్చ్ కోర్సులు చేసే అవకాశం కూడా ఉంది.
- నైపుణ్యాలు: ఎంపీసీతో రాణించేందుకు కంప్యుటేషనల్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్ ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు మన కళ్ల ముందు కనిపించే గ్యాడ్జెట్స్, వాటి పనితీరును తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి.
బైపీసీ.. బహుళ అవకాశాలు
- ఎంపీసీ తర్వాత ఎక్కువ మంది ఎంచుకునే గ్రూప్.. బైపీసీ! ఈ గ్రూప్ ఉత్తీర్ణులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్-యూజీలో ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. రాష్ట్ర స్థాయిలో ఈఏపీ సెట్(అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్)లో ర్యాంకు సాధించి వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీలో చేరే వీలుంది. ఆ తర్వాత పీజీ, పీహెచ్‌డీ చేసే అవకాశముంది. ఇంటర్మీడియెట్ బైపీసీ అర్హతతో బీఎస్సీ (బీజెడ్‌సీ)లో అడుగు పెట్టొచ్చు. ఇప్పుడు బీజెడ్‌సీలోనూ బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్, హ్యూమన్ జెనెటిక్స్, జెనెటిక్స్ వంటి వినూత్న సబ్జెక్టులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేసుకుంటే.. ఫార్మా, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కెరీర్ అవకాశాలు లభిస్తాయి.
- నైపుణ్యాలు: బైపీసీ గ్రూప్‌ను ఎంచుకునే విద్యార్థులకు లైఫ్ సైన్సెస్‌పై సహజ ఆసక్తి ఉండాలి. జీవులు, పరిసరాలు, పర్యావరణంపై ఆసక్తితోపాటు వాటి పట్ల సహానుభూతి(ఎంపతీ) వంటివి ఉంటే మేలు.
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
సీఈసీ.. కార్పొరేట్ కెరీర్స్
- కార్పొరేట్ రంగంలో కెరీర్ కోరుకునే వారికి చక్కటి మార్గం.. సీఈసీ. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌లు కలయికగా ఉండే గ్రూప్ ఇది. సీఈసీ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా బీకాం కోర్సు ముఖ్య మార్గంగా నిలుస్తోంది. బీకాం చదువుతూనే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా కంపెనీల్లో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత.. పీజీ స్థాయిలో ఎంకామ్, ఎంబీఏలో చేరే‡వీలుంది. ముఖ్యంగా అకౌంటింగ్ రంగంలో రాణించాలనుకునే వారు ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసుకోవచ్చు.
- నైపుణ్యాలు: కాలిక్యులేషన్ స్కిల్స్, గణాంకాల విశ్లేషణ, సూక్ష్మ స్థాయి పరిశీలన, వ్యాపార, వాణిజ్యాలపట్ల ఆసక్తి వంటి ఉండాలి.
కాంపిటీటివ్ కింగ్.. హెచ్‌ఈసీ
హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ గ్రూప్ సబ్జెక్ట్‌లుగా ఉండే హెచ్‌ఈసీపై పట్టు సాధించడం ద్వారా ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకున్న వారికి ఈ గ్రూప్ అనుకూలంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో బీఏలోనూ పలు జాబ్ ఓరియెంటెడ్ గ్రూప్ కాంబినేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రైవేటు రంగంలో కొలువులు దక్కించుకోవచ్చు.
చదవండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్ డిప్లొమా.. భవితకు ధీమా
ఇంజనీరింగ్‌కు మార్గం.. పాలిటెక్నిక్
భవిష్యత్తులో ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి టెన్త్ తర్వాత అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. పాలిటెక్నిక్ కోర్సులు. మూడు, మూడున్నరేళ్ల వ్యవధి ఉండే ఈ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా పరిశ్రమల్లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులు ఈసెట్‌లో ర్యాంకుతో నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది.
ఇండస్ట్రీలో ఉపాధికి ఐటీఐ
పదో తరగతి అర్హతగా వృత్తి విద్య శిక్షణతోపాటు స్వయం ఉపాధికి మార్గం.. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్(ఐటీఐ). నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ తదితర పదుల సంఖ్యలో ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు ఉత్తీర్ణత తర్వాత పారిశ్రామిక సంస్థల్లో టెక్నీషియన్స్‌గా ఉపాధి పొందొచ్చు. అదే విధంగా అప్రెంటీస్‌షిప్ పూర్తి చేసుకుని ఎన్‌సీవీటీ అందించే సర్టిఫికెట్ పొందితే ఉద్యోగ సాధనలో ప్రాధాన్యం లభిస్తుంది.
గురుకుల కళాశాలలు
- పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ స్థాయిలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌లు చక్కటి వేదికలుగా నిలుస్తున్నాయి. వీటిలో అడుగుపెట్టాలంటే.. రాష్ట్ర స్థాయిలో ఆర్‌జేసీ సెట్‌ల పేరుతో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
- తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా టీఎస్‌ఆర్‌జేసీ-సెట్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఏపీ ఆర్‌జేసీ సెట్ నిర్వహిస్తారు. ఈ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశం పొందిన వారికి పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలో బోధన ఉంటుంది. నీట్ యూజీ, ఐఐటీ జేఈఈ వంటి వాటికి ప్రత్యేక శిక్షణసైతం లభిస్తుంది.
అగ్రి పాలిటెక్నిక్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ ఏర్పాటు చేశారు. వీటిలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా వంటి కోర్సులు అందిస్తున్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తన సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్ అర్హతగా జాబ్ ఓరియెంటెడ్ కోర్సుల వివరాలు ఇవే..
ఒకేషనల్ కోర్సులు
ఇంటర్మీడియెట్ తర్వాత సత్వరం ఉపాధి పొందాలనుకునే వారికి మరో చక్కటి అవకాశం.. ఒకేషనల్ కోర్సులు. ఆఫీస్ అడ్మిస్ట్రేషన్ షిప్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వరకూ...టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో పలు ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్ బోర్డ్‌లు.. అగ్రికల్చర్, బిజినెస్ అండ్ కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హోంసైన్స్, హ్యుమానిటీస్, పారా మెడికల్ విభాగాల్లో ఒకేషనల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు.
ఆసక్తి ప్రధానం
పదో తరగతి తర్వాత కోర్సును ఎంచుకునే ముందు విద్యార్థులు ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు వ్యక్తిగత సామర్థ్యాలపైనా స్పష్టత తెచ్చుకోవాలి. ఇందుకోసం తాము లక్ష్యంగా భావిస్తున్న కోర్సుల స్వరూపం గురించి అవగాహన పెంచుకోవాలి. అవి తమ సామర్థ్యానికి సరితూగుతాయని భావిస్తేనే వాటిలో చేరాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags
- Careers
- after 10th class
- Career Guidance
- Best Career Options After 10th Class
- Best Polytechnic Courses After 10th Class
- Best Certificate Courses After 10th Class
- After 10th Best Courses
- Intermediate
- Polytechnic
- Careers Courses
- 10th class
- Career Opportunities
- 10th Class Exams
- Students
- Intermediate courses
- MPC or BIPC in Inter
- Engineering
- Medicine
- higher education
- employment opportunities
- vocational courses
- gurukula colleges
- Tenth class decisions
- Higher education options
- MPC and BIPC choices
- employment opportunities
- sakshieducation