Skip to main content

Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

భవిష్యత్తుకు టర్నింగ్‌ పాయింట్‌.. టెన్త్‌ క్లాస్‌! పదో తరగతి తర్వాత ఎంచుకునే కోర్సు భవితకు దారి చూపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది విద్యార్థులు ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసారు. ఇప్పుడు వీరంతా.. పది తర్వాత ఏం చేయాలి అనే అన్వేషణలో పడ్డారు. ఏ కోర్సులో చేరాలి.. తమకు సరైన కోర్సు ఏది.. ఏ కోర్సులో చేరితే మెరుగైన ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. ఇలా వారికి ఎన్నో సందేహాలు! ఈ నేపథ్యంలో.. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న మార్గాలు, భవిష్యత్‌ అవకాశాలు, కోర్సు ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వివరాలు..
best courses after 10th career opportunities in india
 • పదో తరగతి తర్వాత అనేక మార్గాలు
 • ఎక్కువ మంది చేరేది ఇంటర్మీడియెట్‌
 • టెక్నికల్‌ విభాగాల్లో ఉపాధికి పాలిటెక్నిక్, ఐటీఐ
 • ఆసక్తి, సామర్థ్యం ఆధారంగా కోర్సు ఎంపిక ముఖ్యం

ఇంటర్మీడియెట్‌.. పదో తరగతి ఉత్తీర్ణుల్లో అధిక శాతమంది చేరే కోర్సు ఇది. ఇంటర్మీడియెట్‌తోపాటు పాలిటెక్నిక్, ఐటీఐ, అగ్రికల్చర్‌ డిప్లొమాలు, ఒకేషనల్‌ కోర్సులు.. ఇలా ఎన్నో కోర్సుల్లో చేరే అవకాశముంది. కాబట్టి విద్యార్థులు వీటిపైనా దృష్టి సారించాలి. కోర్సు ఎంపికలో విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తి, అకడమిక్‌ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

ఇంటర్‌.. ప్రతి గ్రూప్‌ ప్రత్యేకమే

పదో తరగతి తర్వాత ఎక్కువ మంది చేరే ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూప్‌లు ఉన్నాయి. వీటిల్లో ప్రతి గ్రూప్‌ దేనికదే ఎంతో ప్రత్యేకమైనది. అధిక శాతం మంది విద్యార్థులు ఎంపీసీలో చేరుతుంటారు. ఆ తర్వాతి స్థానంలో బైపీసీ ఉంటుంది. సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీలతోనూ భవిష్యత్తులో మంచి అవకశాలు సొంతం చేసుకునే వీలుంది. అదే విధంగా సాంకేతిక, వృత్తి నైపుణ్యాలు అందించే ఒకేషనల్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. 

చ‌ద‌వండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!

ఇంజనీరింగ్‌కు మార్గం.. ఎంపీసీ

ఎంపీసీ గ్రూప్‌లో ప్రధాన సబ్జెక్టులు మ్యాథమెటిక్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ గ్రూప్‌ అర్హత ఆధారంగా ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తదితర ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంజనీరింగ్‌ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. భవిష్యత్తులో సైన్స్‌ రంగంలో స్థిరపడాలనుకుంటే.. ఇంటర్‌ ఎంపీసీ తర్వాత బీఎస్సీ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంపీసీ విద్యార్థులు ఇంటర్‌ తర్వాత ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం వంటి పరీక్షల ద్వారా డిఫెన్స్‌ రంగంలో కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఎంపీసీ విద్యార్థులు మ్యాథ్స్, సైన్స్‌ కోర్సులే కాకుండా..ఆర్ట్స్, హ్యుమానిటీస్, లా సంబంధిత కోర్సుల్లోనూ చేరే అవకాశముంది. ఎంపీసీలో చేరే విద్యార్థులకు సహజంగా కొన్ని లక్షణాలు ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. అవి.. కంప్యుటేషనల్‌ స్కిల్స్, న్యూమరికల్‌ స్కిల్స్‌. దీంతోపాటు మన కళ్ల ముందు కనిపించే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్స్‌ వంటి పరికరాల పనితీరును తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న వారు ఎంపీసీ గ్రూప్‌నకు సరితూగుతారని చెబుతున్నారు. 

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

మెడిసిన్‌కు దారి.. బైపీసీ

బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులు. ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షలో ర్యాంకు ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ తదితర మెడిసిన్, అనుబంధ కోర్సుల్లో చేరే అవకాశముంది. 

 • రాష్ట్ర స్థాయిలో టీఎస్‌ ఎంసెట్, ఏపీ ఏఈపీసెట్‌లలో ఉత్తీర్ణత సాధించి వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ సైన్స్‌ వంటి విభాగాల్లోనూ బ్యాచిలర్‌ డిగ్రీ, ఆ తర్వాత పీజీ, పీహెచ్‌డీ చేసే అవకాశముంది. 
 • ఇంటర్మీడియెట్‌ బైపీసీ అర్హతతో బీజెడ్‌సీలో అడుగుపెట్టొచ్చు. ఇప్పుడు బీజెడ్‌సీలోనూ బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్, హ్యూమన్‌ జెనెటిక్స్, జెనెటిక్స్‌ వంటి వినూత్న సబ్జెక్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేసుకుంటే.. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో కెరీర్‌ అవకాశాలు లభిస్తాయి.
 • బైపీసీని ఎంపిక చేసుకునే ముందు వ్యక్తిగతంగా కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అవి..లైఫ్‌ సైన్సెస్‌పై సహజ ఆసక్తి, పర్యావరణ స్పృహ వంటివి. దీంతోపాటు సహనం, ఓర్పు అనేవి బైపీసీ విద్యార్థులకు ఉండాల్సిన ఇతర ముఖ్య లక్షణాలు.

సీఈసీతో కార్పొరేట్‌ కెరీర్‌ 

 • భవిష్యత్తులో కార్పొరేట్‌ రంగంలో కెరీర్‌ కోరుకుంటే.. అందుకు చక్కటి మార్గంగా నిలుస్తున్న గ్రూప్‌.. సీఈసీ. ఈ గ్రూప్‌ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్‌ సబ్జెక్ట్‌ల కలయికగా ఉంటుంది. 
 • సీఈసీ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా బీకాం ముఖ్య మార్గంగా నిలుస్తోంది. బీకాం చదువుతూనే చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా కార్పొరేట్‌ కంపెనీల్లో ఇంటర్నల్‌ ఆడిటర్స్, స్టాక్‌ ఆడిటర్స్, ఫైనాన్షియల్‌ మేనేజర్స్, అసిస్టెంట్‌ కంపెనీ సెక్రటరీస్‌ వంటి వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు సొంత చేసుకోవచ్చు.
 • బ్యాచిలర్‌ డిగ్రీ బీకామ్‌ తర్వాత.. పీజీ స్థాయిలో ఎంకామ్, ఎంబీఏల్లో చేరొచ్చు. -ఐఐఎంలు, ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ కోసం క్యాట్, మ్యాట్, సీమ్యాట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
 • కాలిక్యులేషన్‌ స్కిల్స్, గణాంకాల విశ్లేషణ నైపుణ్యాలు, సూక్ష్మ స్థాయి పరిశీలన నైపుణ్యాలుంటే.. సీఈసీ గ్రూప్‌లో సులభంగా రాణించొచ్చు. 

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఎంఈసీతో.. విస్తృత అవకాశాలు

 • ఎంఈసీలో మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఈ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తి చేస్తే..ఇటు మ్యాథమెటిక్స్‌ అర్హతగా బీఎస్సీ.. అటు కామర్స్‌ అర్హతగా బీకాం.. ఇలా రెండు మార్గాలు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరే వీలుంటుంది. 
 • ఎంఈసీతో ముఖ్యంగా చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సుల్లో రాణించే అవకాశం లభిస్తుంది. కంప్యుటేషనల్, కాలిక్యులేషనల్‌ స్కిల్స్‌ ఉన్న విద్యార్థులు ఈ గ్రూప్‌నకు సరితూగుతారు. 

పోటీ పరీక్షలకు హెచ్‌ఈసీ 

 • సివిల్స్, గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షల్లో ముందంజలో నిలిపే గ్రూప్‌గా హెచ్‌ఈసీకి పేరుంది. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌ గ్రూప్‌ సబ్జెక్ట్‌లు. వీటిపై పట్టు సాధించడం ద్వారా పలు ఉద్యోగ పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధించొచ్చు. 
 • హెచ్‌ఈసీ అర్హతగా ప్రవేశం లభించే బీఏలోనూ జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు.

అకడమిక్‌ నైపుణ్యాలకు ఆర్‌జేసీ

 • ఇంటర్మీడియెట్‌ స్థాయిలో అకడమిక్‌ నైపుణ్యాలను మెరుగుపరచుకొని పోటీ ప్రపంచంలో ముందంజలో నిలిచేందుకు చక్కటి వేదికలు.. రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌లు. వీటిలో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఆర్‌జేసీ సెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశం పొందిన వారికి రెసిడెన్షియల్‌ విధానంలో బోధన ఉంటుంది. విద్యార్థులను ఎంసెట్, సీఏ సీపీటీ తదితర ప్రవేశ పరీక్షలకు సన్నద్ధులను చేసే విధంగా ప్రత్యేక శిక్షణసైతం లభిస్తుంది. 
 • తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ నిర్వహిస్తారు. ప్రస్తుతం 2023-24 ప్రవేశాలకు సంబంధించి టీఎస్‌ఆర్‌జేసీ-సెట్‌-2023 ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 35 కళాశాలల్లో ప్రవేశానికి టీఎస్‌ఆర్‌జేసీ-సెట్‌-2023ను మే 6న నిర్వహించనున్నారు. 
  వివరాలకు వెబ్‌సైట్‌: https://tsrjdc.cgg.gov.in/
 • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో.. ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. మొత్తం పది కళాశాలల్లో(గత ఏడాది గణాంకాల ప్రకారం) ప్రవేశాలకు ఏపీఆర్‌జేసీ సెట్‌ను నిర్వహిస్తారు. ఈ సెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. ప్రవేశం ఖరారవుతుంది. 
 • 2023 ప్రవేశాలకు సంబంధించి ఏపీఆర్‌జేసీ సెట్‌ తేదీలు వెలువడ్డాయి. విద్యార్థులు ఏప్రిల్‌ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్‌ను మే 20న నిర్వహిస్తారు.
  వివరాలకు వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/indexinter.jsp

ఒకేషనల్‌ కోర్సులు.. ఉపాధి వేదికలు

 • ఇంటర్మీడియెట్‌ తర్వాత సత్వరం ఉపాధి కోరుకునే వారికి మార్గం.. ఒకేషనల్‌ కోర్సులు. ఆఫీస్‌ అడ్మిస్ట్రేషన్‌షిప్‌ నుంచి ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్‌ వరకూ.. టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో నైపుణ్యాలు అందించే కోర్సులు ఇవి. -ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్‌ బోర్డ్‌లు.. అగ్రికల్చర్‌; బిజినెస్‌ అండ్‌ కామర్స్‌; ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ; హోంసైన్స్‌; హ్యుమానిటీస్‌; పారా మెడికల్‌ విభాగాల్లో మొత్తం 27 ఒకేషనల్‌ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు. 
 • ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలోని ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ సర్వీసింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అప్లయన్సెస్‌; రూరల్‌ ఇంజనీరింగ్‌ టెక్నీషియన్‌ కోర్సులు పూర్తి చేస్తే..ఎలాంటి ప్రవేశ పరీక్షలు అవసరం లేకుండానే సంబంధిత బ్రాంచ్‌లో నేరుగా పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరంలో చేరొచ్చు.

చ‌ద‌వండి: Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

సాంకేతిక విద్యకు కేరాఫ్‌.. పాలిటెక్నిక్‌ 

 • భవిష్యత్తులో ఇంజనీరింగ్‌ విభాగంలో రాణించాలనుకునే విద్యార్థులకు చక్కటి మార్గం.. పాలిటెక్నిక్స్‌. మూడు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, కెమికల్, మెటలర్జీ.. ఇలా అనేక బ్రాంచ్‌లు ఉంటాయి. 
 • ఈ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణులు పరిశ్రమల్లో సూపర్‌వైజర్‌ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. 
 • పాలిటెక్నిక్‌ డిప్లొమా అర్హతతో ఈసెట్‌లో ర్యాంకు ఆధారంగా లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్‌ ద్వితీయ సంవత్సరంలో అడుగు పెట్టే అవకాశం లభిస్తుంది.
 • ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ప్రవేశాలకు సంబంధించి ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. మే 10న ఏపీ పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  వివరాలకు వెబ్‌సైట్‌: https://polycetap.nic.in
 • తెలంగాణ పాలిసెట్‌-2023 ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మే 17న టీఎస్‌ పాలిసెట్‌ను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 24 వరకు, రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  వివరాలకు వెబ్‌సైట్‌: https://polycet.sbtet.telangana.gov.in/

ఐటీఐతో.. సత్వర ఉపాధి

పదో తరగతి అర్హతగా వృత్తి విద్య శిక్షణ, స్వయం ఉపాధికి మార్గం.. ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌(ఐటీఐ). నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ తదితర పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు సాధారణంగా ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ పరిధిలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న ప్రాంతీయ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ కౌన్సిల్స్‌ ఈ ప్రవేశ ప్రక్రియలను నిర్వహిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పారిశ్రామిక సంస్థల్లో ఎంట్రీ లెవల్లో టెక్నీషియన్స్‌గా అడుగు పెట్టొచ్చు. అదే విధంగా అప్రెంటీస్‌ షిప్‌ పూర్తి చేసుకుని ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌ పొందితే ఉద్యోగ సాధనలో ముందంజలో ఉండొచ్చు. 

చ‌ద‌వండి: Job Opportunities: అగ్రికల్చర్‌ కోర్సులు.. అందించేను అవకాశాలు

అగ్రి పాలిటెక్నిక్స్‌

గ్రామీణ యువత స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా నెలకొల్పిన ఇన్‌స్టిట్యూట్‌లు.. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్స్‌. వీటిలో డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ముఖ్యమైనవి. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు. అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగాలు లభిస్తాయి.

Published date : 08 Jan 2024 04:35PM

Photo Stories