Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.. ఇంటర్మీడియెట్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది! లక్షల సంఖ్యలో ఉన్న పదో తరగతి ఉత్తీర్ణులు.. కెరీర్ కోణంలో.. ఎటువైపు అడుగులు వేయాలని ఆలోచిస్తున్న తరుణం! తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ఉజ్వల భవితకు దోహదం చేసే కోర్సుల గురించి అన్వేషిస్తున్నారు! ఏ కోర్సులు అనుకూలమైనవి.. వాటితో భవిష్యత్తు అవకాశాలు ఏంటి? అని వాకబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విద్యార్థి జీవితంలో కీలకమైన పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం...
- ఇంటర్, డిప్లొమా, ఐటీఐల్లో చేరే అవకాశం
- ఇంటర్‌లో ఎంపీపీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లు
- వ్యక్తిగత సామర్థ్యం, ఆసక్తులే ప్రధానం అంటున్న నిపుణులు
పదో తరగతి ఉత్తీర్ణులు.. తమ కెరీర్ ప్రయాణంలో క్రాస్ రోడ్స్‌లో నిలబడినట్లే భావించాలి. అలాంటి విద్యార్థులు నిర్ణయించుకున్న దారి.. అంతిమంగా వారి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి కెరీర్ క్రాస్‌రోడ్స్‌లో నిలుచున్న పదో తరగతి ఉత్తీర్ణులు.. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సమీక్షించుకుంటూ.. తమ సామర్థ్యాలను, ఆసక్తిని బేరీజు వేసుకుని సరైన దారి ఎంచుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇంటర్ తర్వాత కొన్ని తక్షణ ఉపాధి కల్పించే కోర్సులు.. అలాగే మరికొన్ని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు దోహదం చేసే కోర్సులు ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణుల్లో 80 శాతం మేరకు ఇంటర్మీడియెట్‌వైపే అడుగులు వేస్తున్నారు. ఇంటర్‌లో ఎన్నో గ్రూప్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీల్లో తమకు నప్పే గ్రూప్‌ను ఎంచుకోవాలి.
చదవండి: What after Inter/10+2... ఎంపీసీ... మెరుగైన మార్గాలెన్నో
మెయిన్ టార్గెట్.. ఎంపీసీ
- పదో తరగతి ఉత్తీర్ణుల్లో అధిక శాతం మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్న గ్రూప్ ఎంపీసీ. ముఖ్యంగా ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టాలంటే.. ఎంపీసీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంటర్ ఎంపీసీ అర్హతతోనే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్, ఏపీఈఏపీసెట్ వంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లకు అనుమతి లభిస్తుంది. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ గ్రూప్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల కలయికగా ఉంటుంది. ఈ గ్రూప్‌లో రాణించేందుకు కంప్యుటేషన్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్, అనలిటికల్ నైపుణ్యాలు వంటి కొన్ని లక్షణాలు సహజంగా ఉండాలి. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే టెక్నాలజీ, వస్తువుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు ఎంపీసీ గ్రూప్‌నకు సరితూగుతారు.
- ఎంపీసీ గ్రూప్ అర్హత ఆధారంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంజనీరింగ్‌లో కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. అంతేకాకుండా ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం వంటి పరీక్షల ద్వారా సాయుధ దళాల్లో కెరీర్ సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో సైన్స్ రంగంలో స్థిరపడాలనుకుంటే.. బీఎస్సీ పూర్తిచేసి పీజీ, పీహెచ్‌డీ వైపు అడుగులు వేయొచ్చు.
చదవండి: Careers After Inter BiPC: మెడిసిన్‌తోపాటు మరెన్నో!
వైద్య వృత్తి లక్ష్యంగా.. బైపీసీ
పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌లో మరో ప్రధాన గ్రూప్.. బైపీసీ. వైద్యవృత్తిలో స్థిరపడాలనే లక్ష్యంతో ఎంబీబీఎస్/బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో చేరాలనుకుంటే.. బైపీసీ తప్పనిసరి. మెడికల్ కోర్సుల్లో చేరేందుకు నీట్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ కోర్సును ఎంపిక చేసుకునే ముందు వ్యక్తిగతంగా కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. అవి లైఫ్ సైన్సెస్‌పై సహజ ఆసక్తి, ఎన్విరాన్‌మెంట్ కాన్షియస్‌నెస్ వంటివి. అంతేకాకుండా సహనం, ఓర్పు అనేవి బైపీసీ విద్యార్థులకు ఉండాల్సిన ఇతర ముఖ్య లక్షణాలు.
- జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ఎంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత ద్వారా..ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు అభ్యసించొచ్చు. మెడికల్ కోర్సులతోపాటు ఆయుష్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్ వంటి కోర్సుల్లోనూ చేరే అవకాశం ఉంది. అలాగే బ్యాచిలర్ డిగ్రీ, ఆ తర్వాత పీజీ, పీహెచ్‌డీలో చేరొచ్చు. లైఫ్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్‌లో కెరీర్ కోరుకునే అభ్యర్థులకు బీఎస్సీ(బీజెడ్‌సీ) మార్గంగా నిలుస్తోంది.
చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!
కార్పొరేట్ ప్రొఫెషనల్స్ వయా.. సీఈసీ
- కార్పొరేట్ రంగంలో నిర్వహణ పరమైన కెరీర్‌ను కోరుకుంటున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి వారికి సరితూగే గ్రూప్‌గా సీఈసీని పేర్కొనొచ్చు. ఈ గ్రూప్ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌ల కలయికగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేస్తే కార్పొరేట్ కొలువులు సొంతం చేసుకునే దిశగా తొలి మైలురాయి దాటినట్లే. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు కాలిక్యులేషన్ స్కిల్స్, గణాంకాల విశ్లేషణ నైపుణ్యాలు, సూక్ష్మ స్థాయి పరిశీలన వంటివి ఉండాలి.
- వాస్తవానికి సీఈసీ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా బీకాం ముఖ్య కోర్సుగా నిలుస్తోంది. బీకాం చదువుతూనే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించడం ద్వారా కంపెనీల్లో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
- పీజీ స్థాయి ఎంబీఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ముఖ్యంగా అకౌంటింగ్ రంగంలో రాణించాలనుకునే వారు ఎంబీఏ ఫైనాన్స్ స్పెషలైజేషన్ ద్వారా తమ లక్ష్యం నెరవేర్చుకోవచ్చు. ఇందుకోసం బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్వహించే ఐసెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఐఐఎంలు, ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ కోసం క్యాట్, మ్యాట్, సీమ్యాట్ వంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
చదవండి: What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం
ఎంఈసీతోనూ.. మెరుగైన అవకాశాలు
- వ్యాపార వాణిజ్య విభాగాల్లో ఉజ్వల కెరీర్ కోరుకునే వారికి ఇంటర్మీడియెట్ స్థాయిలో అందుబాటులో ఉన్న మరో గ్రూప్.. ఎంఈసీ. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్‌ల కలయికగా ఉంటుంది. ఈ గ్రూప్‌ను ఎంపిక చేసుకుని ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధిస్తే.. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కోర్సుల్లో రాణించే అవకాశం లభిస్తుంది. కంప్యుటేషనల్, కాలిక్యులేషనల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు ఈ గ్రూప్‌ను ఎంచుకోవచ్చు. అదే విధంగా ఏకాగ్రత, ఒక పనిపై సుదీర్ఘ సమయం వెచ్చించే ఓర్పు, సహనం ఉన్న విద్యార్థులు ఎంఈసీ గ్రూప్‌నకు సరితూగుతారు.
- సంప్రదాయ బీకాం, బీఎస్సీ కోర్సులను అభ్యసించొచ్చు. వీటితోపాటు సీఏ, ఐసీడబ్లు్యఏఐ, సీఎస్ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఎంబీఏ, ఎంకాం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Career Guidance: పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..
పోటీ పరీక్షల్లో విజయానికి.. హెచ్‌ఈసీ
- భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేందుకు వీలుగా ఆయా పోటీ పరీక్షల్లో రాణించాలనుకునే వారికి అనువైన గ్రూప్‌గా నిలుస్తోంది.. హెచ్‌ఈసీ. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ గ్రూప్ సబ్జెక్ట్‌లుగా ఉంటాయి. వీటిల్లో పట్టు ద్వారా పలు ఉద్యోగ పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధించొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.
- హెచ్‌ఈసీ అర్హతగా ప్రవేశం లభించే బీఏ కోర్సులోనూ పలు జాబ్ ఓరియెంటెడ్ గ్రూప్ కాంబినేషన్స్(ఉదా: సోషల్ స్టడీస్, సోషల్ సైన్సెస్, ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ తదితర) అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గ్రూప్ సబ్జెక్ట్స్‌తో బీఏ పూర్తి చేయడం ద్వారా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతమవుతున్నాయి.
పాలిటెక్నిక్ డిప్లొమా
పదో తరగతి అర్హతతోనే ఇంజనీరింగ్ కెరీర్ దిశగా బాటలు వేసుకునేందుకు మార్గం.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు. మూడేళ్ల డిప్లొమా కోర్సులుగా పేర్కొనే ఈ పాలిటెక్నిక్ కోర్సులను పూర్తి చేస్తే.. సంబంధిత రంగ పరిశ్రమల్లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతగా నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈ–సెట్)లో ర్యాంకు ఆధారంగా లేటరల్ ఎంట్రీ పేరుతో నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు.
అగ్రి డిప్లొమాలు సైతం
పదో తరగతి పూర్తి చేసుకున్న తర్వాత సత్వర ఉపాధికి ఊతంగా నిలుస్తున్న మరో కోర్సు.. అగ్రికల్చరల్ డిప్లొమా. రెండు రాష్ట్రాల్లోనూ ఇందుకోసం అగ్రికల్చరల్ పాలిటెక్నిక్స్‌ను నెలకొల్పారు. వీటిలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా వంటి కోర్సులు అందిస్తున్నారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు. వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు,విత్తనాల సంస్థలు వంటి వాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది.
చదవండి: After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్ పైలట్.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
ఐటీఐ కూడా
పదో తరగతి అర్హతతో.. సత్వర ఉపాధికి దోహదం చేసే మరో కోర్సు ఐటీఐ. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్ తదితర పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు సాధారణంగా ఏప్రిల్/మే నెలలో నోటిఫికేషన్ వెలువడుతుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ పరిధిలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న ప్రాంతీయ ఒకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్స్ ఈ ప్రవేశ ప్రక్రియలను నిర్వహిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పారిశ్రామిక సంస్థల్లో ఎంట్రీ లెవల్లో టెక్నీషియన్స్‌గా అడుగు పెట్టొచ్చు. అదే విధంగా అప్రెంటీస్‌షిప్ పూర్తి చేసుకుని ఎన్‌సీవీటీ నిర్వహించే అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ పొందితే ఉద్యోగ సాధనలో మరింత ప్రాధాన్యం లభిస్తుంది.
పదో తరగతి తర్వాత కెరీర్.. ముఖ్యాంశాలు
- టెన్త్ ఉత్తీర్ణులకు ప్రధాన గమ్యంగా.. ఇంటర్మీడియెట్.
- ఎంపీసీతో ఇంజనీరింగ్‌తోపాటు హోటల్ మేనేజ్‌మెంట్, లా, తదితర కోర్సుల్లో చేరే అవకాశం.
- బైపీసీతో ఎంబీబీఎస్‌తోపాటు అగ్రి కోర్సులు, ఆయుష్ కోర్సుల్లో చేరొచ్చు.
- కార్పొరేట్ కెరీర్స్‌కు మార్గంగా నిలుస్తున్న సీఈసీ, ఎంఈసీ.
- స్వతర ఉపాధికి మార్గంగా ఐటీఐ, డిప్లొమా, ఒకేషనల్ కోర్సులు
చదవండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది..?