Job Opportunities: అగ్రికల్చర్ కోర్సులు.. అందించేను అవకాశాలు
ఇంటర్మీడియెట్ బైపీసీ.. మెడికల్ కోర్సులకు మార్గంగా భావించే గ్రూప్! బైపీసీలో చేరే అత్యధికులు చెప్పే సమాధానం కూడా ఇదే!! ఒకవేళ.. మెడికల్ కోర్సుల కల నెరవేరకపోతే? ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు రాకపోతే? భవిష్యత్తు ఏంటి? సంప్రదాయ బీఎస్సీతోనే సరిపెట్టుకోవాల్సిందేనా? మెరుగైన అవకాశాలు కల్పించే కోర్సులు ఏమైనా ఉన్నాయా.. వాటిలో చేరడానికి మార్గాలు ఏంటి?! ఇలాంటి తరుణంలో.. బైపీసీ విద్యార్థులకు.. మరో ప్రధాన వేదిక.. అగ్రికల్చరల్ కోర్సులు! ముఖ్యంగా.. గత కొన్నేళ్లుగా కెరీర్ అవకాశాల పరంగా అగ్రికల్చర్ అభ్యర్థులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. బ్యాచిలర్ నుంచి పీహెచ్‌డీ వరకూ.. అందుబాటులో ఉన్న అగ్రికల్చరల్ కోర్సులు, వాటిలో ప్రవేశ మార్గాలు, భవిష్యత్తు అవకాశాలపై ప్రత్యేక కథనం..
- బైపీసీ విద్యార్థులకు మరో ప్రధాన మార్గంగా అగ్రి కోర్సులు
- బ్యాచిలర్ నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు పలు కోర్సులు
- టీఎస్‌ఎంసెట్, ఈఏపీసెట్, ఏఐఈఈఏ ఆధారంగా ప్రవేశాలు
- అగ్రికల్చర్ కోర్సుల ఉత్తీర్ణులకు పెరుగుతున్న డిమాండ్
యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందించడంలో ముందజంలో నిలుస్తున్న విభాగం అగ్రికల్చర్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సెక్టార్‌లోనూ మార్పులు వస్తున్నాయి. అగ్రికల్చర్‌లో బ్యాచిలర్ నుంచి పీహెచ్‌డీ వరకూ.. ఆయా కోర్సులకు తగ్గట్టుగా అభ్యర్థులకు అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. కాబట్టి బైపీసీ విద్యార్థులు అగ్రికల్చర్ రంగాన్ని తమ కెరీర్ గమ్యంగా ఎంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
చదవండి: Engineering Entrance: బెస్ట్ ఇంజనీరింగ్‌కు.. బిట్‌శాట్
బ్యాచిలర్ స్థాయి నుంచే
- బైపీసీ అర్హతతో బ్యాచిలర్ స్థాయి నుంచే అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్(ఆనర్స్) కోర్సు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీఎస్సీ(ఆనర్స్) కమ్యూనిటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే ఈ కోర్సుల్లో చేరాలంటే.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టీఎస్ ఎంసెట్(తెలంగాణ), ఏపీ–ఈఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్) ఎంట్రన్స్‌లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో సీటు కోసం ఎంసెట్ ఎంపీసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో ర్యాంకు సాధించాలి. ఈ ర్యాంకు ఆధారంగా వ్యవసాయ విశ్వ విద్యాలయాలు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల భర్తీ చేపడతాయి. మొత్తం సీట్లలో 40 శాతం సీట్లను ఫార్మర్స్ కోటా కింద రైతుల పిల్లలకు కేటాయిస్తారు.
- అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సుల విద్యార్థులకు అగ్రిసెట్ పేరుతో ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహించి బీఎస్‌సీ(ఆనర్స్) కోర్సులోకి ప్రవేశం కల్పిస్తారు.
- మొత్తం సీట్లలో పది శాతం సీట్లను డిప్లొమా ఉత్తీర్ణులకు కేటాయిస్తారు. అగ్రికల్చర్, /సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్‌లో డిప్లొమా పూర్తి చేసుకున్న వారు ఈ అగ్రిసెట్‌కు అర్హులు.
- అదేవిధంగా బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎంపీసీ స్ట్రీమ్ కోర్సులు
- అగ్రికల్చర్ బ్యాచిలర్ కోర్సుల్లో ఎంపీసీ స్ట్రీమ్ పేరుతోనూ సీట్ల భర్తీ చేపడతారు. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో.. టీఎస్ ఎంసెట్, ఈఏపీసెట్‌లలో ఎంపీసీ స్ట్రీమ్ ఉత్తీర్ణులకు ఈ సీట్లను కేటాయిస్తారు.
- తెలంగాణలోనూ బీఎస్సీ(ఆనర్స్)–అగ్రికల్చర్, బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సుల్లో ప్రవేశానికి అగ్రికల్చరల్, అనుబంధ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి అగ్రి సెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్‌ను నిర్వహించి సూపర్ న్యూమరరీ సీట్ల విధానంలో డిప్లొమా వారికి ప్రత్యేకంగా సీట్లను అందుబాటులో ఉంచుతున్నారు. యూనివర్సిటీ, అనుబంధ ప్రైవేటు కళాశాలల్లో కలిపి దాదాపు ఆరు వందల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఏపీలో ఇతర బ్యాచిలర్ కోర్సులు చదివే అవకాశం
అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణులు బ్యాచిలర్ స్థాయిలో లైఫ్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్ వంటి కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ కాంబినేషన్లు ఉండే బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చదివే అవకాశాన్ని కూడా కల్పించేలా ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల అగ్రి డిప్లొమా కోర్సులను ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులుగా గుర్తిస్తూ.. ఈ కోర్సుల ఉత్తీర్ణులు బీజెడ్‌సీ అనుబంధ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
పీజీ.. పలు స్పెషలైజేషన్లు
- అగ్రికల్చరల్ సైన్స్ కోర్సులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి ఉన్నత విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ స్థాయిలలో పలు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశించాలంటే.. ముందుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్).. జాతీయ స్థాయిలో నిర్వహించే ఏఐఈఈఏ–పీజీ ఎంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తదుపరి దశలో సొంతగా నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరైతే.. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
- ప్రస్తుతం పీజీ స్థాయిలో రెండేళ్ల వ్యవధిలో ఎమ్మెస్సీ(అగ్రికల్చర్), ఎంబీఏ(అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్), ఎంటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), ఎమ్మెస్సీ(హోంసైన్స్) ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్‌లో ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ప్లాంట్ బయోటెక్నాలజీ, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, ఆగ్రానమీ, సోషల్ సైన్సెస్(అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్), స్టాటిస్టికల్ సైన్సెస్(అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్) స్పెషలైజేషన్లు ఉన్నాయి.
- ఎంటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో.. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పరిధిలో సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మ్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీరింగ్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
పీహెచ్‌డీలో విభాగాలు
అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ స్థాయిలో పలు విభాగాల్లో పరిశోధనలు చేసే అవకాశం ఉంది. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ, క్రాప్ సైకాలజీ, మాలిక్యులర్ బయాలజీ అండ్ బయో టెక్నాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ఆగ్రానమీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, సాయిల్ అండ్ వాటర్ ఇంజనీరింగ్, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మ్ మెషినరీ అండ్ పవర్ ఇంజనీరింగ్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తాము ఎంచుకున్న విభాగానికి సంబంధించిన స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తి చేసి.. ఐసీఏఆర్ నిర్వహించే ఏఐఈఈఏ–పీహెచ్‌డీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
చదవండి: After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..
ఐఐఎంలలోనూ అగ్రి పీజీ కోర్సులు
దేశంలో ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌గా గుర్తింపు పొందిన ఐఐఎంలలోనూ అడుగు పెట్టే అవకాశం ఉంది. ఐఐఎం–అహ్మదాబాద్, లక్నో క్యాంపస్‌లలో ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ ప్రోగ్రామ్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. క్యాట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా వీటిలో చేరొచ్చు.
అవకాశాలు ఉజ్వలం
అగ్రికల్చరల్ విభాగంలో.. బ్యాచిలర్ అర్హతతోనే అవకాశాలు అందుకోవచ్చు. బ్యాచిలర్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, న్యూట్రియంట్ పరిశ్రమల్లో సూపర్‌వైజర్స్, ల్యాబ్ ఇంచార్జ్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలోనే నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వేతనం అందుకోవచ్చు. వీటితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లుగా చేరొచ్చు. మోన్‌శాంటో, గోద్రెజ్ ఆగ్రోవెట్, బేయర్ వంటి విత్తన, ఫెర్టిలైజర్ కంపెనీల్లో టెక్నికల్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
- పీజీ పూర్తి చేసిన వారికి ప్రొడక్షన్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్స్ హోదాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. పీహెచ్‌డీ ఉత్తీర్ణులు ఐసీఏఆర్, ఐఏఆర్‌ఐ తదితర అగ్రికల్చరల్ రీసెర్చ్ లేబొరేటరీస్, ఇన్‌స్టిట్యూట్స్‌లో సైంటిస్ట్‌గా కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంది. అదే విధంగా పలు ప్రైవేట్ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ సంస్థల్లోనూ ఆర్ అండ్ డీ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
- అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసిన అభ్యర్థులు.. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల్లో ప్లాంట్ మేనేజర్స్, ఆపరేషన్స్ మేనేజర్స్, మార్కెటింగ్ ఆఫీసర్స్ వంటి హోదాలతో కెరీర్ ప్రారంభించొచ్చు.
స్వయం ఉపాధి
అగ్రికల్చరల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెండుగా లభిస్తున్నాయి. ప్రధానంగా ఆర్గానిక్ ఫార్మింగ్, ప్రొడక్ట్ మార్కెటింగ్ విభాగాల్లో సొంతంగా స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఆర్గానిక్ ఫార్మింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. దాంతో ఈ విభాగంలో స్వయం ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతున్నాయని నిపుణుల అభిప్రాయం.
చదవండి: Inter Special: ఎంపీసీ.. అకడమిక్ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్!!
సర్కారీ కొలువులు
అగ్రికల్చరల్ అనుబంధ కోర్సులు పూర్తి చేసిన వారికి సర్కారీ కొలువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు, ఉద్యాన శాఖ అధికారులు, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు వంటి పోస్ట్‌లకు పోటీ పడొచ్చు. జాతీయ స్థాయిలో.. గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖల్లోనూ ఉన్నత స్థాయి పోస్ట్‌లకు పోటీ పడే అర్హత లభిస్తుంది.
అగ్రికల్చర్ కోర్సులు.. ముఖ్యాంశాలు
- బైపీసీ అర్హతగా టీఎస్ ఎంసెట్(తెలంగాణ), ఈఏపీసెట్(ఆంధ్రప్రదేశ్)లలో ఉత్తీర్ణతతో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో చేరే అవకాశం.
- పీజీ స్థాయిలో పదుల సంఖ్యలో స్పెషలైజేషన్లు.
- ఐసీఏఆర్–ఏఐఈఈఏ–పీజీ ఎంట్రన్స్‌లో ర్యాంకు ఆధారంగా పీజీ ప్రవేశాలు.
- ఏఐఈఈఏ–పీహెచ్‌డీ ఎంట్రన్స్ ఉత్తీర్ణతతో పీహెచ్‌డీ చేసే అవకాశం
- పీహెచ్‌డీతో ఐసీఏఆర్, ఏఐఆర్‌ఈ, ఇతర ప్రముఖ రీసెర్చ్ ల్యాబ్స్, వ్యవసాయ ఉత్పత్తుల సంస్థల రీసెర్చ్ ల్యాబ్స్‌లో సైంటిస్ట్‌లుగా అవకాశం.
- పీహెచ్‌డీ ఉత్తీర్ణులకు సైంటిస్ట్‌లుగా, అధ్యాపకులుగా ఉద్యోగాలు.
- బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సులతో ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో కొలువులు
- స్వయం ఉపాధికి కూడా ఊతంగా అగ్రి కోర్సులు.
అగ్రికల్చరల్ కోర్సులు– ప్రముఖ యూనివర్సిటీలు
- ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ – ఆంధ్రప్రదేశ్
- ప్రొ‘‘ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ – తెలంగాణ
- ఐసీఏఆర్– న్యూఢిల్లీ
- జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ
- తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ
- సెంట్రల్ అగ్రిలక్చరల్ యూనివర్సిటీ–ఇంఫాల్
- ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ
- జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయం
- డా‘‘ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ
- యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ – రాయ్‌చూర్
అవకాశాలు విస్తృతం
అగ్రి కల్చరల్ కోర్సులు పూర్తి చేసుకుంటే విస్తృత అవకాశాలు సొంతమవుతాయనేది సుస్పష్టం. ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్, ఇతర ఆధునిక సాగు పద్ధతులు అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అగ్రికల్చర్ నిపుణుల అవసరం పెరుగుతోంది. దీంతో అగ్రికల్చర్ కోర్సులు పూర్తి చేసిన వారి కోసం సంస్థలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య కూడా క్రమేణా పెరుగుతోంది. కాబట్టి ఇంటర్మీడియెట్‌లోనే ఈ కోర్సుల గురించి అవగాహన పెంచుకొని అడుగులు వేస్తే.. చక్కటి కెరీర్‌కు పునాది వేసుకోవచ్చు.
–ప్రొ‘‘ ప్రవీణ్ రావు, వైస్ ఛాన్స్‌లర్, పీజేటీఎస్‌ఏయూ
చదవండి: After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు