NCHM JEE Notification 2024: NCHM-JEEతో ప్రవేశం కల్పించే కోర్సులు.. ప్రవేశ పరీక్ష విధానం, కెరీర్ మార్గాలు ఇవే...
- ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ–2024కి నోటిఫికేషన్ విడుదల
- బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశం
- ఈ కోర్సు పూర్తి చేసుకుంటే ఆతిథ్య రంగంలో ఉపాధి అవకాశాలు
- ఇంటర్మీడియెట్‌తో ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈకి దరఖాస్తు చేసుకోవచ్చు
ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక చాలా మంది ఇంజనీరింగ్ వైపు దృష్టి సారిస్తున్నారు. దీనికి కారణం.. విస్తృత కెరీర్ అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయమే. అదే అర్హతతో మరెన్నో వినూత్న కోర్సులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌గా పేర్కొనొచ్చు. కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ఐహెచ్‌ఎంలలో ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. హాస్పిటాలిటీ రంగంలో ఉపాధి అవకాశాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు.
హాస్పిటాలిటీలో నిపుణుల కోసం
దేశంలో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్ తదితర కోర్సులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ఈఆర్‌లు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో హోటల్ మేనేజ్‌మెంట్ విభాగంలోనూ నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యాసంస్థ.. ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్‌ఎం). ఈ క్యాంపస్‌లలో.. బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును అందిస్తున్నారు. వీటిల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్ష.. ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ.
చదవండి: Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!
78 ఇన్‌స్టిట్యూట్‌లు.. 12 వేల సీట్లు
ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లోని 78 హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 11,995 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 21 ఇన్‌స్టిట్యూట్‌లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 30 ఇన్‌స్టిట్యూట్‌లు,24 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు, పీపీపీ విధానంలో రాష్ట్ర స్థాయిలో రెండు ఎస్‌హెచ్‌ఐఎం, ఒక పీఎస్‌యూ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అందుబాటులో ఉంది. వీటి పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ సంస్థను కూడా పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది.
అర్హతలు
ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ ఇలా
ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో 200 ప్రశ్నలకు జరుగుతుంది. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ అప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ (30 ప్రశ్నలు), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ (30 ప్రశ్నలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (60 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ (50 ప్రశ్నలు)ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు.
ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్
ఎన్‌సీఎహెచ్‌ఎం–జేఈఈ ఫలితాల తర్వాత సీట్ల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో ఉమ్మడి కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకుని తమ ఇన్‌స్టిట్యూట్ ప్రాథమ్యాలతో ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేస్తే..అందుబాటులో ఉన్న సీట్లు, అప్లికేషన్లు, విద్యార్థులు పొందిన ఎంట్రన్స్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం కల్పిస్తారు. గత ఏడాది రెండు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
కొలువులు ఇవే
బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి విస్తృత కొలువులు లభిస్తున్నాయి. గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్, ఫ్రంట్ డెస్క్ మేనేజర్, కిచెన్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ట్రిప్ అడ్వైజర్, బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్స్, చెఫ్స్ వంటి పలు ఉద్యోగాలు అందుకునే వీలుంది. ప్రారంభంలో సగటున రూ.నాలుగు లక్షల నుంచి రూ.అయిదు లక్షల వేతనం లభిస్తోంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మార్చి 31
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: 2024 ఏపిల్ 2 – ఏప్రిల్ 5
- పరీక్ష తేదీ: 2024, మే 11
- వెబ్‌సైట్: https://exams.nta.ac.in/NCHM/, https://www.nta.ac.in/
బెస్ట్ స్కోర్‌కు మార్గం ఇలా
న్యూవురికల్ ఎబిలిటీ, అనలిటికల్ ఆప్టిట్యూడ్
మ్యాథమెటిక్స్‌లో బేసిక్ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. అభ్యర్థులు హెస్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా శాతాలు, లాభ–నష్టాలు, నెంబర్ సిస్టమ్, సగటు, కాలం–పని, సాధారణ వడ్డీ, బారు వడ్డీ, కాలం–వేగం–దూరం, నిష్పత్తులు, జామెట్రీ వంటి వాటిపై పట్టు సాధించాలి. అనలిటికల్ ఆప్టిట్యూడ్ కోసం నిర్దిష్టంగా డేటాను విశ్లేషించగలిగే సామర్థ్యం, డేటాలోని ముఖ్య సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చిన ప్రశ్నకు అనువుగా, సమాధానం ఇచ్చే స్కిల్ సొంతం చేసుకోవాలి.
రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్
సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగమిది. ఇందులో మెరుగైన ప్రతిభ కనబర్చాలంటే.. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్–డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్ వంటి రీజనింగ్ ఆధారిత అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా డేటా సఫీషియన్సీ, వెన్ డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
ఈ విభాగంలో మంచి మార్కులు పొందాలంటే.. స్కూల్ స్థాయిలోని చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్ పాఠ్యాంశాలు చదవాలి. హిస్టరీలో ముఖ్యమైన యుద్ధాలు–పరిణామాలు–పర్యవసానాలు, స్వాతంత్య్రోద్యమం వంటి అంశాలపై అవగాహన లాభిస్తుంది. జాగ్రఫీలో దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలు, ఖనిజ వనరులు–అవి ఎక్కువగా లభించే ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్ కోసం ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, ఇటీవల కాలంలో అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో రాణించడానికి అభ్యర్థులు గ్రామర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, ప్రిపోజిషన్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. దీనికోసం బేసిక్ గ్రామర్ పుస్తకాలను అధ్యయనం చేయడంతోపాటు దినపత్రికలు చదవడం, వాటిలోని కొత్త పదాలను తెలుసుకోవడం, ఆ పదాలను వినియోగించిన తీరుపై అవగాహన ఏర్పరచుకోవడం వంటివి లాభిస్తాయి.
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ప్రత్యేకమైన విభాగంగా ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ విభాగాన్ని పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అభ్యర్థికి ఆతిథ్య, పర్యాటక రంగాల్లో ఉన్న ఆసక్తి, దృక్పథాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. వాస్తవ సంఘటన లేదా అంశం ఇచ్చి దానికి ఎలా స్పందిస్తారు? అనే తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు అభ్యర్థుల్లో ఎదుటి వారిని మెప్పించే తీరు, సందర్భానికి తగినట్లు వ్యవహరించే శైలికి సంబంధించి ఉంటాయి.
Tags
- NCHM JEE Notification 2024
- NCHM JEE 2024 Exam Pattern
- National Testing Agency
- NCHM JEE 2024 Important dates
- Joint Entrance Examination
- Careers
- National Council for Hotel Management
- After inter
- employment opportunities
- Career Opportunities
- Hotel Management Courses
- Current Affairs
- Exam preparation
- Admission criteria
- Professional development
- sakshieducationlatest admissions