Engineering Entrance: బెస్ట్ ఇంజనీరింగ్‌కు.. బిట్‌శాట్
- బిట్స్ క్యాంపస్‌లలో ప్రవేశాలకు బిట్‌శాట్
- బిట్‌శాట్–2022కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
- ఈ ఏడాది ప్రశ్నల సంఖ్య తగ్గింపు
- బోర్డ్ టాపర్లకు నేరుగా ప్రవేశం
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్.. బిట్స్‌గా సుపరిచితం. డీమ్డ్ యూనివర్సిటీ హోదా, అదే విధంగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్. జాతీయ స్థాయిలో మొత్తం మూడు క్యాంపస్‌లు పిలానీ, గోవా, హైదరాబాద్, అంతర్జాతీయంగా దుబాయ్‌లో ఒక క్యాంపస్ ఉంది. బిట్స్‌కు ఇంజనీరింగ్, సాంకేతిక విద్యలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు వేల మంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్మిషన్ టెస్ట్(బిట్‌శాట్) ద్వారా ప్రవేశం లభిస్తుంది.
ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సు
- బిట్‌శాట్‌లో స్కోర్ ఆధారంగా.. బిట్స్ క్యాంపస్‌లలోని బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తారు. వీటినే ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సులుగా పిలుస్తున్నారు.
- బిట్‌శాట్‌లో పొందిన స్కోర్ ఆధారంగా.. మెరిట్ జాబితా రూపొందించి.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న క్యాంపస్ ప్రాథమ్యాలను, ఇంజనీరింగ్ బ్రాంచ్ ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుని సీటు కేటాయిస్తారు.
అర్హతలు
- 10+2/ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ (బీ ఫార్మసీ).. గ్రూప్ సబ్జెక్టులలో ఒక్కో సబ్జెక్ట్‌లో కనీసం 60 శాతం మార్కులతో.. మొత్తం గ్రూప్ సబ్జెక్ట్‌లలో కలిసి సగటున 75 శాతం మార్కులు సాధించాలి.
- 10+2/ఇంటర్మీడియెట్ 2021లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, 2022లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులే బిట్‌శాట్‌కు అర్హులు.
ప్రశ్నల సంఖ్య తగ్గింపు
- ఈ ఏడాది బిట్‌శాట్‌లో ప్రశ్నల సంఖ్యను తగ్గించారు. గత ఏడాది వరకు 150 ప్రశ్నలతో జరిగిన బిట్‌శాట్‌ను.. ఈ సంవత్సరం 130 ప్రశ్నలతోనే నిర్వహించనున్నారు. పరీక్ష సమయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. బిట్‌శాట్ పరీక్ష నాలుగు విభాగాల్లో మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది.
- పార్ట్–1 ఫిజిక్స్ 30 ప్రశ్నలు, పార్ట్ 2 కెమిస్ట్రీ 30 ప్రశ్నలు, పార్ట్ 3 ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ 10 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు, పార్ట్ 4లో మ్యాథమెటిక్స్/బయాలజీ 40 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది.
- పార్ట్–4లో పేర్కొన్న మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ సబ్జెక్టుల్లో బీఫార్మసీ అభ్యర్థులు ఏదో ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. బీఈ కోర్సుల అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున మొత్తం 130 ప్రశ్నలు– 390 మార్కులకు పరీక్ష జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును తగ్గిస్తారు.
చదవండి: After Inter: ఇంటర్మీడియెట్ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..
మరో 12 ప్రశ్నలు రాసే అవకాశం
బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్‌లో అమలవుతున్న మరో వినూత్న విధానం.. పరీక్షకు కేటాయించిన మూడు గంటల వ్యవధిలో అన్ని ప్రశ్నలను పూర్తిచేసిన అభ్యర్థులకు.. అదనంగా మరో 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ, లాజికల్ రీజనింగ్ నుంచి మూడు ప్రశ్నలు చొప్పున ఇస్తారు.
ఆన్‌లైన్ టెస్ట్.. రెండు స్లాట్‌లు
- ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా బిట్‌శాట్‌ను రెండు సెషన్లుగా, ఒక్కో సెషన్‌లో రెండుస్లాట్లు చొప్పున నిర్వహించనున్నారు. నిర్దిష్ట వ్యవధిలో అభ్యర్థులు తమకు నచ్చిన తేదీ, స్లాట్‌లో పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం తాము ఎంపిక చేసుకున్న టెస్ట్ సెంటర్‌లో తమకు అనుకూలమైన స్లాట్‌ను రిజర్వ్ చేసుకునేందుకు వీలైనంత త్వరగా ఉపక్రమించాలి.
- బిట్‌శాట్‌ను రెండు దశలుగా(సెషన్లు) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితంగా ఏ సెషన్‌లో మంచి స్కోర్ వస్తుందో దాని ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
బోర్డ్ టాపర్స్‌కు నేరుగా ప్రవేశం
బిట్స్ ప్రవేశాల పరంగా మరో విశిష్టత.. ఆయా రాష్ట్రాల బోర్డ్‌ల పరిధిలో ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సులో స్టేట్ టాపర్స్‌గా నిలిచిన అభ్యర్థులకు బిట్‌శాట్‌కు హాజరు నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ బోర్డ్ టాపర్స్ నేరుగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందే వీలుంది. ఈ విధానానికి కూడా విద్యార్థుల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది.
క్యాంపస్‌లు.. బీటెక్ బ్రాంచ్‌లు
- పిలానీ క్యాంపస్: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్ బ్రాంచ్‌లు, బీఫార్మసీ.
- గోవా క్యాంపస్: కెమికల్, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ బ్రాంచ్‌లు
- హైదరాబాద్ క్యాంపస్: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,ఎల క్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్,మెకానికల్ బ్రాంచ్‌లు, బీఫార్మసీ.
- వీటితోపాటు బీ–ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రాక్టికల్ అప్రోచ్
బిట్‌శాట్‌లో చేరిన విద్యార్థులు కోర్సు వ్యవధిలో విస్తృత నైపుణ్యాలు అందుకునే అవకాశం ఉంది. ఆయా కోర్సులకు సంబంధించి బిట్స్ ప్రత్యేక కరిక్యులంను రూపొందించడమే ఇందుకు కారణం. విద్యార్థుల్లో ప్రాక్టికల్ అప్రోచ్ పెరిగే విధంగా దీన్ని రూపొందించారు. బీఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు.. కోర్సు వ్యవధిలో రెండుసార్లు ప్రాక్టీస్ స్కూల్–1, ప్రాక్టీస్ స్కూల్–2 పేరుతో.. పరిశ్రమల్లో రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
- కోర్ సబ్జెక్ట్‌లే కాకుండా.. విద్యార్థులకు ఇతర అంశాల్లోనూ అవగాహన కల్పించే విధంగా మైనర్ ప్రోగ్రామ్స్ విధానాన్ని బిట్స్ అమలు చేస్తోంది. ఫైనాన్స్, అకౌంటింగ్, లిటరేచర్, హ్యుమానిటీస్ వంటి పలు సబ్జెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం మరో విశేషం.
బిట్‌శాట్–2022 ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మే21,2022
- బిట్‌శాట్–2022 సెషన్–1 తేదీలు: జూన్ 20– జూన్ 26
- బిట్‌శాట్–2022 సెషన్–2 తేదీలు: జూలై 22 నుంచి జూలై 26 వరకు
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: బిట్స్ పిలానీ–హైదరాబాద్ క్యాంపస్,హైదరాబాద్, రాజ మండ్రి,తిరుపతి,విజయవాడ, విశాఖపట్నం.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.bitsadmission.com
చదవండి: After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు
విజయం సాధించండిలా
ప్రాథమిక భావనలే ఆలంబనగా
- బిట్‌శాట్‌లో అడుగుతున్న ప్రశ్నలు వాటి తీరును గమనిస్తే.. జేఈఈ తరహాలోనే క్లిష్టత స్థాయి ఉంటోంది. ప్రశ్నలన్నీ దాదాపుగా అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో సమాధానం ఇవ్వాల్సిన విధంగా ఉంటున్నాయి. దీంతో అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లలో బేసిక్స్‌పై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి.
- జేఈఈ ప్రిపరేషన్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవడం వల్ల ఒకే సమయంలో రెండు పరీక్షలకు ప్రిపరేషన్ సాగించొచ్చు. బేసిక్స్‌పై పట్టు సాధించడంతోపాటు విద్యార్థులు నిర్దిష్టంగా కొన్ని వ్యూహాలు అనుసరిస్తే.. బిట్‌శాట్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశముంది.
- ప్రతి సబ్జెక్ట్‌లోనూ ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది.
- కెమిస్ట్రీలో.. ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్‌ను ఒక జాబితాగా రూపొందించుకోవాలి.
- ఫిజిక్స్‌లో.. వర్క్ అండ్ ఎనర్జీ, న్యూటన్స్ లా, కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మ్యాగ్నటిజం అండ్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్లలో ముఖ్య అంశాలతో నోట్స్ రూపొందించుకోవాలి.
- మ్యాథమెటిక్స్‌లో.. హైపర్‌బోలా, పారాబోలా, రెక్టాంగులర్ పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, 3–డి, ఇంటెగ్రల్ కాలిక్యులస్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పార్ట్–3కి ప్రత్యేకంగా
బిట్‌శాట్ పార్ట్–3లో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్ అంశాల నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నైపుణ్యాలను పరీక్షించడమే కాకుండా.. లాంగ్వేజ్, తులనాత్మక పరిశీలన సామర్థ్యాన్ని పరిశీలించేలా ఈ విభాగాన్ని పొందుపర్చారు. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్, వొకాబ్యులరీపై పట్టుంటే 25 ప్రశ్నలకు సులువుగా సమాధానం ఇవ్వొచ్చు.
బిట్‌శాట్‌నే లక్ష్యంగా ఎంచుకుంటే
జేఈఈ–అడ్వాన్స్‌డ్, మెయిన్స్ అభ్యర్థుల్లో అధిక శాతం మంది బిట్‌శాట్‌కు కూడా దరఖాస్తు చేసుకుంటారు. కొంతమంది కేవలం బిట్‌శాట్‌నే లక్ష్యంగా చేసుకుని ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలా బిట్‌శాట్‌నే లక్ష్యంగా చేసుకుంటే.. ప్రత్యేక వ్యూహాలు అనుసరించాలి. ప్రతిరోజు, ప్రతి విభాగానికి కచ్చితంగా నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం రెండు గంటలు చొప్పున కేటాయించాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని సిలబస్‌ను అనుసరిస్తూ వాటిని బిట్‌శాట్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవడం మేలు.
- ఇలా ప్రతి దశలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మెరుగైన స్కోర్ సొంతం చేసుకునే ఆస్కారం లభిస్తుంది.
చదవండి: After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..