Inter Special: ఎంపీసీ.. అకడమిక్ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్!!
ఇంటర్మీడియెట్ ఎంపీసీ.. ఎక్కువ మంది చేరే గ్రూప్! అధిక శాతం మంది ఎంపీసీ విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అందుకోసం ఇంటర్‌తోపాటే నిట్‌లు, ఐఐటీల్లో ప్రవేశాలకు వీలు కల్పించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తారు. మరికొంత మంది రాష్ట్ర స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్/ఏపీఈఏపీసెట్‌పైనా దృష్టిపెడతారు. ఎంపీసీ గ్రూప్‌లో చేరడం లక్ష్య సాధనకు తొలి మెట్టు మాత్రమే! ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే ఇటు అకడమిక్, అటు పోటీ పరీక్షల మధ్య సమతుల్యత పాటిస్తూ.. చదువు కొనసాగిస్తేనే విజయం దరి చేరుతుంది. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్ ఎంపీసీ ద్వితీయం సంవత్సరం విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రిపరేషన్ గైడెన్స్..
- అకడమిక్ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్
- సమయ పాలన, రివిజన్, ప్రాక్టీస్ ప్రధానం అంటున్న నిపుణులు
ఇంజనీరింగ్ లక్ష్యంగా చేసుకున్న ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులు.. అకడమిక్‌గా మంచి మార్కులతోపాటు.. ప్రవేశ పరీక్షల్లోనూ విజయం సాధించేలా ప్రిపరేషన్‌ను సాగించాలి. దీనికి అనుగుణంగా పటిష్టమైన ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవాలి. ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం ఎంతో నిర్ణయాత్మకం. ఎందుకంటే..రెండో సంవత్సరంలో అకడమిక్‌గా మంచి మార్కులతోపాటు జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్, టీఎస్ ఎంసెట్/ఏపీఈఏపీసెట్‌లో ర్యాంకు సాధించేలా కృషి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒకవైపు అకడమిక్స్‌లో రాణించడం.. మరోవైపు ఎంట్రెన్స్‌ల ప్రిపరేషన్. ఇలా.. రెండింటికీ ఏకకాలంలో సన్నద్ధత సాగించాలి. అప్పుడే ఇంటర్‌తోపాటు ప్రవేశ పరీక్షల్లోనూ మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఒకే సమయంలో సన్నద్ధత
- ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. సబ్జెక్ట్‌లను చదివే విషయంలో, టైమ్ మేనేజ్‌మెంట్‌లో, ప్రాక్టీస్ పరంగానూ ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేయాలని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు.
- విద్యార్థులు అకడమిక్ సిలబస్‌ను, పోటీ పరీక్షల సిలబస్‌ను ఒకే సమయంలో పూర్తి చేసుకుంటేనే.. పరీక్షలకు ముందు రివిజన్ సులభం అవుతుంది.
- ఇంటర్మీడియెట్ సిలబస్‌ను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత తాము లక్ష్యంగా పెట్టుకున్న ఎంట్రన్స్‌ల పరంగా ముందుగా జేఈఈ–మెయిన్‌పై దృష్టిపెట్టాలి.
- మెయిన్ సంవత్సరానికి నాలుగు సెషన్లలో(ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో) నిర్వహిస్తారు. ఫిబ్రవరి సెషన్‌కు హాజరయ్యే విద్యార్థులు జనవరి నుంచి పరీక్ష తేదీ వరకూ.. ఇంటర్మీడియెట్, జేఈఈ–మెయిన్ ఉమ్మడి అంశాల పునశ్చరణకు అధిక సమయం కేటాయించాలి.
- మార్చి, ఏప్రిల్ సెషన్‌ల విద్యార్థులు..ఆ సమయంలో ఎక్కువగా ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. ఈ రెండు సెషన్లకు హాజరయ్యే విద్యార్థులు తమ వార్షిక పరీక్షలకు, ప్రాక్టికల్స్‌కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అకడమిక్ పరీక్షల ఒత్తిడికి గురవుతున్నామనుకుంటే.. మార్చి సెషన్‌ను విస్మరించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
- మే సెషన్‌లో విద్యార్థులు మరిన్ని ఎక్కువ మార్కులు సాధించేలా ప్రయత్నించొచ్చు. కారణం.. డిసెంబర్‌లోనే ఇంటర్ అకడమిక్ సిలబస్‌ను పూర్తి చేసుకున్న విద్యార్థులు.. అప్పటికే ఒకసారి ఫిబ్రవరి సెషన్‌కు హాజరై ఉంటారు. దాని ఆధారంగా తమ సామర్థ్యంపై స్పష్టత వస్తుంది. మరోవైపు ఇంటర్ పరీక్షలకు పూర్తి స్థాయి ప్రిపరేషన్‌తో అన్ని సబ్జెక్ట్‌లపై పట్టు వస్తుంది. ఇంటర్ పరీక్షలు కూడా రాసి.. సబ్జెక్టులపై గట్టి పట్టు సాధిస్తారు.
- కాబట్టి మే సెషన్‌లో టాప్ స్కోర్ సాధించేందుకు వీలుగా రివిజన్, మాక్ టెస్ట్‌ల ప్రాక్టీస్‌కు అధిక సమయం కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!
అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.. ఆయా సబ్జెక్ట్‌లను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపేరవ్వాలి. ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల బేసిక్ కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఇంటర్ సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. తద్వారా జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్, ఎంసెట్ వంటి ఎంట్రన్స్ టెస్టుల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు అవకాశం ఉంటుంది.
కీ పాయింట్స్‌తో షార్ట్ నోట్స్
విద్యార్థులు ప్రిపరేషన్ సందర్భంగా ముఖ్యమైన ఫార్ములాలు, కీ పాయింట్స్‌ను షార్ట్ నోట్స్‌గా రూపొందించుకోవాలి. రివిజన్ సమయంలో సులువుగా అర్థమయ్యేలా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ముఖ్యంగా షార్ట్ కట్ మెథడ్స్‌ను అనుసరించే విద్యార్థులు.. ఆయా ఫార్ములాలు, ప్రాబ్లమ్స్, కొశ్చన్స్‌కు సంబంధించి ఏ షార్ట్ కట్‌ను ఎందుకు రాసుకున్నామో ఇట్టే తెలుసుకోగలిగేలా చూసుకోవాలి. ఇది ఇంటర్‌తోపాటు ప్రవేశ పరీక్షల రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
చదవండి: After 10+2/Inter: ఇంటర్ ఎంపీసీ తర్వాత ఎన్నో అవకాశాలు
ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. ఆయా సబ్జెక్ట్‌ల ప్రాక్టీస్‌పై దృష్టిపెట్టాలి. ఇప్పటి నుంచే ప్రతిరోజు సదరు సబ్జెక్ట్‌పై ప్రశ్నలు అడిగే అవకాశమున్న అంశాలను ప్రాక్టీస్ చేయాలి. వాస్తవానికి పోటీ పరీక్షల సిలబస్‌లో ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాల అంశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ప్రతి చాప్టర్‌కు సంబంధించి మొదటి సంవత్సరం అంశాలను కూడా అవలోకనం చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. మొదటి సంవత్సరం సిలబస్‌ను, రెండో సంవత్సరం టాపిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ అభ్యసనం సాగించాలి. ఇలా చేస్తే.. ఆయా టాపిక్స్‌పై సంపూర్ణ అవగాహన వస్తుంది. ఫలితంగా ప్రశ్న ఏ రూపంలో అడిగినా.. సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.
న్యూమరికల్ ప్రశ్నలకూ
గత రెండేళ్లుగా ఎంట్రన్స్ టెస్ట్‌ల్లో ముఖ్యంగా జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల్లో న్యూమరికల్ టైప్ కొశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లలో న్యూమరిక్స్ ఆధారంగా సమాధానం గుర్తించాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. వాటికి సంబంధించి ముఖ్యాంశాలు, పాయింటర్స్‌తో నోట్స్ రాసుకోవడం మేలు చేస్తుంది.
మాక్ టెస్ట్‌లు, ప్రీ–ఫైనల్ టెస్ట్‌లు
విద్యార్థులు మాక్ టెస్ట్‌లు రాయడం, ఇంటర్ ప్రీ–ఫైనల్ టెస్ట్‌లకు హాజరవడం, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం వంటివి చేయాలి. ఇది వార్షిక పరీక్షల తర్వాత జరిగే ఎంట్రన్స్‌ల్లో రాణించేందుకు ఉపయోగపడుతుంది. ఇంటర్ పరీక్షలు ముగిసాక ఆయా ఎంట్రన్స్‌లకు 30 లేదా 40 రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్వల్ప వ్యవధిలో సన్నద్ధత పొందాలంటే.. ముందుగానే మాక్ టెస్టులు రాసి.. బలాబలాలను విశ్లేషించుకోవాలి.
టైమ్ మేనేజ్‌మెంట్
ఇంటర్‌తోపాటు ఎంట్రన్స్ టెస్ట్‌లకు హాజరయ్యే విద్యార్థులు టైమ్ మేనేజ్‌మెంట్ ఎంతో ముఖ్యమని గుర్తించాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివే విధంగా సమయం కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌ను రోజూ కనీసం రెండు గంటలు చదవాలి. సులభమైన సబ్జెక్ట్‌కు కొంత తక్కువ సమయం కేటాయించి.. క్లిష్టంగా భావించే సబ్జెక్ట్‌లకు కొంత ఎక్కువ సమయం కేటాయించడం మేలు. అదేవిధంగా అంతకుముందు రోజు చదివిన టాపిక్స్‌ను మరోసారి పునశ్చరణ చేసేలా కనీసం పది నిమిషాలు కేటాయించాలి.
చదవండి: After 10+2/Inter: ఇంటర్ ఎంపీసీ తర్వాత ఎన్నో అవకాశాలు
ఇంటర్ ప్రిపరేషన్–ముఖ్యాంశాలు
- డిసెంబర్ చివరి నాటికి జేఈఈ మెయిన్ సిలబస్, ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాల సిలబస్‌లోని ఉమ్మడి అంశాల ప్రిపరేషన్ పూర్తి చేయాలి.
- జేఈఈ–మెయిన్ ఫిబ్రవరి సెషన్‌కు హాజరవుతున్న విద్యార్థులు.. చివరి రెండు వారాలు పునశ్చరణ, మాక్ టెస్ట్‌లకు కేటాయించాలి.
- ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఇంటర్మీడియెట్ పరీక్షలకే సమయం కేటాయించాలి. ఆ తర్వాత మెయిన్, అడ్వాన్స్‌డ్, టీఎస్‌ఎంసెట్/ఏపీఈఏసెట్‌లపై దృష్టి పెట్టాలి.
- ప్రిపరేషన్ సమయంలోనే సొంత నోట్స్, షార్ట్ కట్ ఫార్ములాలను రూపొందించుకోవాలి. వీటి ఆధారంగా రివిజన్ చేయాలి.
- ప్రతిరోజు ఇంటర్‌తోపాటు ఎంట్రన్స్ టెస్ట్‌ల ప్రిపరేషన్‌కు సమయం కేటాయించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
- ప్రతిరోజు కనీసం ఆరు గంటలు ఇంటర్మీడియెట్, ఎంట్రెన్స్ టెస్ట్ అంశాల ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
సబ్జెక్ట్‌ల వారీగా ఇలా
మ్యాథమెటిక్స్
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. మ్యాథమెటిక్స్.. రెండేళ్ల సిలబస్‌లోని ప్రతి చాప్టర్‌ను చదివేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు: 3–డి జామెట్రీ; కో ఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. వీటివల్ల కొంత ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. వీటితోపాటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ అంశాలను కనీసం ఒక్కసారైనా పూర్తి చేసే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.
–ఆర్.కేదారేశ్వర్, మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ
ఫిజిక్స్
ఎక్కువ మంది విద్యార్థులు కష్టమైనదిగా భావించే సబ్జెక్ట్ ఫిజిక్స్. ఇందులో ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్; సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌పై అవగాహన పెంచుకుంటే..మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రిపరేషన్ సమయంలోనే ఆయా అంశాల ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ ప్రాక్టీస్ చేయాలి.
– సీహెచ్.రామకృష్ణ, ఫిజిక్స్ ఫ్యాకల్టీ
కెమిస్ట్రీ
మిగతా రెండు సబ్జెక్ట్‌లతో పోల్చితే విద్యార్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఇందులో అడిగే ప్రశ్నలు కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలపై నైపుణ్యాలను తెలుసుకునే విధంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
–టి.కృష్ణ, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ
చదవండి: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు