Skip to main content

After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!

అకడమిక్, కెరీర్ పరంగా బైపీసీతో లభించినన్ని విస్తృతావకాశాలు మరే ఇతర గ్రూప్‌తో లభించవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
After BiPC
బైపీసీతో విస్తృతావకాశాలు!!

బైపీసీతో మెడిసిన్, ఫార్మా, రీసెర్చ్, ల్యాబ్స్, టీచింగ్ వంటి బహుళరంగాల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవచ్చు. అకడెమిక్‌గా ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఉజ్వల భవితకు మార్గంవేసే అనేక వినూత్న కోర్సులకు బైపీసీ వేదికగా నిలుస్తోంది. అందువల్లే లక్షలాది విద్యార్థులు బైపీసీ గ్రూప్‌ను ఎంచుకుంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో బైపీసీ అర్హతతో లభించే అవకాశాలపై ప్రత్యేక కథనం.

  • బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌లతో పాటు అగ్రికల్చర్ బీఎస్సీ నుంచి ఆగ్రోనమీ వరకు.. పారా మెడికల్ కోర్సుల నుంచి ప్లాంట్ సైన్స్ వరకు; ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు నుంచి లైఫ్ సెన్సైస్‌లో సైంటిస్ట్ వరకు.. అకడమిక్ అండ్ కెరీర్‌ల పరంగా అనేక అవకాశాలున్నాయి.
  • బైపీసీని కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చదివేందుకు మార్గంగానే భావించకుండా.. బహుళ అవకాశాలు అందించే సాధనంగా గుర్తిస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు.


మెడికల్ కోర్సులు
ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్.
ప్రవేశం: ఎంసెట్ (అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్)లో ర్యాంకు ఆధారంగా.
బీయూఎంఎస్‌కు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.

బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీఎన్‌వైఎస్
ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా వైద్య రంగంలోనే స్థిరపడాలనే గట్టి సంకల్పం ఉన్న అభ్యర్థులకు బ్యాచిలర్ ఆఫ్ హోమియో మెడికల్ సెన్సైస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి కోర్సులు చక్కని మార్గాలుగా నిలుస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఆయా విభాగాల్లో వైద్యులుగా స్థిరపడొచ్చు. ఇటీవల కాలంలో హోమియోపతి, ఆయుర్వేద, నేచురల్ మెడిసిన్‌లకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఈ విభాగాల్లో పెద్ద సంఖ్యలో మల్టీ స్పెషాలిటీ తరహా ఆస్పత్రులు ఏర్పాటవుతున్నాయి. కాబట్టి ఆయా కోర్సులు చదివిన విద్యార్థులకు కెరీర్ ఆశాజనకంగా ఉంటుంది. ప్రారంభంలో నెలకు రూ.40 వేల వరకు జీతం లభిస్తుంది.

చదవండిAfter 10+2: ఇంటర్మీడియెట్‌ తర్వాత ఫార్మసీ కోర్సులు.. కెరీర్‌కు ధీమా

వెటర్నరీ సెన్సైస్
బైపీసీ విద్యార్థులకు సుపరిచితమైన కోర్సు.. వెటర్నరీ సైన్స్. ప్రస్తుతం వెటర్నరీ సైన్స్ ఉత్తీర్ణులకు కెరీర్ పరంగా మంచి డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి వెటర్నరీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో నిర్వహించే ఆల్ ఇండియా ప్రీ వెటర్నరీ టెస్ట్‌లో ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న వెటర్నరీ సైన్స్ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. వెటర్నరీ అండ్ యానిమల్ హజ్బెండరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. నెలకు రూ.35 వేల నుంచి రూ.40 వేల జీతం అందుకోవచ్చు. ఉన్నత విద్య పరంగా ఎంవీఎస్‌సీ ఇన్ లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్, వెటర్నరీ ఫిజియాలజీ వంటి అవకాశాలుంటాయి.

బీఎస్సీ అగ్రికల్చర్, హార్టీకల్చర్, బీటెక్ ఫుడ్ సైన్స్, బీఎస్సీ హోం సైన్స్
ఈ కోర్సులన్నింటికీ కలిపి తెలుగు రాష్ట్రాల్లో 700 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయాలు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను భర్తీ చేస్తాయి. అగ్రికల్చర్‌లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి ప్రైవేట్ విత్తనాభివృద్ధి సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, బ్యాంకుల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు జీతభత్యాలుంటాయి.

చదవండి: Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్‌ ఖాయం... నెలకు రూ.44 వేల వ‌ర‌కు జీతం


బీఎస్సీ-డెయిరీ టెక్నాలజీ
పాల ఉత్పత్తులు, ప్రాసెసింగ్ తదితర నైపుణ్యాలను అందించే కోర్సు.. బీఎస్సీ డెయిరీ టెక్నాలజీ. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు డెయిరీ ఫార్మ్స్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయి. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా బీఎస్సీ డెయిరీ టెక్నాలజీ కోర్సులో సీట్లను భర్తీ చేస్తారు. బీఎస్సీ, ఎంఎస్సీ డెయిరీ టెక్నాలజీ పూర్తిచేసిన అభ్యర్థులకు నెలకు రూ.20 నుంచి రూ.50 వేల వరకు జీతంగా లభిస్తుంది.

బీఎస్సీ- న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్
ఆధునిక ప్రపంచంలో వ్యక్తుల దైనందిన వ్యవహార శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతున్న మరో కోర్సు.. బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ ఫుడ్‌సైన్స్. బీఎస్సీ, ఎమ్మెస్సీ న్యూట్రిషన్ స్పెషలైజేషన్ అభ్యర్థులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో, హోటళ్లలో డైటీషియన్‌‌సగా ఉద్యోగాలను అందుకోవచ్చు. నెలకు రూ.10,000 నుంచి రూ.50,000 వరకు జీతభత్యాలు ఉంటాయి.

బీఎస్సీ ఫిషరీసైన్స్
సీ ఫుడ్స్‌కు డిమాండ్, జలచరాల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రస్తుత సమయంలో కెరీర్ పరంగా బీఎస్సీ ఫిషరీస్ సైన్స్ కోర్సు చక్కని అవకాశాలను కల్పిస్తోంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి సీ ఫుడ్ ప్రొడక్ట్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్లలో అవకాశాలుంటాయి. బోధన రంగంలో అవకాశాలను అందుకోవచ్చు. అయితే ఈ రంగంలో బోధకులుగా స్థిరపడేందుకు పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఫార్మసీ
ఫార్మసీ రంగం అవకాశాల కల్పనలో ఎవర్‌గ్రీన్‌గా వెలుగొందుతోంది. విద్యార్థులు బైపీసీ అర్హతగా బీ ఫార్మసీలో ప్రవేశించొచ్చు. దీని కోసం ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. బీ ఫార్మసీ పూర్తిచేసిన వారికి ఫార్మాస్యూటికల్ సంస్థల్లో వివిధ కొలువుల్లో స్థిరపడొచ్చు. ఉన్నత విద్య చదవాలనుకునే అభ్యర్థులు ఎం.ఫార్మసీ చేయొచ్చు. ఎం.ఫార్మసీలో డ్రగ్ డిస్కవరీ నుంచి ఫార్మకోగ్నసీ వరకు దాదాపు పది స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆయా స్పెషలైజేషన్లు చదివితే డ్రగ్ ఫార్ములేషన్ సంస్థల్లో కీలక హోదాల్లో కొలువులను సొంతం చేసుకోవచ్చు.

చదవండి: Paramedical Courses: ఈ కోర్సులో చేరితే.. కొలువు పక్కా! ఉద్యోగం కాదనుకుంటే...

లైఫ్ సెన్సైస్
బైపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా అవకాశాలు కల్పిస్తున్న కోర్సుల్లో లైఫ్ సెన్సైస్ ప్రధానంగా నిలుస్తున్నాయి. బయోటెక్, బయో ఇన్ఫర్మాటిక్స్ తదితర కోర్సుల్లో అడుగుపెడితే కెరీర్ పరంగా ఉజ్వల అవకాశాలుంటాయి.

బయోటెక్
ఇటీవల కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, పెద్ద సంఖ్యలో అవకాశాలు కల్పిస్తున్న విభాగం బయోటెక్నాలజీ. దీంట్లో అడుగుపెట్టేందుకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లో నిర్వహించే బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్న దాదాపు అన్ని కళాశాలల్లో బయో టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి విత్తనాభివృద్ధి సంస్థలు, పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్ పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ.20 వేల జీతం అందుకోవచ్చు.

బయో ఇన్ఫర్మాటిక్స్
బయలాజికల్ సెన్సైస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమ్మిళితంగా లైఫ్ సెన్సైస్ విభాగంలో నూతన ఒరవడి సృష్టిస్తున్న కోర్సు.. బయో ఇన్ఫర్మాటిక్స్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. ఆయా కోర్సులు పూర్తిచేసిన వారికి కార్పొరేట్ హాస్పిటల్స్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌లో ఉద్యోగాలు లభిస్తాయి. పూర్తిచేసిన కోర్సు, అర్హతల ఆధారంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు జీతం లభిస్తుంది.

NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
నాలుగున్నరేళ్ల వ్యవధి ఉండే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు పూర్తిచేస్తే ఫిజియోథెరపిస్ట్‌లుగా స్థిరపడొచ్చు. వీరు స్వయం ఉపాధి దిశగా అడుగేయవచ్చు. ఆర్థోపెడిక్ సర్జరీలు చేయించుకున్న వారికి ఫిజియోథెరపీ తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉపాధి పరంగా ఎలాంటి ఢోకా ఉండదు.

పారా మెడికల్ కోర్సులు
తొందరగా కొలువుల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు సరైన కోర్సులు.. పారా మెడికల్ కోర్సులు. ఇందులో బీఎస్సీ (నర్సింగ్), మెడికల్ ల్యాబ్‌టెక్నీషియన్, ఎక్స్-రే టెక్నీషియన్, ఆక్యుపేషనల్ థెరపీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, ఆప్టోమెట్రీ కోర్సులు ప్రాచుర్యం పొందుతున్నాయి. డార్క్ రూం అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్లకు ఇటీవల డిమాండ్ పెరిగింది. వైద్యులకు సహకరించడం, ఆయా వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసి సంబంధిత నివేదికలు రూపొందించడం వంటి విధులు పారా మెడికల్ విభాగాల్లో ఉంటాయి. డిప్లొమా, బ్యాచిలర్ స్థాయి కోర్సులను పూర్తిచేసిన వారికి ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో ఉద్యోగాలు లభిస్తాయి. అదే విధంగా మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలున్నాయి.

ఎక్స్ రే, రేడియాలజిస్టు: స్కానింగ్, సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ మొదలైనవి నిర్వహించడానికి రేడియాలజీ విభాగంలో శిక్షణ ఇచ్చే రెండేళ్ల కోర్సు ఇది. కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అనుభవాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు వేతనాలుంటాయి.

ఆప్టోమెట్రి: కంటికి సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే నైపుణ్యాలను అందించే కోర్సు ఆప్టోమెట్రి. నాలుగేళ్ల వ్యవధిలో ఉండే ఆప్టోమెట్రి కోర్సు పూర్తయిన వెంటనే కొలువులను సొంతం చేసుకోవచ్చు. బాస్ అండ్ లాంబ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెటస్, హైదరాబాద్; ఏఐఐఎంఎస్, బీవీయూ, పుణె, ఇగ్నో, మధురై నేత్ర చికిత్సాలయం, అగర్వాల్ నేత్ర చికిత్సాలయం, ఎల్.వి.ప్రసాద్ నేత్ర చికిత్సాలయం ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

మెడికల్ ట్రాన్‌‌సక్రిప్షన్: రోగులకు చికిత్స చేసిన వైద్యులు రూపొందించిన నివేదికలను సమగ్రంగా తీర్చిదిద్దడం ప్రధాన విధిగా ఉండే మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ పూర్తిచేస్తే నెలకు రూ.10 వేలతో ఉద్యోగం ఖాయం. ముఖ్యంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలకు చెందిన సంస్థలు భారతదేశంలో కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ విభాగంలో ఔట్ సోర్సింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ కెరీర్ ఉజ్వలంగా ఉండనుంది.

విస్తృత దృష్టి..విభిన్న అవకాశాలు
బైపీసీ విద్యార్థులు కెరీర్ అవకాశాలు అనగానే ఎంబీబీఎస్, బీడీఎస్ అనే దృక్పథం నుంచి బయటపడాలి. విస్తృత దృష్టితో ఆలోచిస్తే అనేక అవకాశాలున్నాయని గుర్తించాలి. ఆయా కెరీర్, అకడమిక్ అవకాశాల గురించి తెలుసుకోవడానికి ఇప్పటి నుంచే కృషి చేయాలి. అవకాశాల పరంగా నర్సింగ్, పారా మెడికల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. నర్సింగ్ విద్యార్థులకు విదేశాల్లోనూ అవకాశాలు లభిస్తున్నాయి.
- ప్రొఫెసర్ ఎస్.బాబూలాల్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.

 

లైఫ్ సెన్సైస్‌లో బెస్ట్ ఎవెన్యూస్
బైపీసీ విద్యార్థులు మెడికల్ కోర్సుల్లో సీటు రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మైక్రో బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్ వంటి లైఫ్‌సెన్సైస్ కోర్సులు పూర్తిచేస్తే చక్కని అవకాశాలుంటున్నాయి. ఈ విభాగాల్లో ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేసిన వారికి దేశంలోని ప్రముఖ లాబొరేటరీల్లో పరిశోధకులుగా, బోధన రంగంలో ఫ్యాకల్టీగా కెరీర్‌ను సుస్థిరం చేసుకోవచ్చు.
- ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, జువాలజీ హెచ్‌ఓడీ, ఓయూ.

 

Published date : 01 Dec 2021 03:24PM

Photo Stories