Skip to main content

Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్‌ ఖాయం... నెలకు రూ.44 వేల వ‌ర‌కు జీతం

Career in Nursing Academic Courses, Job Opportunities Salary and other Details
Career in Nursing Academic Courses, Job Opportunities Salary and other Details

నర్సింగ్‌.. వైద్య రంగంలో.. అత్యంత కీలకమైన వృత్తి! నర్సులు.. శస్త్ర చికిత్సల్లో వైద్యులకు సహకరించడంతో పాటు నిత్యం పేషెంట్లకు సేవలందిస్తారు. అందుకే వైద్య రంగంలో నర్సింగ్‌ వృత్తికి ఎంతో ప్రాధాన్యం ఉంది! ముఖ్యంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో.. నర్సింగ్‌ సేవలకు విస్తృతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని హాస్పిటల్స్‌.. భారీ సంఖ్యలో నర్సుల నియామకాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నర్సింగ్‌ సేవలకు పెరుగుతున్న ప్రాధాన్యం, అకడెమిక్‌ కోర్సులు, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం.. 

  • ఇంటర్‌తోనే నర్సింగ్‌లో అడుగుపెట్టే అవకాశం
  • నర్సింగ్‌ ఉత్తీర్ణులకు దేశవిదేశాల్లో డిమాండ్‌
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్‌తో భారీ వేతనాలు!

ప్రస్తుత కరోనా పరిణామాల్లో నర్సింగ్‌ సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది. దాంతో దేశంలో నర్సింగ్‌ అభ్యర్థుల పరంగా డిమాండ్‌–సప్లయ్‌ మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. పలు నివేదికల అంచనాల ప్రకారం–ప్రస్తుతం దేశంలో దాదాపు 25లక్షల మంది నర్సుల అవసరం ఉంది. 2025 నాటికి ఈ సంఖ్య 30 లక్షలకు పెరిగే అవకాశముంది. కానీ ఏటా సర్టిఫికెట్లతో బయటికి వస్తున్న వారి సంఖ్య ఆరేడు లక్షలకు మించడంలేదు. 

ఎంపీహెచ్‌డబ్ల్యూ/ఏఎన్‌ఎం

ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే నర్సింగ్‌ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండేళ్ల మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌/ఆగ్జిలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌ కోర్సులో చేరేందుకు ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ అర్హులే. వయసు 17ఏళ్లలోపు ఉండాలి.రాష్ట్రాల స్థాయి లో కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో ప్రవేశాలు నిర్వహిస్తారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల జిల్లాకు చెందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో మెరిట్‌ జాబితా రూపొందించి సీటు ఖరారు చేస్తారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల్లో కొలువులు లభిస్తాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ అవకాశాలు అందుకోవచ్చు.


చ‌ద‌వండి: Paramedical Courses: ఈ కోర్సులో చేరితే.. కొలువు పక్కా! ఉద్యోగం కాదనుకుంటే...

జీఎన్‌ఎం

నర్సింగ్‌ వృత్తిలో చేరాలనుకునే వారికి అందుబాటులో ఉన్న మరో కోర్సు.. జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ(జీఎన్‌ఎం). ఇది మూడేళ్ల కోర్సు. ఇందులో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. రాష్ట్రాల స్థాయిలో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పర్యవేక్షణలో ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారు ఉన్నత విద్యలో పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌లో చేరొచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంక్షేమ గృహాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

బీఎస్సీ నర్సింగ్‌

బ్యాచిలర్‌ స్థాయి కోర్సు.. బీఎస్సీ నర్సింగ్‌. ఇంటర్‌ బైపీసీ గ్రూప్‌ 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఇంటర్మీడియెట్‌లో పొందిన మార్కులు లేదా ఎంసెట్‌ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రాల స్థాయిలో పారామెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డ్, స్టేట్‌ హెల్త్‌ యూనివర్సిటీలు సంయుక్తంగా ఆన్‌లైన్‌ ప్రవేశ ప్రక్రియ నిర్వహించి..సీటు ఖరారు చేస్తాయి. బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే నెలకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకూ వేతనం లభిస్తుంది.


చ‌ద‌వండి: Nutrition Courses: ఆహార కోర్సులు... అద్భుత అవకాశాలు!!

పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ డిప్లొమా

నర్సింగ్‌లో మంచి అవకాశాలు కల్పించే కోర్సు.. పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ డిప్లొమా. ఇంటర్మీడియెట్‌ తర్వాత జీఎన్‌ఎం అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సుల ఉతీర్ణులు ఇందులో చేరేందుకు అర్హులు. ఈ కోర్సులో స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌లను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అభ్యర్థులు అంకాలజీ, ఆపరేషన్‌ రూమ్, ఆర్థోపెడిక్‌ అండ్‌ రిహాబిలిటేషన్, క్రిటికల్‌ కేర్, ఎమర్జెన్సీ అండ్‌ డిజాస్టర్‌ తదితర స్పెషలైజేషన్లను అభ్యసించొచ్చు. 

ఎమ్మెస్సీ నర్సింగ్‌

నర్సింగ్‌లో పీజీ స్థాయి కోర్సు.. ఎమ్మెస్సీ నర్సింగ్‌. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో మెడికల్‌ సర్జన్‌ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, పిడియాట్రిక్స్, సైకియాట్రిక్‌ నర్సింగ్, అబ్‌స్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ నర్సింగ్, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్‌ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. వీరికి ఆసుపత్రుల్లో, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సూపర్‌వైజర్‌ స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి.

ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు

రాష్ట్రాల స్థాయిలో హెల్త్‌ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలతోపాటు జాతీయ స్థాయిలోనూ పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో నర్సింగ్‌ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో–ఎయిమ్స్‌–ఢిల్లీ, బోపాల్, పాట్నా, భువనేశ్వర్, రాజ్‌పూర్, రిషికేష్‌ క్యాంపస్‌లు; ఏఎఫ్‌ఎంసీ–పుణె; జిప్‌మర్‌–పుదుచ్చేరి; పీజీఐఎంఆర్‌ –చండీగఢ్‌లు నర్సింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. 

నర్సింగ్‌తో మిలిటరీ కెరీర్‌

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌–పుణెలో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన విద్యార్థినులకు సైనిక దళాల్లో కొలువు లభిస్తుంది. కోర్సులో చేరిన సమయంలోనే 60 శాతం మందికి షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ హోదా కింద సీటు కేటాయిస్తారు. కోర్సు పూర్తయ్యాక కనీసం అయిదేళ్లు మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌లో విధులు నిర్వహిస్తామని బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించి..ఆ తర్వాత దశలో ఇంటర్వ్యూ నిర్వహించి అందులో మెరిట్‌ ఆధారంగా సీట్ల భర్తీ చేస్తారు.

పీహెచ్‌డీ కూడా

నర్సింగ్‌లో పీహెచ్‌డీ కూడా చేయొచ్చు. సైకియాట్రిక్‌ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్, పిడియాట్రిక్‌ నర్సింగ్‌ స్పెషలైజేషన్స్‌కు పీహెచ్‌డీలో ప్రాధాన్యం ఉంది. ఆయా స్పెషలైజేషన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి నర్సింగ్‌ ప్రొఫెసర్లుగా, ఫార్మా, హెల్త్‌కేర్‌ సంస్థల్లో ఆర్‌ అండ్‌ డీ విభాగాల్లో పర్యవేక్షణ స్థాయిలో ఉద్యోగాలు లభిస్తున్నాయి.


చ‌ద‌వండి: అవకాశాలతరంగం... ఫార్మా రంగం

వేతనాలు ఆకర్షణీయం

  • దేశంలో నర్సింగ్‌ అభ్యర్థులకు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల పరిధిలోని హాస్పిటల్స్‌లో చేరిన వారికి ప్రస్తుత పే కమిషన్‌ ప్రకారం–బేసిక్‌ పే రూ.44,900గా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలోనూ ఆస్పత్రులు, సంక్షేమ వసతి గృహాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో నర్సుల నియామకాలు జరుగుతున్నాయి. వీరికి నెలకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకు వేతనం అందుతోంది. 
  • బీఎస్సీ నర్సింగ్‌ చేసిన వారికి కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో రూ.25వేల నుంచి రూ.30వేల వరకు వేతనం లభిస్తోంది. పీజీ అభ్యర్థులకు నెలకు రూ.40వేల వరకు వేతనం అందుతోంది. 
  • బీఎస్సీ నర్సింగ్‌తో నర్సుగా కెరీర్‌ ప్రారంభించిన వారు..సూపరింటెండెంట్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత నర్సుగా, ఆ తర్వాత హెడ్‌ నర్స్, క్లినికల్‌ నర్స్‌ స్పెషలిస్ట్, ఓటీ హెడ్‌ వంటి హోదాలు పొందొచ్చు.

విదేశీ అవకాశాలు

బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియాల్లో నర్సులకు డిమాండ్‌ నెలకొంది. ఆయా దేశాలు నిర్వహించే లైసెన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అక్కడ కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు కెనడాలో నర్సుగా ఉపాధి కోరుకునే వారు.. ఆ దేశం నిర్వహించే కెనడియన్‌ రిజిస్టర్డ్‌ నర్సెస్‌ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్‌ భాష నైపుణ్యం కూడా తప్పనిసరి. అందుకు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ వంటి ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ స్కోర్లు సాధించాల్సి ఉంటుంది. ఇలా విదేశాల్లో ఉద్యోగం సొంతం చేసుకున్న వారికి నెలకు రూ.2లక్షల వరకు వేతనం లభిస్తోంది.

నర్సింగ్‌ కెరీర్‌.. ముఖ్యాంశాలు

  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు శాఖల్లో నియామకాలు.
  • ప్రారంభంలోనే నెలకు రూ.44 వేల వరకు మూల వేతనం.
  • రాష్ట్రాల స్థాయిలోనూ ఇటీవల పెరుగుతున్న నియామకాలు.
  • నర్సింగ్‌లో ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్‌ ఖాయం.
  • 2025 నాటికి 30 లక్షల మంది నర్సుల అవసరమని అంచనా.
  • బీఎస్సీ నర్సింగ్‌తో దేశ విదేశాల్లో ఉద్యోగాలు. 
Published date : 15 Nov 2021 06:03PM

Photo Stories