Skip to main content

అవకాశాలతరంగం... ఫార్మా రంగం

ఫార్మాస్యూటికల్ రంగం.. ఇటీవలి కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. కొత్త సంస్థల ప్రవేశం, నూతన ఔషధాల తయారీ, వ్యాక్సిన్ల ఆవిష్కరణ.. ఇలా ఎన్నో రకాలుగా భారత ఫార్మా ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ రంగంలో నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. యువత దీన్ని అవకాశంగా మలచుకొని, ఫార్మా రంగంలో కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఫార్మసీ రంగంలో ఉన్నతవిద్య, ఉపాధి అవకాశాలపై విశ్లేషణ..

 

ఇంటర్మీడియెట్‌తో మార్గాలుఫార్మసీ రంగంలో కెరీర్ ప్రారంభించడానికి ఇంటర్మీడియెట్ అర్హతతోనే వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి..

 

 

  • డిప్లొమా ఇన్ ఫార్మసీ: కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణులు అర్హులు. తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఇంటర్‌లో మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. జూన్/జూలై నెలల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది.
  • బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (బీఫార్మసీ):
    కోర్సు వ్యవధి:
    నాలుగేళ్లు
    అర్హత: బైపీసీ /ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌తోపాటు ఎంసెట్ ఉత్తీర్ణత. తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం బీఫార్మసీ సీట్లను ఎంపీసీ విద్యార్థులతో మిగతా 50 శాతం సీట్లను బైపీసీ విద్యార్థులతో భర్తీ చేస్తారు.
  • మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం.ఫార్మసీ): ఎం.ఫార్మసీలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ఆధారంగా జాతీయ స్థాయి యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు, రాష్ట్రాల స్థాయిలోని స్టేట్ యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పిస్తారు. పీజీఈసెట్‌లో భాగంగా రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలు ఎం.ఫార్మసీ కోసం కూడా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి.


ఎం.ఫార్మసీ- స్పెషలైజేషన్లు
మాస్టర్ ఆఫ్ ఫార్మసీలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఫార్మకాలజీ, టాక్సికాలజీ, ఫార్మకోగ్నసీ, ఫార్మకో విజిలెన్స్, ఫార్మా మేనేజ్‌మెంట్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్.
నైపర్-జేఈఈ: ఎం.ఫార్మసీలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో మార్గం.. నైపర్-జేఈఈ. ఈ ఎగ్జామినేషన్ ద్వారా నైపర్ ఏడు క్యాంపస్‌ల్లో ఎం.ఫార్మసీలో అడుగుపెట్టొచ్చు. నైపర్-జేఈఈ ఔత్సాహికులు ముందుగా జీప్యాట్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.
ఫార్మ్-డి: ఆరేళ్ల వ్యవధి ఉండే ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. ఫార్మ్-డి (పోస్ట్ బ్యాకులరేట్) పేరుతో బీఎస్సీ ఉత్తీర్ణులు కూడా ఫార్మ్-డిలో ప్రవేశించొచ్చు. వీరు మూడేళ్లు చదివితే సరిపోతుంది.
పీహెచ్‌డీ అవకాశాలు: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత ద్వారా సీఎస్‌ఐఆర్, డీఎస్‌టీ ల్యాబ్‌లలో, వివిధ కేంద్రీయ, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది. పీహెచ్‌డీలో జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్ పొందవచ్చు.

ఉద్యోగ అవకాశాలు

 

 

  • డి.ఫార్మసీతో ఎంట్రీ లెవల్‌లో ఫార్మసిస్ట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.
  • బీఫార్మసీ అర్హతతో ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సంస్థల్లో కెమికల్ ప్రాసెసింగ్ యూనిట్స్, డ్రగ్ ఫార్ములేషన్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
  • ఫార్మ్-డి విద్యార్థులు కూడా ఇదే తరహా విధులు నిర్వర్తిస్తారు. అయితే వీరికి లభించే హోదాలు బీఫార్మసీ ఉత్తీర్ణుల కంటే పై స్థాయిలో, పర్యవేక్షణ స్థాయిలో ఉంటాయి.
  • పీహెచ్‌డీ పూర్తి చేసినవారు బోధన రంగంలో ప్రొఫెసర్లుగా స్థిరపడవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో మెడికల్ కెమిస్ట్స్, మాలిక్యులర్ బయాలజిస్ట్స్, జెనెటిసిస్ట్స్, ఇమ్యునాలజిస్ట్స్, క్లినికల్ రీసెర్చర్స్, బయో-స్టాటిస్టిషియన్స్, కెమికల్ అండ్ బయో కెమికల్ ఇంజనీర్స్ వంటి హోదాలు లభిస్తాయి.


ఆకర్షణీయమైన వేతనాలు
అర్హత, ఎంపికైన రంగం ఆధారంగా ఫార్మసీ ఉత్తీర్ణులకు వేతనాలు లభిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో ఫార్మసిస్ట్‌గా ఏడాదికి రూ. రెండు లక్షల నుంచి రూ. రెండున్నర లక్షల మధ్య వేతనం లభిస్తోంది. మిడిల్ లెవల్‌లో రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు, పై స్థాయిలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్యలో వార్షిక వేతనం లభిస్తోంది.

 

 

  • ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే.. బీఫార్మసీ పూర్తి చేసినవారు సర్వీస్ కమిషన్లు నిర్వహించే డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రభుత్వం నుంచి పెరుగుతున్న ప్రోత్సాహం
ఫార్మాస్యూటికల్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫార్మా విజన్-2020 పేరుతో 2020 నాటికి భారత్‌ను డ్రగ్ డిస్కవరీలో ప్రపంచ స్థాయిలో నెంబర్-1గా నిలపాలని భావిస్తోంది. 2020 నాటికి భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ 85 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని ప్రముఖ సర్వే సంస్థ ఈక్వీటీ మాస్టర్ అంచనా.

భారత ఫార్మా ఇండస్ట్రీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్

 

 

  • మార్కెట్ విలువ కోణంలో ప్రపంచంలో 13వ పెద్ద దేశం
  • పరిమాణం పరంగా ప్రపంచంలో మూడో పెద్ద దేశం
  • ఫార్మా ఉత్పత్తిలో టాప్-6 జాబితాలో చోటు.
  • పదివేలకు పైగా ఉన్న ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి సంస్థలు
  • 2020 నాటికి 21.5 మిలియన్లకు చేరనున్న మానవ వనరుల అవసరం.

 

 

ఫార్మసీ రంగంలో సుస్థిర కెరీర్‌కు ఓర్పు, ఆసక్తి ఎంతో అవసరం. వ్యాధులు, వాటికి సంబంధించిన వ్యాక్సిన్లు, ఔషధ ఆవిష్కరణ కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు చురుకుదనం, నేర్పు ఉండాలి. పరిశోధక విద్యార్థులు.. తొలి పరిశోధనలు విఫలమైనా నిరుత్సాహానికి గురికావద్దు. మరింత ఉత్సాహంతో ముందుకెళ్లాలి. అప్పుడే భవిష్యత్తులో రాణించగలరు.
- డాక్టర్ ఆర్.శ్రీనివాస్, కోర్సు కోఆర్డినేటర్, నైపర్- హైదరాబాద్.

 

Published date : 25 Oct 2021 11:25AM

Photo Stories