Skip to main content

Paramedical Courses: ఈ కోర్సులో చేరితే.. కొలువు పక్కా! ఉద్యోగం కాదనుకుంటే...

Career After Paramedical Courses
Career After Paramedical Courses

ఇంటర్మీడియట్‌ సైన్స్‌ విద్యార్థుల్లో ఎక్కువ మంది లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్‌. పోటీ కారణంగా కోరుకున్న అందరికీ ఆయా కోర్సుల్లో ప్రవేశం లభించే అవకాశం లేదు. దాంతో ప్రత్యామ్నాయంగా ఫార్మసీ, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిజియోథెరపీ, ఆయూష్, డిగ్రీ వంటి కోర్సులను ఎంచుకుంటారు. వీటితోపాటు ఇటీవల కాలంలో పారామెడికల్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. పారామెడికల్‌ కోర్సులు, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం... 

  • పారామెడికల్‌ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ 
  • ఉద్యోగం కాదనుకుంటే స్వయం ఉపాధి  
  • సర్టిఫికెట్‌ నుంచి పీజీ స్థాయి వరకు కోర్సులు

పారామెడికల్‌ కోర్సులను వైద్యరంగంలో వృత్తి శిక్షణ కోర్సులుగా పేర్కొంటారు. వీటిని తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పూర్తిచేసే వీలుంది. ఆ తర్వాత వైద్య రంగంలో సేవలు అందించొచ్చు. ఆరునెలల సర్టిఫికెట్‌ స్థాయి నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకూ.. పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతితోనే  పారామెడికల్‌ కోర్సుల్లో చేరవచ్చు. కాని ఇంటర్‌ అర్హతతో చేసే కోర్సులకు మంచి డిమాండ్‌ నెలకొంది. ఈ కోర్సులను ఎయిమ్స్, జిప్‌మర్‌ వంటి జాతీయ స్థాయి సంస్థలతోపాటు రాష్ట స్థాయిలోని స్టేట్‌ మెడికల్‌ బోర్డులు/హెల్త్‌ యూనివర్సిటీలు సైతం అందిస్తున్నాయి. 

చ‌ద‌వండి: After Class 10+2

పెరిగిన ప్రాధాన్యం

దేశ విదేశాల్లో పారామెడికల్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇటీవల కరోనా పరిణామాల నేపథ్యంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ.. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారామెడికల్‌ సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శిక్షణ పొందిన పారామెడికల్‌ అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పుష్కల ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. 

సర్టిఫికెట్‌ కోర్సులు

ఇవి ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటాయి. వీటిలో చేరడానికి కనీస విద్యార్హత.. పదో తరగతి. వీటిని పూర్తి చేసిన వారు అసిస్టెంట్‌ లేదా టెక్నీషియన్‌ ఉద్యోగాలు పొందొచ్చు. సర్టిఫికెట్‌ ఇన్‌ ఎక్స్‌రే టెక్నీషియన్, సర్టిఫికెట్‌ ఇన్‌ ఈసీజీ అండ్‌ సీటీ స్కాన్‌ టెక్నీషియన్, సర్టిఫికెట్‌ ఇన్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌/టెక్నీషియన్, సర్టిఫికెట్‌ ఇన్‌ నర్సింగ్‌ కేర్‌ అసిస్టెంట్, సర్టిఫికెట్‌ ఇన్‌ డెంటల్‌ అసిస్టెంట్, సర్టిఫికెట్‌ ఇన్‌ హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, సర్టిఫికెట్‌ ఇన్‌ రూరల్‌ హెల్త్‌కేర్, సర్టిఫికెట్‌ ఇన్‌ డయాలసిస్‌ టెక్నీషియన్, సర్టిఫికెట్‌ ఇన్‌ హోమ్‌బేస్ట్‌ హెల్త్‌కేర్‌ వంటి కోర్సులు ఉన్నాయి. 

చ‌ద‌వండి: Nutrition Courses: ఆహార కోర్సులు... అద్భుత అవకాశాలు!!

డిప్లొమా కోర్సులు

ఇవి ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితిగలవి. ఇంటర్, పదో తరగతి అర్హతలతో వీటిల్లో చేరొచ్చు. డిప్లొమా ఇన్‌ ఓటీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్‌ రూరల్‌ హెల్త్‌కేర్, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ(జీఎన్‌ఎం), ఆగ్జలరీ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎం), డిప్లొమా ఇన్‌ డెంటల్‌ హైజినిస్ట్, డిప్లొమా ఇన్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ, డిప్లొమా ఇన్‌ డయాలసిస్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ఎక్స్‌రే టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ నర్సింగ్‌ కేర్‌ అసిస్టెంట్, డిప్లొమా ఇన్‌ ఫిజియోథెరపీ,డిప్లొమా ఇన్‌ క్యాత్‌ల్యాబ్‌ టెక్నీషియన్, డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజ్‌ టెక్నీషియన్, డిప్లొమా ఇన్‌ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్‌ కార్డియాలజీ టెక్నీషియన్‌ తదితర కోర్సుల్లో చేరొచ్చు. 

బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు

బ్యాచిలర్‌ స్థాయి కోర్సుల కాల వ్యవధి మూడు నుంచి నాలుగేళ్లు. వీటిల్లో చేరడానికి ఇంటర్‌ బైపీసీలో 50 శాతం మార్కులు ఉండాలి. కొన్ని కోర్సులకు ఎంపీసీ విద్యార్థులూ అర్హులే. బ్యాచిలర్‌ స్థాయి పారామెడికల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులో ఉం టాయి. బ్యాచిలర్‌ ఆఫ్‌ రేడియేషన్‌ టెక్నాలజీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ, బీఎస్సీ ఇన్‌ డయాలసిస్‌ థెరపీ, బీఎస్సీ ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్‌ ఆప్టోమెట్రీ, బీఎస్సీ ఇన్‌ ఎక్స్‌రే టెక్నాలజీ, బీఎస్సీ ఇన్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్‌ మెడికల్‌ రికార్డ్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్‌ అనస్థీషియా టెక్నాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

చ‌ద‌వండి: సరైన కెరీర్‌కు సోపానాలు..

కెరీర్‌ స్కోప్‌

పారామెడికల్‌ నిపుణులకు భారతదేశంలోనే కాకుండా.. అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, యూకే, కెనడా తదితర దేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రయివేట్‌.. రెండు రంగాల్లోనూ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఆసుపత్రులు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లు, క్లినిక్‌లు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలు ఇచ్చి మరీ విధుల్లోకి తీసుకుంటున్నాయి. ఆయా సంస్థను బట్టి నెలకు రూ.పది వేల నుంచి రూ.25వేల వరకూ వేతనం అందుతుంది. ఈ రంగంలో అనుభవం కీలకం కాబట్టి అనుభవం పెరిగే కొద్దీ వేతనం కూడా పెరుగుతోంది. డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు పారామెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్స్‌గా పనిచేయవచ్చు. దీంతోపాటు సొంత ల్యాబొరేటరీలను, క్లినిక్స్‌ను ప్రారంభించవచ్చు.

Published date : 09 Nov 2021 05:27PM

Photo Stories