After 10+2: ఇంటర్మీడియెట్ తర్వాత ఫార్మసీ కోర్సులు.. కెరీర్‌కు ధీమా
దేశంలో ఫార్మారంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ఔషధశాలగా భారత్ పేరొందుతోంది. నూతన ఆవిష్కరణలతో కొత్త ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి నెలవైన ఫార్మా రంగంలో అవకాశాలకు కొదవలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియెట్ తర్వాత ఫార్మసీ కోర్సులు అభ్యసించొచ్చు. రోగులకు మందులు అందించడం దగ్గర్నుంచి ఔషధాల పరిశోధన వరకూ.. అనేక ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఫార్మసీకోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ప్రధానంగా మూడు రకాల ఫార్మసీ కోర్సులున్నాయి. డి.ఫార్మసీ(డిప్లొమా ఇన్ ఫార్మసీ), బీఫార్మసీ(బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ), ఫార్మ్–డి(డాక్టర్ ఆఫ్ ఫార్మసీ). ఈ కోర్సులు పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యావకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు.
డి.ఫార్మసీ
- ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీలో సాధించిన మార్కుల ఆధారంగా డి.ఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్ర సాంకేతిక శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది. ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.
- ఉద్యోగావకాశాలు: డి–ఫార్మసీ అభ్యర్థులకు ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, విద్యా సంస్థలు, క్లినిక్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ మందుల దుకాణాలు, ఫార్మాస్యూటికల్ సంస్థలు, సేల్స్, మార్కెటింగ్, పరిశోధనా సంస్థలు, పరిశోధన ప్రయోగశాలల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
- ఉన్నత విద్య: డి.ఫార్మసీ తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈసెట్ పరీక్షలో అర్హత సాధించి.. లేటరల్ ఎంట్రీ ద్వారా బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరొచ్చు. ఫార్మ్–డి కోర్సులను కూడా అభ్యసించొచ్చు.
చదవండి: Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్ ఖాయం... నెలకు రూ.44 వేల వరకు జీతం
బీఫార్మసీ
- ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ/డి.ఫార్మసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బీఫార్మసీ)లో చేరొచ్చు. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. బీఫార్మసీ పూర్తి చేసినవారు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.
- ఉద్యోగావకాశాలు: బీఫార్మసీలో ఉత్తీర్ణులకు పలు ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఫార్మసిస్ట్‌లుగా చేరొచ్చు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లు, మెడికల్ అండర్ రైటర్‌లుగా పనిచేయొచ్చు. సొంతంగా మందుల దుకాణాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఫార్మస్యూటికల్, బయోటెక్ కంపెనీల్లో రీసెర్చ్ సైంటిస్టు, రీసెర్చ్ అసోసియేట్, ప్రీ క్లినికల్ రీసెర్చ్‌లో.. స్టడీ డైరెక్టర్, క్యూసీ మేనేజర్, క్యూసీ ఆడిటర్, క్యూసీ అసోసియేట్ కొలువులు; ఫార్మా ఇండస్ట్రీలో.. ఫార్ములేషన్స్ ఆర్ అండ్ డీ, అనలిటికల్ ఆర్ అండ్ డీ, క్వాలిటీ కంట్రోల్స్, క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో అవకాశాలు పొందొచ్చు.
ఫార్మ్–డి
- ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ/బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఫార్మ్–డి కోర్సులో చేరొచ్చు. కోర్సు కాలవ్యవధి ఆరేళ్లు. కోర్సులో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. అయిదేళ్లు తరగతిగది బోధన, ప్రాక్టికల్స్‌తోపాటు.. చివరి ఏడాది పూర్తిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఫార్మ్–డి కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.
- ఉద్యోగ అవకాశాలు: ఫార్మ్–డి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు క్లినికల్ ఫార్మసిస్టు, కమ్యూనిటీ ఫార్మసిస్టు, హాస్పిటల్ ఫార్మసిస్టుగా అవకాశాలు లభిస్తాయి. క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషనల్‌లో ఏడీఆర్ మానిటరింగ్, డ్రగ్ ఇంటరాక్షన్ మానిటరింగ్, టాక్సికాలజీ, థెరప్యూటిక్స్, బీఏబీఈ స్టడీస్, పేషెంట్ మానిటరింగ్, క్లినికల్ ప్రోటోకాల్ డెవలప్‌మెంట్, పేషెంట్ కేస్ స్టడీ, పేషెంట్ కౌన్సెలింగ్, క్లినికల్ ట్రయల్స్, డేటా మేనేజ్‌మెంట్ వంటి అవకాశాలు ఉంటాయి. విదేశాలలోనూ వీరికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు.. పరిశోధనలపై దృష్టిసారించాలనుకుంటే.. పీహెచ్‌డీ చేయొచ్చు.
చదవండి: Paramedical Courses: ఈ కోర్సులో చేరితే.. కొలువు పక్కా! ఉద్యోగం కాదనుకుంటే...
మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎంఫార్మసీ)
- బీఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులు రెండేళ్ల కాలవ్యవధి ఉన్న ఎంఫార్మసీ కోర్సులో చేరొచ్చు. ఎంఫార్మసీలో ఫార్మాస్యుటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మా కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఫార్మసీ ప్రాక్టీస్, క్వాలిటీ అస్యూరెన్స్ తదితర స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీ)నిర్వహించే గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా దేశంలోని పలు యూనివర్సిటీలు ఎంఫార్మసీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు జీప్యాట్ స్కోరుతో తాము చేరాలనుకుంటున్న యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌కు స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- నైపర్ జేఈఈ రాసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
- అంతర్జాతీయ అర్హత పరీక్షల ద్వారా విదేశాల్లో ఎంఎస్(ఫార్మాస్యూటికల్ సైన్సెస్)తో పాటు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలో చేరే అవకాశముంది.
- బీఫార్మసీ తర్వాత మూడేళ్ల ఫార్మ్–డి(పోస్ట్ బ్యాచులరేట్)లో చేరవచ్చు. ఫార్మ్–డి(పోస్ట్ బ్యాచులరేట్)ను లేటరల్ ఎంట్రీగా పరిగణిస్తారు. బీఫార్మసీ తర్వాత ఫార్మ్–డిలో నేరుగా నాలుగో సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. రాష్ట్ర స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఎంఫార్మసీ కోర్సులో చేరొచ్చు.
ఫార్మసీ–మేనేజ్‌మెంట్ కోర్సులు
- ఫార్మసీ రంగంలో మేనేజ్‌మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. దాంతో నైపర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లు ఎంబీఏ(ఫార్మ్) వంటి ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాయి. అలాగే ఎంటెక్(ఫార్మసీ), ఎంఎస్(ఫార్మ్) లాంటి వినూత్న కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. బీఫార్మసీ, ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్ సంబంధిత కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు వీటిలో చేరొచ్చు.
చదవండి: Nutrition Courses: ఆహార కోర్సులు... అద్భుత అవకాశాలు!!
పీహెచ్‌డీ
- నైపర్‌లతోపాటు, పలు సెంట్రల్ యూనివర్సిటీలు, బిట్స్ తదితర ఇన్‌స్టిట్యూట్‌లు ఫార్మసీలో వివిధ స్పెషలైజేషన్స్‌తో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఉన్నత విద్యతో మరిన్ని అవకాశాలు
కోవిడ్ పరిస్థితుల్లో ఫార్మా రంగం ప్రాధాన్యత మరింత పెరిగింది. ఫార్మసీలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి అవకాశాలకు ఢోకా లేదు. భవిష్యత్తులో ఫార్మా రంగం విస్తరణ, కొత్త ప్రాజెక్టుల కారణంగా ఉపాధి మార్గాలు మరింత విస్తృతమవుతాయి. ఫార్మా కోర్సులు చదివిన వారు ఆస్పత్రుల్లో ఫార్మాసిస్టులు, అనలిటికల్, పరిశోధన, అభివృద్ధి, మెడికల్ రేటింగ్స్, డేటా అనాలిసిస్ విభాగాలతోపాటు పలు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకోవచ్చు. పీహెచ్‌డీతోపాటు విదేశాల్లో పోస్ట్ డాక్టోరల్ కోర్సులు అభ్యసించి పరిశోధన దిశగా అడుగులు వేయొచ్చు. అధ్యాపక వృత్తిలోనూ స్థిరపడొచ్చు.
– ఎన్.శంకరయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, నైపర్ హైదరాబాద్.
చదవండి: అవకాశాలతరంగం... ఫార్మా రంగం