Skip to main content

NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం

NDA for Women
NDA for Women
  • ఎన్‌డీఏలో ఇక మహిళలకు కూడా అనుమతి

  • ఎన్‌డీఏలో ప్రవేశంతో త్రివిధ దళాల్లో పెరగనున్న స్త్రీ శక్తి

  • గత ఏడాది.. మహిళలకు పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకు ఖరారు

  • ఇప్పటికే పలు మార్గాల్లో మహిళలకు సాయుధ దళాల్లో అవకాశాలు

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌.. త్రివిధ దళాలుగా గుర్తింపు! ఇవి ధైర్య సాహసాలు, తెగువ చూపాల్సిన విభాగాలు! దేశ భద్రత కోసం నిత్యం అప్రమత్తంగా విధులు నిర్వర్తించాల్సిన కొలువు. ఇకపై త్రివిధ దళాల్లోని కీలక విభాగాల్లోనూ నారీ భేరీ మోగనుంది! తెగువ చూపించే విధుల్లో చేరే అవకాశం మహిళలకు లభించనుంది! పురుషులకు దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం ఏర్పడనుంది!! కారణం.. తాజాగా కేంద్ర ప్రభుత్వం.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ)లోకి మహిళలకు కూడా అనుమతి కల్పించనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో మహిళలు.. ఎన్‌డీఏ పరీక్షలో విజయం సాధించి.. సాయుధ దళాల్లో సమున్నత స్థాయికి ఎదిగే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రయోజనాలు.. ఇప్పటికే త్రివిధ దళాల్లో మహిళలకు లభిస్తున్న కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం... 

త్రివిధ దళాల్లో ఎంపిక ప్రక్రియకు నిర్వహించే కీలక పరీక్షల్లో ఇంతకాలం పురుష అభ్యర్థులనే అర్హులుగా పేర్కొంటూ వస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులకు దీటుగా ప్రతిభ చూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎన్‌డీఏలో పురుషులకు మాత్రమే అవకాశం అనేది మహిళలను వివక్షకు గురి చేయడమే అంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం, త్రివిధ దళాలు సమాలోచనలు జరిపి.. ఎన్‌డీఏలోకి మహిళలకు కూడా అనుమతి కల్పిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఫలితంగా మహిళా అభ్యర్థులు సైతం ఇక నుంచి ఎన్‌డీఏ(నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ) పరీక్షకు హాజరుకావచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకుతో ఉన్నత స్థాయి కొలువు సొంతం చేసుకోవచ్చు. 

2022 నుంచి అవకాశం!

ప్రస్తుతం ఎన్‌డీఏ పరీక్ష అర్హత నిబంధనల ప్రకారం–నోటిఫికేషన్‌ వెలువడే నాటికి ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకున్న లేదా చివరి సంవత్సరం చదువుతున్న అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. తాజా నిర్ణయంతో.. ఎన్‌డీఏ –ఎన్‌ఏ(1)–2022 నోటిఫికేషన్‌ నుంచి అవివాహిత మహిళా అభ్యర్థులకు కూడా అవకాశం లభించనుంది. ఈ పరీక్షలో అర్హత సాధించి.. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల్లోనూ నెగ్గితే.. త్రివిధ దళాల్లో కెరీర్‌ ఖాయం అవుతుంది. వీరు ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌ హోదాతో కెరీర్‌ ప్రారంభించి.. అనుభవం,ప్రతిభ ద్వారా చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ వరకు; నేవీలో సబ్‌ లెఫ్ట్‌నెంట్‌ నుంచి అడ్మిరల్‌ వరకు; ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ నుంచి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ స్థాయికి చేరుకోవచ్చు.

ఇప్పటికే సీడీఎస్‌ ద్వారా

మహిళలు రక్షణ దళాల్లో నేరుగా ప్రవేశించేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌). ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత.. బ్యాచిలర్‌ డిగ్రీ. సీడీఎస్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఆర్మీ విభాగంలో ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో.. ఎస్‌ఎస్‌సీడబ్లు్య(నాన్‌–టెక్నికల్‌) విభాగంలో ప్రవేశం పొందొచ్చు. ఈ పరీక్షను ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న కటాఫ్‌ తేదీ నాటికి 19ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సీడీఎస్‌.. ఇతర విభాగాల్లోనూ?

ప్రస్తుతం సీడీఎస్‌ ద్వారా నేవల్‌ అకాడమీ, మిలటరీ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీల్లోకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వీటిలో నేవల్‌ అకాడమీ, మిలటరీ అకాడమీలకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. తాజా పరిణామాలను చూస్తే.. రానున్న రోజుల్లో నేవల్, మిలటరీ అకాడమీల్లోనూ..మహిళలకు అవకాశం కల్పించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

శాశ్వత కమిషన్‌

  • త్రివిధ దళాల్లో 1992లో తొలుత అయిదేళ్ల వ్యవధిలో ఉండే ఉమెన్‌ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ మొదలైంది. తర్వాత మరో అయిదేళ్లు పొడిగించుకునే అవకాశం ఉండేది. 2006లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌కు సంబంధించి నిబంధనలు మార్చి.. గరిష్టంగా 14ఏళ్లు త్రివిధ దళాల్లో పనిచేసే విధంగా మహిళలకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2008లో జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌(జేఏజీ), ఆర్మీ ఎడ్యుకేషన్‌ కార్ప్స్‌ విభాగాల్లో.. మహిళలకు పర్మనెంట్‌ కమిషన్‌ మంజూరు చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని విభాగాల్లోనూ పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకు కల్పిస్తూ గత ఏడాది నిర్ణయం తీసుకున్నారు.


ఆర్మీలో మహిళలకు నేరుగా

త్రివిధ దళాల్లో కీలకమైన ఆర్మీలో మహిళలకు డిగ్రీ, పీజీ అర్హతతో పలు కెరీర్‌ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్మీ విభాగం నేరుగా కూడా మహిళలకు నియామక ప్రక్రియ నిర్వహిస్తోంది. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్, జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ అనే రెండు విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ పద్ధతిలో ఈ నియామకాలు చేపడుతోంది.

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ ఫర్‌ ఉమెన్‌

బ్యాచిలర్‌ డిగ్రీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై.. ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌లో మూడేళ్ల అనుభవంతోపాటు ఎన్‌సీసీ–సీ సర్టిఫికెట్‌ ఎగ్జామ్‌లో బి గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ స్కీమ్‌కు అర్హులు. దీనికి ప్రతి ఏటా రెండుసార్లు నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఇందులో ఎంపికైన వారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ విజయం సాధిస్తే.. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఓటీఏ)–చెన్నైలో.. 49 వారాలపాటు శిక్షణ ఇచ్చి ఆర్మీలో కొలువు కల్పిస్తారు. 

ఎస్‌ఎస్‌సీ డబ్లు్య(జేఏజీ)

  • ఆర్మీలో నాన్‌–టెక్నికల్‌ విభాగంలో కీలకమైనది.. ఎస్‌ఎస్‌సీ డబ్లు్య(జేఏజీ). ఇది ఆర్మీలో అంతర్గతంగా ఉండే న్యాయ విభాగానికి సంబంధించిన సర్వీస్‌. అందుకే దీన్ని జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌గా పిలుస్తారు. ఈ పోస్ట్‌లకు ప్రతి ఏటా రెండుసార్లు(జూలై /ఆగస్ట్‌; జనవరి/ఫిబ్రవరి)లో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. అర్హత: 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో నమోదుకు అర్హత పొంది ఉండాలి. వయసు 21ఏళ్ల నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. 

గ్రాడ్యుయేట్‌ టెక్నికల్‌ ఎంట్రీస్‌–ఎస్‌ఎస్‌సీ(టెక్నికల్‌) ఉమెన్‌

  • ఆర్మీలోని టెక్నికల్‌ విభాగంలో సైతం మహిళలకు అవకాశం కల్పించే విధానం.. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్నికల్‌)–ఉమెన్‌ ఎంట్రీ స్కీమ్‌. ఈ స్కీమ్‌ ద్వారా ప్రతి ఏటా రెండుసార్లు 20 మంది చొప్పున మొత్తం 40 మంది మహిళలను టెక్నికల్‌ విభాగాల్లో ఎంపిక చేస్తారు. ఇందుకోసం ప్రతి ఏటా జూన్‌/జూలై; డిసెంబర్‌/జనవరిల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నిర్దేశిత బ్రాంచ్‌తో బీటెక్‌ ఉత్తీర్ణులై.. 20ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు అర్హులు. 

అందరికీ ఓటీఏ–చెన్నైలో శిక్షణ

ఆర్మీలోని ఆయా విభాగాల్లో ఎంపికైన మహిళా అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 49 వారాల పాటు శిక్షణనిస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కమిషన్డ్‌ ర్యాంకుతో ఆఫీసర్‌ హోదాలో విధులు కేటాయిస్తారు. డైరెక్ట్‌ ఎంట్రీ స్కీమ్‌ విధానాల్లో ఫిజికల్‌ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు ఉంటాయి.

మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌

ఆర్మీలో మహిళా అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో అవకాశం.. మిలటరీ నర్సింగ్‌ సర్వీస్‌. బీఎస్‌సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in 


ఎయిర్‌ఫోర్స్‌లో ఇలా

గగనతల గస్తీ విభాగంగా పేరొందిన ఎయిర్‌ఫోర్స్‌లోనూ మహిళలకు ఇప్పటికే పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీల భర్తీకి ఏఎఫ్‌క్యాట్‌ (ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)ను నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ ద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌), గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌–టెక్నికల్‌) విభాగాల్లో పోస్టులు భర్తీ చేస్తారు. 

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌

  • షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో.. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో మహిళలకు అవకాశం కల్పిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తే.. పైలట్‌గా ఎంపిక చేస్తారు. ఇటీవల కాలంలో ఫైటర్‌ ఫ్లయిట్స్‌ నడిపే అవకాశం కూడా మహిళలకు కల్పిస్తున్నారు. ఈ ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శిక్షణనిస్తారు. 
  • అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అదే విధంగా ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివుండాలి. వయసు 20ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. 

గ్రౌండ్‌ డ్యూటీ–టెక్నికల్‌

  • ఈ విధానంలో మహిళా అభ్యర్థులను షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఏరోనాటికల్‌ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఏరోనాటికల్, మెకానికల్‌ ఇంజనీర్‌ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తారు. 
  • అర్హత: బీటెక్‌/బీఈలో సంబంధిత బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌తో 60 శాతం మార్కులు సాధించాలి. వయసు 20ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. 

గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌–టెక్నికల్‌)

  • ఈ విధానంలో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లాజిస్టిక్స్‌ విభాగాల్లో మహిళలను ఎంపిక చేస్తారు. అర్హత: 60శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అకౌంట్స్‌ విభాగానికి బీకాం ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు. వయసు 20ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌(ఫ్లయింగ్‌ బ్రాంచ్‌)

  • వైమానిక దళంలో మహిళలకు అందుబాటులో ఉన్న మరో మార్గం.. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ(ఫ్లయింగ్‌). ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ సీనియర్‌ డివిజన్‌లో ‘సి’ సర్టిఫికెట్‌ ఉండి.. బ్యాచిలర్‌ డిగ్రీలో 60 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ గ్రూప్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. 
  • వీటితోపాటు గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో మెటీరియాలజీ; ఎడ్యుకేషన్‌ విభాగాల్లోనూ మహిళలకు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ హోదాలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. 

గెజిటెడ్‌ ర్యాంకు

ఎయిర్‌ఫోర్స్‌లో ఏఎఫ్‌క్యాట్‌ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్‌–ఎ గెజిటెడ్‌ హోదాతో కొలువు లభిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌తో కెరీర్‌ ప్రారంభించిన వారికి సదరు వ్యవధి ముగిశాక.. పర్మనెంట్‌ కమిషన్‌కు పొడిగించుకునే అవకాశం సైతం అందుబాటులోకి రానుంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://afcat.cdac.in 


నావికా దళంలో స్త్రీ శక్తి

భారత నావికా దళం కూడా మహిళలకు పలు కెరీర్‌ అవకాశాలు కల్పిస్తోంది. ఏటీసీ, అబ్జర్వర్, లా, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, నేవల్‌ ఆర్కిటెక్చర్, పైలట్‌(మారిటైమ్‌ రికన్నెసెన్స్‌స్ట్రీమ్‌), నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ విభాగాల్లో మహిళలకు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ర్యాంకుతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

విభాగాలు–అర్హతలు

  • ఏటీసీ(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌)– బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత; వయసు 19 1/2ఏళ్ల నుంచి 25ఏళ్లు ఉండాలి. 
  • అబ్జర్వర్‌–బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత; వయసు 19ఏళ్ల నుంచి 24ఏళ్లు ఉండాలి.
  • లా: ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో పేరు నమోదుకు అర్హత ఉండాలి. వయసు 22ఏళ్ల నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. 
  • లాజిస్టిక్స్‌: బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత లేదా ప్రథమ శ్రేణిలో ఎంబీఏ లేదా బీఎస్సీ/బీకాం/బీఎస్సీ(ఐటీ)లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతతోపాటు ఫైనాన్స్‌/ లాజిస్టిక్స్‌/సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌/మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ప్రథమ శ్రేణిలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ) ప్రథమ శ్రేణిలో పూర్తిచేసుకోవాలి. వయసు 19 1/2 ఏళ్ల నుంచి 25ఏళ్లు ఉండాలి.
  • ఎడ్యుకేషన్‌: సంబంధిత విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ శ్రేణి ఉత్తీర్ణత ఉండాలి. అదే విధంగా బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో అదే సబ్జెక్ట్‌ గ్రూప్‌తో ఉత్తీర్ణులవ్వాలి. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా సీఎస్‌ఐటీ బ్రాంచ్‌తో ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • నేవల్‌ ఆర్కిటెక్చర్‌: మెకానికల్‌/సివిల్‌/ఏరోనాటికల్‌/మెటలర్జీ/నేవల్‌ ఆర్కిటెక్చర్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 19 1/2ఏళ్ల నుంచి 25ఏళ్లు ఉండాలి. 
  • పైలట్‌(మారిటైమ్‌ రికన్నెసెన్స్‌ స్ట్రీమ్‌): బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి; వయసు 19ఏళ్ల నుంచి 24ఏళ్లు ఉండాలి.
  • నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌(ఎన్‌ఏఐ): ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఐటీ, కెమికల్, మెటలర్జీ, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ తదితర బ్రాంచ్‌లతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
  • పైలట్‌ జనరల్‌: బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. అదే విధంగా ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండాలి. వయసు 19ఏళ్ల నుంచి 24 ఏళ్లు ఉండాలి.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/en/page/womeninthenavy.html

Published date : 20 Sep 2021 05:27PM

Photo Stories