Skip to main content

Intermediate Guidance: ఇంట‌ర్ వార్షిక పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలో రాణించాలంటే..

ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌. ద్వితీయ సంవత్సరంలో.. సైన్స్‌ సబ్జెక్ట్‌లలో నిర్వహించే ప్రయోగ పరీక్షలు. ఒక్కో సబ్జెక్ట్‌కు 30 మార్కులు కేటాయిస్తున్న పరిస్థితి! విద్యార్థులు రెండేళ్ల కోర్సులో భాగంగా తాము నేర్చుకున్న అంశాల నుంచి అడిగే ఏదైనా ఒక టాపిక్‌పై ఎగ్జామినర్‌ సమక్షంలో ప్రయోగం చేసి చూపించాల్సి ఉంటుంది. వీటిలో పొందే మార్కులను కూడా తుది మార్కులకు కలుపుతారు. కాబట్టి ఈ ప్రయోగ పరీక్షల్లో.. రాణిస్తే మార్కుల శాతాన్ని పెంచుకోవచ్చు. తాజాగా..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ప్రాక్టికల్‌ పరీక్షల తేదీలు కూడా ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఇంటర్‌లో ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ ప్రాధాన్యత, పరీక్షల విధానం, వీటిలో రాణించేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం..
Intermediate annual and practical exams schedule released in andhra pradesh and telangana
Intermediate annual and practical exams schedule released in andhra pradesh and telangana
  • మార్కులు పెంచుకోవడానికి దోహదం చేసే ప్రాక్టికల్స్‌
  • తెలంగాణలో మార్చి 23, ఏపీలో మార్చి 11 నుంచి ప్రాక్టికల్స్‌
  • విద్యార్థులు వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న సబ్జెక్ట్‌ నిపుణులు

ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు ప్రాక్టికల్‌ పరీక్షలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయం ఉంది. కానీ వీటిలో సాధించే మార్కులను తుది మార్కులకు కలుపుతారు. ప్రస్తుతం ఏ పరీక్షలో చూసినా.. ప్రతి ఒక్క మార్కు కీలకంగా మారుతోంది. కాబట్టి ప్రాక్టికల్స్‌కు కూడా ప్రత్యేక శ్రద్ధతో అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మార్కుల పెంపునకు దోహదం

ఇంటర్మీడియెట్‌లో ప్రాక్టికల్స్‌ను ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్,కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో నిర్వహిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్‌లకు కేటాయించిన మొత్తం వంద మార్కుల విధానంలో.. 30 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. అంటే.. విద్యార్థులు థియరీ ఎగ్జామ్స్‌లో 70 మార్కులకే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్స్‌లో చూపిన ప్రతిభకు అనుగుణంగా మరో 30 మార్కులు లభిస్తాయి. 

ప్రయోగ ఫలితాల విశ్లేషణ

ప్రాక్టికల్‌ పరీక్షల్లో విద్యార్థులు తమకు ఇచ్చిన అంశంపై ఫార్ములాలను రాసి.. దాని ఆధారంగా ప్రయోగం నిర్వహించడం, దాని ఫలితాన్ని విశ్లేషించడం వంటివి చేయాల్సి ఉంటుంది. అందుకోసం డయాగ్రమ్స్, టేబుల్స్, గ్రాఫ్‌లను గీయాలి. మొత్తం ప్రయోగం పూర్తయ్యాక వైవా నిర్వహిస్తారు. ఇందులో సదరు విద్యార్థులు.. ఎగ్జామినర్‌ సంబంధిత ప్రయోగంపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అకడమిక్‌ షెడ్యూల్‌ ప్రకారం–బోధన సమయంలోనే విద్యార్థులు ప్రాక్టికల్స్‌ను నిర్వహిస్తూ.. వాటికి సంబంధించిన రికార్డ్‌లను కూడా రాయాల్సి ఉంటుంది. ఇలా రాసిన రికార్డ్స్‌ను ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఎగ్జామినర్‌కు చూపించి మూల్యాంకన చేయించుకోవాలి. సదరు రికార్డ్‌ బుక్‌కు కూడా కొన్ని మార్కులు కేటాయిస్తారు. దీన్నిబట్టే ప్రాక్టికల్స్‌ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు..

ఇంటర్మీడియెట్‌.. ప్రాక్టికల్స్‌.. ముఖ్యాంశాలు

  • తెలంగాణలో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు.
  • ఏపీలో మార్చి 11 నుంచి 31 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు.
  • మూడు గంటల వ్యవధిలో ఒక్కో ప్రాక్టికల్‌ పరీక్ష.
  • డయాగ్రమ్స్, టేబుల్స్, గ్రాఫ్స్‌ రూపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • ప్రయోగ విధానం, ఫార్ములాలను రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. 
  • అన్ని అంశాలకు సంబంధించి అప్లికేషన్‌ దృక్పథంతో అడుగులు వేయాలి.
  • వైవాలో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు పాయింట్ల రూపంలో రికార్డ్‌లోని అంశాలను అధ్యయనం చేయాలి.
  • ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియలను నిర్దిష్ట క్రమంలో ఉండేలా ప్రాక్టీస్‌ చేయాలి


ఇంటర్మీడియట్ సిల‌బ‌స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, స్ట‌డీమెటీరియ‌ల్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఫిజిక్స్‌ ప్రాక్టికల్‌.. ఇలా

  • ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ విషయానికొస్తే.. ఫార్ములా, ప్రొసీజర్‌(5 మార్కులు); టాబ్యులర్‌ ఫాం, అబ్జర్వేషన్స్, గ్రాఫ్‌(8 మార్కులు); కాలిక్యులేషన్స్, రిజల్ట్, యూనిట్లు(ఆరు మార్కులు); ప్రికాషన్స్‌(2 మార్కులు); వైవా(5 మార్కులు); రికార్డు(4 మార్కులు) విభాగాలుగా ప్రాక్టికల్‌ పరీక్ష జరుగుతుంది. 
  • రెండేళ్ల ఇంటర్మీడియెట్‌ కోర్సులో భాగంగా 20 ప్రయోగాలు చేస్తారు. వీటి ఆధారంగా ప్రాక్టికల్‌ పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. కరోనా కారణంగా ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ను తగ్గించిన నేపథ్యంలో.. ప్రాక్టికల్స్‌లోనూ ఆ మేరకు అంశాలను తొలగించారు. 
  • ప్రాక్టికల్‌ పరీక్ష రోజున ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌ సమక్షంలో.. విద్యార్థి ఒక ప్రయోగాన్ని 3 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. విద్యార్థులు మొదటి అరగంట వ్యవధిలో థియరీ పార్ట్‌ రాసి, ఎగ్జామినర్‌కు చూపిస్తే అప్పుడు పరికరం ఇస్తారు. దాని ఆధారంగా ప్రాక్టికల్‌కు ఉపక్రమించాలి. ఈ దశలో తొలుత సూత్రాన్ని రాసి.. అందులోని పదాలను తప్పనిసరిగా వివరించాలి. పది వాక్యాలకు మించకుండా ప్రయోగ విధానం రాయాలి. పరికరం వర్ణన రాయనవసరం లేదు. టాబ్యులేషన్‌ ఫాం, అబ్జర్వేషన్, గ్రాఫ్, ఇచ్చిన ప్రశ్నకు సంబంధించి ఖాళీ పట్టికను గీయాలి. గ్రాఫ్స్‌ అవసరమైతే నమూనా గ్రాఫ్‌లను గీయాలి. ప్రయోగ సమయంలో పరిశీలించిన అంశాలను విడిగా రాయాలి. ప్రయోగ నిర్వహణకు సంబంధించి కనీసం రెండు జాగ్రత్తలు రాయాలి. ప్రయోగం పూర్తయ్యాక వచ్చిన విలువ ఫలితం, దీనికి సంబంధించిన యూనిట్లను తప్పనిసరిగా రాయాలి. ప్రయోగ సమయంలో తీసిన రీడింగ్స్‌ను పట్టికలో పొందుపరచాలి. ప్రయోగ సమయంలో పొందిన విలువలను సూత్రంలో ప్రతిక్షేపించి, తుది ఫలితం పొందాలి.
  • ప్రయోగ పరీక్ష సమయంలో ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌ విద్యార్థిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రయోగానికి సంబంధించి కనీసం 5 ప్రశ్నలు ఎదురవుతాయి. వీటికి విద్యార్థి సమాధానాలు చెప్పాలి. దీనినే వైవా అని పిలుస్తారు. సూటిగా సమాధానాలు చెప్పడం ద్వారా మంచి మార్కులు పొందొచ్చు. అకడమిక్‌ అభ్యసనంలో భాగంగా విద్యార్థులు చేసిన ప్రాక్టికల్స్‌తో రూపొందించిన రికార్డును కూడా పరిశీలిస్తారు. దీనికి నాలుగు మార్కులు ఇస్తారు. 
    – రవీంద్ర, ఫిజిక్స్‌ ఫ్యాకల్టీ

బోటనీ సబ్జెక్టు నైపుణ్యానికి పరీక్ష.. 

  • బైపీసీ విద్యార్థులకు నిర్వహించే బోటనీ ప్రాక్టికల్‌.. సబ్జెక్టు పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అంచనా వేసేలా ఉంటుంది. దీన్ని 30 మార్కులకు, మూడు గంటల వ్యవధితో నిర్వహిస్తారు. కచ్చితమైన సమాచారాన్ని ఇస్తే మంచి మార్కులు సొంతమైనట్లే. ప్రశ్నపత్రంలో మొత్తం అయిదు ప్రశ్నలుంటాయి. 
  • మొదటి భాగంగా కొమ్మ తాలూకు వివిధ భాగాల్ని వర్ణించాలి. అందుకోసం పటాలను గీయడం, భాగాలను గుర్తించడంపై పట్టు సాధించాలి. దీనికి ప్రాక్టీస్‌ ప్రధానం. దీనికి ఆరు మార్కులు. శాఖీయ లక్షణాలను సాంకేతిక పదాలతో వర్ణించినందుకు 1 మార్కు, సాధారణ క్షణాలను సాంకేతిక పదాలతో వర్ణించినందుకు 2 మార్కులు, కుటుంబాన్ని గుర్తించినందుకు 1 మార్కు, పుష్ప విన్యాసం 1/2 మార్కు, పుష్ప చిత్రం గీసినందుకు 1/2 మార్కు, పటాలు గీసినందుకు 1 మార్కు ఉంటాయి.
  • రెండో ప్రశ్నలో ఇచ్చిన మెటీరియల్‌ నుంచి అడ్డుకోత తీసి, స్లైడ్‌ తయారు చేయాలి. స్లైడ్‌ రూపకల్పనకు 3 మార్కులు, గుర్తించినందుకు 1 మార్కు, పటానికి 2 మార్కులు ఉంటాయి. 
  • మూడో ప్రశ్నలో ప్రయోగానికి ఆరు మార్కులుంటాయి. నాలుగు ప్రయోగాలు ఇచ్చి ఏదైనా ఒక ప్రయోగం చేయమంటారు. ఈ ప్రయోగాలకు సిద్ధమయ్యేందుకు లేబొరేటరీ మాన్యువల్‌ను ఉపయోగించుకోవాలి. ప్రయోగం చేసినందుకు 3 మార్కులు, ప్రయోగ విధానం రాసి, పటాలు గీసినందుకు 3 మార్కులు ఇస్తారు.
  • నాలుగో ప్రశ్నలో సరైన కారణాలతో నమూనాను గుర్తించాలి. దీనికి 4 మార్కులు. ఇందులో ఈ నుంచి హెచ్‌ వరకు ప్రశ్నలుంటాయి.
  • రికార్డుకు అయిదు మార్కులు, హెర్బేరియంకు మూడు మార్కులుంటాయి.
  • సిలబస్‌లో పేర్కొన్న కుటుంబాలకు సంబంధించి కనీసం 10 హెర్బేరియం షీట్లు ఉండేలా చూసుకోవాలి. ఆకులు, పుష్పాలు ఉండే కొమ్మలను సేకరించాలి.
    – రాజేంద్ర, బోటనీ ఫ్యాకల్టీ

జువాలజీ ప్రాక్టికల్‌ ఇలా.. 

బైపీసీ విద్యార్థులకు ఉండే మరో ప్రాక్టికల్‌ పరీక్ష.. జువాలజీ. జంతుశాస్త్రంలోని వివిధ అంశాలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మూడు గంటల వ్యవధిలో 30 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష పత్రంలో నాలుగు భాగాలుంటాయి. వానపాము, బొద్దింక, మానవుడు.. వీటిలోని వివిధ వ్యవస్థల పటాలు/నమూనాలను విద్యార్థులకు ఇస్తారు. వీటిలో ఆయా వ్యవస్థలను గుర్తించి, వాటి పటాన్ని గీయాలి. కనీసం నాలుగు భాగాలు గుర్తించాలి. వీటికి 6 మార్కులు కేటాయించారు. గుర్తింపునకు ఒక మార్కు, పటానికి మూడు మార్కులు, భాగాల గుర్తింపునకు రెండు మార్కులు ఉంటాయి. వానపాములోని మూడు వ్యవస్థలకు సంబంధించి జీవి ఖండితాలను గుర్తించాలి. ఆయా వ్యవస్థల్లోని భాగాలను, అవి విస్తరించి ఉండే ఖండితాలను జాగ్రత్తగా పరిశీలించాలి. బొద్దింక ముఖ భాగాలు, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ పటాలను కూడా సాధన చేయాలి. 

  • రెండో భాగానికి అయిదు మార్కులు కేటాయించారు. ఇచ్చిన శాంపిల్స్‌లో పిండిపదార్థాలు, గ్లూకోజ్, కొవ్వు పదార్థాలను, ఆల్బుమిన్‌ను గుర్తించాలి. అదే విధంగా పిండి పదార్థాల జీర్ణక్రియలో లాలాజల అమైలేజ్‌ పాత్రను నిరూపించాలి. ఫార్ములాకు ఒక మార్కు, ప్రొసీజర్‌కు మూడు మార్కులు, ఫలితానికి ఒక మార్కు ఉంటాయి.
  • మూడో భాగంలో ఏ, బీ, సీ, డీ, ఈ.. క్రమంలో అమర్చిన స్పాటర్స్‌ను గుర్తించి, పటాన్ని గీయాలి. గుర్తింపు లక్షణాలను రాయాలి. ఈ భాగానికి 12 మార్కులు కేటాయించారు. వీటిలో అకశేరుకాల స్లైడ్లు, నమూనాలు, కణజాల స్లైడ్లు, సకశేరుకాల స్లైడ్లు, సకశేరుకాల నమూనాలు, కీళ్లు వంటి వాటిని ఇచ్చారు. గుర్తింపునకు 1/2 మార్కు, డయాగ్రమ్‌కు 1/2 మార్కు, పాయింట్లు గుర్తించినందుకు 1 మార్కుల చొప్పున మొత్తం ఒక్కో స్పాటర్‌కు రెండు మార్కులు ఉంటాయి. ఇలా ఆరు అంశాలకు 12 మార్కులు ఇస్తారు. సిలబస్‌లోని అంశాలను విపులంగా సాధన చేయాలి. అధ్యాపకుల సలహాలు తీసుకొని.. వేటిని గుర్తింపు లక్షణాలుగా రాయాలో తెలుసుకోవాలి. నాలుగో భాగంగా రికార్డ్‌ను పరిశీలిస్తారు. దీనికి ఏడు మార్కులు ఉంటాయి. 
    –శ్రీనివాసులు, జువాలజీ ఫ్యాకల్టీ

కెమిస్ట్రీలో రాణించాలంటే

  • కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌ పట్ల విద్యార్థులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా క్వాలిటేటివ్‌ అనాలిసిస్‌/గుణాత్మక విశ్లేషణలో వివిధ రకాల అయాన్‌లను నిర్ధారించే పరీక్షల్లో రసాయన చర్యలను గమనించాలి. దీనికి సంబంధించి వైవాలో ప్రశ్నలు అడిగేందుకు అవకాశముంది. ప్రాక్టికల్‌ సమయంలో క్వాలిటేటివ్‌ అనాలిసిస్‌(10 మార్కులు); వేల్యూమెట్రిక్‌ అనాలిసిస్‌(8 మార్కులు); ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ ఫంక్షనల్‌ గ్రూప్స్‌ లేదా ప్రిపరేషన్‌ అఫ్‌ కొల్లాయిడ్స్‌(6 మార్కులు); వైవా(2 మార్కులు), ప్రాజెక్ట్‌ రికార్డ్‌ (4 మార్కులు) ఉంటాయి. 
  • ప్రాక్టికల్‌ చేసే సమయంలో రసాయనాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరమైతే నిర్ధరణ పరీక్షను ఇన్విజిలేటర్‌కు చూపించాలి. విద్యార్థి ఫలితంలో ఇచ్చిన కచ్చితత్వం ఆధారంగా మార్కులు ఇస్తారు. కాబట్టి టైట్రేషన్‌ జాగ్రత్తగా చేయాలి. ప్రాజెక్ట్‌ వర్క్, రికార్డులను విధిగా సర్టిఫై చేయించుకొని, పట్టికలన్నీ పూరించాలి. విద్యార్థులు వైవా గురించి ఆందోళన చెందుతుంటారు. కానీ, ఇందులో అడిగే ప్రశ్నలు రెండేళ్లలో చదివిన అంశాలు, ప్రాక్టికల్స్‌లో మీరు చేసిన అంశాలకు సంబంధించి ఉంటాయి. 
  • ప్రాక్టికల్‌కు ఉపక్రమించే ముందు మొదట వాల్యూమెట్రిక్‌ ప్రొసీజర్‌ రాయాల్సి ఉంటుంది. అందువల్ల దీన్ని విధిగా నేర్చుకోవాలి. ప్రిన్సిపుల్, ఉపకరణాలు, ఇండికేటర్, రఫ్‌ టేబుల్‌ కచ్చితంగా ఉండేలా చూడాలి.
    –కృష్ణ, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ


చదవండి:  

Study Material

Model papers

Previous Papers

Published date : 22 Feb 2022 05:57PM

Photo Stories