Skip to main content

ఇంటర్మీడియెట్ పరీక్షల తుది దశ సన్నద్ధతకు సలహాలు..

తెలుగు రాష్ట్రాల్లో.. ఇంటర్మీడియెట్ పరీక్షల సందడి మొదలైంది. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది...అలాగే ఏపీలో కూడా ఇంట‌ర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.త్వర‌లో ప్రారంభం కానున్న.. వార్షిక పరీక్షల దిశగా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది! మరోవైపు.. పలు ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలు.. దరఖాస్తుల ప్రకటనలు.. విద్యార్థులకు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రస్తుత సమయంలో ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు నిపుణుల సలహాలు...
Career Guidance ఇంటర్మీడియెట్.. సమీప భవిష్యత్తులో నచ్చిన కోర్సుల్లో ప్రవేశించేందుకు ఎంతో కీలకం. ఇప్పుడు ఏ కోర్సులో కాలు మోపాలన్నా.. ఎంట్రన్స్ టెస్ట్‌లతోపాటు ఇంటర్మీడియెట్‌లో మంచి పర్సంటేజీ కూడా తప్పనిసరిగా మారుతోంది. జాతీయస్థాయిలో జరిగే జేఈఈ-మెయిన్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ తొలగించినప్పటికీ... అడ్వాన్స్‌డ్‌లో 75 శాతం మార్కుల నిబంధన, తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కొనసాగుతోంది. కాబట్టి ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలకు పూర్తి సమయం కేటాయించి మంచి మార్కులు సాధించేలా కృషిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంట్రన్స్‌ల టెన్షన్‌కు విరామం :
ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇంజనీరింగ్ లేదా, మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు సాధించడం తమ లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. ఆయా ప్రవేశ పరీక్షల్లో టాప్ ర్యాంకుల కోసం ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. అయితే.. ప్రస్తుతం ఆ విద్యార్థులు ఎంట్రన్స్ టెస్ట్‌ల టెన్షన్‌కు విరామం ఇచ్చి.. అందుబాటులో ఉన్న ఈ కొద్ది సమయాన్ని పూర్తిగా ఇంటర్మీడియెట్ పరీక్షల ప్రిపరేషన్‌కే కేటాయించాలనేది నిపుణుల సలహా. ఇప్పుడు ప్రవేశ పరీక్షల గురించి ఆలోచిస్తే అనవసర ఆందోళన, ఒత్తిడి పెరిగి.. ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసిన తర్వాత ఆయా ప్రవేశ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించొచ్చు.

ఆరోగ్యం.. ఆత్మవిశ్వాసం
పరీక్షలు బాగా రాయాలంటే.. ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి విద్యార్థులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసం తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ.. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన దరిచేరనీయకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక స్థయిర్యం, పరీక్షల్లో రాణించగలననే ఆత్మవిశ్వాసం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. కాబట్టి విద్యార్థులు తాము పరీక్షలు బాగా రాయగలమనే నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. రెండేళ్లుగా చేస్తున్న కృషి ఫలితంగా మంచి మార్కులు సాధించగలమనే ఆత్మ స్థయిర్యాన్ని పెంపొందించుకోవాలి.

రివిజన్ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు కొత్త అంశాల జోలికి వెళ్లకుండా.. ఇప్పటికే తాము చదివిన అంశాల రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా వెయిటేజీ ఎక్కువ ఉన్న అంశాలపై మరింత పట్టు సాధించేందుకు కృషి చేయాలి. అందుకోసం రెడీ రెకనర్స్, షార్ట్ నోట్స్ వంటి వాటిని ఉపయోగించుకోవాలి.

ఎంపీసీ..
  • ఎంపీసీ విద్యార్థులు ప్రస్తుత సమయంలో మ్యాథమెటిక్స్ పరంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్‌పై పట్టు సాధించేందుకు కృషి చేయాలి.
  • ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్‌కు సంబంధించి ద్విపద సిద్ధాంతం; ప్రస్తారాలు-సంయోగాలు, సంభావ్యత; వృత్తాలు; సమాకలనులు; నిశ్చిత సమాకలనులు; అవకలన సమీకరణాలు; డిమూవర్స్ సిద్ధాంతం, వర్గ సమీకరణాలు, పరావలయం తదితర అంశాలను బాగా పునశ్చరణ చేయాలి.
  • మొదటి సంవత్సరం విద్యార్థులు.. వెక్టార్ అల్జీబ్రా; మాత్రికలు, సరళరేఖలు, సరళరేఖ యుగ్మాలు, అవకలనాలు, అప్లికేషన్స్ అండ్ డెరివేషన్స్‌కు అధిక సమయం కేటాయించాలి.

ఫిజిక్స్ :
  • న్యూమరికల్ అప్రోచ్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో మెరుగైన మార్కులు సాధించుకునే అవకాశం ఫిజిక్స్‌లో లభిస్తుంది.
  • ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. రొటేటరీ మోషన్; యూనివర్సల్ గ్రావిటేషన్ లా; ఎస్కేప్ వెలాసిటీ; సింపుల్ హార్మోనిక్ మోషన్ (ఎస్‌హెచ్‌ఎం); సర్ఫేస్ టెన్షన్, థర్మో డైనమిక్స్ తదితర అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి.
  • ద్వితీయ సంవత్సరంలోని మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం; కరెంట్ ఎలక్ట్రిసిటీ; ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్; పరమాణువు, వేవ్స్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. అదే విధంగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అంశాలపై శ్రద్ధ చూపాలి.

కెమిస్ట్రీ :
  • కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించాలంటే.. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రెండు మార్కుల ప్రశ్నలను బాగా సాధన చేయాలి.
  • ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్ విభాగాలపై బాగా దృష్టి పెట్టాలి. వీటి నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్‌తో పాటు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశముంది. దీంతోపాటు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ చాప్టర్‌పైనా పట్టు సాధించేలా రివిజన్ చేయాలి.
  • ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. కెమికల్ కెనైటిక్స్, ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్లపై పట్టు సాధించాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో అయిదు, ఆరు, ఏడు గ్రూప్ మూలకాలను ఔపోసన పట్టాలి. రివిజన్ సమయంలో అకడామీ పుస్తకాల్లో ప్రతి యూనిట్ వెనుక ఇచ్చిన ప్రశ్నలను సాధన చేయడం ద్వారా మరిన్ని మార్కులు పొందే అవకాశముంది.

బైపీసీ..
బైపీసీ విద్యార్థులు బోటనీ, జువాలజీ సబ్జెక్టులను అనలిటికల్ అప్రోచ్‌తో చదవాలి. దాంతోపాటు అప్లికేషన్ ఓరియెంటేషన్ అలవరచుకోవాలి.

బోటనీ :
  • ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. మొక్కల శరీర ధర్మశాస్త్రం; బయోటెక్నాలజీ; మైక్రోబ్స్, అణుజీవశాస్త్రం యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. బోటనీ విషయంలో ఫ్లో చార్ట్‌లు, డయాగ్రమ్స్ వేయడం ప్రాక్టీస్ చేయాలి. ఫిజియాలజీ చాప్టర్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
  • మొదటి సంవత్సరం విద్యార్థులు.. మొక్కల నిర్మాణాత్మక సంవిధానం-స్వరూప శాస్త్రం; జీవ ప్రపంచంలో వైవిధ్యం; కణనిర్మాణం, విధులు; మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి యూనిట్లపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి డయాగ్రమ్స్ వేయడం బాగా ప్రాక్టీస్ చేయాలి.

జువాలజీ :
  • జువాలజీ విషయంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ప్రత్యుత్పత్తి సంబంధిత ఆరోగ్యం; అంతఃస్రావక వ్యవస్థ, నాడీ నియంత్రణ-సమన్వయం; శరీర ద్రవాలు, ప్రసరణ, విసర్జక పదార్థాలు; జన్యు శాస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. జంతుదేహ నిర్మాణం; గమనం, ప్రత్యుత్పత్తి; జీవావరణం; పర్యావరణం; బొద్దింక జీవ వ్యవస్థ తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. జువాలజీలో కూడా గ్రాఫికల్ ప్రజంటేషన్ మార్కుల సాధనలో కీలకంగా ఉంటుంది. కాబట్టి డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయాలి.

ఫిజిక్స్ :
బైపీసీ-ఫిజిక్స్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. లిక్విడ్, గ్యాస్, కైనటిక్ గ్యాస్ థియరీ, రొటేటరీ మోషన్, యాంగులర్ మూమెంట్, యూనివర్సల్ గ్రావిటేషన్ లా, ఆర్బిటాల్ వెలాసిటీ వంటి అంశాలు ప్రాధాన్యం ఇవ్వాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.. వేవ్ మోషన్; సెమీ కండక్టర్ ఎలిమెంట్స్; మూవింగ్ ఛార్జెస్-మ్యాగ్నటిజం; విద్యుదయస్కాంత ప్రేరణ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.

కెమిస్ట్రీ :
  • కెమిస్ట్రీ పరంగా.. ప్రథమ సంవత్సరం విద్యార్థులు.. ఆవర్తన పట్టిక; కర్బన రసాయన శాస్త్రం; రసాయన బంధం; పరమాణు నిర్మాణం అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలోని సమస్యలను సాధన చేయాలి. సినాప్సిస్ రూపొందించుకుంటే రివిజన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది.
  • ద్వితీయ సంవత్సరంలో పి-బ్లాక్ ఎలిమెంట్స్; ఆర్గానిక్ కెమిస్ట్రీ; విద్యుత్ రసాయన శాస్త్రం; కెమికల్ కైనటిక్స్‌లోని దీర్ఘ సమాధాన ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

రెండు ప్రి-ఫైనల్ పరీక్షలు :
ఇంటర్మీడియెట్ విద్యార్థులు ప్రస్తుత సమయంలో తమ ప్రిపరేషన్‌ను సమీక్షించుకునేలా కనీసం రెండు ప్రి-ఫైనల్ పరీక్షలను రాయాలి. తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక పరీక్షహాల్లో సమాధానాలిచ్చేటప్పుడు తొలుత తమకు బాగా తెలిసిన దీర్ఘ సమాధాన ప్రశ్నలను, తర్వాత స్వల్ప సమాధాన ప్రశ్నలను, చివరగా అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను రాయాలి.
Published date : 13 Feb 2018 01:21PM

Photo Stories