Skip to main content

Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసిన విద్యార్థుల్లో అనేకమంది వివిధ కారణాలతో సత్వర ఉపాధి కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారు తమ ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదం చేస్తున్నాయి.. స్వల్పకాలిక సర్టిఫికేషన్‌ కోర్సులు! వీటిని పూర్తి చేసుకుంటే..అదనపు నైపుణ్యాలతో ఉద్యోగాన్వేషణలో ముందంజలో నిలిచే అవకాశం లభిస్తోంది! ఇటీవల పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న జాబ్‌ ఓరియెంటెడ్‌ షార్ట్‌ టర్మ్‌ సర్టిఫికేషన్‌ కోర్సుల వివరాలు..
best certificate courses after 10th class & inter
  • పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు
  • సైబర్‌ సెక్యూరిటీ నుంచి ఫొటోగ్రఫీ వరకు పలు సర్టిఫికేషన్స్‌
  • సర్టిఫికెట్‌ సొంతం చేసుకుంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు


చ‌ద‌వండి: APBIE: ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి.. ఉత్తీర్ణత శాతం ఇలా..


పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణతతో..ఎన్నో షార్ట్‌టర్మ్‌ కోర్సుల్లో చేరే అవకాశముంది. విద్యార్థులు కొంత సమయాన్ని ఈ సర్టిఫికేషన్స్‌ కోసం కేటాయిస్తే.. మెరుగైన ఉపాది అవకాశాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఐటీ మొదలు ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, బ్యుటీషియన్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి వ్యవధి ఆరు నెలల నుంచి సంవత్సరం. వీటిని పూర్తి చేసుకుంటే ఉపాధికి అవసరమైన క్షేత్ర నైపుణ్యాలు లభిస్తాయి. ఫలితంగా ఉద్యోగ సాధనతోపాటు మెరుగైన వేతనాలు అందుకునేందకు మార్గం ఏర్పడుతుంది. 

చ‌ద‌వండి: Tech skills: సైబర్‌ సెక్యూరిటీ.. కెరీర్‌ అవకాశాలు, అర్హతలు, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు

సైబర్‌ సెక్యూరిటీ

  • సైబర్‌ సెక్యూరిటీ..ప్రస్తుత టెక్‌ యుగంలో అత్యంత కీలక నైపుణ్యం. ప్రస్తుతం సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. ఆ క్రమంలో విలువైన సమాచారం తస్కరణకు గురికాకుండా.. సైబర్‌ సెక్యూరిటీ నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఈ స్కిల్స్‌ను అందుకునేందుకు ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో ఉండే సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. 
  • పదో తరగతి, ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఆయా సర్టిఫికేషన్‌ కోర్సుల ద్వారా ఎథికల్‌ హ్యాకింగ్, సైబర్‌ సెక్యూరిటీ అనాలిసిస్, అప్లికేషన్స్‌ ఆఫ్‌ అటాక్స్, అడ్వాన్స్‌డ్‌ సెక్యూరిటీ అనాలిసిస్, డేటా ప్రొటెక్షన్, హార్డ్‌వేర్‌ ప్రొటెక్షన్‌ వంటి అంశాల్లో నైపుణ్యాలు పొందొచ్చు. 
  • ఈ సర్టిఫికేషన్‌ పూర్తి చేసుకున్న వారికి ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు, లేదా ఇతర రంగాల్లోని కంపెనీల్లో ఐటీ విభాగాల్లో సైబర్‌ సెక్యూరిటీ టీమ్‌ అసిస్టెంట్స్, అసోసియేట్స్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. 
  • కోర్సెరా, యుడెమీ వంటి సంస్థలు సర్టిఫికెట్‌ ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ కోర్సును ఆరు నెలల వ్యవధిలో అందిస్తున్నాయి. 

చ‌ద‌వండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..

హార్డ్‌వేర్‌ మెయింటనెన్స్‌

  • ఐటీలోనే ఉద్యోగావకాశాలు కల్పించే మరో కోర్సు.. హార్డ్‌వేర్‌ మెయింటనెన్స్‌. కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయడానికి అవసరమైన సీపీయూ, నెట్‌ వర్కింగ్, లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ నిర్వహణ వంటి వాటికి సంబంధించిన నైపుణ్యాలు హార్డ్‌వేర్‌ మెయింటనెన్స్‌ కోర్సు ద్వారా సొంతం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం పీసీ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్, పీసీ అసెంబ్లీ అండ్‌ మెయింటనెన్స్‌ తదితర విభాగాల్లో సర్టిఫికేషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. 
  • డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ అండ్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ రిపెయిర్‌ అండ్‌ మెయింటనెన్స్‌ ఆఫ్‌ సిస్టమ్స్‌ వంటి కోర్సులు ఉన్నాయి.
  • ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నిమ్స్‌మే, సెట్విన్‌ వంటి సంస్థలు ఈ కోర్సులను బోధిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే.. చిన్న, మధ్య తరహా సంస్థల్లో హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌ అసిస్టెంట్స్, సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

కంప్యూటర్‌ కోర్సులు

పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ అర్హతతో మరెన్నో కంప్యూటర్‌ సర్టిఫికేషన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో.. సీసీఎన్‌ఏ, సీసీఎన్‌పీ, ఎస్‌ఏపీ, కోర్‌–జావా ప్రోగ్రామింగ్, అడ్వాన్స్‌డ్‌ జావా ప్రోగ్రామింగ్, డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్, సీ++, ఎంఎస్‌ ఆఫీస్‌ అండ్‌ ఇంటర్నెట్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ వంటి కోర్సులున్నాయి. ఆయా కోర్సులను బట్టి మూడు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో వీటిని బోధిస్తున్నారు. అదే విధంగా ఎన్‌ఎస్‌డీసీ ఐటీ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలోనూ వీటిని అభ్యసించే అవకాశం ఉంది. వీటిని పూర్తి చేసుకుంటే..ఐటీ, ఐటీ అనుంబంధ విభాగాల్లో అసిస్టెంట్స్, సపోర్టింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఉద్యోగాలు దక్కుతాయి.

చ‌ద‌వండి: Best Certification Courses: సర్టిఫికేషన్స్‌తో.. కెరీర్‌ షైన్‌!

మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్ట్‌

  • సంస్థల్లో క్లరికల్‌ కేడర్‌లో విధులు నిర్వహించే వారికి ఉపయోగపడే కోర్సు.. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్ట్‌. ఈ కోర్సును పూర్తిచేసుకుంటే..ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ టూల్స్‌గా పిలిచే వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌ తదితర బేసిక్‌ కంప్యూటర్‌ స్కిల్స్‌ లభిస్తాయి. ఇది ఆర్ట్స్, కామర్స్‌ విద్యార్థులకు అనుకూలమైన కోర్సుగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం అన్ని సంస్థల్లో ఉద్యోగుల హాజరు నుంచి వేతన జాబితా రూపకల్పన వరకూ.. అన్నింటికీ కంప్యూటర్‌ ఆధారంగా మారింది. అంతేకాకుండా డాక్యుమెంటేషన్, ఎక్సెల్‌ షీట్‌ ప్రిపరేషన్స్‌ వంటివి సర్వ సాధారణంగా మారాయి.
  • ప్రస్తుతం యుడెమీ, కోర్సెరా వంటి పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ విధానంలో అందిస్తున్నాయి. 
  • ఈ సర్టిఫికేషన్‌ చేతిలో ఉంటే ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాల్లో ప్రాధాన్యత లభిస్తుంది. అడ్మినిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి కొలువులు లభిస్తాయి. నెలకు కనీసం రూ.12 నుంచి రూ.15 వేల ప్రారంభ వేతనం అందుతుంది. 

డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్‌

డీటీపీలో సర్టిఫికేషన్లు పూర్తి చేస్తే డేటాఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్లుగా ఉపాధి లభిస్తుంది. డేటాఎంట్రీ ఆపరేటర్లకు ప్రారంభంలో నెలకు రూ.ఆరు వేల నుంచి రూ.పది వేల వరకు వేతనం అందుతుంది. సొంతగా డీటీపీ సెంటర్‌ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందొచ్చు. డేటాఎంట్రీ ఆపరేటర్‌గా కొలువు పొందాలంటే.. ఎంఎస్‌ ఆఫీస్‌ టూల్స్, టైపింగ్, ఫోటోషాప్‌ వంటి అంశాల్లో పరిజ్ఞానం తప్పనిసరి. 

చ‌ద‌వండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!

వీడియో ఎడిటింగ్‌

  • ప్రస్తుతం సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా,ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా వీడియోల రూపంలో అందిస్తున్నాయి. సదరు వీడియోలు, వాటిలో వినియోగించాల్సిన చిత్రాలను ఆకర్షణీయంగా రూపొందించే స్కిల్‌ ఉన్న వారికి డిమాండ్‌ నెలకొంది. అలాగే వీడియో ఎడిటింగ్‌పై పట్టుంటే.. టీవీ మీడియా, వెబ్‌ మీడియా, సినిమాలు, అడ్వర్‌టైజింగ్‌ తదితర విభాగాల్లో ఉపాధి లభిస్తుంది. వీడియో ఎడిటింగ్‌కు సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలు అందించే షార్ట్‌ టర్మ్‌ కోర్సులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే వీటిని పూర్తి చేసుకోవచ్చు.
  • వీడియో ఎడిటింగ్‌కు సంబంధించి కూడా యుడెమీ, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్‌ ఆఫ్‌ ఓపెన్‌ లెర్నింగ్, కోర్సెరా వంటి సంస్థలు మూడు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో ఉండే వీడియో ఎడిటింగ్, లీనియర్, నాన్‌–లీనియర్‌ ఎడిటింగ్‌ వంటి కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా మీడియా సంస్థలు, యానిమేషన్‌ సంస్థలు, అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలలో వీడియో ఎడిటర్స్, అసిస్టెంట్‌ వీడియో ఎడిటర్స్‌ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. 

చ‌ద‌వండి: Best Polytechnic Courses After 10th: పాలిటెక్నిక్‌ డిప్లొమా.. భవితకు ధీమా

డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌

  • హోటల్‌ మేనేజ్‌మెంట్‌..ఇటీవల ఉద్యోగ కల్పనలో ముందంజలో ఉంటోంది. ఇంటర్మీడియెట్‌ అర్హతతో డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం వంటి కోర్సు­ల్లో చేరొచ్చు. ఏడాది వ్యవధి ఉండే ఈ కోర్సులను పూర్తి చేసుకోవడం ద్వారా హోటల్స్, రిసార్ట్స్, టూరిజం సంస్థల్లో అసిస్టెంట్‌ చెఫ్, స్టివార్ట్, గైడ్, బిల్లింగ్‌ ఎగ్జిక్యూటివ్, గెస్ట్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి కొలువులు లభిస్తాయి.
  • డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ ప్రొడక్షన్, డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో వీటిని అభ్యసించొచ్చు.

ఫొటోగ్రఫీ

మాటల్లో వర్ణించలేని భావాలను వ్యక్తం చేయడానికి చక్కటి సాధనం..ఫొటోగ్రఫీ. ఇలాంటి అద్భుతమైన మాధ్యమాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారు ఫొటోగ్రఫీ సర్టిఫికేషన్ల ద్వారా రాణించొచ్చు. ఫొటోగ్రఫీకి సంబంధించి ఆరు నెలల షార్ట్‌ టర్మ్‌ కోర్సులతోపాటు డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఫోటో జర్నలిజం, కమర్షియల్‌ ఫోటోగ్రఫీ, అడ్వరై్టజింగ్, ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ, ఇండస్ట్రియల్‌ ఫోటోగ్రఫీ, వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రఫీ, ఏరియల్‌ ఫోటోగ్రఫీ, సైంటిఫిక్‌ ఫోటోగ్రఫీ.. వంటి విభాగాల్లో ఉపాధి లభిస్తుంది. వీరికి మీడియా సంస్థలు, పబ్లిషింగ్‌ సంస్థలు, అడ్వర్టయిజింగ్‌ కంపెనీలు ప్రధాన ఉపాధి వేదికలు. వీరు సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్‌ ఫోటోగ్రాఫర్‌గా కూడా పని చే యవచ్చు. సత్యజిత్‌ రే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్, ఏఏఎఫ్‌టీ, పిక్సెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ వంటి పలు సంస్థలు ఫోటోగ్రఫీలో డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.

చ‌ద‌వండి: Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

బ్యుటీషియన్‌

  • వివిధ కారణాలతో బ్యూటీ షియన్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ఈ రంగానికి సంబంధించి కోర్సులు పూర్తి చేసిన వారు చక్కటి ఉపాధి పొందే అవకాశముంది. ప్రస్తుతం బ్యుటీషియన్‌ విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి మీడియా సంస్థలు, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో..హెయిర్‌ డ్రెస్సర్, స్కిన్‌ కేర్‌ స్పెషలిస్ట్, మేకప్‌ ఆర్టిస్ట్, కాస్మొటిక్‌ కన్సల్టెంట్‌ అండ్‌ బ్యూటీ అడ్వైజర్, సెలూన్‌ అండ్‌ స్పా డైరెక్టర్, నెయిల్‌ టెక్నీషియన్‌ అండ్‌ మేనిక్యూరిస్ట్, బ్యూటీ కన్సల్టెంట్, బ్యూటీ స్కూల్‌ ఇనస్ట్రక్టర్, కాస్మోటాలజిస్ట్, డెర్మటాలజీ అసిస్టెంట్, మార్కెటింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ స్పెషలిస్ట్‌ ఇన్‌ బ్యూటీ ఇండస్ట్రీ, ఆర్మో థెరపిస్ట్‌లుగా స్థిరపడవచ్చు. లేదా సొంతంగా బ్యూటీపార్లర్‌ నిర్వహించవచ్చు. వివాహాలు, జన్మదిన వేడుకలు వంటి సందర్భాల్లో బ్యుటీషియన్లకు చక్కని ఆదాయం ల­భిస్తోంది. కొంత సృజనాత్మకత ఉంటే ఫ్యాషన్‌ రంగంలో అవకాశాలను కూడా అంది పుచ్చుకోవచ్చు. 
  • సెట్విన్, నిమ్స్‌మే వంటి సంస్థలు గ్రూమింగ్, పర్సనల్‌ గ్రూమింగ్, బ్యుటీషియన్, అడ్వాన్స్‌ బ్యుటీషియన్, బ్యూటీ కేర్‌లో కోర్సులను బోధిస్తున్నాయి.

చ‌ద‌వండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

యానిమేషన్‌

ఇటీవల అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాల్లో యానిమేషన్‌ ఒకటి. వీడియో గేమ్స్, కార్టూన్స్, మోషన్‌ కార్టూన్స్‌ పట్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి పెరుగుతుండడంతో యానిమేషన్‌ రంగం శరవేగంగా వృద్ధి చెందుతోంది. దీంతో.. ఈ విభాగంలో నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి చక్కటి ఉపాధి లభిస్తోంది.
ప్రస్తుతం 3డి గేమింగ్, వీడియోలకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో.. వీటికి సంబంధించి కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.మాడ్యులర్‌(మోడలింగ్‌), రిగ్గింగ్, టెక్స ్చరింగ్‌ సెట్‌ డిజైనర్‌(ఎ–యానిమేటర్, బి–లిప్సింగ్‌), కంపోజిటింగ్‌ కోర్సులు వీటిలో ముఖ్యమైనవి.
నిమ్స్‌మే ఇతర యానిమేషన్‌ సంస్థలు మూడు నుంచి సంవత్సరం వ్యవధిలోని కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకుంటే.. వీడియో గేమింగ్‌ సంస్థలు, మీడియా సంస్థలు, యానిమేషన్‌ సంస్థలు, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అవకాశాలు లభిస్తాయి.

Published date : 08 Jan 2024 04:35PM

Photo Stories