Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!
ఎస్‌ఎస్‌సీ.. సీహెచ్‌ఎస్‌ఎల్
- ఇంటర్మీడియెట్ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(సీహెచ్‌ఎస్‌ఎల్) ఎగ్జామ్‌కు పోటీపడొచ్చు. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో ఎల్‌డీసీ, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్ వంటి పలు ఉద్యోగాలకు నియామకాలు చేపడతారు. టెర్-1, టైర్-2 పేరుతో రెండు దశల్లో పరీక్ష ఉంటుంది.
- టైర్-1 దశలో..200 మార్కులకు నిర్వహించే పరీక్షలో..ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్‌ల్లో ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి.
- టైర్-1లో మెరిట్ జాబితాలో నిలిచిన వారికి టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను రెండు సెషన్‌లు, మూడు సెక్షన్లు, ప్రతి సెక్షన్‌లో రెండు మాడ్యూల్స్ విధానంలో నిర్వహిస్తారు. సెషన్-1లో సెక్షన్-1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్(30 ప్రశ్నలు-90 మార్కులు), రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్(30 ప్రశ్నలు-90 మార్కులు), సెక్షన్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్(40 ప్రశ్నలు-120 మార్కులు), జనరల్ అవేర్ నెస్(20 ప్రశ్నలు-60 మార్కులు), సెక్షన్-3లో మాడ్యూల్-1లో కంప్యూటర్ నాలెడ్జ్ (15 ప్రశ్నలు-45 మార్కులు), సెషన్-2లో సెక్షన్-3లో మాడ్యూల్-2లో స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in/
చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!
ఆర్‌ఆర్‌బీ..టెక్నికల్ ఉద్యోగాలు
ఇంటర్ అర్హతతో ఇండియన్ రైల్వేలోని గ్రూప్-సి ఉద్యోగాలను దక్కించుకోవచ్చు. ఇందుకోసం సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కేవలం ఇంటర్‌తోనే కాకుండా పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా అర్హతతోనూ గ్రూప్-సి ఉద్యోగాల భర్తీ చేపడతారు. అసిస్టెంట్ లోకోపైలట్, టెక్నీషియన్ గ్రేడ్-3 పేరుతో పలు టెక్నికల్ విభాగాల్లో సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగాలు గ్రూప్-సి పరిధిలోకి వస్తాయి. ఇంటర్మీడియెట్ అర్హతతో ట్రాఫిక్ అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్ వంటి నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు.
- అసిస్టెంట్ లోకోపైలెట్, టెక్నీషియన్ పోస్టులకు ఉమ్మడిగా రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఉంటుంది.
- మొదటి దశలో జనరల్ అవేర్‌నెస్(40 ప్రశ్నలు), మ్యాథమెటిక్స్(30 ప్రశ్నలు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (30 ప్రశ్నలు) విభాగాల్లో మొత్తం వంద మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుంది.
- మొదటి దశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశకు ఎంపిక చేస్తారు. రెండో దశలో జనరల్ అవేర్‌నెస్(50 ప్రశ్నలు), మ్యాథమెటిక్స్(35 ప్రశ్నలు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(35 ప్రశ్నలు) విభాగాల్లో 120 ప్రశ్నలు ఉంటాయి.
- వివరాలకు వెబ్‌సైట్: https://indianrailways.gov.in/
త్రివిధ దళాల్లో కొలువులు వయా ఎన్‌డీఏ
- ఇంటర్మీడియెట్ అర్హతతో త్రివిధ దళాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) పర్మనెంట్ కమిషన్ ర్యాంకుతో కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. దీనికి మార్గం.. యూపీఎస్సీ నిర్వహించే నేషన్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో విజయం ద్వారా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవల్ అకాడమీల్లో శిక్షణకు ఎంపికైతే.. కొలువుతోపాటు డిగ్రీ సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. ఆర్మీ కేడెట్స్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఎస్సీ/బీఏ; నేవల్, ఎయిర్‌ఫోర్స్ కేడెట్‌గా శిక్షణ పొందిన వారికి బీటెక్‌తోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో త్రివిధ దళాల్లో కెరీర్ ప్రారంభమవుతుంది.
- ఎన్‌డీఏ నియామక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. తొలిదశలో 900 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన వారికి తదుపరి దశలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల ఆధ్వర్యంలోని సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌లు మరో 900 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వీటిలో విజయం సాధించిన వారికి ఆయా అకాడమీల్లో క్యాడెట్ ట్రైనీలుగా అవకాశం కల్పిస్తారు.
- వివరాలకు వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
చదవండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!
ఆర్మీ.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్
- ఇంటర్ అర్హతతో అందుబాటులో ఉన్న మరో చక్కటి అవకాశం.. ఇండియన్ ఆర్మీలోని 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణత సాధించి.. జేఈఈ-మెయిన్‌లో ర్యాంకు పొందిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీరికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు త్రివిధ దళాలలకు చెందిన మిలటరీ అకాడమీలలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే..ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, మెకానికల్, నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో బీటెక్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కెరీర్ ప్రారంభించొచ్చు. వీటికోసం ఇండియన్ ఆర్మీ, నేవీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.
త్రివిధ దళాల్లో అగ్నివీర్
- ఇంటర్మీడియెట్ అర్హతతో త్రివిధ దళాల్లో అగ్నిపథ్ స్కీమ్ ద్వారా చేపడుతున్న అగ్నివీర్ నియామకాలకు పోటీపడొచ్చు. అగ్నివీర్ టెక్నికల్ పోస్ట్‌లను ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణులతో భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- నేవీలో..అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్) పేరుతో.. ఇంటర్మీడియెట్(ఎంపీసీ/బైపీసీ) తత్సమాన కోర్సు అర్హతగా నేవీలోని పలు విభాగాల్లో నియామకాలను ఖరారు చేస్తారు. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ, బైపీసీ గ్రూప్ ఉత్తీర్ణతను అర్హతగా నిర్దేశించారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలిదశలో రాత పరీక్ష, మలిదశలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్ష.. నాలుగు విభాగాల్లో(ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్) వంద మార్కులకు ఉంటుంది. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు.
- ఎయిర్‌ఫోర్స్‌లోనూ అగ్నివీర్ వాయు పేరిట టెక్నికల్ విభాగాల్లో ఎంపీసీ అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
చదవండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్ కొలువు
ఇండియన్ కోస్ట్ గార్డ్
- ఇంటర్మీడియెట్, పదో తరగతి అర్హతతో సుస్థిర కొలువు అందించే వేదిక.. ఇండియన్ కోస్ట్ గార్డ్. తీరగస్తీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఇంటర్మీడియెట్ అర్హతతో నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లలో నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఐఎన్‌ఎస్ చిల్కాలో ప్రాథమికంగా శిక్షణ ఇస్తారు.
- ఇది విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి నియామకాలు ఖరారు చేస్తారు.
- వివరాలకు వెబ్‌సైట్: https://joinindiancoastguard.gov.in/
రాష్ట్ర స్థాయిలో.. పోలీస్ కానిస్టేబుల్స్
రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియెట్ అర్హతతో పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్‌లు అందుబాటులో ఉంటాయి. కానిస్టేబుల్ పోస్టులకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలి దశలో ప్రిలిమినరీ రాత పరీక్ష, రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మూడో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
తొలిదశ ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. వీటిలో సత్తా చాటిన వారికి చివరగా మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఈ మూడు దశల్లోనూ విజేతలుగా నిలిచిన వారికి కానిస్టేబుల్‌గా కొలువు సొంతమవుతుంది.