Skip to main content

After‌ Inter MPC‌: ఇంజనీరింగ్‌తోపాటు వినూత్న కోర్సుల్లో చేరే అవకాశం.. అవకాశాలు, ఎంట్రన్స్‌ టెస్టుల వివ‌రాలు ఇలా..

After 12th MPC
After 12th MPC

ఎంపీసీలో చేరిన విద్యార్థుల్లో అధిక శాతం మంది లక్ష్యం.. ఇంజనీరింగ్‌. ఇంజనీరింగ్‌లో చేరాలంటే.. ఆయా ఎంట్రన్స్‌లో విజయం సాధించాలి. ఒకవేళ వాటిలో నిరాశజనక ఫలితాలు వచ్చినా..ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే.. ఎంపీసీ అర్హతతో మరెన్నో వినూత్న కోర్సుల్లో చేరే అవకాశం కూడా ఉంది. మరికొద్ది రోజుల్లో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసుకోబోతున్న ఎంపీసీ విద్యార్థులకు ఉపయోగపడేలా.. ఇంజనీరింగ్‌తోపాటు అందుబాటులో ఉన్న వివిధ ఉన్నత విద్య అవకాశాలు, ఎంట్రన్స్‌ టెస్టులు, పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం...

  • అందుబాటులో బీటెక్‌ సహా పలు వినూత్న కోర్సులు
  • లా, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సుల్లోనూ చేరొచ్చు
  • ఆయా ఎంట్రన్స్‌లలో విజయమే గీటు రాయి

ఎంపీసీ విద్యార్థుల తొలి లక్ష్యమైన ఇంజనీరింగ్‌లో చేరేందుకు పలు ఎంట్రన్స్‌ టెస్ట్‌లలో విజయం సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐఐటీలు, నిట్‌ల్లో ప్రవేశాలకు వీలు కల్పించే.. జేఈఈ అడ్వాన్స్‌డ్, జేఈఈ మెయిన్‌; తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం టీఎస్‌ ఎంసెట్‌; ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో అడ్మిషన్‌ కోసం ఏపీ ఈఏపీసెట్, బిట్స్‌లో ప్రవేశం బిట్‌ శాట్‌ వంటివి ముఖ్యమైనవి. 

జేఈఈ–మెయిన్‌

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి వీలు కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత పరీక్ష..జేఈఈ మెయిన్‌. అంతేకాకుండా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ + ఎంటెక్‌ల్లో జేఈఈ మెయిన్‌ ర్యాంకు ద్వారా ప్రవేశం కల్పిస్తారు. జేఈఈ మెయిన్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీపై ప్రశ్నలు ఉంటాయి. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. గత ఏడాది నుంచి ఏటా నాలుగుసార్లు ఈ పరీక్ష నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్ణయించింది. 2022కు సంబంధించి త్వరలో తొలి దశ పరీక్షకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. 

  • బీఆర్క్‌కు పేపర్‌–2: జేఈఈ–మెయిన్‌లో నిర్వహించే పేపర్‌–2లో స్కోర్‌ ఆధారంగా ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌)కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ పేపర్‌లో మ్యాథమెటిక్స్‌;అప్టిట్యూడ్‌ టెస్ట్, డ్రాయింగ్‌ టెస్ట్‌ విభాగాల్లో నైపుణ్యాలను పరీక్షిస్తారు. మ్యాథమెటిక్స్, అప్టిట్యూడ్‌ టెస్ట్‌లను ఆన్‌లైన్‌ విధానంలో, డ్రాయింగ్‌ టెస్ట్‌ను పెన్‌ పేపర్‌ విధానంలో నిర్వహిస్తారు. 
  • పేపర్‌–2బీ పేరుతో బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి మరో పేపర్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, అప్టిట్యూడ్‌ టెస్ట్, ప్లానింగ్‌ బేస్డ్‌ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మెరుగైన స్కోర్‌ ఆధారంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సులో అడుగుపెట్టొచ్చు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in


చ‌ద‌వండి: జేఈఈ మెయిన్..ముందస్తు ప్రణాళికలతో సక్సెస్ సునాయసమే

జేఈఈ–అడ్వాన్స్‌డ్‌

  • ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌. జేఈఈ–మెయిన్‌ పేపర్‌–1లో ప్రతిభ ఆధారంగా 2.5 లక్షల మందిని జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. 
  • ఈ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ఒక్కో పేపర్‌ పరీక్ష సమయం మూడు గంటలు. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరుగుతుంది. 
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో స్కోర్‌ ఆధారంగా ఐఐటీలే కాకుండా..ఐఐఎస్‌టీ, ఐఐఎస్‌సీ తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. 
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2022కు సంబంధించి జూన్‌ మొదటి వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. పూర్తి వివరాలను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది.
  • వివరాలకు వెబ్‌సైట్‌: www.jeeadv.ac.in

ఎంసెట్, ఈఏపీసెట్‌

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాల స్థాయిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం ప్రత్యేకంగా ఎంట్రన్స్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. 
  • తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌ ఎంసెట్, ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీ(ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ) సెట్‌ పేరుతో ఈ పరీక్షలు ఉంటాయి. 
  • బీటెక్‌ కోర్సుల అభ్యర్థులు ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పేపర్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణత ద్వారా బీటెక్‌తోపాటు బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌)/బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ)/బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ)/బీటెక్‌(బయోటెకాలజీ)/బీఫార్మసీ(ఎంపీసీ)/ఫార్మ్‌–డీ(ఎంపీసీ) కోర్సుల్లోనూ చేరొచ్చు. 
  • ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ మొత్తం 160మార్కులకు ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్‌ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 40 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. 


చ‌ద‌వండి: AP EAPCET: కంప్యూటర్‌ సైన్స్ టాప్‌.. ఇతర కొత్త కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు

బిట్‌శాట్‌

ఇంజనీరింగ్‌ కోర్సుల అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రముఖ ఎంట్రన్స్‌ టెస్ట్‌.. బిట్‌ శాట్‌. ఇంజనీరింగ్‌ విద్యలో పేరు గడించిన బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(బిట్స్‌–పిలానీ).. బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తుంది. దీనిద్వారా బిట్స్‌ పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. 

  • ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది. 
  • ఈ పరీక్షను కూడా పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలోనే ఆన్‌లైన్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. 
  • మొత్తం నాలుగు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ, లాజికల్‌ రీజనింగ్‌; వీటితోపాటు ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్‌; బీఫార్మసీ అభ్యర్థులకు బయాలజీ ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలతో పరీక్ష జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
  • బిట్‌శాట్‌–2022 నోటిఫికేషన్‌ ఫిబ్రవరి మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది.
  • వివరాలకు వెబ్‌సైట్‌: www.bitsadmission.com

నాటా

  • జాతీయ స్థాయిలో కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ గుర్తింపు పొందిన కళాశాలల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌) కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నేషనల్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా). ప్రతి ఏటా జనవరిలో నోటిఫికేషన్‌ వెలువడుతుంది.
  • ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది. 
  • నాటాను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు–200 మార్కులకు జరిగే ఈ పరీక్షలో డయగ్రమాటిక్‌ రీజనింగ్, న్యూమరికల్‌ రీజనింగ్, వెర్బల్‌ రీజనింగ్, ఇండక్టివ్‌ రీజనింగ్, సిట్యుయేషనల్‌ జడ్జ్‌మెంట్, లాజికల్‌ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • 2021 నుంచి ఏటా రెండుసార్లు నాటా ఎంట్రన్స్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా ఫిబ్రవరిలో వెలువడే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nata.in

హోటల్‌ మేనేజ్‌మెంట్‌

  • ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులకు అందుబాటులో ఉన్న మరో అవకాశం.. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు. జాతీయ స్థాయిలో టూరిజం శాఖ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాంపస్‌లు ఈ కోర్సును అందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. వీటిలో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్ష.. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌–జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌.
  • ఈ ఎంట్రన్స్‌ను అయిదు విభాగాల్లో(న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ అప్టిట్యూడ్‌; రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌; జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌; ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌; అప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌) 200 ప్రశ్నలకు నిర్వహిస్తారు. 
  • ఈ ప్రవేశ పరీక్షలో స్కోర్‌ ఆధారంగా.. టూరిజం విభాగం ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాంపస్‌లతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని కళాశాలలు, ఇతర ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లలో హాస్పిటాలిటీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ntanchm.nic.in 

జాతీయ స్థాయిలో లాకు ‘క్లాట్‌’

  • జాతీయ స్థాయిలోని నేషనల్‌ లా యూనివర్సిటీల్లో.. ఇంటర్మీడియెట్‌ అర్హతగా అయిదేళ్ల వ్యవధిలోని ఇంటిగ్రేటెడ్‌ బీఏ–ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌–యూజీ (క్లాట్‌–యూజీ) నిర్వహిస్తున్నారు. ఈ ఎంట్రన్స్‌లో స్కోర్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 22 నేషనల్‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందొచ్చు.
  • క్లాట్‌–యూజీ పరీక్షను 150 మార్కులకు అయిదు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌; జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌; లీగల్‌ రీజనింగ్‌; లాజికల్‌ రీజనింగ్‌; క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌.
  • క్లాట్‌–యూజీ–2022కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022. 
  • మే 8, 2022న క్లాట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.
  • వెబ్‌సైట్‌: https://cons-rtiumofnlus.ac.in/clat2022


చ‌ద‌వండి: Fashion Career: డిజైనింగ్‌ రంగం... కొలువుల త‌రంగం

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ

  • ఫ్యాషన్‌ రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి చక్కటి కోర్సులను అందిస్తోంది.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌). నిఫ్ట్‌ క్యాంపస్‌లు అందించే కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 
  • 2022 సంవత్సరానికి సంబంధించి నిఫ్ట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 17, 2022.
  • పరీక్ష తేదీ: ఫిబ్రవరి 6, 2022
  • అభ్యర్థులకు తొలి దశలో జీఏటీ పేరుతో క్యాంటిటేటివ్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ అండ్‌ ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో విజయం సాధిస్తే.. ఆ తర్వాత దశలో క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధించిన వారికి తుది దశలో పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌లు ఉంటాయి. 
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://nift.ac.in/admission


చ‌ద‌వండి: After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు

Published date : 12 Jan 2022 05:55PM

Photo Stories