Skip to main content

జేఈఈ మెయిన్..ముందస్తు ప్రణాళికలతో సక్సెస్ సునాయసమే

జేఈఈ మెయిన్.. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! దాంతోపాటు ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జరిపే జేఈఈ అడ్వాన్స్‌డ్స్ రాసేందుకు అర్హత పరీక్ష!! అందుకే దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ కోసం ఇంటర్మీడియెట్‌లో చేరిన రోజు నుంచేఅహోరాత్రులు శ్రమిస్తుంటారు. గంటలు గంటలు చదువుతూ ఎంతో ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే కాస్త ముందుగానే అంటే స్కూల్ స్థాయిలోనే.. తొమ్మిది, పదోతరగతిలో ఉన్నప్పటి నుంచే కాన్పెప్ట్‌లపై అవగాహన పెంచుకుంటూ చదివితే.. జేఈఈ మెయిన్‌లో సక్సెస్ సునాయసమే అంటున్నారు నిపుణులు. జేఈఈ- మెయిన్‌లో విజయానికి హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులు అనుసరించాల్సిన ముందస్తు ప్రిపరేషన్ వ్యూహంపై నిపుణులు, గత విజేతల సలహాలు, సూచనలు..!
దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి వీలుకల్పించే జేఈఈ మెయిన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. జనవరి 19న నిర్వహించనున్న జేఈఈ-మెయిన్ పరీక్షకు ఇటీవలే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. వచ్చిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 9.65 లక్షలు..! మరోవైపు దేశంలోని ఐఐటీలు, నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లోని మొత్తం సీట్ల సంఖ్య 36వేలకు మించి ఉండదు. అంటే..పోటీ తీవ్రం. సీట్లు పరి మితమని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో.. నిద్రా హారాలు మాని రాత్రింబవళ్లు శ్రమిస్తేనే ఈ పరీక్షలో విజయం సాధ్యమవుతుందనే అభిప్రాయం సహజం. కాని జేఈఈ మెయిన్‌లో టాప్ ర్యాంకు కోసం పుస్తకాల పురుగులు కావాల్సిన అవసరం లేదని.. కళ్లు కాయలు కాసేలా చదవాల్సిన పని కూడా లేదని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. హై స్కూల్ స్థాయి నుంచే ఆసక్తితో, ఇష్టంతో, కాన్సెప్టులపై పూర్తి అవగాహన పెంచుకుంటూ చదివితే.. ఇంటర్మీడియెట్ అర్హతతో రాసే జేఈఈ మెయిన్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చనేది సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్న మాట!!

ఆ మూడు సబ్జెక్టులపై దృష్టి..
వాస్తవానికి జేఈఈ మెయిన్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించిన నిర్దేశిత సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు అంటే.. 360 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో అడిగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుంచే అభ్యసిస్తుంటారు. ముఖ్యంగా తొమ్మిది, పదోతరగతుల్లో ఈ మూడు సబ్జెక్టుల సిలబస్‌లో భాగంగా చదివే పాఠ్యాంశాలు.. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలోనూ కొనసాగుతాయి. కాకపోతే కొంత లోతుగా, విస్తృతంగా ఉంటాయి. అందుకే విద్యార్థులు స్కూల్ స్థాయిలోనే.. ఆయా కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్‌లో జేఈఈ మెయిన్‌ను ఆడుతూపాడుతూ కొట్టేయొచ్చు అంటున్నారు నిపుణులు.

14 గంటలు చదవాల్సిందేనా!
గత విజేతల్లో చాలామంది విద్యార్థులు తాము రోజుకు 14 గంటలు చదివామని చెబుతుంటారు. ఈ మాటలు విని.. మిగతా విద్యార్థులు కూడా గంటల కొద్దీ చదివే ప్రయత్నం చేస్తూ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ క్రమంలో మానసిక ఆందోళనకు గురవుతూ.. ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటున్న పరిస్థితి. కానీ.. ‘హైస్కూల్ స్థాయి నుంచి ముఖ్యంగా తొమ్మిదో తరగతి నుంచే పక్కా ప్రణాళికతో చదివితే ఇంటర్మీడియెట్ పూర్తయ్యే సమయానికి జేఈఈ-మెయిన్‌లో విజయానికి అవసరమైన మెళ కువలు ఇట్టే అలవడతాయి. అంతేకాకుండా విద్యార్థులు మానసిక ఒత్తిడికి కూడా దూరంగా ఉండొచ్చు’ అని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో ఉన్న పరిమిత సీట్లు అపరిమిత పోటీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు విపరీతంగా చదవాలని భావిస్తుంటారు. అయితే హై స్కూల్ స్థాయి నుంచే బేసిక్స్, కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అలవాటుగా మార్చుకుంటే.. తేలిగ్గానే సక్సెస్ సొంతం చేసుకోవచ్చు.

బేసిక్స్‌లో బెస్ట్‌గా ఉంటే:
జేఈఈ-మెయిన్/జేఈఈ-అడ్వాన్స్‌డ్ రాయాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు తొమ్మిది, పదో తరగతుల నుంచే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. కాబట్టి జేఈఈ మెయిన్ సిలబస్, అందుకు చదవాల్సిన పుస్తకాల గురించిన సమాచారం తేలిగ్గానే సేకరించుకోవచ్చు. రోజుకు కనీసం రెండు గంటలు ఇందుకోసం కేటాయిస్తూ... మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి తమ తరగతుల్లోని సిలబస్‌ను, జేఈఈ మెయిన్ సిలబస్‌లో ఉన్న టాపిక్స్‌ను అనుసంధానించుకుంటూ అవగాహన పెంచుకోవాలి. ఆ విధంగా జేఈఈ మెయిన్‌లో అడిగే.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లకు సంబంధించిన టాపిక్స్‌లో బేసిక్స్‌పై పట్టు సాధించేందుకు స్కూల్ స్థాయి నుంచే మార్గం వేసుకోవచ్చు. బేసిక్స్‌లో పట్టు సాధించిన విద్యార్థులు.. భవిష్యత్తులో జేఈఈ-మెయిన్/ అడ్వా న్స్‌డ్ అనే కాదు.. ఎలాంటి పోటీ పరీక్ష అయినా.. సులువుగా విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

నిజ జీవిత సంఘటనలతో..
విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులపై హైస్కూల్ స్థాయిలోనే బేసిక్స్‌లో పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం.. ఆయా టాపిక్స్‌ను నిజ జీవిత సంఘటనలతో పోల్చుకుంటూ చదవడం! ఉదాహరణకు.. ఫిజిక్స్‌లో ధ్వని, విద్యుత్ వంటి అంశాలు మన నిత్య జీవితంలో కనిపించేవే. వీటిని యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానంలో అభ్యసిస్తే ఎక్కువ కష్టపడకుండానే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇదే తరహాలో మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలనూ చదివే వీలుంది. ఇలా చేయడం వల్ల ఆయా అం శాలను గుర్తుపెట్టుకునేందుకు బట్టీపట్టాల్సిన శ్రమ ఉండదు. అంతేకాకుండా పూర్తి అవగాహనతో, కాన్సెప్ట్యువల్ క్లారిటీతో నేర్చుకున్న అంశాలు శాశ్వతంగా గుర్తుండి పోతాయి. భవిష్యత్‌లో సదరు టాపిక్స్ సంబంధించి ఎగ్జామినర్ ఎలాంటి ప్రశ్నను అడిగినా.. అప్లికేషన్ అప్రోచ్ ద్వారా సమాధానం సాధించే సామర్థ్యం విద్యార్థి సొంతమవుతుంది.

టాపిక్స్ కొనసాగింపు.. కలిసొచ్చేలా
జేఈఈ-మెయిన్ అడిగే మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించిన అంశాలు.. స్కూల్ స్థాయిలో ఒక తరగతి నుంచి మరో తరగతికి కొనసాగింపుగా ఉండటం విద్యార్థులకు ఎంతో కొలిసొచ్చే విషయమని చెప్పొచ్చు. ఉదాహరణకు కెమిస్ట్రీలో మూలకాలు- ధర్మాలు అనే టాపిక్... హైస్కూల్ స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదవాల్సి ఉంటుంది. ప్రారంభంలోనే అంటే స్కూల్ స్థాయిలో ఈ టాపిక్స్‌కు సంబంధించిన బేసిక్స్, కాన్సెప్ట్‌లపై అప్లికేషన్ అప్రోచ్‌తో అభ్యసనం సాగిస్తే.. ఇంటర్మీడియెట్‌కు వచ్చే సమయానికి సదరు టాపిక్‌పై పూర్తి స్థాయి పట్టు లభించడం ఖాయం. జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్‌లకు సంబంధించి సిలబస్‌లను పరిశీలిస్తే.. ఇంటర్ రిలేటెడ్ అప్రోచ్ ఉన్న టాపిక్స్ ఎన్నో కనిపిస్తాయి. అంటే.. ఒక చాప్టర్‌లో పేర్కొన్న అంశాలు, బోధించిన పాఠాలకు కొనసాగింపు మరో చాప్టర్‌లో ఉండటం. ఇలాంటి టాపిక్స్‌ను మిస్ కాకుండా అభ్యసనం సాగిస్తే ఎంతో మేలు జరుగుతుంది.

లక్ష్యంపై స్పష్టత :
విద్యార్థులకు హైస్కూల్ స్థాయిలోనే తమ లక్ష్యంపై స్పష్టత ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్ తర్వాత ఐఐటీలో చేరాలి లేదా ఎన్‌ఐటీలో చేరాలి అని ైెహ స్కూల్ స్థాయిలోనే గట్టిగా నిర్ణయించుకొని.. అందుకు అనుగుణంగా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకుసాగడం వల్ల విజయావకాశాలు మెరుగవుతాయి. అలాకాకుండా పదోతరగతి పూర్తయ్యే వరకూ లక్ష్యంపై ఎలాంటి స్పష్టత లేకుండా.. ఒక్కసారిగా ఇంటర్‌లో చేరగానే జేఈఈ మెయిన్‌కు ప్రిపరేషన్ ప్రారంభించడం వల్ల అటు ఇంటర్, ఇటు జేఈఈ మెయిన్ సిలబస్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ఇంటర్‌లో చేరిన విద్యార్థులు గంటల కొద్దీ చదువుతూ మానసిక ఆందోళనకు గురవుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. విద్యార్థులు స్కూల్ స్థాయి నుంచి చక్కటి క్రమశిక్షణతో రోజూ కొంత సమయం జేఈఈ మెయిన్ కోసం కేటాయిస్తూ.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ చదివితే ఎంతో మేలు కలుగుతుంది.

ఒలింపియాడ్స్ :
హైస్కూల్ స్థాయి నుంచే జేఈఈ మెయిన్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు.. ఒలింపియాడ్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్ వంటివి రాయడం మంచిది. వీటివల్ల విద్యార్థులకు రియల్ టైం నాలెడ్జ్ సొంతమవుతుంది. పోటీ పరీక్షల తీరుతెన్నులు తెలిసొస్తాయి. విద్యార్థులకు తమ శక్తి సామర్థ్యాలపై, సబ్జెక్టు నైపుణ్యాలపై అవగాహన పెరుగుతుంది. తద్వారా ఎలాంటి పోటీ పరీక్షలోనైనా విజయం సాధించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

తల్లిదండ్రుల పాత్ర కీలకం..
జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షలకు విద్యార్థులు పోటీ పడే విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. తమ పిల్లల్లోని వాస్తన పరిజ్ఞానాన్ని అంచనా వేసి.. దానిపై స్పష్టత లభించాకే ఇలాంటి పెద్ద లక్ష్యాల వైపు దృష్టిసారించేలా చూడాలని సూచిస్తున్నారు. అలాకాకుండా విద్యార్థులకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగా తల్లిదండ్రులే లక్ష్యాలు నిర్దేశిస్తే.. హైస్కూల్ నుంచి చదివినా.. ఇంటర్‌లో చదివినా.. ఫలితం అంతంతమాత్రమే అంటున్నారు.

జేఈఈ మెయిన్ -2020 విజయం సాధించాలంటే...
 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో తొలిసారి జేఈఈ-మెయిన్ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరగనుంది. ఇందులో విజయానికి మార్గాలు... ఇవిగో...

సిలబస్ అంశాలు బేరీజు వేసుకుంటూ..
ప్రస్తుత సమయంలో ఎన్‌టీఏ- జేఈఈ మెయిన్-2020 అభ్యర్థులు ముందుగా ఈ పరీక్షకు పేర్కొన్న సిలబస్‌లోని అంశాలను.. ఇంటర్మీడి యెట్ బోర్డ్ సిలబస్ టాపిక్స్‌తో బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. జేఈఈ -మెయి న్‌లో.. ఇంటర్ రెండేళ్ల సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి కేవలం ద్వితీయ సంవత్సరం అంశాలను చదవడానికే పరిమితం కాకుండా.. మొదటి సంవత్సరం టాపిక్స్‌పైనా దృష్టిపెట్టాలి. ప్రతిరోజు కనీసం ఒక గంటసేపు మొదటి సంవత్సరం అంశాలకు సమయం కేటాయించాలి. డిసెంబర్ చివరి నాటికి జేఈఈ- మెయిన్ ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.

వెయిటేజీ.. గత ప్రశ్న పత్రాలు :
జేఈఈ-మెయిన్ పరీక్షలో విజయం దిశగా విద్యార్థులు ఆయా అంశాలకు పరీక్షలో లభిస్తున్న వెయిటేజీని పరిశీలించాలి. ఇందుకోసం గత ప్రశ్న పత్రాలను విశ్లేషించడం లాభిస్తుంది. తొలిసారి ఎన్‌టీఏ ఆధ్వర్యంలో పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో ప్రశ్నల వెయిటేజీ గురించి కచ్చితంగా అంచనా వేయడం కొంత కష్టమేనని నిపుణులు అంటున్నారు.

సబ్జెక్ట్‌ల వారీగా... ప్రిపరేషన్ ఇలా
మ్యాథమెటిక్స్:
మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అన్ని టాపిక్స్‌కు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా 3-డి జామెట్రీ; కోఆర్డినేట్ జామెట్రీ; వెక్టార్ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్; కాంప్లెక్స్ నెంబర్స్; పారా బోలా; ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వే షన్స్; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ అంశాలపై పట్టు సాధించేలా ప్రిపరేషన్ సాగించాలి.

ఫిజిక్స్: ఫిజిక్స్‌లో కైనమాటిక్స్, గ్రావిటేషన్, హీట్ అండ్ థర్మో డైనమిక్స్, వేవ్స్ అండ్ సౌండ్స్, మ్యాగ్నటిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్, ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. న్యూమరికల్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించడం అవసరం. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో.. అంచెల వారీగా సాధన చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

కెమిస్ట్రీ: కెమిస్ట్రీలో అభ్యర్థులు కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలుగా ఉంటాయి. దీనికి అనుగుణంగా అభ్యర్థులు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి.

ప్రిపరేషన్ టిప్స్..
  • కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్ సాగించాలి.
  • అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో విజయావకాశాలు మెరుగు.
  • ఆన్‌లైన్ టెస్టింగ్ విధానంపై ముందుగానే అవగాహన ఏర్పరచుకోవాలి.
  • రీడింగ్‌తోపాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
  • రివిజన్‌కు రోజూ కనీసం అరగంట సమయం కేటాయించాలి.

నిపుణుల మాట..!
వీలైనంత ముందుగా నిర్ణయం తీసుకోవాలి...
జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ విద్యార్థులు ముందుగా తమ లక్ష్యంపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని నైపుణ్యాల ఆధారంగా ఇలాంటి పరీక్షల దిశగా నడిపించాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.
- అజయ్ ఆంటోనీ, కోర్స్ డెరైక్టర్ (జేఈఈ)-టైమ్ ఇన్‌స్టిట్యూట్.

ఆసక్తే విజయానికి పునాది :
జేఈఈ-మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో విజయానికి.. ఆసక్తి చాలా ముఖ్యం. విద్యార్థులు ఆయా సబ్జెక్టుల పట్ల హైస్కూల్ స్థాయి నుంచే ఇష్టాన్ని పెంపొందించుకుంటే విజయం సాధించొచ్చు. విద్యార్థులు ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్‌ను అలవర్చుకోవాలి.
- ఆర్.కేదారేశ్వర్, విజన్ 40 ఐఐటీ అకాడమీ

టాపర్స్ టిప్స్...
కాన్సెప్ట్స్ కీలకం:
జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించా లంటే.. కాన్సెప్ట్‌లపై అవగాహన తప్పనిసరి. అప్పుడే పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడిగినా స మాధానం గుర్తించడం సాధ్యమవుతుంది. నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకుని దానికి అను గుణంగా చదివితే.. విజయావకాశాలు మెరుగవుతాయి.
-వి.మోహన్ అభ్యాస్, జేఈఈ-మెయిన్(2017) ఆరో ర్యాంకు

ప్రాక్టీస్ ప్రధానం:
జేఈఈలో సక్సెస్ కావాలంటే ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకోసం.. గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది. అంతేకా కుండా ఎప్పటికప్పుడు ఈ ఫలితాలను విశ్లేషించుకుని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ తీరులో మార్పు చేసుకుంటే మెరుగైన ఫలితం లభిస్తుంది.
- భోగి.సూరజ్ కృష్ణ, జేఈఈ-మెయిన్(2018)- ఫస్ట్ ర్యాంకు
Published date : 17 Oct 2018 06:00PM

Photo Stories