Skip to main content

JEE Main 2024: జేఈఈ మెయిన్‌లో సిలబస్‌ మార్పులు... సన్నద్ధత ఇలా!

JEE Main 2024 Syllabus Changes,  study materials for JEE Main, JEE Main question paper,

జేఈఈ-మెయిన్‌.. దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడే పరీక్ష! ఈ పరీక్షలో స్కోర్‌తో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో.. బీటెక్‌లో ప్రవేశాలు పొందే అవకాశం లభిస్తుంది! మరోవైపు ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు కూడా ఇదే ప్రామాణికం! దీంతో.. విద్యార్థులు జేఈఈ-మెయిన్‌లో బెస్ట్‌ స్కోర్‌ కోసం ఇంటర్‌(ఎంపీసీ) తొలిరోజు నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభిస్తారు! ఇప్పుడు వీరంతా తమ కసరత్తును మరింత ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైంది!! కారణం.. జేఈఈ-మెయిన్‌- 2024 పరీక్ష తేదీలు వెలువడడంతోపాటు దరఖాస్తు ప్రక్రియ సైతం మొదలైంది! ఈ నేపథ్యంలో.. జేఈఈ-మెయిన్‌-2024 సిలబస్‌ మార్పులు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..

  • జేఈఈ-మెయిన్‌-2024లో కీలక మార్పులు
  • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో సిలబస్‌ కుదింపు
  • జనవరి 24-ఫిబ్రవరి 1,2024 వరకు తొలి సెషన్‌
  • 2024 ఏప్రిల్‌ 1-15 వరకు రెండో సెషన్‌ పరీక్ష
  • కాన్సెస్ట్‌ ఆధారిత ప్రిపరేషన్‌తోనే విజయం

జేఈఈ-మెయిన్‌.. జాతీయ స్థాయిలో దాదాపు 12 లక్షల మందికిపైగా పోటీ పడే పరీక్ష. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది వరకూ ఉంటారు. వీరంతా ఇప్పుడు మారిన సిలబస్‌కు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. జేఈఈ మెయిన్‌ సిలబస్‌లో ఎన్‌టీఏ కీలక మార్పులు చేయడమే!

అర్హతలు
ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌/తత్సమాన కోర్సు 2022, 2023లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. 2024లో ఇంటర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

చ‌ద‌వండి: JEE Main 2024 Notification: జేఈఈ(మెయిన్స్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

పరీక్ష విధానం

  • జేఈఈ-మెయిన్‌ను పేపర్‌-1, పేపర్‌-2ఎ, పేపర్‌-2బిలుగా నిర్వహిస్తారు. బీటెక్‌ అభ్యర్థులకు పేపర్‌-1, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులకు పేపర్‌-2ఎ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల అభ్యర్థులకు పేపర్‌-2బి పరీక్ష ఉంటుంది. 
  • పేపర్‌-1(బీటెక్‌/బీఈ) ఇలా: ఈ పేపర్‌ను మొత్తం మూడు సబ్జెక్ట్‌(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలు, సెక్షన్‌ బీలో 10 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌ బీలోని 10 ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు చొప్పున మొత్తం 90 ప్రశ్నలు-300 మార్కులకు పరీక్ష జరుగుతుంది. సెక్షన్‌-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో (ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. ప్రతి పొరపాటు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు.

చ‌ద‌వండి: JEE Main Guidance

సిలబస్‌ కుదింపు
జేఈఈ-మెయిన్‌-2024లో కీలక మార్పు..సిలబస్‌ కుదింపు. పరీక్షలో సబ్జెక్ట్‌లుగా ఉండే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో సిలబస్‌ను తగ్గించారు. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా ఇంటర్మీడియెట్, +2 స్థాయిలో 30 శాతం సిలబస్‌ను కుదించిన సంగతి తెలిసిందే. దీన్ని పరిగణనలోకి తీసుకుని.. జేఈఈ నిర్వాహక సంస్థ ఎన్‌టీఏ సిలబస్‌లో కుదింపు చేసింది. సబ్జెక్ట్‌ వారీగా కొన్ని టాపిక్స్‌ను సిలబస్‌ నుంచి తొలగించింది.
తొలగించిన అంశాలివే

  • కెమిస్ట్రీ నుంచి అత్యధికంగా 12 అంశాలను తగ్గించారు. అదే విధంగా మ్యాథమెటిక్స్‌లో మ్యాథమెటికల్‌ రీజనింగ్‌ను తొలగించారు. ఫిజిక్స్‌లో కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ను పూర్తిగా తొలగించారు. సబ్జెక్టుల వారీగా తొలగించిన అంశాలు.. 
  • ఫిజిక్స్‌: కైనమాటిక్స్, గ్రావిటేషన్, ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సాలిడ్స్‌ అండ్‌ లిక్విడ్స్, ఆసిలేషన్‌ అండ్‌ వేవ్స్, థర్మోడైనమిక్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిక్‌ ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ కరెంట్‌ అండ్‌ మ్యాగ్నటిజం, ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ ఇండక్షన్‌ అండ్‌ ఆల్టర్నేటింగ్‌ కరెంట్స్, ఆప్టిక్స్, డ్యూయల్‌ నేచర్‌ ఆఫ్‌ మేటర్‌ అండ్‌ రేడియేషన్, ఆటమ్స్‌ అండ్‌ న్యూక్లియే, కమ్యూనికేషన్‌ సిస్టమ్, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌.
  • కెమిస్ట్రీ: బేసిక్‌ కాన్సెస్ట్స్‌లో కొన్ని అంశాలు (ఫిజికల్‌ క్వాంటిటీస్‌ అండ్‌ మెజర్‌మెంట్స్, ప్రెసిషన్, యాక్యురసీ, సిగ్నిఫికెంట్‌ ఫిగర్స్, ఎస్‌.ఐ. యూనిట్స్, డైమెన్షనల్‌ అనాలిసిస్‌), అటామిక్‌ స్ట్రక్చర్, స్టేట్స్‌ ఆఫ్‌ మేటర్, సర్ఫేస్‌ కెమిస్ట్రీ (మొత్తం చాప్టర్‌ తొలగింపు), పి-బ్లాక్‌ ఎలిమెట్స్‌. అదే విధంగా జనరల్‌ ప్రిన్సిపిల్స్‌ అండ్‌ ప్రొసెషన్‌ ఆఫ్‌ ఐసోలేషన్‌ ఆఫ్‌ మెటల్స్, హైడ్రోజన్, ఎస్‌-బ్లాక్‌ ఎలిమెంట్స్, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, పాలిమర్స్, కెమిస్ట్రీ ఇన్‌ డైలీ లైఫ్‌లను పూర్తిగా తొలగించారు.
  • మ్యాథమెటిక్స్‌: ఈ సబ్జెక్ట్‌లో మ్యాథమెటికల్‌ రీజనింగ్, మ్యాథమెటికల్‌ ఇండక్షన్స్, డైమెన్షనల్‌ జామెట్రీలను తొలగించారు. అదే విధంగా సిలబస్‌లోని ఇతర యూనిట్స్‌లోనూ కొన్ని టాపిక్స్‌ను తొలగించారు.

మార్పులకు అనుగుణంగా
సిలబస్‌లో జరిగిన మార్పులకు అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మార్చుకోవాలి. తాజా సిలబస్‌ను పరిశీలించి.. చదవాల్సిన టాపిక్స్‌పై స్పష్టత పెంచుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లు-టాపిక్స్‌కు ఉన్న వెయిటేజీకి అనుగుణంగా ప్రిపరేషన్‌ సమయం కేటాయించుకోవాలి.

అప్లికేషన్‌ ఆధారిత ప్రిపరేషన్‌
విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లకు అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్‌ సాగిస్తే జేఈఈ-మెయిన్‌లో బెస్ట్‌ ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సదరు సబ్జెక్ట్‌ల బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా చదివే సమయంలోనే ముఖ్యమైన ఫార్ములాలు, కీ పాయింట్స్‌ను షార్ట్‌ నోట్స్‌గా రూపొందించుకోవాలి. ఇది ఇంటర్, జేఈఈ -మెయిన్‌ రెండు పరీక్షలకు రివిజన్‌ పరంగా ఎంతో కలిసొస్తుంది.

ప్రాక్టీస్‌తో పర్‌ఫెక్ట్‌గా
విద్యార్థులు ప్రతిరోజు తాము చదివిన సబ్జెక్ట్‌కు సంబంధించి.. ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉన్న అంశాలను ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేయాలి. జేఈఈ-మెయిన్‌ సిలబస్‌లో అధిక శాతం అంశాలు ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం టాపిక్స్‌ నుంచే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయం సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మొదటి సంవత్సరం అంశాలను కూడా అవలోకనం చేసుకోవాలి. మొదటి సంవత్సరం అంశాలను, రెండో సంవత్సరం టాపిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం సాగించాలి. ఫలితంగా సంబంధిత అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన లభించడంతోపాటు ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

న్యూమరికల్‌ ప్రశ్నలకు
జేఈఈ-మెయిన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌.. ఈ మూడు సబ్జెక్ట్‌ల నుంచీ అయిదు ప్రశ్నలు చొప్పున న్యూమరికల్‌ ఆధారిత ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు అప్లికేషన్‌ ఆధారిత ప్రిపరేషన్‌కు, ఆయా సబ్జెక్ట్‌లలో న్యూమరిక్స్‌ ఆధారంగా సమాధానం సాధించాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మాక్‌ టెస్ట్‌లు, ప్రీ-ఫైనల్‌ టెస్ట్‌లు
జేఈఈ-మెయిన్‌ అభ్యర్థులు మాక్‌ టెస్ట్‌లకు హాజరవడం, ఇంటర్‌ ప్రీ-ఫైనల్‌ టెస్ట్‌లు రాయడం, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్‌ సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ వ్యూహాన్ని అనుసరించాలి. జనవరి సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ప్రస్తుతం దాదాపు నెలరోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో వీరు అధిక సమయాన్ని పునశ్చరణకు, వీక్లీ టెస్ట్‌లకు, మాక్‌ టెస్ట్‌లకు కేటాయించాలి. ఫలితంగా ఇంటర్‌ పరీక్షలతోపాటు, జేఈఈ-మెయిన్‌లోనూ మెరుగైన ప్రతిభ కనబర్చే అవకాశం లభిస్తుంది.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌
ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివే విధంగా ప్లాన్‌ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కు కనీసం రెండు గంటల సమయం కేటాయించేలా చూసుకోవాలి. తమకు బాగా సులభమైన సబ్జెక్ట్‌కు కొంత తక్కువ స­మయం కేటాయించి.. క్లిష్టంగా భావించే సబ్జెక్ట్‌లకు కొంత ఎక్కువ సమయం కేటాయించడం మేలు. ఇలా పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే మెరుగైన స్కోర్‌ సాధించేందుకు అవకాశం ఉంటుంది.

చ‌ద‌వండి: NTA: జేఈఈ మెయిన్‌లో 100 స్కోర్‌ పాయింట్లు సాధించిన 20 మందీ వీరే ..

సబ్జెక్ట్‌ల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు
మ్యాథమెటిక్స్‌
ఈ సబ్జెక్ట్‌లో రెండేళ్ల సిలబస్‌కు సంబంధించి ప్రతి చాప్టర్‌ను అధ్యయనం చేయాలి. ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు.. కో ఆర్డినేట్‌ జామెట్రీ; వెక్టార్‌ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌; కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్‌. వీటితోపాటు క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌; పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్, బైనామియల్‌ థీరమ్, లోకస్‌ అంశాలను కనీసం ఒక్కసారైనా పూర్తిచేయాలి.

ఫిజిక్స్‌
ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెంటర్‌ ఆఫ్‌ మాస్, మొమెంటమ్‌ అండ్‌ కొలిజన్‌; సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌పై అవగాహన పెంచుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ఆయా అంశాల ప్రాథమిక భావనలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి.

కెమిస్ట్రీ
కెమికల్‌ బాండింగ్, పిరియాడిక్‌ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలపై పట్టు సాధించాలి. మోల్‌ కాన్సెప్ట్, కో ఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • జనవరి సెషన్‌ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్‌ 30, 2023.
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు నుంచి;
  • జనవరి సెషన్‌ పరీక్ష తేదీలు: 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు;
  • ఫలితాల వెల్లడి: 2024, ఫిబ్రవరి 12.
  • రెండో సెషన్‌ దరఖాస్తు తేదీలు: 2024, ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 వరకు;
  • రెండో సెషన్‌ పరీక్ష తేదీలు: 2024, ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు;
  • రెండో సెషన్‌ ఫలితాల వెల్లడి: 2024, ఏప్రిల్‌ 25
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jeemain.nta.ac.in/
Published date : 17 Nov 2023 09:40AM

Photo Stories