Skip to main content

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానం.. సబ్జెక్ట్‌ వారీగా ముఖ్యమైన టాపిక్స్‌..

జేఈఈ-మెయిన్‌.. ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! దీంతోపాటు ఐఐటీల్లో అడ్మిషన్స్‌ కోసం జరిపే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్ష కూడా ఇదే!! ఇంతటి కీలకమైన పరీక్ష కోసం విద్యార్థులు ఇంటర్‌ ఎంపీసీలో చేరిన మొదటి రోజునుంచే అహర్నిశలు కృషి చేస్తారనేది నిస్సందేహం! వచ్చే ఏడాది జనవరి 24 నుంచి తొలి సెషన్‌ను, ఏప్రిల్‌ 1 నుంచి రెండో సెషన్‌ను నిర్వహిస్తామని ఎన్‌టీఏ(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. జేఈఈ మెయిన్‌ పరీక్ష విధానం, ఇందులో విజయం సాధించేందుకు మార్గాలు..
JEE Main Exam Pattern, jee main 2024 exam date and subjects and preparation tips,JEE Main Preparation Tips
  • జేఈఈ-మెయిన్‌-2024 తేదీలు ఖరారు
  • జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు తొలి సెషన్‌
  • ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు రెండో సెషన్‌ పరీక్షలు
  • తెలుగు రాష్ట్రాల నుంచి లక్షకు పైగా విద్యార్థుల హాజరు

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌.. మెయిన్‌.. సంక్షిప్తంగా జేఈఈ-మెయిన్‌. దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఇది. ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. ఈ ఏడాది ఎన్‌టీఏ ముందుగానే పరీక్ష తేదీలను ప్రకటించింది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. జేఈఈ-మెయిన్‌లో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

చ‌ద‌వండి: Previous Papers (JEE Main)

పది లక్షలకు పైగా పోటీ
జేఈఈ-మెయిన్‌ పరీక్షకు జాతీయ స్థాయిలో ఏటా పది లక్షల మందికిపైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ రెండు సెషన్లలో కలిపి 11,13,325 మంది పరీక్షకు హాజరయ్యా­రు. జనవరి సెషన్‌లో 8,23,967 మంది; ఏప్రిల్‌ సెషన్‌లో 8,83,367మంది పరీక్ష రాసారు. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య 1.10 లక్షల మంది.

2024 తేదీలు ఖరారు
జేఈఈ-మెయిన్‌ 2024 తేదీలను ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి సెషన్‌ను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు; రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అంటే.. తొలి సెషన్‌కు మూడు నెలలు.. రెండో సెషన్‌ ఏడు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి విద్యార్థులు సరైన టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకొని జేఈఈ-మెయిన్‌కు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: JEE Main Syllabus

300 మార్కులకు
బీఈ, బీటెక్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి మొత్తం 300 మార్కులకు జేఈఈ మెయిన్‌(పేపర్‌ 1) పరీక్ష నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్‌ ఏ, సెక్షన్‌ బీ ఉంటాయి. సెక్షన్‌-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో (ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి. ఛాయిస్‌ విధానం కారణంగా సెక్షన్‌-బిలో 10 ప్రశ్నల్లో అయిదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. సెక్షన్‌-ఎలో 0.25 శాతం నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.

బోర్డ్‌+జేఈఈ మెయిన్‌
ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు డిసెంబర్‌ రెండో వారం నాటికి ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ను పూర్తి చేసుకుంటారు. వీరు జేఈఈ-మెయిన్‌ జనవరి సెషన్‌ పరీక్షలో రాణించేలా ఇప్పటి నుంచి ఉమ్మడి అంశాలపై దృష్టిపెట్టాలి. ఇంటర్మీడియెట్, జేఈఈ-మెయిన్‌లో ఉన్న ఉమ్మడి టాపిక్స్‌ పునశ్చరణకు అధిక సమయం కేటాయించాలి. తద్వారా జేఈఈ-మెయిన్‌ జనవరి సెషన్‌లో మంచి ప్రతిభ కనబర్చడానికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్స్, కాన్సెప్ట్స్‌
ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థు­లు జేఈఈ-మెయిన్‌ పరీక్ష ప్రశ్నల తీరుపై అవగాహన పెంచుకోవాలి. ఆ దిశగా ఆయా సబ్జెక్ట్‌లను అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో అ«ధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఆయా సబ్జెక్ట్‌ల బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఇంటర్‌ సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయి పట్టుతోపాటు జేఈఈ-మెయిన్‌లోనూ రాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా చదివేటప్పుడే ముఖ్యమైన ఫార్ములాలు, కీ పాయింట్స్‌ను షార్ట్‌ నోట్స్‌గా రూపొందించుకుంటే.. పరీక్ష సమయంలో రివిజన్‌కు ఎంతో కలిసొస్తుంది.

సిలబస్‌ అనుసంధానం
జేఈఈ-మెయిన్‌ విద్యార్థులు..మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మొదటి సంవత్సరం అంశాలను, రెండో సంవత్సరం అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అభ్యసనం సాగిస్తే.. సంబంధిత అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన లభించడంతోపాటు ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. జేఈఈ-మెయిన్‌ సిలబస్‌లో ఇంటర్మీడియెట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ అంశాలకు సమ ప్రాధాన్యం ఉంటోంది. కాబట్టి రెండు సంవత్సరాల సిలబస్‌పై పట్టు సాధించేలా కృషి చేయాలి.

న్యూమరికల్‌ ప్రశ్నలకు
జేఈఈ-మెయిన్‌ అభ్యర్థులు న్యూమరికల్‌ టైప్‌ కొశ్చన్స్‌ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. జేఈఈ-మెయిన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌..ఈ మూడు సబ్జెక్ట్‌ల నుంచీ అయిదు ప్రశ్నలు చొప్పున న్యూమరికల్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంటర్‌ విద్యార్థులు అప్లికేషన్‌ ఆధారిత ప్రిపరేషన్‌కు, ఆయా సబ్జెక్ట్‌లలో న్యూమరిక్స్‌ ఆధారంగా సమాధానం సాధించాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం
ఇంటర్, జేఈఈ-మెయిన్‌ రెండు పరీక్షలకూ ప్రాక్టీస్‌ చాలా ముఖ్యం. కాబట్టి ప్రతిరోజు తాము చదివిన సబ్జెక్ట్‌కు సంబంధించి..అందులోంచి ప్రశ్నలు అడిగే ఆస్కారమున్న అంశాలను గుర్తించి ప్రాక్టీస్‌ చేయాలి. విద్యార్థులు మెయిన్‌ మాక్‌ టెస్ట్‌లకు, ఇంటర్‌ ప్రీ-ఫైనల్‌ టెస్ట్‌లకు హాజరు కావడం కూడా పరీక్షలో రాణించేందుకు దోహదం చేస్తుంది. జనవరి సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ప్రస్తుతం దాదాపు నెలరోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో వీరు అధిక సమయాన్ని పునశ్చరణకు, వీక్లీ టెస్ట్‌లకు, మాక్‌ టెస్ట్‌లకు కేటాయించాలి.

టైమ్‌ మేనేజ్‌మెంట్‌
ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివే విధంగా సమయం కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు కనీసం రెండు గంట­ల సమయం కేటాయించాలి. తమకు బాగా సులభమైన సబ్జెక్ట్‌కు కొంత తక్కువ సమయం కేటాయించి.. క్లిష్టంగా భావించే సబ్జెక్ట్‌లకు కొంత ఎక్కువ సమయం కేటాయించడం మేలు. క్లిష్టంగా భావించిన సబ్జెక్ట్‌లు,అంశాల విషయంలోనూ కనీసం బే­సి­క్‌ ఫార్ములాలు తెలుసుకోవాలి. అంతకుముందు రోజు చదివిన అంశాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకునే విధంగా కనీసం పది నిమిషాలు కేటాయించాలి.

ఏప్రిల్‌ సెషన్‌కు ఇలా
ఏప్రిల్‌ సెషన్‌పైనే దృష్టి పెట్టిన విద్యార్థులు ఇప్ప­టి నుంచే నిర్దిష్ట వ్యూహంతో ప్రిపరేషన్‌ సాగించడం ద్వారా మంచి మార్కులు సాధించే అవకాశముంది. డిసెంబర్‌లో ఇంటర్‌ సిలబస్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఆ తర్వాత జేఈఈ-మెయిన్‌ పరీక్ష సిలబస్‌కు అనుగుణంగా ఫిబ్రవరి చివరి వారం వరకు ప్రిపరేషన్‌ సాగించాలి. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్‌ సెషన్‌ తేదీకి మధ్య ఉన్న వ్యవధిని పూర్తిగా రివిజన్, మాక్‌ టెస్ట్‌ల ప్రాక్టీస్‌కు కేటాయించాలి.

సబ్జెక్ట్‌ వారీగా ముఖ్యమైన టాపిక్స్‌
మ్యాథమెటిక్స్‌

ఈ సబ్జెక్ట్‌లో రెండు సంవత్సరాల సిలబస్‌కు సంబంధించి ప్రతి చాప్టర్‌ను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. 3-డి జామెట్రీ; కో ఆర్డినేట్‌ జామెట్రీ; వెక్టార్‌ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌; కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్‌. వీటితోపాటు క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌; పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్, బైనామియల్‌ థీరమ్, లోకస్‌ అంశాలను కనీసం ఒక్కసారైనా పూర్తిచేసే విధంగా ప్రిపరేషన్‌ సాగించాలి.

ఫిజిక్స్‌

ఫిజిక్సిలో న్యూమరికల్‌ అప్లికేషన్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సెంటర్‌ ఆఫ్‌ మాస్, మొమెంటమ్‌ అండ్‌ కొలిజన్‌; సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్,వేవ్‌ మోష­న్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌పై అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.

కెమిస్ట్రీ

విద్యార్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్‌ కెమిస్ట్రీ. ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు కెమికల్‌ బాండింగ్, పిరియాడిక్‌ టేబుల్, బ్రేకింగ్‌ల మూలాలపై నైపుణ్యాలను తెలుసుకునే విధంగా ఉంటాయి. కాబట్టి మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి. 

అడ్వాన్స్‌డ్‌కు అర్హతగా

ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు జేఈఈ-మెయిన్‌ నుంచి 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తారు. కాబట్టి జేఈఈ-మెయిన్‌లో మంచి స్కోర్‌ సాధించేలా కృషి చేస్తే.. అడ్వాన్స్‌డ్‌కు అర్హుల జాబితాలో నిలిచే అవకాశం లభిస్తుంది.
 

Published date : 11 Oct 2023 08:50AM

Photo Stories