Arif: ఉద్యోగమని నమ్మించి చేపలు పట్టిస్తున్నారు
ఈ ముఠా ఉచ్చులో చిక్కుకుని గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన ఆరిఫ్ అనే యువకుడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగ వేటలో ఉన్న ఆరిఫ్‌కు గుంటూరు నాజ్ సెంటర్‌కు చెందిన మొహిద్దీన్ పరిచయమయ్యాడు.
వినుకొండలో చేపల అక్వేరియంలో ఉద్యోగం ఉందని.. వారానికి రూ.15 వేలు ఇస్తారని ఆరిఫ్‌ను మొహిద్దీన్ నమ్మించాడు. ఆ ఉద్యోగం కావాలంటే తనకు రూ.10 వేలు ఇవ్వాలన్నాడు. దీంతో ఆరిఫ్ తన బైక్ తాకట్టు పెట్టి రూ.10 వేలు ఇచ్చాడు. గత నెల 23న మొహిద్దీన్ కలిసి వ్యాన్‌లో బయలుదేరగా, గుంటూరులో మరో ఇద్దరిని, నరసరావుపేటలో మరో ముగ్గురిని ఎక్కించిన తర్వాత వ్యాన్‌లో ఖాళీలేదని, తాను వెనుక వస్తానని మొహిద్దీన్ మధ్యలో దిగిపోయాడు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
రాత్రి నంద్యాల జిల్లా కొత్తపల్లి అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ కృష్ణా నదిలో పడవ ఎక్కించి సంగమేశ్వర వద్ద దింపారు. ఇక్కడకెందుకు తీసుకొచ్చారని అడగ్గా.. ఇక్కడ చేపలు పట్టాలని చెప్పి ఆరిఫ్ వద్ద ముఠా సభ్యులు ఫోన్ లాగేసుకున్నారు.
ఎవరైనా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే ముఠా సభ్యులు చితకబాదుతుండటంతో ఆరిఫ్ బిక్కుబిక్కుమంటూ గడిపాడు. తన సెల్‌ఫోన్‌ను ఎలాగో దక్కించుకున్న ఆరిఫ్ ఇంకో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రోజంతా కొండల్లో నుంచి నడిచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు.
ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ కట్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై నల్లపాడు పోలీసుల సహాయంతో లొకేషన్ కనుక్కుని అక్కడికి వెళ్లారు. స్థానికులను విచారించగా.. ఇక్కడకు పనుల కోసం వచ్చిన వారిలో చాలామంది గల్లంతయ్యారని చెప్పడంతో ఆందోళన చెందారు.
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే గుంటూరులో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకురావాలన్నారు. దీంతో ఆరిఫ్ కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో మార్కాపురం రాగా.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరిఫ్ ఇంటికి ఫోన్ చేసి కర్నూలు బస్టాండ్‌లో ఉన్నానని చెప్పడంతో వారు మార్కాపురం బస్ ఎక్కి రావాలని సూచించారు. అతను వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మంగళవారం గుంటూరు చేరుకున్నారు.
ముఠా వలలో చిక్కి పదుల సంఖ్యలో యువకులు అక్కడ ఉన్నారని, పోలీసులు వారిని కాపాడాలని ఆరిఫ్ ‘సాక్షి’కి తెలిపాడు.