Indian Airforce Notification 2024: అగ్నివీర్‌లకు ఆహ్వానం.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం ఇదే..
- అగ్నివీర్ వాయు 1/2025 నోటిఫికేషన్ విడుదల
- పైలట్స్, కమిషన్డ్ ఆఫీసర్స్, నేవిగేటర్స్, ఎయిర్‌మెన్ కొలువులు
- అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా నియామకాలు
- మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గత రెండేళ్లుగా అగ్నివీర్-వాయు పేరిట నియామకాలను చేపడుతోంది. తాజా నోటిఫికేషన్(అగ్నివీర్ వాయు 1/2025) ద్వారా కమిషన్డ్ ఆఫీసర్, పైలట్స్, నేవిగేటర్స్, ఎయిర్‌మెన్ పోస్టులను భర్తీ చేయనుంది.
అర్హతలు
- ఆయా పోస్ట్‌లను అనుసరించి ఎంపీసీ, ఇతర గ్రూప్‌లతో ఇంటర్మీడియెట్/నిర్దేశిత బ్రాంచ్‌లతో డిప్లొమా/ఒకేషనల్ ఇంటర్మీడియెట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
- సైన్స్ సబ్జెక్ట్స్‌కు అర్హతలు: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఎంపీసీ) ఉత్తీర్ణత లేదా మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్ /ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్‌లతో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి(లేదా)మ్యాథ్స్,ఫిజిక్స్‌లు సబ్జెక్ట్‌లుగా రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల ఉత్తీర్ణత ఉండాలి.
- సైన్సేతర సబ్జెక్ట్స్‌కు అర్హతలు: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (జనరల్, ఒకేషనల్) ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: 17 1/2- 21 ఏళ్ల మధ్య ఉండాలి (అభ్యర్థులు జనవరి 2, 2004 - జూలై 2, 2007 మధ్యలో జన్మించి ఉండాలి).
మూడు దశల ఎంపిక ప్రక్రియ
అగ్నివీర్ వాయు నియామకాలకు మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆయా పోస్ట్‌లకు అనుగుణంగా.. సైన్స్, సైన్సేతర సబ్జెక్ట్స్, సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ సైన్సేతర సబ్జెక్ట్‌ల పేరిట అర్హతలను, పరీక్ష విధానాన్ని పేర్కొన్నారు. మూడు దశల ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలి దశలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ మూడు సబ్జెక్ట్‌ల అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటుంది.
తొలిదశ పరీక్షలు వేర్వేరుగా
ఆయా పోస్టులకు సరితూగేలా అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు తొలిదశ ఆన్‌లైన్ టెస్ట్‌ను మూడు విధానాల్లో నిర్వహిస్తారు. టెక్నికల్ విభాగాల్లో చేరాలనుకునే వారు సైన్స్ సబ్జెక్ట్స్ పరీక్షకు, నాన్-టెక్నికల్ విభాగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు సైన్సేతర సబ్జెక్ట్ పరీక్షకు, ఈ రెండు విభాగాల్లోనూ చేరాలనుకుని,సంబంధిత అర్హతలున్న వారు సైన్స్, సైన్సేతర సబ్జెక్ట్ పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది.
సైన్స్ సబ్జెక్ట్స్‌కు టెస్ట్ ఇలా
సైన్స్ సబ్జెక్ట్స్‌లో నిర్వహించే పరీక్ష.. 60 నిమిషాల వ్యవధిలో 70 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు; మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
సైన్సేతర సబ్జెక్ట్స్‌కు పరీక్ష
ఈ విభాగానికి సంబంధించిన పరీక్ష 45 నిమిషాల వ్యవధిలో 50 మార్కులకు ఉంటుంది. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు.
సైన్స్, సైన్సేతర సబ్జెక్ట్స్ పరీక్ష
ఈ విభాగం పరీక్ష 85 నిమిషాల వ్యవధిలో 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు; రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు; మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్క్ నిబంధన విధించారు.
రెండో దశ.. పీఎఫ్‌టీ-1
ఎంపిక ప్రక్రియ రెండో దశలో భాగంగా.. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్-1 పేరుతో శారీరక ద్రుఢత్వ పరీక్ష నిర్వహిస్తారు. 1.6 కిలోమీటర్ల దూరాన్ని పురుష అభ్యర్థులు ఏడు నిమిషాల్లో; మహిళా అభ్యర్థులు ఎనిమిది నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది.
మూడో దశ.. పీఎఫ్‌టీ-2
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్-1లో ఉత్తీర్ణత సాధించిన వారికి.. మూడో దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్-2 పేరుతో పలు ఫిజికల్ ఈవెంట్స్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు 10 పుష్-అప్స్(1 నిమిషం); 10 సిట్-అప్స్(1 నిమిషం); 20 స్క్వాట్స్ (1 నిమిషం) చేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు 10 పుష్-అప్స్(1:30 నిమిషాలు వ్యవధి); 15 స్క్వాట్స్ (1 నిమిషం) తీయాల్సి ఉంటుంది.
చివరగా అడాప్టబిలిటీ టెస్ట్
తొలిదశలో ఆన్‌లైన్ టెస్ట్, తర్వాత పీఎఫ్‌టీ-1, 2లలో ప్రతిభ చూపిన వారికి చివరగా అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. అడాప్టబిలిటీ టెస్ట్-1లో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తారు. అడాప్టబిలిటీ టెస్ట్-2లో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది.
చదవండి: Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..
వైద్య పరీక్షలు
అడాప్టబిలిటీ టెస్ట్‌లోనూ విజయం సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. అగ్నివీర్ వాయుగా నియామకం ఖరారు చేస్తారు.
నాలుగేళ్లు విధులు
ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల పాటు విధులు నిర్వర్తించే అవకాశం కల్పిస్తారు. వీరికి మొదటి ఏడాది నెలకు రూ.30 వేలు, రెండో ఏడాది రూ.33 వేలు, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40 వేలు చొప్పున వేతనం లభిస్తుంది. వేతనంలోంచి ప్రతి నెల 30 శాతం చొప్పున అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు జమ చేస్తారు. ఈ 30 శాతానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఇలా నాలుగేళ్లు పూర్తయ్యే సరికి అభ్యర్థుల కార్పస్ ఫండ్‌లో రూ.10.04 లక్షలు జమ అవుతాయి. వేతనంతోపాటు రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్‌లను కూడా అందిస్తారు. దీంతోపాటు నాన్-కంట్రిబ్యూటరీ జీవిత బీమా పేరుతో రూ.48 లక్షల మొత్తానికి బీమా కల్పిస్తారు. అదేవిధంగా విధి నిర్వహణ సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే మరో రూ.44 లక్షల పరిహారం అందిస్తారు.
స్కిల్ సర్టిఫికెట్
నాలుగేళ్లపాటు విధులు పూర్తి చేసుకున్న వారికి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ పేరుతో ధ్రువ పత్రం అందజేస్తారు. ఫలితంగా అభ్యర్థులు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు వీలుంటుంది.
టెక్నికల్, నాన్-టెక్నికల్ విధులు
- అగ్నివీర్-వాయుగా నియమితులైన వారు టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- ఎయిర్‌మెన్‌గా ఎంపికైన వారు ఎయిర్‌మెన్ గ్రూప్-ఎక్స్ పరిధిలో ఎయిర్‌ఫోర్స్‌లోని టెక్నికల్ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. గ్రూప్-వై పరిధిలో నాన్-టెక్నికల్ విభాగాల్లో పనిచేస్తారు.
- నేవిగేటర్‌గా ఎంపికైన వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఫ్లయింగ్ విభాగం, గ్రౌండ్ డ్యూటీ విభాగాల మధ్య సమన్వయం చేస్తూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- పైలట్‌గా నియమితులైన వారు యుద్ధ విమానాలు, వైమానిక దళానికి చెందిన ఇతర ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను నడపాల్సి ఉంటుంది.
- కమిషన్డ్ ఆఫీసర్ హోదాలో నియమితులైన వారికి.. ఫ్లయింగ్ ఆఫీసర్, ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్, గ్రూప్ కెప్టెన్ వంటి హోదాలు లభిస్తాయి.
రాత పరీక్షలో రాణించేలా
- రాత పరీక్షలో రాణించేందుకు అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిన అంశాలు..
- ఇంగ్లిష్: బేసిక్ గ్రామర్ నైపుణ్యాలు పరీక్షించే విభాగం ఇది. ఇందులో ప్రిపొజిషన్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్, ప్యాసివ్ వాయిస్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్, డైరెక్ట్-ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వెర్బ్స్, టెన్సెస్, పంక్చుయేషన్స్, యాంటానిమ్స్, సినానిమ్స్‌లపై పట్టు సాధించాలి.
- సైన్స్: ఇంటర్మీడియెట్ స్థాయిలోని కైనమాటిక్స్, వర్క్, ఎనర్జీ చలన నియమాలు, మెకానిక్స్, హీట్, థర్మో డైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ,మ్యాగ్నటిజం,సెమీ కండక్టర్స్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- మ్యాథమెటిక్స్: క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, సమితులు,ప్రమేయాలు,ట్రిగ్నోమెట్రీ, స్ట్రెయిట్ లైన్స్, పెర్ముటేషన్స్-కాంబినేషన్స్, వెక్టార్స్, స్టాటిస్టిక్స్, 3-డి జామెట్రీ, డిఫరెన్షియేషన్స్, డెరివేటివ్స్, అల్జీబ్రా వంటి ఇంటర్మీడియెట్ స్థాయి గణిత అంశాలపై పట్టు సాధించాలి.
- జనరల్ అవేర్‌నెస్: ఈ విభాగంలో రాణించడానికి కరెంట్ అఫైర్స్‌తోపాటు భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, పోర్ట్‌లు, తీర ప్రాంతాలు, ముఖ్యమైన వ్యక్తులు, సదస్సులు, క్రీడలు-విజేతలు, రక్షణ రంగానికి సంబంధించి తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జనవరి 17 - ఫిబ్రవరి 6, 2024
- ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: మార్చి 17 నుంచి..
- వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in/
చదవండి: Groups Preparation Tips: గ్రూప్స్..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్ కొట్టేలా!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | February 06,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Indian Airforce Notification 2024
- Indian Airforce Recruitment 2024
- Defence Jobs
- Agniveer Jobs
- Indian Airforce Agniveer Vayu
- Agneepath Scheme
- Agniveer Vayu Recruitment 2024
- latest job notification 2024
- central govt jobs 2024
- govt jobs notification 2024
- sakshi education latest job notifications
- Agniveer Vayu 1/2025 Notification
- Agniveer Vayu Exam 2025
- Indian Air Force Recruitment
- Selection Process