1422 Jobs in SBI: పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్..
బ్యాంకింగ్ రంగంలో కొలువు కోరుకునే యువతకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ చక్కటి అవకాశం కల్పిస్తోంది! జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 హోదాలో 1,422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో వీటికి పోటీపడొచ్చు. ఎస్‌బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ గైడెన్స్..
- సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్‌లకు నోటిఫికేషన్
- 1,422 పోస్ట్‌ల భర్తీకి ప్రక్రియ ప్రారంభం
- బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం
ఇటీవల కాలంలో ఎస్‌బీఐ నిత్యం ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ బ్యాంకింగ్ ఉద్యోగార్థులకు ఆశాకిరణంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ, ఐబీపీఎస్ సంస్థల పీఓ, క్లర్క్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.. అదే సన్నద్ధతతో ఈ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్ట్‌లకు కూడా పోటీపడొచ్చు.
- మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 1,422
- ప్రారంభ వేతన శ్రేణి: రూ.36,100-రూ.63,840
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: సెప్టెంబర్ 30, 2022 నాటికి 21-30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
- పని అనుభవం: సెప్టెంబర్ 30 నాటికి ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం రెండేళ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరి. నిబంధనల ప్రకారం డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ అనుభవం పొంది ఉండాలి.
అయిదు సర్కిళ్లు
దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ.. జాతీయ స్థాయిలో మొత్తం 1,422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. 22 పోస్ట్‌లను బ్యాక్‌లాగ్ వేకెన్సీలుగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అయిదు సర్కిళ్లకు వేర్వేరుగా ఈ పోస్ట్‌లను కేటాయించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 175 ఖాళీలు ఉన్నాయి.
చదవండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
రెండంచెల ఎంపిక
ఎస్‌బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియను రెండంచెల విధానంలో నిర్వహించనున్నారు. తొలి దశలో ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఆ తర్వాత స్క్రీనింగ్; చివరి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
4 విభాగాల్లో.. రాత పరీక్ష
తొలిదశలో ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ రాత పరీక్ష నాలుగు విభాగాల్లో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్/ఎకానమీ 30ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ అప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులకు ఉంటాయి. ఇలా మొత్తం 120 ప్రశ్నలు-120 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా జరుగుతుంది. ఆబ్జెక్టివ్ పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కుల విధానం లేదు.
డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా
తొలిదశ రాత పరీక్షలో భాగంగానే ఆబ్జెక్టివ్ టెస్ట్ ముగిసిన తర్వాత ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ విభాగాల్లో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు కేటాయించిన సమయం 30 నిమిషాలు.
స్క్రీనింగ్
తొలిదశ ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థుల దరఖాస్తు, ధ్రువపత్రాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి.. స్క్రీనింగ్‌కు పిలుస్తారు. బ్యాంక్ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల అనుభవం, జాబ్ ప్రొఫైల్ పరిశీలించి.. తుది దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తుంది.
ఇంటర్వ్యూ ఇలా
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా.. ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంపై ఉన్న ఆసక్తి, సమకాలీన అంశాలపై అవగాహన, బ్యాంకింగ్ రంగ పరిణామాలపై పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ఇంటర్వ్యూ కొనసాగుతుంది.
75:25 వెయిటేజీ విధానం
ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తారు. రాత పరీక్షలో ప్రతిభకు 75 శాతం, ఇంటర్వ్యూలో పొందిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంటే..170 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో పొందిన మార్కులను 75 శాతానికి; 50 మార్కులకు జరిగే ఇంటర్వ్యూలో పొందిన మార్కులను 25 శాతానికి మదింపు చేస్తారు.
లాంగ్వేజ్ టెస్ట్
- సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీ క్రమంలో సంబంధిత రాష్ట్ర అధికారిక భాషపై లాంగ్వేజ్ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. రాత పరీక్ష,ఇంటర్వ్యూల్లో విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే నియామకం ఖరారు చేస్తారు.
- పదో తరగతి, 12వ తరగతిని సంబంధిత రాష్ట్రానికి చెందిన మాతృ భాషలో చదివిన వారికి ఈ రాత పరీక్ష నుంచి మినహాయింపు కల్పిస్తారు.
ప్రణాళికాబద్ద ప్రిపరేషన్
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఇంగ్లిష్‌లో బేసిక్ గ్రామర్‌తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
జనరల్ అవేర్‌నెస్/ఎకానమీ
తాజా ఆర్థిక, వాణిజ్య, వాపార పరిణామాలు, విధానాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల(ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎకానమీకి సంబంధించి జీడీపీ మూల భావనలు, సమ్మిళిత వృద్ధి, మైక్రో, మాక్రో ఎకనామిక్స్ భావనలు తెలుసుకోవాలి.
బ్యాంకింగ్ నాలెడ్జ్
బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలి.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్
కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. అదే విధంగా కంప్యూటర్ పదజాలం, బ్యాంకింగ్ రంగంలో వినియోగించే సాఫ్ట్‌వేర్‌ల గురించి తెలుసుకోవాలి.
డిస్క్రిప్టివ్ టెస్ట్
ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో ఉండే లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్‌లో రాణించడానికి బిజినెస్ లెటర్స్, అఫిషియల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్‌ను రాయడం అలవర్చుకోవాలి. వీటి విషయంలో పంక్చుయేషన్స్ కూడా ఎంతో ముఖ్యం. ఎస్సే రైటింగ్‌కు సంబంధించి బ్యాంకింగ్ రంగ పరిణామాలకు ప్రాధాన్యమిస్తూ వ్యాసాలు రాయగలిగే నేర్పు సాధించాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దిన పత్రికల్లో ప్రచురించే బిజినెస్ న్యూస్, అనాలిసిస్‌లను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది. వాటిని విశ్లేషించి సారాంశాన్ని గ్రహించి ఎస్సే రాయగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
ప్రాక్టీస్‌తో సక్సెస్
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. పాత ప్రశ్న పత్రాల సాధన, మోడల్ ప్రశ్న పత్రాల సాధనకు సమయం కేటాయించాలి. ప్రతి రోజు కనీసం 8 నుంచి పది గంటలు ప్రిపరేషన్ సాగించాలి.
జేఎంజేఎస్-1 హోదా
సీబీఓ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి ముందుగా ఆరు నెలల ప్రొబేషన్ ఉంటుంది. ఈ సమయంలో సంతృప్తిగా విధులు నిర్వర్తించిన వారికి శాశ్వత నియామకం ఖరారు చేస్తారు. వీరికి జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1 హోదా కల్పిస్తారు. రూ.36 వేల మూల వేతనంతో కెరీర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఆయా సర్కిళ్ల పరిధిలోని రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 7,2022
- ఆన్‌లైన్ టెస్ట్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: నవంబర్ చివరి వారం లేదా/డిసెంబర్ మొదటి వారం
- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 4, 2022
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
- వెబ్‌సైట్: https://bank.sbi/careers
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | November 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |