Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 9th కరెంట్ అఫైర్స్
Taiwan Vs China : చల్లారని ఉద్రిక్తత
తైవాన్ చుట్టూతా సముద్ర జలాల్లో సైనిక విన్యాసాలు కొనసాగిస్తూ ద్వీప ఆక్రమణ భయాలను పెంచేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7న ముగియాల్సిన సైనిక యుద్ధ క్రీడలను ఇంకా కొనసాగిస్తోంది. తైవాన్ జలసంధి వెంట లైవ్ ఫైర్ డ్రిల్స్ పేరిట చైనా నావిక, వాయు సేన దళాలు సంయుక్త విన్యాసాలు కొనసాగిస్తున్నాయని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. గత ఐదు రోజులుగా వేర్వేరు సామర్థ్యాలున్న క్షిపణులను చైనా ప్రయోగించింది. యుద్ధ విమానాలు, డ్రోన్లను తీరం వెంట, గగనతలంలో చక్కర్లు కొట్టించింది. తైవాన్ స్పందనను చైనా విశ్లేషిస్తోందని జిన్‌హువా వార్తా సంస్థ తెలిపింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 8th కరెంట్ అఫైర్స్
Rajya Sabha Chairman : వెంకయ్యకి ఘనంగా వీడ్కోలు
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.... పార్లమెంట్ ఎగువ సభ గౌరవాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చేందుకు చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న సమయంలో.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని స్వతంత్ర భారతంలో జన్మించినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని చెప్పారు.
Also read: Quiz of The Day (August 09, 2022): సముద్రం లోతును ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతకు, మహిళలకు, సమాజంలోని పీడిత తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని మోదీ ప్రశంసించారు. మాటల మాంత్రికుడిగా వెంకయ్య ప్రయోగించే చమత్కార పదజాలం, ఏకవాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్య ప్రయోగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని అన్నారు. వెంకయ్య మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం దక్కడం తనకు గర్వకారణమని తెలిపారు. పార్టీ, ప్రభుత్వం ఏ బాధ్యతలను అప్పగించినా వాటిని ఎంతో చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తించి, తనలాంటి కార్యకర్తలందరికీ మార్గదర్శకంగా నిలిచారని వెంకయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు.
Also read: Weekly Current Affairs (International) Bitbank: బ్రిక్స్ గ్రూపింగ్‌లో చేరడానికి ఏ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి?
మాతృభాషపై అభిరుచి అభినందనీయం
మాతృభాష పట్ల వెంకయ్య నాయుడి అభిరుచి అభినందనీయం, ఆదర్శనీయమని మోదీ కొనియాడారు. మాట్లాడిన ప్రతి సందర్భంలో మాతృభాషను ప్రోత్సహించడం, కాపాడుకోవాలని పిలుపునివ్వడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. వెంకయ్య హయాంలో రాజ్యసభ పనితీరు ఎంతగానో మెరుగుపడిందని, సభ్యుల హాజరు గణనీయంగా పెరిగిందని, ఎన్నో బిల్లులు విజయవంతంగా ఆమోదం పొందాయని గుర్తుచేశారు. వీడ్కోలు చెప్పేందుకు సభకు ఎంపీలంతా హాజరుకావడం వెంకయ్యపై ఉన్న గౌరవానికి సంకేతమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారతీయ భాషల పట్ల ఆయన చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. ఆయన మాటల్లో లోతైన నిగూఢార్థం ఉంటుందన్నారు. ఉప రాష్ట్రపతిగా యువత సంక్షేమం కోసం కృషి చేశారని, యువశక్తిపై ప్రధానంగా దృష్టి పెట్టారని వెల్లడించారు. తనకు తెలిసినంతవరకూ వెంకయ్య ప్రజా సేవ నుంచి పదవీ విరమణ చేయడం సాధ్యం కాదని మోదీ చెప్పారు. గతంలో పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా విశిష్టమైన సేవలు అందించారని ఉద్ఘాటించారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ గోల్డెన్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించిన భారతీయుడు ఎవరు?
వెంకయ్య భావోద్వేగం
వెంకయ్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారని, ఏడాది వయసులో తల్లిని కోల్పోయారని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక నిమిషం పాటు చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఒత్తిడిలోనూ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని వెంకయ్యను ప్రశంసించారు. సభ గౌరవాన్ని వెంకయ్య పెంచారని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ చెప్పారు.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
ఆత్మకథ రాయండి
వెంకయ్య నాయుడి రాజకీయ జీవితం, అందించిన సేవలు అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రాజ్యసభ ఎంపీలు పేర్కొన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆత్మకథ(ఆటోబయోగ్రఫీ) రాయాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా సభ్యులందరినీ సమానంగా చూశారని, వివక్ష ప్రదర్శించలేదని పలువురు ఎంపీలు కొనియాడారు.
Also read: Weekly Current Affairs (National) Bitbank: దేశంలో పూర్తిగా హైడ్రో మరియు సోలార్ పవర్‌తో నడిచే మొదటి విమానాశ్రయం ఏది?
రాష్ట్రపతి కావాలనుకోలేదు
రాష్ట్రపతి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పదవుల్లో లేకపోయినా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. సోమవారం రాజ్యసభలో తన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. చట్టసభలో అర్థవంతమైన చర్చలు, సంవాదాలు జరగాలని ప్రజలు ఆశిస్తారని గుర్తుచేశారు. అంతేతప్ప ఆందోళనలు, గొడవలు, అంతరాయాలను కోరుకోరని చెప్పారు. సభ గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులంతా కృషి చేయాలని సూచించారు. సభలో ఉన్నప్పుడు మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఉన్నత ప్రమాణాలను అనుసరించాలన్నారు. పదవీ విరమణ తర్వాత ఇంటికే పరిమితం కాబోనని, అన్నిచోట్లా తిరుగుతూ అందరితో భిన్న అంశాలపై మాట్లాడుతూనే ఉంటానని వెంకయ్య స్పష్టం చేశారు. రాజ్యసభపై గొప్ప బాధ్యతలు ఉన్నాయని, ఈ విషయాన్ని సభ్యులంతా సదా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్ చక్కగా పని చేయాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. రాజ్యసభ చైర్మన్‌గా సభ గౌరవాన్ని కాపాడేందుకు శక్తి వంచన లేకుండా ప్రయతి్నంచానని, అందరికీ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానని వెల్లడించారు. బీజేపీకి రాజీనామా చేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు.
Also read: ICRA Ratings హౌసింగ్ ఫైనాన్స్‌లో 10–12 శాతం వృద్ధి
Common wealth games 2022 : భారత్ నాలుగో స్థానంలో
ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్ క్రీడోత్సవం ఆగస్టు 8తో ముగిసింది. మొత్తం 216 మంది క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. 67 స్వర్ణాలు, 57 రజతాలు, 54 కాంస్యాలతో కలిపి 178 పతకాలతో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో నిలిచింది. 176 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో, 92 పతకాలతో కెనెడా మూడో స్థానంలో నిలిచాయి.
Also read: Commonwealth Games 2022 : ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం..
2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి 66 పతకాలు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. అయితే గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో షూటింగ్ క్రీడాంశంలో భారత్ ఏకంగా 16 పతకాలు సొంతం చేసుకుంది. 2022 క్రీడాపోటీల్లో షూటింగ్ క్రీడాంశాన్ని నిర్వహించలేదు. ఫలితంగా భారత్ పతకాల ర్యాంక్‌లో ఒక స్థానం పడిపోయింది. ఒకవేళ షూటింగ్ కూడా బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో ఉండి ఉంటే భారత్ పతకాల సంఖ్యలోనూ, తుది ర్యాంక్‌లోనూ మరింత మెరుగయ్యేది.
Also read: సాకేత్–యూకీ జంటకు Luxembourg టెన్నిస్ టైటిల్
క్రీడాంశం | పతకాలు |
రెజ్లింగ్ | 12 |
వెయిట్‌లిఫ్టింగ్ | 10 |
అథ్లెటిక్స్ | 8 |
బాక్సింగ్ | 7 |
టేబుల్ టెన్నిస్ | 7 |
బ్యాడ్మింటన్ | 6 |
జూడో | 3 |
హాకీ | 2 |
లాన్ బౌల్స్ | 2 |
స్క్వాష్ | 2 |
టి20 క్రికెట్ | 1 |
పారా పవర్‌లిఫ్టింగ్ | 1 |
ఆఖరి రోజు.. 6 పతకాలు
అంచనాలకు అనుగుణంగా మెరిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా అవతరించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్యం... 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో రజతం నెగ్గిన సింధు, ఆగస్టు 8న ముగిసిన బర్మింగ్ హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది. 2014 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది.
Also read: Commonwealth Games 2022 : స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం PV సింధు.. ఇదే తొలి స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి సింధు. గతంలో సైనా నెహ్వాల్ (2010, 2018) రెండుసార్లు పసిడి పతకాలు సాధించింది. కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయ ప్లేయర్‌గా సింధు (3 పతకాలు) నిలిచింది. గతంలో అపర్ణా పోపట్ (1998లో రజతం; 2002లో కాంస్యం), సైనా రెండు పతకాల చొప్పున సాధించారు.
Also read: World Athletics U 20: రూపల్ చౌదరీకి కాంస్యం
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట భారత్‌కు తొలిసారి స్వర్ణ పతకాన్ని అందించింది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో రజతం సాధించిన సాత్విక్–చిరాగ్ జోడీ ఈసారి మాత్రం బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి 21–15, 21–13తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) జట్టును ఓడించారు. ఈ గెలుపుతో కామన్వెల్త్ గేమ్స్ పురుషుల డబుల్స్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్–చిరాగ్ గుర్తింపు పొందింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట స్వర్ణం సాధించాక డబుల్స్‌లో భారత్‌కు లభించిన రెండో స్వర్ణం ఇదే కావడం విశేషం.
Also read: World under - 20 Atheletics భారత రిలే జట్టుకి రజతం
టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత సీనియర్ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత మళ్లీ కామన్వెల్త్ గేమ్స్ పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సాధించాడు. ఫైనల్లో 40 ఏళ్ల శరత్ 11–13, 11–7, 11–2, 11–6, 11–8తో లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్)పై గెలిచాడు. తమిళనాడుకు చెందిన శరత్ కమల్ చివరిసారి 2006 మెల్‌బోర్న్ గేమ్స్‌లో సింగిల్స్‌లో బంగారు పతకం గెలిచాడు. శరత్ కమల్ అన్ని కామన్వెల్త్ క్రీడల్లో కలిపి మొత్తం 13 పతకాలు గెలిచాడు .
Also read: CWG 2022 : మీరాబాయి చానుకి స్వర్ణం
భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ సత్యన్ జ్ఞానశేఖరన్ పురుషుల సింగిల్స్‌లో తొలిసారి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. కాంస్య పతక పోరులో తమిళనాడుకు చెందిన సత్యన్ 11–9, 11–3, 11–5, 8–11, 9–11, 10–12, 11–9తో పాల్ డ్రింక్‌హాల్ (ఇంగ్లండ్)పై విజయం సాధించాడు.
Also read: Hungarian Grand Prix 2022 : విజేత వెర్‌స్టాపెన్
కామన్వెల్త్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు పసిడి కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. మూడోసారి ఫైనల్ ఆడిన టీమిండియా మళ్లీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆ్రస్టేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ 0–7 గోల్స్ తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 2010 ఢిల్లీ గేమ్స్‌లో, 2014 గ్లాస్గో గేమ్స్‌లోనూ ఆసీస్ చేతిలోనే భారత్ ఓడి రజత పతకాలు సాధించింది.
Also read: Chess Olympiad 2022: చెన్నైలో ప్రారంభించిన ప్రధాని మోదీ
కామన్వెల్త్ గేమ్స్‌లో 1998లో తొలిసారి హాకీని ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఇప్పటివరకు పురుషుల విభాగంలో ఆ్రస్టేలియా ఏడుసార్లు విజేతగా నిలిచింది.
Also read: World Athletics Championships: అథ్లెట్ సిడ్నీ మెక్‌లాఫ్లిన్ ప్రపంచ రికార్డు
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ 1998 కౌలాలంపూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ విభాగంలో రజతం, వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత గోపీచంద్ కుమార్తె గాయత్రి బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల డబుల్స్‌లో భాగస్వామి ట్రెసా జాలీతో కలిసి కాంస్య పతకం సాధించింది. తద్వారా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది.
Also read: World Athletics Championships: నోరా జెరుటోకు స్వర్ణం
పాక్.. నదీమ్.. అద్భుతం
కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అద్భుతం చేశాడు. ఫైనల్లో నదీమ్ జావెలిన్‌ను 90.18 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో జావెలిన్‌ను 90 మీటర్లకు పైగా విసిరిన రెండో ఆసియా అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. 2017లో చైనీస్ తైపీ అథ్లెట్ 91.36 మీటర్ల దూరం విసిరాడు. నదీమ్ ప్రదర్శనతో పాక్ 56 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకం గెలిచింది.
Also read: World Athletics: ప్రపంచ అథ్లెటిక్స్ నుంచి రష్యా ఔట్
APలో Aarogyasri ఖైదీలకూ వర్తింపు
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మానవతా దృక్పథంతో ఖైదీలకు సైతం చికిత్స అందించనుంది. ఈ మేరకు ఖైదీలకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ తాజాగా జీవో విడుదల చేసింది. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తొలిసారి ఖైదీలకూ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలందించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు.. ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వీరికి వైద్యం అందించనుంది. 2019 డిసెంబర్‌లో జరిగిన ప్రిజన్ డెవలప్‌మెంట్ బోర్డు సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఖైదీల వైద్య సదుపాయాలపై నివేదిక సమర్పించాలని జైళ్ల శాఖను ఆదేశించారు. దీంతో స్వతహాగా వైద్యుడైన జైళ్ల శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావుతో పాటు అప్పటి గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ కె.రఘు, డీజీ అషాన్‌రెజా ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఆమోదిస్తూ ప్రభుత్వం 2022 జూలై 22న జీవో విడుదల చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు అనారోగ్యం పాలైతే వారు సాధారణ ప్రజల మాదిరిగానే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంబంధిత జబ్బుకు చికిత్స లభించకపోతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. వీరి కోసం ఇప్పటికే ఆరోగ్యశ్రీ సీఈవో నెట్‌వర్క్ ఆస్పత్రులను గుర్తించారు. ఖైదీలు వైద్య సేవలు పొందడానికి ఆధార్/రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. అవి లేని ఇతర రాష్ట్రాల ఖైదీలకు చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ (సీఎంసీవో) కార్డును తాత్కాలికంగా జారీ చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ సరైన వైద్యం అందక మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది.
Also read: All About the World's Tallest Family..
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP