CWG 2022 : మీరాబాయి చానుకి స్వర్ణం
ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు ( జూలై 30 ) వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. మేరీ హనిత్రా (మారిషస్; 172 కేజీలు), హన్ కమిన్‌స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు.
Also read: రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో FLoating Solar Plant
పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్ అనీఖ్ కస్‌దమ్ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది.
Also read: Family Doctor Scheme : నెలలో 26 రోజులు గ్రామాల్లోనే వైద్య సేవలు
పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో మొహమ్మద్ అజ్మల్ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.
Also read: Krishna Projects : గెజిట్ నోటిఫికేషన్ లో సవరణ