Skip to main content

Union Budget: కేంద్ర బడ్జెట్‌ 2024-25.. పూర్తి వివ‌రాలు ఇవే..

2024–25 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
Indian Union Budget 2024-25 Highlights

ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా మూడోసారి నమ్మకముంచిన దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ రూపుదిద్దుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ నానా సవాళ్లతో సతమతం అవుతున్నా భారత్‌ మాత్రం తిరుగులేని వృద్ధిరేటుతో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. 

‘‘ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నట్టు మన దేశంలో ఉన్నది ‘నాలుగే కులాలు’. అవి.. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలు. వారి అభ్యున్నతి కోసం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, మధ్యతరగతిపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాం’’ అని వివరించారు. 4.1 కోట్ల పై చిలుకు యువతీయువకులకు వచ్చే ఐదేళ్లలో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన నిమిత్తం 5 పథకాలతో కూడిన ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ని ప్రకటించారు. 

2047 నాటికి వికసిత భారత్‌ సాకారమే లక్ష్యంగా ‘వ్యవసాయ రంగంలో మరింత ఉత్పాదకత, ఉపాధి–నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి–సామాజిక న్యాయం, నిర్మాణ–సేవా రంగాలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్‌–రీసెర్చ్, సంస్కరణ’ల పేరిట ఎన్డీఏ ప్రభుత్వ ‘తొమ్మిది ప్రాథమ్యాల’కు తెరతీశారు. దీన్ని రానున్న బడ్జెట్లలో మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. 

రైతు నుంచి యువత దాకా.. 
వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్లో పలు చర్యలు చేపట్టినట్టు నిర్మల వెల్లడించారు. ‘‘సాగులో ఉత్పాదకతను పెంచేలా పరిశోధనలకు పెద్దపీట వేయనున్నాం. 32 పంట రకాల్లో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 100కు పైగా వంగడాలను అభవృద్ధి చేస్తాం. కోటిమందికి పైగా రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లిస్తాం. అందుకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తాం. తృణధాన్యాలు, నూనెగింజల అభివృద్ధిలో వీలైనంత త్వరగా స్వయంసమృద్ధి సాధిస్తాం’’ అని వివరించారు. ‘‘సంఘటిత రంగంలో ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టే వారికి తొలి నెల వేతనం కేంద్రమే అందిస్తుంది. 

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు కల్పిస్తాం. కోటి మందికి టాప్‌–500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తాం. ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా రుణాలకు వీలు కల్పిస్తాం. అన్ని రంగాల్లోనూ మహిళలు మరింతగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలు కల్పిస్తాం’’ అని చెప్పారు. ఉద్యోగికీ, యజమానికీ ఇద్దరికీ లాభించేలా పీఎఫ్‌ ప్రోత్సాహకాల వంటి పలు చర్యలను ప్రకటించారు. అధికారికంగానే 6.7 శాతం దాటిన పట్టణ నిరుద్యోగాన్ని ఎంతో కొంత నేలకు దించే ప్రయత్నం బడ్జెట్‌ కేటాయింపుల్లో కనిపించింది. 

భాగస్వాములకు ఇలా.. 
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కోణంలో చూస్తే నితీశ్‌కుమార్‌ పాలనలోని బిహార్‌పై నిర్మలమ్మ ఏకంగా రూ.60,000 కోట్ల మేరకు వరాల జల్లు కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌ వేలు, భారీ విద్యుత్కేంద్రం, రెండు హెరిటేజ్‌ కారిడార్లు, ఎయిర్‌పోర్టుల వంటివెన్నో వీటిలో ఉన్నాయి. ఇవేగాక అవసరమైన మేరకు ఆ రాష్ట్రానికి మరిన్ని అదనపు కేటాయింపులూ ఉంటాయని మంత్రి ప్రకటించారు! అక్కడ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న విషయం తెలిసిందే. రాజధాని అవసరాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక రుణం అందేలా చూస్తామన్నారు. పోలవరం త్వరిత నిర్మాణం, రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలకు గ్రాంటు తదితరాలను ప్రస్తావించారు. 

రాష్ట్రాలతో కలిసి ముందుకు..
నగరాల సమగ్రాభివృద్ధికి రాష్ట్రాల సమన్వయంతో కృషి చేస్తామని నిర్మల పేర్కొన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధి ద్వారా వాటిని గ్రోత్‌ హబ్‌లుగా తీర్చిదిద్దుతామన్నారు. పీఎం ఆవాస్‌ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు కట్టించనున్నారు. మహిళలు, బాలికల ప్రగతి, సంక్షేమానికి ఈసారి ఏకంగా రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు. 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింతగా ప్రోత్సహించేందుకు ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. ‘‘పీఎం సూర్య ఘర్‌ పథకం కింద రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్ల ద్వారా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు అందించే పథకానికి అద్భుతమైన స్పందన వచ్చింది. 14 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని మంత్రి చెప్పారు. ఈ పథకాన్ని మరింతగా ముందుకుతీసుకెళ్తామన్నారు. 

మహిళలకు మంచి కబురు..
సామాన్యునిపై పన్నుల భారాన్ని వీలైంతగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. మహిళలకు చల్లని కబురు వినిపించారు. బంగారం, వెండి, ప్లాటినంతో పాటు మొబైల్స్‌పైనా దిగుమతి సుంకం తగ్గించారు. తద్వారా వాటి ధరలు దిగి రానున్నాయి. పీఎం విశ్వకర్మ, స్వానిధి, స్టాండప్‌ ఇండియా తదితరాలతో చేతి వృత్తుల వారు, స్వయంసహాయక బృందాలు మొదలుకుని ఎస్సీ, ఎస్టీల దాకా అన్ని వర్గాల సంక్షేమానికి భరోసా లభిస్తుందని మంత్రి అన్నారు. ‘పూర్వోదయ’ పథకం తూర్పు భారతదేశ ప్రగతిని పరుగులు పెట్టిస్తుందని చెప్పారు. 

ఈశాన్య రాష్ట్రాలకూ పలు కేటాయింపులు చేశారు. పర్యాటకాభివృద్ధికి పలు చర్యలను ప్రతిపాదించారు. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు ద్వారా స్టార్టప్‌లకు మరింత ఊపునిచ్చేందుకు విత్త మంత్రి ప్రయత్నించారు. విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని 40 నుంచి 35 శాతానికి తగ్గించారు. అన్ని రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిశోధనల కోసం అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫండ్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పట్టణ భూ రికార్డులను పూర్తిగా డిజిటైజ్‌ చేయనున్నట్టు తెలిపారు. ఆదాయపన్ను చట్టం–1961ని సమూలంగా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. 

Union Budget 2024-25

బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాథమ్యాలు
1. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత 
➤ వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్ల కేటాయింపులు 
➤ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 109 రకాల కొత్త వంగడాలు  రైతులకు అందుబాటులోకి 
➤ రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ సాగు బాట పట్టేలా చర్యలు. 
➤ అందుకు దన్నుగా నిలిచేలా 10 వేల బయో ఇన్‌పుట్‌ వనరుల కేంద్రాలు 
➤ రైతులు, వారి భూముల కవరేజీ తదితరాల కోసం మూడేళ్లలో  డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా (డీపీఐ) అభివృద్ధి 

2.ఉపాధి–నైపుణ్యాభివృద్ధి 
➤ ఏ పథకాల్లోనూ లబ్ధిదారులు కాని యువతకు ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా రుణాలు 
➤ ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ 
➤ ఉద్యోగికి, యజమానికి లాభించేలా పీఎఫ్‌ ప్రోత్సాహకాలు తదితరాలు 
➤ ప్రత్యేకించి మహిళల కోసం పలు చర్యలు 
➤ ఐదు పథకాలతో కూడిన సమగ్ర ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ 

3. మానవ వనరుల అభివృద్ధి–సామాజిక న్యాయం 
➤ పలు రాష్ట్రాల్లో పారిశ్రామిక, హెరిటేజ్‌ కారిడార్ల అభివృద్ధి 
➤ 63 వేల గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకం 
➤ మహిళలు, బాలికల అభ్యున్నతి పథకాలకు రూ.3 లక్షల కోట్లు 
➤ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 

4. నిర్మాణ–సేవా రంగాలు
➤ తయారీ రంగంలో ఎంఎస్‌ఎంఈల కోసం రుణ హామీ పథకాలు 
➤ థర్డ్‌ పార్టీ గ్యారంటీ లేకుండా రూ.100 కోట్ల దాకా రుణాలు 
➤ ముద్రా రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు 
➤ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కామర్స్‌ ఎగుమతి హబ్‌లు 

5. పట్టణాభివృద్ధి
➤ 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 నగరాల సమగ్రాభివృద్ధికి రవాణా ఆధారిత ప్రణాళికలు, వ్యూహాలు 
➤ ప్రధాని పట్టణ ఆవాస్‌ యోజన 2.0 కింద కోటి మంది పట్టణ  పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్లు 
➤ ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే ఐదేళ్లలో ఏటా 100 చొప్పున వీధి మార్కెట్లు 

6. ఇంధన భద్రత
➤ ఉపాధి, వృద్ధి తదితరాలతో పాటు పర్యావరణ హితాన్నీ దృష్టిలో పెట్టుకుంటూ సంప్రదాయేతర ఇంధన వనరులకు మరింత ప్రోత్సాహం 
➤ కరెంటు నిల్వ కోసం పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం 
➤ ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యంలో చిన్న, మాడ్యులార్‌  అణు రియాక్టర్ల అభివృద్ధి 

7. మౌలిక సదుపాయాలు 
➤ దీర్ఘకాలిక లక్ష్యంతో రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపులు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలకు రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు 
➤ పీఎంజీఎస్‌వై–4తో 25 వేల గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ 
➤ వరద ప్రభావిత రాష్ట్రాల్లో సమస్య శాశ్వత నివారణే లక్ష్యంగా పలు ప్రాజెక్టులు 
➤ పలు రాష్ట్రాల్లో పర్యాటక తదితర కారిడార్ల అభివృద్ధి 

8. ఇన్నొవేషన్‌ – రీసెర్చ్‌ 
➤ పరిశోధన, నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫండ్‌ 
➤ ప్రైవేట్‌ రంగ సమన్వయంతో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సా హమిచ్చేందుకు రూ.లక్ష కోట్ల ఫైనాన్సింగ్‌ పూల్‌ 
➤ అంతరిక్ష ఆర్థికాన్ని వచ్చే పదేళ్లలో కనీసం ఐదు రెట్లు విస్తరణ.అందుకు ఈ బడ్జెట్లో రూ.1,000 కోట్లు. 

9. భావి తరం సంస్కరణలు
➤ భూములన్నింటికీ ప్రత్యేక ల్యాండ్‌ పార్సిల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్, లేదా భూ ఆధార్‌ 
➤ భూ రిజిస్ట్రీ ఏర్పాటు, రైతుల రిజిస్ట్రీతో లింకేజీ 
➤ జీఎస్‌ఐ మ్యాపింగ్‌తో పట్టణ ప్రాంత భూ రికార్డుల డిజిటైజేషన్‌ 
➤ అన్నిరకాల కార్మిక సేవలూ ఒక్కతాటిపైకి. సంబంధిత  పోర్టళ్లతో ఇ–శ్రామ్‌ పోర్టల్‌ అనుసంధానం

మొత్తం 2024-25 బ‌డ్జెట్: రూ.48,20,512 కోట్లు

రక్షణ రంగం (డిఫెన్స్): రూ.4.56 లక్షల కోట్లు.
గ్రామీణాభివృద్ధి (రూరల్ డెవలప్‌మెంట్): రూ.2,65,808 కోట్లు.
వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.1,51,851 కోట్లు.
హోం వ్యవహారాలు: రూ.1,50,983 కోట్లు.
విద్య: రూ.1,25,638 కోట్లు.
ఐటీ, టెలికాం: రూ.1,16,342 కోట్లు.
ఆరోగ్యం: రూ.89,287 కోట్లు.
ఎనర్జీ: రూ.68,769 కోట్లు.
సాంఘిక సంక్షేమం: రూ.56,501 కోట్లు.
వాణిజ్యం, పరిశ్రమల రంగం: రూ. 47,559 కోట్లు

Budget Details

భూటాన్‌కు అత్యధికం.. మాల్దీవులకు కోత
భారత పొరుగుదేశమైన భూటాన్‌కు ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా రూ.2068 కోట్లను అభివృద్ధి ఎయిడ్‌ కింద కేటాయించింది. అయితే, మాల్దీవులకు మాత్రం గత ఏడాదితో పోలిస్తే నిధుల్లో కోత విధించింది. మాల్దీవులకు గత ఏడాది రూ.770 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది. 

గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా అనుకూలురైన మొహమ్మద్‌ మొయిజ్జు వచ్చాక భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. విదేశాంగ శాఖకు గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.29,121 కోట్లు కేటాయించగా 2024–25 బడ్జెట్‌లో రూ.22,154 కోట్లు కేటాయించారు. భూటాన్‌ తర్వాత నేపాల్‌కు అధికంగా నిధులు (రూ.700 కోట్లు) కేటాయించారు. 

శ్రీలంకకు గత ఏడాది రూ.60 కోట్లు కేటాయించగా, ఈసారి మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. కేంద్ర బడ్జెట్‌లో సాయం కింద అఫ్గానిస్తాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, మయన్మార్‌కు రూ.250 కోట్లు, మారిషస్‌కు రూ.370 కోట్లు, ఆఫ్రికా దేశాలకు రూ.200 కోట్లు కేటాయించారు. లాటిన్‌ అమెరికా, యురేసియా దేశాలకు అభివృద్ధి సాయం కింద రూ.4883 కోట్లు కేటాయించారు.

బడ్జెట్లో కేంద్రం కీలక చర్యలు..
నిరుద్యోగ సమస్యకు ముకుతాడు వేసేందుకు బడ్జెట్లో కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిం చడంపై దృష్టి పెట్టింది. వారికి అదనపు ఉపాధి  కల్పించే సంస్థలకు ప్రోత్సహకాలు ప్రకటించారు. నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్ల పాటు యజమాని వాటా పీఎఫ్‌ చందాను రీయింబర్స్‌ చేయనున్నారు. పని ప్రాంతంలోనే ఉండేందుకు వీలుగా చిరుద్యోగులకు డారి్మటరీల ఏర్పాటునూ ప్రతిపాదించారు. సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరేవారికి తొలి వేతనాన్ని ప్రభుత్వమే ఇస్తుందని విత్త మంత్రి ప్రకటించారు. 
 
వీటన్నింటికి వచ్చే ఐదేళ్లలో ఏకంగా రూ.2 లక్షల కోట్లు వెచ్చించనున్నారు. తద్వారా 4 కోట్ల మంది పై చిలుకు యువతకు ప్రయోజనం చేకూర్చడం, ఆ మేరకు వ్యవసాయ రంగంపై భారం తగ్గించడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దేశీయంగా ఉన్నత విద్యకూ రుణ భరోసా ఇచ్చారు. వేతన జీవులకు నామమాత్రపు ఆదాయ పన్ను ఊరట కల్పిం చారు. దాన్ని కూడా కొత్త పన్ను విధానానికే పరిమితం చేశారు. 

అదే సమయంలో మోదీ సర్కారు ప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు! మోదీ సర్కారు మనుగడకు కీలకమైన నితీశ్‌ సారథ్యంలోని బిహార్‌కు రూ.60 వేల కోట్ల మేరకు వరాలు గుప్పించగా ఏపీకి రూ.15 వేల కోట్ల ‘ప్రపంచ బ్యాంకు’ రుణంతో సరిపెట్టారు.. 

ఇవి ప్రియం.. 
➣ అమ్మోనియం నైట్రేట్, పీవీసీ ఫ్లెక్స్‌ బ్యానర్లు/పీవీసీ ఫ్లెక్స్‌ షీట్లు 
➣ గార్డెన్‌లో  వినియోగించే గొడుగులు 
➣ సోలార్స్‌ గ్లాస్‌ 
➣ దిగుమతి చేసుకునే టెలికం పరికరాలు
➣ ల్యాబొరేటరీ కెమికల్స్,  బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌  

ఇవి చౌక.. 
➣ బంగారం, వెండి, ప్లాటినం,పల్లాడియం, ఓస్మియం, రుతీనియం, ఇరీడియం కాయిన్లు, కాపర్‌. 
➣ క్వార్ట్జ్, లిథియం కార్బోనేట్, లిథియం ఆక్సైడ్, లిథియం హైడ్రాక్సైడ్, నైట్రేట్స్‌ పొటాషియం, ఫెర్రో నికెల్, బ్లిస్టర్‌ కాపర్‌ 
➣ కేన్సర్‌ ఔషధాలు (ట్రస్టుజుమాబ్‌ డెరుక్స్‌టెకాన్, ఓసిమెరి్టనిబ్, డుర్వాలుమాబ్‌) 
➣ మెడికల్‌ ఎక్స్‌రే మెషీన్లలో   వినియోగించే ట్యూబ్‌లు,ఫ్లాట్‌ ప్యానెల్‌ డిటెక్టర్లు 
➣ మొబైల్‌ ఫోన్లు, చార్జర్లు,మొబైల్‌ ఫోన్‌ ప్రింటెడ్‌సర్క్యూట్‌ బోర్డ్‌ అసెంబ్లీ (పీసీబీఏ) 
➣ సోలార్‌ సెల్స్, ప్యానెల్స్‌ ఎక్విప్‌మెంట్‌ 
➣ చేపలు, రొయ్యల మేత 
➣ తోలు ఉత్పత్తులు, పాదరక్షలు 
➣ టెక్స్‌టైల్స్‌  

Oil Companies: ఆయిల్‌ కంపెనీలను నిరాశపరిచిన బడ్జెట్‌!
ఆయిల్‌ కంపెనీలను బడ్జెట్‌ నిరాశపరిచింది. ఇండియన్‌ ఆయిల్, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియంలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రికార్డు లాభాల (దాదాపు రూ.81,000 కోట్లు) కారణంగా గత ఆర్థిక సంవత్సరం ప్రకటించిన రూ.30,000 కోట్ల మూలధన మద్దతును ఆర్థికమంత్రి రద్దు చేశారు.
 
నిజానికి ఈ మద్దతును రూ.15,000 కోట్లకు తగ్గించాలని 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్, తాజా బడ్జెట్‌లో ఈ మద్దతును పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.

Rs.30000 cr capital support to oil cos

వ్యూహాత్మక నిల్వలకు రూ.5,000 కోట్లు 
ఇక సరఫరాల్లో అంతరాయాలను నిరోధించడానికి కర్ణాటకలోని మంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ నిల్వల క్షేత్రాలను నింపడానికి  వీలుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రూ.5,000 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు.  

షేర్లు డీలా.. 
తాజా నిర్ణయం నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఐఓసీ షేర్‌ ధర క్రితం ముగింపుతో పోల్చితే 2 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. బీపీసీఎల్‌ షేర్‌ ధర 1 శాతం తగ్గి రూ.306 వద్ద ముగిసింది. హెచ్‌పీసీఎల్‌ షేరు ధర స్వల్ప నష్టంతో 347 వద్ద స్థిరపడింది.

క్రూజ్‌ పర్యాటకానికి ప్రోత్సాహం
విదేశీ షిప్పింగ్‌ కంపెనీలపై సులభతర పన్ను 
దేశీ క్రూజ్‌ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్‌ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. క్రూజ్‌ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్‌లుగా చెబుతారు. దేశంలో క్రూజ్‌ పర్యాటకానికి భారీ అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.

ఈ విభాగంలో భారత షిప్పింగ్‌ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్‌ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్‌ పర్యాటకానికి భారత్‌ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు. ‘‘క్రూజ్‌ షిప్పింగ్‌ల నిర్వహణలో పాలు పంచుకునే ప్రవాసులకు ఊహాత్మకమైన పన్ను విధానం ప్రతిపాదిస్తున్నాం. విదేశీ కంపెనీ, నాన్‌ రెసిడెంట్‌ షిప్‌ ఆపరేటర్‌ రెండూ ఒకే హోల్డింగ్‌ కంపెనీ కింద ఉంటే లీజ్‌ రెంటల్‌ రూపంలో ఆర్జించే ఆదాయంపై పన్ను మినహాయింపును కల్పిస్తున్నాం’’అని వివరించారు. ఈ దిశగా సెక్షన్‌ 44బీబీసీని ప్రతిపాదించారు. 2025 ఏప్రిల్‌ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పారు.  

ఎన్‌పీఎస్‌పై మరింత పన్ను ప్రయోజనం
నూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్‌పీఎస్‌) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్‌పీఎస్‌ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్‌పీఎస్‌ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది. 

ఉదాహరణకు పార్థసారథి మూలవేతనం, కరవు భత్యం రూ.1,00,000 ఉందనుకుంటే.. తాజా మార్పుతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏడాదికి రూ.48వేల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ ఖాతా తెరిచేందుకు ‘ఎన్‌పీఎస్‌ వాత్సల్య’ ప్లాన్‌ను కూడా ప్రకటించారు.  

ఈకామర్స్‌ ఎగుమతులకు దన్ను
హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు 
ఈకామర్స్‌ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్‌ విధానం(పీపీపీ)లో వీలు కల్పించనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్‌ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగుకింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సర్వీసులకు ఇవి తెరతీయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. వెరసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.

ప్రస్తుతం ఈకామర్స్‌ విభాగం ద్వారా దేశీ ఎగుమతులు కేవలం 5 బిలియన్‌ డాలర్లకు పరిమితంకాగా.. చైనా నుంచి వార్షికంగా 300 బిలియన్‌ డాలర్లు ఎగుమతులు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో 50–100 బిలియన్‌ డాలర్లకు దేశీ ఎగుమతులను పెంచేందుకు అవకాశముంది. బడ్జెట్‌ ప్రతిపాదిత కేంద్రా(హబ్‌)ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్‌ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు.

తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్‌బీఐసహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్‌టీ కలసి పనిచేస్తోంది. ఫలితంగా ఈ హబ్‌లకు ఎగుమతులు క్లియరెన్స్‌లను కలి్పస్తారు. అంతేకాకుండా వేర్‌హౌసింగ్, కస్టమ్స్‌ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్‌లను వీటికి జత చేస్తారు.

డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ.50,000 కోట్లు 
ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్‌ అంచనా వేసింది. మధ్యంతర బడ్జెట్‌లోనూ ఇదేస్థాయిలో ప్రభుత్వం అంచనాలు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్‌ఈలు) నుంచి రూ.56,260 కోట్ల డివిడెండ్‌ లభించవచ్చని భావిస్తోంది.

మధ్యంతర బడ్జెట్‌లో వేసిన అంచనాలు రూ.48,000 కోట్లకంటే అధికంకావడం గమనార్హం! మరోవైపు ఆర్‌బీఐ, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ.2,32,874 కోట్ల డివిడెండ్‌ అందుకునే చాన్స్‌ ఉన్నట్లు బడ్జెట్‌ ఊహిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్‌బీఐ నుంచి రూ.2.11 లక్షల కోట్ల అనూహ్య డివిడెండ్‌ లభించడం ప్రభావం చూపింది. మధ్యంతర బడ్జెట్‌ ఈ పద్దుకింద రూ.1.02 లక్షల కోట్లు మాత్రమే అంచనా వేసింది.

దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకత
ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ ఏర్పాటు   
దివాలా కోడ్‌ (ఐబీసీ) పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్‌ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్‌ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

కోడ్‌ను ఇప్పటి వరకూ ఆరు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబీసీ 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను  పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ.3.3 లక్షల కోట్ల రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్‌సహా 15 నగరాల్లో ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌లు ఉన్నాయి. 

అంతేకాకుండా, నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఢిల్లీ, చెన్నైలలో బెంచ్‌లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.  

టెలికం పరికరాల దిగుమతులకు చెక్‌
10 శాతం నుంచి 15 శాతానికి సుంకాల పెంపు 
దేశీయంగా టెలికం గేర్‌ తయారీకి దన్నుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపునకు తెరతీశారు. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్‌బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది.

అయితే కమ్యూనికేషన్‌ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్‌పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్‌ తదితరాలున్నాయి.

రూ.50 లక్షలు మించితేనే రిటర్నుల పునఃమదింపు
పన్ను చెల్లింపుదారులకు సంబంధించి కొన్ని సానుకూల చర్యలకు బడ్జెట్లో చోటు లభించింది. ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు.

పన్నుల విషయంలో అనిశ్చిత, వివాదాలను ఈ చర్యలు తగ్గిస్తాయని మంత్రి చెప్పారు. ఎలాంటి కేసుల్లోనూ ఐదేళ్ల తర్వాత సంబంధిత పన్ను రిటర్నులను తిరిగి మదించకుండా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామని ప్రకటించారు.  పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్‌ సే విశ్వాస్‌ పథకం 2.0’ను తీసుకొస్తామన్నారు. 

వీటిపై పన్ను పెంపు.. 
బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(డెరివేటివ్స్‌) లావాదేవీలపై పన్నును పెంచేందుకు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌లో ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ)ను పెంచారు. దీంతో సెక్యూరిటీల ఆప్షన్‌ విక్రయంపై ప్రస్తుతమున్న ఆప్షన్‌ ప్రీమియంలో 0.625 శాతం పన్ను 0.1 శాతానికి పెరగనుంది. ఇక సెక్యూరిటీల ఫ్యూచర్స్‌ విక్రయంపై సైతం 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్‌ 1 నుంచి పన్ను పెంపు అమల్లోకి రానుంది. 

Tax



నిజానికి ఎఫ్‌అండ్‌వో విభాగంలో ఇటీవల కొంతకాలంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపుతున్నారు. దీనిపై సెబీ, ఆర్థిక శాఖ, స్టాక్ ఎక్ఛ్సేజీలతోపాటు ఆర్థిక సర్వే సైతం ఆందోళన వ్యక్తం చేసింది. డెరివేటివ్స్‌ విభాగంలో రిటైలర్ల పార్టిసిపేషన్‌ భారీగా పెరిగిపోతుండటంతో జూదానికి దారితీస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో సీతారామన్‌ ఎఫ్‌అండ్‌వో లావాదేవీలపై పన్నులను పెంచేందుకు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సెబీ చీఫ్‌ మాధవి పురి బచ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ ఇటీవలే ఎఫ్‌అండ్‌వో లావాదేవీలు పెరుగుతుండటంపై రిటైలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రిటైలర్లను డెరివేటివ్స్‌ అత్యధికంగా ఆకట్టుకుంటున్న కారణంగా విశ్లేషకులు సైతం రిస్కులను అర్ధం చేసుకోగలిగినవాళ్లు మాత్రమే లావాదేవీలను చేపట్టమంటూ అప్రమత్తం చేస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు వీటిని చేపట్టకపోవడమే మేలని సూచిస్తున్నారు. 

టర్నోవర్‌ దూకుడు 
డెరివేటివ్స్‌ విభాగంలో నెలవారీ టర్నోవర్‌ 2024 మార్చికల్లా కొన్ని రెట్లు ఎగసి రూ.8,740 లక్షల కోట్లను తాకింది. 2019 మార్చిలో కేవలం రూ.217 లక్షల కోట్లుగా నమోదుకావడం గమనార్హం! ఇదే కాలంలో నగదు విభాగంలోనూ రోజువారీ సగటు టర్నోవర్‌ రూ. లక్ష కోట్లను తాకగా.. ఎఫ్‌అండ్‌వోలో రూ.330 లక్షల కోట్లకు చేరింది.  

ఎఫ్‌అండ్‌వో అంటే? 
ఒక షేరు లేదా కమోడిటీ విలువ ఆధారంగా కుదుర్చుకునే తాత్కాలిక కాంట్రాక్ట్‌ల లావాదేవీలను ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌గా పేర్కొనవచ్చు. అత్యధిక శాతం ట్రేడర్లు రిసు్కల రక్షణ(హెడ్జింగ్‌)కు, ధరల కదలికలపై అంచనాలు, షేర్లు లేదా కమోడిటీల ధర వ్యత్యాసాల లబ్ధికి సైతం వీటిలో లావాదేవీలను చేపడుతుంటారు. వెరసి వీటిని స్వల్పకాలిక లాభార్జనకు స్పెక్యులేటివ్‌ టూల్‌గా వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్‌ ఆటుపోట్లు, లెవరేజ్‌.. తదితర  రిస్క్‌ల కారణంగా అత్యధికస్థాయిలో నష్టాలు సైతం వాటిల్లుతుంటాయి.

సెబీ ఇటీవలి నివేదిక ప్రకారం రిటైల్‌ ఇన్వెస్టర్లలో 89 శాతం మంది డెరివేటివ్స్‌లో నష్టపోతున్నారు. 2021–22 ఏడాదిలో వీరికి సగటున రూ. 1.1 లక్ష చొప్పున నష్టాలు నమోదయ్యాయి. కరోనా కాలంలో ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్ల సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. 2019లో ఈ సంఖ్య 7.1 లక్షలుకాగా.. 2021కల్లా 45.24 లక్షలకు జంప్‌చేసింది.

5 రెట్లు అధికమైనా.. 
డెరివేటివ్స్‌లో ఎస్‌టీటీ 5 రెట్లు పెరగనున్నట్లు సిట్రస్‌ అడ్వయిజర్స్‌ వ్యవస్థాపకుడు సంజయ్‌ సిన్హా పేర్కొన్నారు. ఇటీవల ఈ విభాగంలో లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో పన్ను పెంపు ఊహించిందేనని తెలియజేశారు.

అయితే పన్ను పెంపు అమల్లోకిరానున్న 2024 అక్టోబర్‌ 1 నుంచి ఎక్స్జ‌జీల టర్నోవర్‌ చార్జీలు తగ్గనున్నట్లు కొటక్‌ సెక్యూరిటీస్‌ డిజిటల్‌ బిజినెస్‌ హెడ్‌ ఆశిష్‌ నందా పేర్కొన్నారు. ఉదాహరణకు ఆప్షన్స్‌పై రూ.10,000 రౌండ్‌ ట్రిప్‌ ప్రీమియంపై ఎస్‌టీటీ రూ.3.75 పెరుగుతుందనుకుంటే.. టర్నోవర్‌ చార్జీలు రూ.3.5–4 స్థాయిలో తగ్గనున్నట్లు వివరించారు. దీంతో నికరంగా ప్రభావం ఉండకపోవచ్చని 
అభిప్రాయపడ్డారు.

Percentages

ఎల్‌టీసీజీలో సవరణలు
కేంద్రానికి రూ.15,000 కోట్ల అదనపు ఆదాయం
బడ్జెట్‌లో వివిధ ఆస్తుల(సెక్యూరిటీలు, స్థిరాస్తులు) హోల్డింగ్‌ కాలావధి ఆధారంగా క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌లను క్రమబద్ధీకరించారు. ఏడాదికి మించి లిస్టెడ్‌ ఫైనాన్షియల్‌ ఆస్తుల హోల్డింగ్‌తోపాటు.. రెండేళ్లకు మించి ఆర్థికేతర ఆస్తులు, అన్‌లిస్టెడ్‌ ఆస్తుల హోల్డింగ్స్‌ దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ) జాబితాలో చేరనున్నాయి.

అన్‌లిస్టెడ్‌ బాండ్లు, డిబెంచర్లను మినహాయించి(వీటికి సంబంధిత స్లాబ్‌లు వర్తిస్తాయి) వివిధ ఆస్తులపై దీర్ఘకాలిక లాభాల పన్ను సగటున 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్, బిజినెస్‌ ట్రస్ట్‌ యూనిట్లు వీటిలోకి వస్తాయి. అయితే ఆర్థికేతర ఆస్తులపై 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు.

అయితే ఇండెక్సేషన్‌ లబ్ధిని ఎత్తివేశారు. ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి రూ. లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచారు. కాగా.. మూలధన లాభాలపై పన్ను(క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌) రేట్ల సవరణ కారణంగా రూ.15,000 కోట్లమేర అదనపు ఆదాయం సమకూరే వీలున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా అంచనా వేశారు.  

బైబ్యాక్‌ షేర్లపైనా పన్ను
డివిడెండ్‌ తరహాలో విధింపు 
బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం డివిడెండ్‌ తరహాలో బైబ్యాక్‌ చేసే షేర్లపై వాటాదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలతో ఇకపై బైబ్యాక్‌ షేర్లకు వాటాదారులపై పన్ను విధించనున్నారు.

వెరసి కంపెనీలు చేపట్టే బైబ్యాక్‌లో భాగంగా షేర్లకు చెల్లించే సొమ్ముపై డివిడెండ్‌ తరహాలో వాటాదారులపైనే పన్ను భారం పడనుంది. ఇది ఇన్వెస్టర్లపై పన్ను భారాన్ని మరింత పెంచనుంది. మరోవైపు ఎస్‌టీటీతోపాటు.. స్వల్పకాలిక లాభాలపై పన్ను పెంపునకు తాజా బడ్జెట్‌ తెరతీసింది. ఇప్పటివరకూ బైబ్యాక్‌ షేర్లకు కంపెనీలే పన్ను చెల్లిస్తున్నాయి.

నైపుణ్య యువతరం.. ఉద్యోగ భారతం 
దేశంలో భారీగా కొత్త ఉద్యోగాల కల్పన, అందుకు వీలు కల్పించేలా యువతకు నైపుణ్య శిక్షణ లక్ష్యంతో మోదీ 3.0 సర్కారు అడుగులు వేసింది. తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్య అంశాల్లో ‘ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ’ఒకటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 

Employment


 
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా, రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను చేపడతామని ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రయోజనాలను కల్పిస్తామని ప్రకటించారు. 

ఈపీఎఫ్‌ఓ డేటా ఆధారంగా..
కొత్త ఉద్యోగాల కల్పన పథకాలను.. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లో నమోదయ్యే వివరాల ఆధారంగా అమలు చేస్తామని నిర్మల తెలిపారు. మొత్తంగా ప్రస్తుత 2024–25 కేంద్ర బడ్జెట్‌లో విద్య, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కోసం రూ.1.48 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో ఎంప్లాయ్‌మెంట్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌కు 23 వేల కోట్లు, జాబ్‌ క్రియేషన్‌ ఇన్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్కీమ్‌కు రూ.52 వేల కోట్లు, సపోర్ట్‌ టుఎంప్లాయర్స్‌ స్కీమ్‌కు రూ.32 వేల కోట్లు కలిపి రూ.1.07 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు వివరించారు.

నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు..
కార్కుల నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, తగిన నైపుణ్యమున్న కార్మకులతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఈ–శ్రమ్, శ్రమ్‌ సువిధ, సమాధాన్‌ వంటి పోర్టల్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. దీనితో స్కిల్‌ ప్రొవైడర్స్, ఎంప్లాయర్స్‌కు.. ఉద్యోగాలు కోరుకునే యువతకు మధ్య అనుసంధానంకుదురుతుందని వెల్లడించారు. 

ఐదేళ్లలో కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ 
దేశంలో యువత సులభంగా ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించేలా, ఉద్యోగంలో చేరే ముందే తగిన అనుభవం సాధించేలా.. విస్తృతస్థాయిలో ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని అమలు చేస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 500 టాప్‌ కంపెనీల్లో మొత్తంగా కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో చేరేప్పుడు ఒకసారి రూ.6 వేలు అందిస్తామని, తర్వాత ప్రతినెలా రూ.5 వేలు ఇంటర్న్‌సిప్‌ అలవెన్స్‌ అందుతుందని వెల్లడించారు. 

ఏడాదిపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్‌ సమయంలో సంబంధిత ఉద్యోగం, పని వాతావరణంపై యువతకు అవగాహన ఏర్పడుతుందని.. దీనితో మంచి ఉద్యోగం పొందేందుకు అవకాశం వస్తుందని వివరించారు. ఈ ఇంటర్న్‌షిప్‌ పథకానికి ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇచ్చేందుకయ్యే వ్యయాన్ని, ఇంటర్న్‌షిప్‌ అలవెన్స్‌లో పది శాతాన్ని కంపెనీలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధుల నుంచి భరిస్తాయని తెలిపారు.

స్కిల్స్ పెరిగితే.. ఉద్యోగాలూ పెరుగుతాయి! 
బడ్జెట్‌లో దేశ యువతలో నైపుణ్యాల పెంపు, ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహకాలు అందించే స్కీమ్‌లను ప్రకటించడంపై హ్యూమన్స్‌ రీసోర్స్, ఎడ్‌ టెక్‌ రంగాల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వికసిత్‌ భారత్‌’లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తున్నారు. యువతలో నైపుణ్యాలు పెరిగితే ఉద్యోగ అవకాశాలు విస్తృతం అవుతాయని అంటున్నారు. 

‘‘మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు తోడ్పడతాయి. పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు అందేందుకు నైపుణ్య శిక్షణ బాట వేస్తుంది. ఈ దిశగా ప్రభుత్వ నిర్ణయాలు బాగున్నాయి..’’అని టీమ్‌లీజ్‌ డిగ్రీ అప్రెంటిస్‌షిప్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘‘నైపుణ్య శిక్షణ మాత్రమేగాకుండా.. ఉద్యోగులు, ఉద్యోగాలను కల్పించే కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయమని క్వెస్‌ కార్ప్‌ సీఈవో గురుప్రసాద్‌ శ్రీనివాసన్‌ చెప్పారు.

‘‘20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు వంటివి రాబోయే తరం సాధికారతకు తోడ్పడతాయి. దేశంలోని యువతలో నైపుణ్యాల లోటును పూడ్చవచ్చు..’’అని పియర్సన్‌ ఇండియా కంట్రీ హెడ్‌ వినయ్‌కుమార్‌ స్వామి పేర్కొన్నారు.  

ఉద్యోగాల కల్పన కోసం.. 
1. ఎంప్లాయ్‌మెంట్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌: వ్యవస్థీకృత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకంగా ఒక నెల వేతనం చెల్లింపు. మూడు వాయిదాల్లో.. గరిష్టంగా రూ.15 వేల వరకు అందిస్తారు. దీనితో వచ్చే ఐదేళ్లలో 2.1 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా.  

2. జాబ్‌ క్రియేషన్‌ ఇన్‌మాన్యుఫాక్చరింగ్‌ స్కీమ్‌:  కొత్తగా ఉద్యోగంలో చేరేవారు,కొత్తగా ఉద్యోగాలిచ్చే సంస్థలు చెల్లించేఈపీఎఫ్‌ఓ చందాలపై తొలి నాలుగేళ్లపాటు ప్రోత్సాహకాలు. సుమారు 30 లక్షల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందనిఅంచనా.

3. సపోర్ట్‌ టుఎంప్లాయర్స్‌ స్కీమ్‌: కంపెనీలు కొత్తగా/అదనంగా ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి యాజమాన్య వాటాగా చెల్లించే ఈపీఎఫ్‌ చందాల రీయింబర్స్‌మెంట్‌.  ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. దీనితో కొత్తగా 50 లక్షల ఉద్యోగాల కల్పనజరుగుతుందని అంచనా. (ఈ మూడు స్కీమ్‌లనుగరిష్టంగా నెలకు రూ.లక్ష వేతనంఇచ్చే ఉద్యోగాలు/ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తారు.)

నైపుణ్యాల శిక్షణ కోసం..
1. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం. రాష్ట్రాలు, పరిశ్రమలు, కంపెనీలతో కలసి దీనిని అమలు చేస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానంలో 1,000 పారిశ్రామిక శిక్షణ ఇన్‌స్టిట్యూట్ల (ఐటీఐ) అప్‌గ్రెడేషన్‌. 
2. వచ్చే ఐదేళ్లలో కోటి మందికి 500 టాప్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అందించే మరో పథకం అమలు.
3. పరిశ్రమలు, కంపెనీల అవసరాలకుతగినట్టుగా ఉండేలా కోర్సులు,పాఠ్యాంశాల రూపకల్పన.
4. నైపుణ్య శిక్షణ కోసం ‘మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీమ్‌’కింద ఏటా 25 వేల మంది యువతకు రూ.7.5 లక్షల వరకు రుణాలు.
5. మహిళలకే ప్రత్యేకించిన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు. ఉద్యోగాల్లో మహిళల భాగ స్వామ్యం పెరగడం కోసం.. పరిశ్రమలు, కంపెనీల సహకారంతో వర్కింగ్‌ విమెన్‌ హాస్టళ్లు, చిన్న పిల్లల సంరక్షణను చూసుకునే క్రెచ్‌ల ఏర్పాటుకు నిర్ణయం.

ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణకు రూ.309.74 కోట్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.309.74 కోట్లను కేటాయించారు. ఇందులో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్రటేరియట్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్,లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.103.05 కోట్లు. వివిధ శిక్షణ స్కీమ్‌లకు రూ.120.56 కోట్లు, మిషన్‌ కర్మయోగికి రూ.86.13 కోట్లు ఇచ్చారు. వీటితో ఉద్యోగులకు వివిధ నైపుణ్యాలపై రిఫ్రెషర్‌ కోర్సులు, మిడ్‌ కెరీర్‌ శిక్షణ ఇస్తారు.

కొత్త‌కు పన్నుకు జైజై.. పాత‌కు పన్నుకు బైబై..
ఉద్యోగస్తులు పాత పన్నుల విధానం కాకుండా కొత్త పన్నుల విధానం ప్రోత్సహించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదాయపన్ను రిటర్నులు దాఖలును సులభతరం చేస్తున్నామన్న నెపంతో పొదుపుపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు ఉండని కొత్త పన్నుల విధానం ఎంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పాత ఆదాయ పన్ను విధానంలో బీమా ప్రీమియం, గృహరుణం, పిల్లల చదువులు, పోస్టాఫీసు వంటి వివిధ సేవింగ్‌ పథకాలకు చేసే వ్యయాలను చూపించడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. 

Minor changes in the new tax regime slabs

కానీ 2020లో తక్కువ పన్నురేట్లతో వివిధ శ్లాబులను కొత్త పన్నుల విధానం ప్రవేశపెట్టింది. కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారు పొదుపు, వ్యయాలపై ఎటువంటి మినహాయింపులు వర్తించవు. మొత్తం ఆదాయం ఎంత అయితే అంత పన్ను చెల్లించాల్సిందే. కొత్త పన్నుల విధానం సులభతరంగా ఉండటంతో పన్ను చెల్లింపుదారులు ఈ విధానంవైపే మొగ్గు చూపుతున్నారని, 2023–24లో ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్నుల విధానంలో రిటర్నులు దాఖలు చేసినట్లు సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 

ఈ ఏడాది ఇప్పటి వరకు 8.61 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారికే ఈ మార్పులు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు. రానున్న కాలంలో అందరూ కొత్త పన్నుల విధానం ఎంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పాత పన్నుల విధానంకు పన్ను మినహాయింపులను తగ్గిస్తూ కొత్త విధానానికి ప్రయోజనాలను పెంచుతున్నారని ట్యాక్స్‌ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా మార్పులు చేసిన తర్వాత పది లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్న వారికి కొత్త పన్నుల విధానం ఎంచుకుంటేనే ప్రయోజనంగా ఉంటుందంటున్నారు. 

Tax

స్థిరాస్తి విలువ రూ.50 లక్షలు దాటితే టీడీఎస్‌..
ఇక నుంచి రూ.50 లక్షలు దాటిన స్థిరాస్థి విలువను విక్రయిస్తే ఒక శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్‌ 194ఐఏ సెక్షన్‌ ప్రకారం స్థిరాస్థి విలువ రూ.50 లక్షలు దాటితే ఒక శాతం టీడీఎస్‌ వసూలు చేయాలి. స్థిరాస్థి విలువను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినా మొత్తం విలువను పరిగణనలోకి తీసుకొని టీడీఎస్‌ను వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. కానీ ఈ టీడీఎస్‌ నుంచి వ్యవసాయ భూములకు మినహాయింపు ఇచ్చారు. 

స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75 వేలకు పెంపు 
కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు ఊరటనిస్తూ స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని 50% పెంచుతూ సీతారామన్‌ ప్రకటించారు. రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.75 వేలకు పెంచారు. ఫ్యా మిలీ పెన్షన్‌దారుల స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. కొత్త పన్నుల విధానంలో 10% పన్నులోపు శ్లాబుల్లో స్వల్ప మార్పుల ను ప్రతిపాదించింది. 

కొత్త పన్నుల విధానంలో 3 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవస రం లేదు. గతంలో 5% పన్ను శ్లాబు పరిధి రూ.3– 6 లక్షలుగా ఉంటే ఇప్పుడు దాన్ని రూ.3–7 లక్షలకు, గతంలో రూ.6–9 లక్షలుగా 10% పన్ను పరిధిని రూ.7–10 లక్షలకు పెంచా రు. ఈ మార్పుల వల్ల ప్రతీ పన్ను చెల్లింపుదారునికి రూ.17,500 ప్రయోజనం లభిస్తుంది.

tax regime slabs

సాగుకు రూ.1.52 ల‌క్ష‌ల కోట్లు
వ్యవసాయానికి బడ్జెట్‌లో కేంద్రం పెద్దపీట వేసింది. బడ్జెట్‌కు సంబంధించిన తొమ్మిది ప్రాధాన్య అంశాల్లో వ్యవసాయ ఉత్పాదకతను ఒకటిగా చేర్చింది. మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. సాగు ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేటాయింపులు జరిపింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2024–25బడ్జెట్‌ ప్రసంగంలోవెల్లడించారు.  

Farmor

పరిశోధనలకు ప్రోత్సాహం
‘వ్యవసాయ పరిశోధనలను సమగ్రంగాసమీక్షించడం ద్వారా ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని అధిక ఉత్పాదకతనిచ్చే సరికొత్త వంగడాల దిశగా ప్రోత్సహిస్తాం. ఈ మేరకు నిధులు కూడా అందజేస్తాం. ప్రైవేటు రంగానికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తాం. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవసాయ రంగ నిపుణులు ఈ పరిశోధనలను పర్యవేక్షిస్తారు. 32 వ్యవసాయ అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే, అధిక దిగుబడినిచ్చే 109 కొత్తవంగడాలను రైతులు సాగుచేసేందుకు వీలుగా విడుదల చేస్తాం. 

10 వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలు
వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సర్టిఫికేషన్, బ్రాండింగ్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తాం. శాస్త్రీయ సంస్థలు, ఆసక్తి కలిగిన గ్రామపంచాయతీల ద్వారా దీనిని అమలుచేస్తాం. 10 వేల అవసరాధారిత బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలు (సేంద్రియ ఎరువుల కేంద్రాలు) ఏర్పాటు చేస్తాం. 

సహకార సంఘాలు,స్టార్టప్‌లకు ప్రోత్సాహం
అధిక వినియోగ కేంద్రాలకు సమీపంలో భారీ స్థాయిలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం. రైతు–ఉత్పత్తిదారు సంఘాలను ప్రోత్సహిస్తాం. అలాగే కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌తో సహా కూరగాయల సరఫరా వ్యవస్థల కోసం సహకార సంఘాలు, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం. 

పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి
పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి సాధన దిశగా వాటి ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తాం. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర నూనెగింజలకు ‘ఆత్మనిర్భరత’ సాధన కోసం ఓ ప్రత్యేక వ్యూహానికి రూపకల్పన చేస్తాం. 

డిజిటల్‌ క్రాప్‌ సర్వే
పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో..వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైతులు, వారి భూముల కోసం వ్యవసాయంలో డిజిటిల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) అమలు చేస్తాం. ఈ ఏడాది 400 జిల్లాల్లో డీపీఐ ద్వారా ఖరీఫ్‌ పంటల డిజిటల్‌ సర్వే నిర్వహిస్తాం. 6 కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలను రైతు, భూమి రిజిస్ట్రీల్లో పొందుపరుస్తాం. ఐదు రాష్ట్రాల్లో జన్‌ సమర్థ్‌ ఆధారిత కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తాం.

రొయ్యల ఉత్పత్తి ఎగుమతి
రొయ్యల సాగు కేంద్రాల నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఆర్థిక సాయంఅందజేస్తాం. నాబార్డ్‌ ద్వారా రొయ్యల సాగు, శుద్ధి, ఎగుమతికి నిధులుఅందజేస్తాం.

జాతీయ సహకార విధానం
సహకార రంగ సర్వతోముఖాభివృద్ధికి వీలుగా జాతీయ సహకార విధానాన్ని కేంద్రం తీసుకువస్తుంది.వేగవంతమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పెద్దయెత్తున ఉపాధి కల్పన, అవకాశాలు లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తాం..’ అని ఆర్థికమంత్రి వెల్లడించారు.

భూసారం పెంపు, జీవవైవిధ్యానికి దోహదం
సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, క్రిమిసంహారాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని కేంద్రం భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయం భూసారాన్ని పెంచడమే కాకుండా జీవవైవిధ్యానికి దోహదపడుతుంది. 

రైతుల సాగు ఖర్చులు తగ్గేలా చేయడం ద్వారా వారి లాభదాయకతను పెంపొదిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు వాతావరణ సూచనలు, పంటలకు సంబంధించిన సలహా సేవలు, మార్కెట్‌ ధరల గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటిల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ద్వారా వీలు కలుగుతుంది.

యూరియాకు బడ్జెట్‌లో సబ్సిడీ తగ్గింపు 
కేంద్ర బడ్జెట్‌లో యూరియాకు సబ్సిడీ తగ్గింది. 2022–2023లో 1,65,217 కోట్లు సబ్సిడీపై ఖర్చు చేయగా, 2023–24లో రూ.1,28,594 కోట్లకు తగ్గిపోయింది. 2024–25లో బడ్జెట్‌ను మరింత తగ్గించి 1,19,000 కోట్లు మాత్రమే కేటాయించారు. పోషకాధార ఎరువుల సబ్సిడీ కింద 2022–23లో రూ.86,122 కోట్లు ఖర్చు చేయగా, 2024–25లో ఇంకా తగ్గించి రూ.45,000 కోట్లు కేటాయించారు. అంటే కంపెనీలు పెంచే ఎరువుల ధరల భారాన్ని ఇకపై రైతులే భరించాల్సి ఉంటుందని రైతు నేతలు విమర్శిస్తున్నారు. 

అలాగే 2019 నుంచి కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులు తగ్గిపోతూ వస్తున్నాయి. 2019–20 సంవత్సర మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 5.44 శాతం కేటాయించగా, ఇప్పుడు 2024–2025లో 3.15 శాతానికి పడిపోయింది. ఇక పంటల బీమా పథకానికి కూడా 2023–24లో రూ. 15,000 కోట్ల ఖర్చు అంచనా వేసిన ప్రభుత్వం ఈ ఏడాది దానిని రూ.14,600 కోట్లకు తగ్గించింది. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీకి 2023–24 లో రూ.23,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.22,000 కోట్లు మాత్రమే కేటాయించింది.  

మద్దతు ధరలకు చట్టబద్దత ఏదీ? 
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణరాష్ట్ర కమిటీకనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు గత ఏడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ సందర్భంగా ఈ చట్టం ప్రస్తావన చేయలేదు. పైగా వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు కూడా తగ్గించింది.

Ayudalu

బ‌డ్జెట్‌లో ఊసేలేని తెలంగాణ 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడా తెలంగాణ ఊసే కనబడలేదు. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ, ‘పాలమూరు’ప్రాజెక్టుకు జాతీయ హోదా, మూసీ రివర్‌ఫ్రంట్‌కు నిధులు, విభజన చట్టం హామీల అమలు, వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు, స్కిల్‌ యూనివర్సిటీకి సహకారం, కొత్త నవోదయ పాఠశాలలు.. ఇలా ఏ ఒక్కదానికీ నిధులు కేటాయించలేదు. ఒక్క హైదరాబాద్‌–బెంగళూరు ఇండ్రస్టియల్‌ కారిడార్‌లోని ఓర్వకల్లు పరిధిలో నీరు, విద్యుత్, రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేస్తామని మాత్రమే బడ్జెట్‌లో పేర్కొన్నారు. 

telangana in budget

ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసుకున్నా.. 
విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేలా నిధులిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కానీ అదే చట్టం పరిధిలోని తెలంగాణకు మాత్రం ఎలాంటి నిధులనూ ఇవ్వలేదు. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్న ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు సీఎం, మంత్రులు కేంద్ర పెద్దలను పలుమార్లు కలిశారు. 

గత పదేళ్లలో జరిగిన రూ.33,712 కోట్ల రెవెన్యూ నష్టాన్ని ఈసారైనా ఇవ్వాలని.. వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ల కింద రూ.2,250 కోట్లు, 14, 15 ఆర్థిక సంఘాలు సిఫార్సు చేసిన రూ.6వేల కోట్లు ఇప్పించాలని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. కానీ కేంద్రం ఏ ఒక్కదానినీ పట్టించుకోలేదు. ఎన్డీయే సర్కారు రాజకీయ అవసరాలను బట్టి ఏపీకి నిధులు చూపారని అనుకున్నా... 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచిన తెలంగాణను కేంద్రం పట్టించుకోకపోవడం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

వాటా పెంపు కూడా దక్కలేదు.. 
కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాను పెంచుతారని రాష్ట్ర ప్రభుత్వం ఆశించినా అదీ దక్కలేదు. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు 2.102 శాతం వాటా కింద రూ.26,216.38 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో చూపారు. కానీ గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రైల్వే ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక రాష్ట్రాలకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాల కింద రూ.1.5 లక్షల కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది. ఈ 1.5 లక్షల కోట్లలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్నది కీలకంగా మారింది. 

ఏమైనా వస్తే.. టోకుగా చూపిన అంశాల్లోనే!
➢ దేశవ్యాప్తంగా 1,000 ఐటీఐల ఆధునీకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని 60కిపైగా ఐటీఐల ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన 1,000 ఐటీఐల్లో మన రాష్ట్రం వాటా కింద ఎన్ని వస్తాయన్నది తేలాల్సి ఉంది. 
➢ దేశవ్యాప్తంగా 12 పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తామన్న ప్రతిపాదనల నేపథ్యంలో తెలంగాణకు ఏదైనా కారిడార్‌ దక్కుతుందా అన్నది చర్చ జరుగుతోంది. 
➢ ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌ కింద దేశంలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు ఆర్థిక చేయూత అందిస్తామని కేంద్రం పేర్కొంది. దీని  కింద హైదరాబాద్‌కు నిధులు అందే అవకాశముంది. 

➢ దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ను అందిస్తామని కేంద్రం బడ్జెట్‌లో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించే నూతన గృహాలకు రూఫ్‌ టాప్‌ సోలార్‌ తప్పనిసరి చేయాలన్న యోచనలో ఉంది. కేంద్ర పథకానికి దీనిని లింక్‌ చేస్తే ప్రయోజనం ఉండవచ్చని నిపుణులు 
అంటున్నారు. 
➢ దేశంలోని 100 పెద్ద నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ కోసం ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది. దీనికింద హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లకు సాయం దక్కవచ్చు. 
➢ దేశవ్యాప్తంగా మౌలిక సౌకర్యాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లను ప్రతిపాదించారు. ఇందులో రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), పేదలకు గృహ నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఏమేర నిధులు రావొచ్చనే చర్చ జరుగుతోంది.

Indian Budget

చిన్న సంస్థలకు ఊతం.. రుణ హామీ పథకం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) తోడ్పాటు అందించే దిశగా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చర్యలు ప్రతిపాదించారు. యంత్ర పరికరాల కొనుగోలు కోసం ఎటువంటి కొలేటరల్‌ లేదా థర్డ్‌ పార్టీ గ్యారంటీ లేకుండా టర్మ్‌ లోన్స్‌ తీసుకునే వెసులుబాటు లభించేలా రుణ హామీ పథకాన్ని ప్రకటించారు.

దీనికోసం విడిగా సెల్ఫ్‌–ఫైనాన్సింగ్‌ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది ఒక్కో దరఖాస్తుదారుకు రూ. 100 కోట్ల వరకు రుణాలకు (తీసుకున్న రుణ మొత్తం ఎంతైనా సరే) హామీ ఇస్తుందని పేర్కొన్నారు. దీన్ని పొందేందుకు రుణగ్రహీత ముందస్తుగా నిర్దిష్ట గ్యారంటీ ఫీజును, రుణ బ్యాలెన్స్‌ తగ్గే కొద్దీ వార్షిక ఫీజును కట్టాల్సి ఉంటుంది.

ఎస్‌ఎంఈలకు గడ్డు కాలంలో కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉండేలా చూసేందుకు కొత్త విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది. తమ పరిధిలో లేని కారణాల వల్ల స్పెషల్‌ మెన్షన్‌ అకౌంటు (ఎస్‌ఎంఏ) దశలోకి చేరిన ఎంఎస్‌ఎంఈలు ఆ తదుపరి మొండి బాకీల్లోకి జారిపోకుండా సహాయం పొందేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది.  

కొత్త అసెస్‌మెంట్‌ విధానం.. 
ఎంఎస్‌ఎంఈలకు రుణాల విషయంలో కొత్త మదింపు విధానాన్ని మంత్రి ప్రతిపాదించారు. అసెస్‌మెంట్‌ కోసం బైటి సంస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు దానికి సంబంధించి అంతర్గతంగా సొంత విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొన్నారు. సంప్రదాయ అసెస్‌మెంట్‌ విధానంతో పోలిస్తే ఈ మోడల్‌ మెరుగ్గా ఉండగలదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇక ఎంఎస్‌ఎంఈలు, సంప్రదాయ చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించుకునేందుకు తోడ్పాటు అందించేలా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ–కామర్స్‌ ఎక్స్‌పోర్ట్‌ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

పసిడి, వెండి ధరలకు ఊరట! 
ఇటు బులియన్‌ పరిశ్రమకు అటు ఆభరణాల ప్రియులకు ఊరటనిస్తూ ఆర్థికమంత్రి కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. బంగారం, వెండిపై కస్టమ్స్‌ సుంకాలు ప్రస్తుతం 15 శాతంకాగా, ఈ రేటును 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందులో ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం (బీసీడీ) 10 నుంచి 5 శాతానికి తగ్గగా, అగ్రికల్చరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ (ఏఐడీసీ) 5 శాతం నుంచి 1 శాతానికి చేరింది.

Gold


 
ఇక విలువైన లోహాల నాణేలు, హుక్, క్లాస్ప్, క్లాంప్, పిన్, క్యాచ్, స్క్రూ బ్యాక్‌ వంటి చిన్న భాగాలకు సంబంధించిన బంగారం–వెండి ఫైండింగ్స్, బంగారం, వెండి కడ్డీలపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని కూడా 15 శాతం నుంచి 6 శాతానికి బడ్జెట్‌ తగ్గించింది. మరింత మెరుగుదల అవసరమైన బంగారం, వెండి డోర్‌లపై కస్టమ్స్‌ సుంకం 14.35 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గించారు.

‘దేశంలో బంగారం, విలువైన లోహ ఆభరణాల పరిశ్రమకు ఊతం ఇవ్వడానికి బంగారం– వెండిపై కస్టమ్స్‌ సుంకాలను 6 శాతానికి  తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను’ అని ఆర్థికమంత్రి తెలిపారు. ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరిడియంలపై లెవీని కూడా 15.4 శాతం 
నుంచి 6.4 శాతానికి బడ్జెట్‌లో తగ్గించారు.

రాజధానిలో రూ.3,350 తగ్గుదల 
ఇక ఆర్థిక మంత్రి కీలక ప్రకటన నేపథ్యంలో స్పాట్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పడ్డాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత (99.9 శాతం ప్యూరిటీ) పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.3,350 తగ్గి, రూ.72,300కు దిగివచ్చింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో దిగివచ్చి రూ.71,950 స్థాయికి చేరింది.

వెండి కేజీ ధర సైతం రూ.3,500 (4 శాతం) తగ్గి రూ.87,500కు దిగివచ్చింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికి వస్తే, 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధరలు క్రితం ముగింపుతో పోలి్చతే రూ.3,614 రూ.3,602 చొప్పున తగ్గి వరుసగా రూ.69,602, రూ.69,323కు దిగివచ్చాయి. ఇక వెండి కేజీ ధర రూ.3,275 తగ్గి రూ.84,919కి దిగింది.  

Gold Details

ఫ్యూచర్స్‌లో రూ.4,000 డౌన్‌ 
ఆర్థికమంత్రి ప్రకటన వెంటనే ఫ్యూచర్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో చురుగ్గా ట్రేడవుతున్న బంగారం ఆగస్టు కాంట్రాక్ట్‌ 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు రూ.4,000 పడిపోయి (5 శాతంపైగా) రూ.68,500కు చేరింది. కేజీ వెండి ధర సైతం రూ.88,995 నుంచి రూ.84,275కు దిగివచ్చింది. 

అంతర్జాతీయంగా ధర ఇలా.. 
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ న్యూయార్క్‌ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో ఈ నెల 16వ తేదీన ఔన్స్‌కు (31.1గ్రా) ఆల్‌టైమ్‌ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్‌ ధర జూలై 23వ తేదీ 2,400 డాలర్లపైన ట్రేడవుతోంది.  

తీపికబురే కానీ..  
కస్టమ్స్‌ సుంకాలు తగ్గించడం  తక్షణ డిమాండ్‌కు సంబంధించి బులియన్‌ పరిశ్రమ, వినియోగదారుకు తీపి కబురే అయినప్పటికీ ఈ నిర్ణయంపై రానున్న కాలంలో భౌగోళిక ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువల కదలికలు ప్రభావం చూపుతాయి.

పల్లెకు 3.0 ధమాకా..
కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన మోదీ 3.0 సర్కారు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు నడుం బిగించింది. కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాల (ఫ్లాగ్‌షిప్‌)కు ఈసారి బడ్జెట్లో దండిగానే నిధులు కేటాయించింది.

Villages

గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో గ్రామీణాభివృద్ధికి (మౌలిక సదుపాయాలతో సహా) రూ.2,38,204 కోట్లు కేటాయించగా (సవరించిన అంచనా రూ.2,38,984 కోట్లు).. ఈ సారి బడ్జెట్లో (2024–25) దీన్ని రూ.2,65,808 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ముఖ్యంగా ఉపాధి హామీకి మళ్లీ భారీగా నిధులతో పాటు గ్రామీణ రోడ్ల కోసం నాలుగో దశ, అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం (పట్టణ, గ్రామీణ)పై ఫోకస్‌ చేయడం విశేషం!

జోరుగా ‘ఉపాధి’..
2024–25 కేటాయింపు: రూ.86,000 కోట్లు
2023–24 కేటాయింపు: రూ.60,000 కోట్లు 
గతేడాది బడ్జెట్లో నిధుల కోతకు గురైన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఏ) మళ్లీ కేటాయింపులు జోరందుకున్నాయి. ముఖ్యంగా మోదీ సర్కారు ఈ పథకాన్ని నీరుగారుస్తుందన్న విమర్శల నేపథ్యంలో 2024–25 బడ్జెట్లో కేటాయింపులు 40 శాతం మేర పెరగడం విశేషం. అయితే, 2023–24 సవరించిన అంచనాల (రూ. 86,000 కోట్లు)తో పోలిస్తే దాదాపు అదే స్థాయిలో ఉన్నాయి.

గ్రామీణ రోడ్లు.. నాలుగో దశ షురూ
2024–25 కేటాయింపు:రూ.19,000 కోట్లు
2023–24 కేటాయింపు: రూ.17,000 కోట్లు (సవరించిన అంచనా)
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అమలు చేస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్‌ స్కీమ్‌ (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పీఎంజీఎస్‌వై)కు ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యం లభించింది. ఈ స్కీమ్‌ నాలుగో దశను సీతారామన్‌ ప్రకటించారు. ‘పీఎంజీఎస్‌వై ఫేజ్‌–4లో భాగంగా 25,000 పల్లె ప్రాంతాలను పక్కా రోడ్లతో అనుసంధానం చేయనున్నాం. ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా రోడ్లను అభి­వృ­ద్ధి చేస్తాం’ అని మంత్రి పేర్కొ­న్నారు. 

2023–24 సవరించిన అంచనాలు రూ. 17,000 కోట్లతో పోలిస్తే, 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు దా­దా­పు 12 శాతం పెరగడం గమనార్హం. స్కీమ్‌ మొదలైన­ప్పటి నుంచి ఈ ఏడాది జన­వరి వరకు మొత్తం 8,15,072 కిలోమీటర్ల పొడవైన రోడ్లకు అనుమ­తులు మంజూరు కా­గా, 7,51,163 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయింది.

సొంతింటికి దన్ను (పీఎంఏవై)
2024–25 కేటాయింపులు: రూ.80,671 కోట్లు
2023–24 కేటాయింపులు: రూ.54,103 కోట్లు  (సవరించిన అంచనా)
పేదలు, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చేలా బడ్జెట్లో ఈ పథకానికి నిధులు భారీగా పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద, బలహీన వర్గాలకు 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలనేది లక్ష్యం కాగా, 2023 మార్చి నాటికి 2.94 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కాగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో అదనంగా మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ఈ స్కీమ్‌ కింద చేపట్టనున్నట్లు తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో రెండు కోట్ల ఇళ్లను గ్రామాల్లో, కోటి ఇళ్లను పట్టణ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. పీఎంఏవై (అర్బన్‌) 2.0 స్కీమ్‌ కోసం ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సీతారామన్‌ వివరించారు. ఇందులో భాగంగా వడ్డీ రాయితీ, చౌక రుణాల రూపంలో రూ. 2.2 లక్షల కోట్ల సాయం అందిస్తామని చెప్పారు. రుణ ఆధారిత సబ్సిడీ స్కీమ్‌ (సీఎల్‌ఎస్‌ఎస్‌) కోసం ఈ బడ్జెట్లో రూ.4,000 కోట్లను కేంద్రం కేటాయించింది. మొత్తం మీద పీఎంఏవై (అర్బన్‌)కు ఈ బడ్జెట్లో రూ.30,170 కోట్లు దక్కాయి. 2023–24తో పోలిస్తే ఇది 20.19 శాతం ఎక్కువ.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌..
2024–25 కేటాయింపు: రూ. 12,192 కోట్లు
2023–24 కేటాయింపు: రూ.9,550 కోట్లు (సవరించిన అంచనా)
దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా తుడిచిపెట్టడానికి (ఓడీఎఫ్‌) 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్‌ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వ్యర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ మిషన్‌ కింద, గ్రామీణ ప్రాంతాల్లో ఓడీఎఫ్‌ స్టేటస్‌ను పూర్తిగా సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. దీన్ని స్థిరంగా కొనసాగించడంతో పాటు అన్ని గ్రామాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

స్వచ్ఛ భారత్‌ (అర్బన్‌) పథకానికి ఈ బడ్జెట్లో రూ.5,000 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్‌ అంచనా (రూ.5,000 కోట్లు)తో పోలిస్తే అదే స్థాయిలో ఉన్నప్పటికీ, సవరించిన అంచనా (రూ.2,550 కోట్లు)తో పోలిస్తే నిధులు రెట్టింపయ్యాయి. ఇక స్వచ్ఛభారత్‌ (గ్రామీణ) స్కీమ్‌కు రూ.7,192 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనా (రూ.7,000 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది.

తాగునీటికి కాస్త పెంపు.. 
2024–25 కేటాయింపు: రూ.69,927 కోట్లు
2023–24 కేటాయింపు: రూ.69,846 కోట్లు (సవరించిన అంచనా)
గ్రామీణ కుటుంబాలన్నింటికీ స్వచ్ఛమై­న తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్‌ జీవన్‌ మిషన్‌ ఫ్లాగ్షిప్‌ ప్రోగ్రామ్‌ను  ప్రకటించారు. 2024 నాటికి దీన్ని సాధించాలనేది కేంద్రం లక్ష్యం. కాగా, దేశంలోని మొత్తం 19.26 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను ఇప్పటివరకు 14.22 కోట్ల కుటుంబాలకు తాగు నీటి సదుపాయం (కుళా­యి కనెక్షన్లు) కల్పించినట్లు అంచనా.

పట్టణ పేదల ఇళ్లకు.. 2.2 లక్షల కోట్లు
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–అర్బన్‌  పథకం కింద వచ్చే ఐదేళ్లలో కోటి మంది పట్టణ పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు గృహ నిర్మాణాల నిమిత్తం రూ.2.2 లక్షల కోట్ల సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. సరసమైన రేట్లతో రుణాలు అందించేందుకు వీలుగా వడ్డీ రాయితీని కూడా ప్రతిపాదించింది. మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం (పీఎంఏవై) కింద 3 కోట్ల అదనపు గృహాలను ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 

ఈ మేరకు నిధుల కేటాయింపు జరుపుతున్నామని చెప్పారు. కేంద్రసాయం రూ.2.2 లక్షల కోట్లతో కలిపి మొత్తం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడితో పీఎంఏవై అర్బన్‌ 2.0 పథకాన్ని చేపడతామని తెలిపారు. రెంటల్‌ హౌసింగ్‌ మార్కెట్లను ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్రం విధానాలను రూపొందిస్తుందని చెప్పారు. అద్దె ఇళ్ల లభ్యతను పెంచడంతో పాటు నాణ్యత, పారదర్శకతకు అవసరమైన విధానాలు, నియమ నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ తరహా వసతులతో అద్దె గృహాలు నిర్మిస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని చేపడతామన్నారు. 

రాష్ట్రాలు స్టాంప్‌ డ్యూటీ తగ్గించాలి
మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై సుంకాన్ని మరింత తగ్గించే అంశంపై కేంద్రం దృష్టి సారిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పట్టణాభివృద్ధి పథకాల్లో దీనినొక తప్పనిసరి అంశంగా చేయనున్నట్లు చెప్పారు. అధిక స్టాంప్‌ డ్యూటీ వసూలు చేసే రాష్ట్రాలు వాటిని తగ్గించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆస్తుల కొనుగోలు లావాదేవీలపై రాష్ట్రాలు విధించే పన్నును స్టాంప్‌ డ్యూటీగా పేర్కొంటారు. 

ఆస్తుల రిజిస్ట్రేషన్‌ సమయంలో దీనిని చెల్లించడం జరుగు­తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదొక ప్రధాన ఆదాయ వనరు. ఇలావుండగా పన్ను ప్రయోజ­నాల విషయంలో ఆధార్‌ నంబర్‌కు బదులుగా ఆధార్‌ నమోదు ఐడీ వినియో­గాన్ని నిలిపివేయాలని సీతారామన్‌ ప్రతిపాదించారు.  

పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళిక
దేశంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగిన 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికను కేంద్రం ప్రతిపాదించింది. నగరాల సృజనాత్మకతో కూడిన పునర్‌ అభివృద్ధి కోసం ఓ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని తెలిపింది. నగరాలను అభివృద్ధి కేంద్రాలు (గ్రోత్‌ హబ్‌లు)గా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. టౌన్‌ ప్లానింగ్‌ పథకాల వినియోగంతో నగర చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, రవాణా ప్రణాళిక ద్వారా దీనిని సాధిస్తామని చెప్పారు.   

రక్షణ రంగానికి.. రూ.6.22 లక్షల కోట్లు
చైనా కవ్వింపులు, పాక్‌ ముష్కరుల చొరబాట్లతో సరిహద్దుల వెంట అప్రమత్తంగా ఉండే సైన్యంతోపాటు భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మరింత పటిష్టతే లక్ష్యంగా మోదీ సర్కార్‌ మరోమారు రక్షణ రంగానికి పెద్దపీట వేసింది.

Rakshana Rangam

2024–25 ఆర్థికసంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6,21,940.85 కోట్లు కేటాయించింది. అత్యాధునిక డ్రోన్లు, యుద్ధవిమా నాలు, నౌకలు, ఆయుధాలు, ఇతర సైనిక ఉపకరణాల కొనుగోలు కోసం ఏకంగా రూ.1,72,000 కోట్లను కేటాయించారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో రక్షణరంగ వాటా 12.9 శాతం పెరిగింది. 
 
గత ఆర్థికసంవత్సరంతో పోలిస్తే ఈసారి రక్షణరంగానికి కేటాయింపులు 4.79 శాతం పెంచారు. రక్షణ రంగంలో స్వావలంబనే లక్ష్యంగా సైనిక ఉపకరణాల స్థానిక తయారీని మరింత ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్‌ నడుం బిగించింది. అందుకే స్థానిక ఉపకరణాల సేకరణ కోసం రూ.1,05,518.43 కోట్లను కేటాయించింది. దీంతో బీజేపీ సర్కార్‌ లక్షిత రక్షణరంగంలో ఆత్మనిర్భరత మరింతగా సాకారంకానుంది. 

అగ్నిపథ్‌ పథకం కోసం రూ.5,980 కోట్లు
గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి సరహద్దుల వెంట రహదారుల నిర్మాణానికి కేటాయింపులు 30 శాతం పెరగడం విశేషం. బీఆర్‌వోకు కేటాయించిన రూ.6,500 కోట్ల నిధులతో సరిహద్దుల వెంట మౌలికవసతుల కల్పన మెరుగుపడనుంది. రక్షణరంగ పరిశ్రమల్లో అంకుర సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐడెక్స్‌ పథకానికి రూ.518 కోట్లు కేటాయించారు. అంకుర సంస్థలు, సూక్ష్మ చిన్నమధ్యతరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలు ఇచ్చే కొత్త ఐడియాలను ఆచరణలో పెట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు.

కోస్ట్‌గార్డ్‌ ఆర్గనైజేషన్‌కు రూ.7,651 కోట్లు కేటాయించారు. తేజస్‌ వంటి తేలికపాటి యుద్ధవిమానాలను తయారుచేస్తూ నూతన విమానాల డిజైన్, రూపకల్పన, తయారీ కోసం కృషిచేసే హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌కు రూ.1,600 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ రైఫిల్స్‌ విభాగం కోసం రూ.10,535 కోట్లు కేటాయించారు. ఎన్‌సీసీ కోసం రూ.2,726 కోట్లు, త్రివిధ దళాల్లో అగ్నిపథ్‌ పథకం నిర్వహణ కోసం రూ.5,980 కోట్లు కేటాయించారు. 

Rakshana Rangam

కేంద్ర ప‌న్నుల్లో పెరిగిన తెలంగాణ వాట‌
కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ.26,216.38 (2.102 శాతం) కోట్ల వాటా లభించనుంది. అందులో ఆదాయ పన్ను రూ.9,066.56 కోట్లు, కార్పొరేషన్‌ పన్ను రూ.7,872.25 కోట్లు, కేంద్ర జీఎస్టీ రూ.7,832.19 కోట్లు, కస్టమ్స్‌ రూ.1,157.45 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ రూ.243.98 కోట్లు, సర్వీస్‌ టాక్స్‌ రూ.0.86 కోట్లు, ఇతర పన్నులు రూ.43.09 కోట్లు ఉన్నాయి.
 
ఈ మేరకు 2024–25 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. గతేడాది బడ్జెట్‌లో కేంద్ర పన్నుల రూపంలో తెలంగాణకు రూ.23,066.20 కోట్లు కేటాయించగా దానితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో పన్నుల వాటా రూ.3,150.18 కోట్లు అధికం కావడం విశేషం.

రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్‌ కేటాయింపులు ఇవీ..
➢ ఈ ఏడాది బడ్జెట్‌లో హైదరాబాద్‌ ఐఐటీ (ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టులు)కి నిధుల కేటాయింపులో కోత విధించారు. గతేడాది రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి మొత్తం రూ.522.71 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్‌ (ఈఏపీ)లకు రూ.122 కోట్లు మాత్రమే కేటాయించారు. 

➢ తెలంగాణలోని గిరిజన యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా కేటాయింపులేవీ చేయలేదు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కలిపి కేటాయింపులు చేశారు. అయితే గతేడాది తెలంగాణ, ఏపీలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.37.67 కోట్లు కేంద్రంకేటాయించింది.

➢ హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌కు కేటాయింపుల్లో కోత విధించారు. గతేడాది రూ.115 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో కేవలం రూ.10.84 కోట్లే కేటాయించారు. 

➢ సింగరేణి కాలరీస్‌కు రూ.1,600 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌కు రూ.352.81 కోట్లు, హైదరాబాద్‌ సహా దేశంలోని 7 నైపర్‌ సంస్థలకు కలిపి రూ.242 కోట్ల మేర కేంద్రం కేటాయించింది. 
➢ హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ.28 కోట్లు, హైదరాబాద్‌ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ హిందీ సంస్థకు రూ.16.54 కోట్ల మేర కేటాయింపులు చేసింది. 

➢ హైదరాబాద్‌ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌  కంప్యూటింగ్‌ (సీ–డాక్‌)కు రూ.270 కోట్లు, నేషనల్‌ ఫిషరీస్‌ డెవలస్‌మెంట్‌ బోర్డుకు రూ.16.78 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు (పెన్షన్లు) రూ.603.33 కోట్లు, హైదరాబాద్‌ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, శిక్షణ, పరిశోధనకు మొత్తం రూ.1,348.35 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. 
➢ హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ. 940.66 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్‌)లోని భార జల ప్లాంట్లకు రూ.1,485.21 కోట్ల మేర కేటాయించారు.

Budget Details

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్లు 
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఆ నిధులను బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇస్తామని తెలిపారు. ‘ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తిస్తూ వివిధ అభివృద్ధి సంస్థల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయాన్ని సమకూరుస్తాం. 
 
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.15 వేల కోట్లు, రానున్న రోజుల్లో అదనపు మొత్తాలను అందచేస్తాం’ అని ఆమె తన బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్‌లో భాగంగా ఆమె తన ప్రసంగంలో ఏపీ పునర్విభజన చట్టం, అందులో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని, అందుకోసం ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. 

Amaravathi

భారత ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకం అని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి అదనపు నిధులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీతో పాటు బీహార్‌కు కూడా రూ.11,500 కోట్ల నిధులు కేటాయించామన్నారు. వారణాసిలోని విశ్వనాథుని ఆలయం తరహాలో బీహార్‌లోని బుద్దగయాలో ఒకటి ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీహార్‌లో పారిశ్రామిక కారిడర్‌ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. 

వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ..
ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రంలోని వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. విభజన చట్టం ప్రకారం.. పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తాం అన్నారు. హైదరాబాద్‌–బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేకంగా సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్‌లో ఓర్వ­కల్లుకు నిధులు ఇస్తామని చెప్పారు.  

తూర్పు తీర ప్రాంతాలైన ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీ­హార్‌ రాష్ట్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. విద్య, మౌలిక వసతులు, ఆర్థిక అవకాశాలు కల్పించి వికసిత్‌ భారత్‌కు ఈ ప్రాంతాలు గ్రోత్‌ ఇంజన్‌ అయ్యేలా కృషి చేస్తామన్నారు. దీనికి పూర్వోదయ అనే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. 

ఆ నిధులు ప్రపంచ బ్యాంకు నుంచి.. 
‘బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పినట్లుగా అమరావతి కోసం రూ.15 వేల కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా అప్పుగా (రుణాలు) తీసుకుంటాం. ఏడీబీ లేక ఏఐబీ లేక ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకుంటాం’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మరింత స్పష్టత ఇచ్చారు.

Published date : 24 Jul 2024 06:04PM
PDF

Photo Stories