Skip to main content

Orvakal Mega Industrial Hub: ఓర్వకల్లు మెగా ఇండిస్ట్రియల్‌ హబ్‌ అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో జూలై 23వ తేదీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో కర్నూలు జిల్లాకు కొంత మేలు జరిగేలా హామీలు గుప్పించారు.
Orvakal Mega Industrial Hub Details in Budget
ఓర్వకల్లు పారిశ్రామిక వాడలోని ఫ్యాక్టరీ

హైదరాబాద్‌–బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగంగా నోడ్‌ పాయింట్‌గా ఉన్న ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌(ఓహెచ్‌ఎం)కు నీరు, రోడ్లు, విద్యుత్‌, హైవే, రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నిజానికి ఈ నోడ్‌పాయింట్‌ను 2020 ఆగస్టు 20న గుర్తించింది. ప్రకటన తర్వాత కేంద్రం ఎప్పుడూ దీని అభివృద్ధిని పట్టించుకోలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దీనికి నీరు, విద్యుత్‌, రోడ్డు సౌకర్యాల కోసం నిధులు కేటాయించింది. రూ.428 కోట్లతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి నీరు అందించేందుకు పైపులైన్‌ పనులు చేపట్టారు. ఫేస్‌–1లో 288 కోట్లతో పనులు ప్రారంభించగా 80శాతం పూర్తయ్యాయి. చైన్నె–హైదరాబాద్‌ జాతీయ రహదారి నుంచి లింక్‌రోడ్డు, అంతర్గత రోడ్డు పనులు కూడా చేపట్టారు.

ఫేస్‌–1 కోసం రూ.1,800 కోట్లు కేటాయింపు
ఓహెచ్‌ఎంలో ఫేజ్‌–1లో మౌలిక సదుపాయల కల్పనకు ఇప్పటికే గత రాష్ట్ర ప్రభుత్వం రూ.1,800కోట్లు కేటాయించింది. దీంతో 2,600 ఎకరాల్లో డ్రైనేజీ, పవర్‌, నీరు, రోడ్లు అంతర్గతంగా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 10,900 ఎకాలు అభివృద్ధి చేయాలంటే కనీసం రూ.10వేల కోట్లు ఖర్చవుతుంది. ఇదంతా కూడా ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో అంతర్గత అభివృద్ధే. ఇది కాకుండా విద్యుత్‌, రైల్వే, హైవే, కారిడార్‌ బయట రోడ్ల కోసం మరిన్ని నిధులు అవసరమవుతాయి. ఈ నిధులను కేంద్రం భరించాల్సి ఉంది. కేంద్రం పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనలో ప్రధానమైన నీరు, రోడ్లు, విద్యుత్‌, రైల్వేలైన్లు, హైవేలను పూర్తి చేస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్‌ ప్రాంతాల్లో పని చేసే కార్మికుల నివాసానికి డార్మిటరీ తరహా అద్దె ఇళ్లను ఏర్పాటు చేయనుంది. అయితే వీటన్నింటికీ నిధుల కేటాయింపు జరగకపోవడం గమనార్హం.

ఇతర రంగాలకూ చేయూత
ముద్ర రుణాలను రూ.10లక్షల నుంచి రూ.20లక్షలకు పెంచారు. ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి క్రెడిట్‌ గ్యారెంటీ స్కీం కింద టర్మ్‌లోన్లు ఇస్తామన్నారు. సెల్ఫ్‌ గ్యారెంటీ ఫండ్‌ కింద మరో రూ.వందకోట్లు కేటాయించారు. జిల్లాలో 1766 ఎంఎస్‌ఎంఈలు ఉన్నా యి. ఈ ప్రోత్సాహంతో మరిన్ని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.

Mega Industrial Hub: క‌ర్నూల్‌లో 23 కంపెనీల ఏర్పాటుకు దరఖాస్తు

➤ విద్యార్థులకు రూ.10లక్షల వరకూ విద్యారుణం అందించనున్నారు. అయితే వీరు స్వదేశీ విద్యాసంస్థల్లో మాత్రమే చదవాలి.
➤ గ్రామీణ ప్రాంత అభివృద్ధికి రూ.2.66లక్షల కోట్లు కేటాయించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలకు మేలు జరగనుంది.

 
మౌలిక వసతులు మెరుగుపడితే పారిశ్రామికాభివృద్ధి
➤ కేంద్రం ఇండస్ట్రియల్‌ హబ్‌లో మౌలిక వసతులు కల్పిస్తే పారిశ్రామిక అభివృద్ధికి మరింత మేలు జరగనుంది.
➤ పరిశ్రమలశాఖ మంత్రిగా టీజీ భరత్‌ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను అత్యంత అనువైన ఓర్వకల్లుకు తరలిస్తే జిల్లా అభివృద్ధిబాట పడుతుంది.
➤ ఓహెచ్‌ఎం సమీపంలోనే ఎయిర్‌పోర్టు, జాతీయ రహదారి 298 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణపట్నం పోర్టు ఉంది. రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

➤ హైదరాబాద్‌లో భూమి సమస్య, ట్రాఫిక్‌ తీవ్రంగా ఉంది. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటైతే ఎయిర్‌ పోర్టు నుంచి పరిశ్రమకు పది నిమిషాల్లో చేరుకోవచ్చు.
➤ కాబట్టి కేంద్రం ప్రకటించినట్లు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలన్నీ ఏర్పాటవుతాయి.
➤ పైగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టాన్ని చేశారు.

➤ కాబట్టి ఎన్ని పరిశ్రమలు ఏర్పాటైనా ప్రతీ వెయ్యి ఉద్యోగాల్లో 750 కర్నూలు జిల్లావాసులకే అందనున్నాయి.
➤ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పూర్తిస్థాయిలో అభివృద్ధి అయితే నంద్యాల, కర్నూలు జిల్లాల అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది.
➤ ముఖ్యంగా ఫార్మారంగం అభివృద్ధికి హైదరాబాద్‌, వైజాగ్‌ కంటే అత్యంత అనువైన వాతావరణం ఇక్కడ ఉంది.

క్యాన్సర్‌ వైద్యానికి దన్ను
క్యాన్సర్‌ వైద్యంలో వినియోగించే మందులు, వైద్య పరికరాలకు కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. అలాగే 3 రకాల క్యాన్సర్‌ మందులపై కూడా కస్టమ్స్‌ డ్యూటీ తొలగించింది. దీంతో సామాన్యులకు భారమైన క్యాన్సర్‌ వైద్యం, మందులు ధరల తగ్గే అవకాశం ఉంది. కర్నూలులో స్టేట్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటైంది. ఇక్కడ వైద్యం, మందుల కోసం వచ్చే రోగులకు, ఇన్‌స్టిట్యూట్‌కు మేలు జరగనుంది.

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌ 2024-25.. పూర్తి వివ‌రాలు ఇవే..

ప్రత్యేక ప్యాకేజీ అంశంలో అన్యాయమే..
ఆంధ్రప్రదేశ్‌ పునర్వవ్యస్థీకరణ చట్టం–2014 ప్రకారం ‘సీమ’, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చట్టంలో పొందుపరిచారు. ఈ లెక్కన రూ.22,400 కోట్లను 2014–19 కాలంలో కేంద్రం కేటాయించాలి. అయితే బుందేల్‌ఖండ్‌ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరుతో ఈ ప్రాంతాలకు అన్యాయం చేసింది. ఒక్కో జిల్లాకు రూ.50కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు ఆ ఐదేళ్లు కేటాయించింది. ఇప్పుడు వెనుకబడిన 7 జిల్లాలకు ఆ నిధులను తిరిగి కొనసాగించనున్నారు. అంటే కర్నూలు జిల్లాకు రూ.50కోట్ల నిధులు మాత్రమే అందనున్నాయి.

Published date : 24 Jul 2024 07:26PM

Photo Stories