Skip to main content

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మల్లు భట్టి విక్రమార్క..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను మల్లు భట్టి విక్రమార్క జూలై 25వ తేదీ శాసనసభలో ప్రవేశపెట్టారు.
Telangana Budget

మొత్తం రూ.2,91,159 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, గత ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, శాఖల వారీగా బడ్జెట్‌ కేటాయింపులను వివరిస్తూ సుదీర్ఘంగా గంటా 45 నిమిషాల పాటు ప్రసంగించారు. 

ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తామిచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్న పట్టుదలతో ఉన్నామని.. ఆ దిశగానే రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేశామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, అర్హులకు రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్, నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం, అర్హులకు ఉచితంగా నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ సరఫరా వంటి హామీలను ప్రభుత్వం ఏర్పడిన కొన్నిరోజుల్లోనే అమల్లోకి తెచ్చామని చెప్పారు. 

వామనావతారంలా పెరిగిన అప్పులు.. 
తెలంగాణ ఏర్పాటైన తర్వాత దశాబ్దకాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని వట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు.. అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అడుగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న రూ.75,577 కోట్ల అప్పు.. 2023 డిసెంబర్‌ నాటికి వామనావతారంలా పెరిగి పెరిగి రూ.6,71,757 కోట్లకు చేరింది. సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నీళ్లను ఏ కాలువల ద్వారా పారించాలన్న ధ్యేయంతో కాకుండా.. అవినీతి సొమ్మును ఏ కాలువల ద్వారా ప్రవహింపచేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. 

ఓ వైపు అప్పులు, మరోవైపు పేరుకుపోయిన బిల్లులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మా ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలను చేపట్టడంతోపాటు మరింత మేలైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే కృత నిశ్చయంతో ఉంది. తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దుబారా ఖర్చులు కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం. ఈ సంవత్సరం మార్చి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు/పెన్షన్లు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. 

బడ్జెట్‌ సమగ్ర స్వరూపం (రూ.కోట్లలో) 
 

Telangana Budget

అప్పులు తీరుస్తూ.. సంక్షేమం పాటిస్తూ.. 
రాష్ట్రానికి డిసెంబర్‌ నాటికి రూ.6,71,757 కోట్లు అప్పులు ఉన్నట్టు తేలింది. మా ప్రభుత్వం వచ్చాక రూ.35,118 కోట్ల రుణాలు తీసుకోగా.. గత ప్రభుత్వం తాలూకు రూ.42,892 కోట్ల రుణాలు, వడ్డీలు చెల్లించాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే సమయంలో సంక్షేమాన్ని విస్మరించలేదు. డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశాం. మూలధన వ్యయానికి అదనంగా రూ.19,456 కోట్లు ఖర్చు చేశాం. 

గత దశాబ్దకాలంలో ఉద్యోగ నియామకాలు సరిగా జరగక నిరుద్యోగ యువత కలలు కల్లలయ్యాయి. అక్రమాలు, పేపర్‌ లీకేజీలు, అసమర్థ పరీక్ష నిర్వహణతో యువతకు ఉద్యోగాలు అందని పరిస్థితి ఏర్పడింది. దాన్ని సరిదిద్ది నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చే చర్యలను మా ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలను అందజేశాం. 

జాతీయ వృద్ధిరేటుకన్నా వెనుకబడ్డాం.. 
2023–24లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతం వృద్ధి చెందితే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం, తెలంగాణ 7.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అంటే గత ఏడాది జాతీయ వృద్ధిరేటు కన్నా తెలంగాణ వృద్ధిరేటు తక్కువ. 2023–24లో తెలంగాణ జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే రూ.14,63,963 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 11.9 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు 9.1 శాతం. 

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు ఖర్చుల కోసం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి రుణం నిరంతరంగా పెరుగుతూ వచ్చింది. కఠిన ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. 

జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు.. 
2023–24లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయం రూ.1,83,236తో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,64,063 ఎక్కువ. అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉంది. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.9,46,862 అయితే.. వికారాబాద్‌ జిల్లా తలసరి ఆదాయం రూ.1,80,241 మాత్రమే. అంటే జిల్లాల మధ్య ఆర్థికాభివృద్ధి సమాన స్థాయిలో లేదని స్పష్టమవుతోంది.. అని భట్టి పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖలు, పథకాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులను వెల్లడించారు. 

అతి త్వరలో రూ.2లక్షల వరకు రుణమాఫీ  
‘గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను అప్పుల్లోకి నెట్టిందే తప్ప నిజంగా ఎలాంటి మేలు చేయలేదు. మేం రైతులకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించాం. జూలై 18న రూ.లక్ష వరకు రుణమున్న 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ మొత్తాన్ని ఖాతాల్లో ఒకేసారి జమచేశాం. రూ.రెండు లక్షల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతిత్వరలో రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది.’ 

ధరణికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం
బడ్జెట్‌ ప్రసంగంలో వివిధ ప్రభుత్వ శాఖలు, పథకాల వారీగా చేసిన నిధుల కేటాయింపులను డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. పలు అంశాలకు సంబంధించిన విధానాలను, చేపట్టబోయే చర్యలనూ తెలిపారు.
 
➤ ‘రైతు భరోసా’ కింద అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000 చెల్లించాలన్నది మా సంకల్పం. అందుకే ప్రజలతో చర్చించి ఎలా చేయాలన్న దానిపై కసరత్తు  చేస్తున్నాం. 
➤ భూమిలేని రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగుపర్చడానికి వారికి ఏటా రూ.12,000 అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. 

➤ మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాము. ఈ పథకం క్రింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.  

➤ సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి 33 రకాల వరిని గుర్తించి, వాటికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లించాలని నిర్ణయించాం. 
➤ ధరణి పోర్టల్‌ సమస్యలు, పరిష్కారాల పురోగతిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తున్నాం. ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. 

➤ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3,500 చొప్పున మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నాం. ఇంటి విస్తీర్ణం కనీసం 400 చదరపు అడుగులతో ఉంటుంది. 
➤ ఒకే ప్రాంతంలో వేర్వేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ గురుకుల పాఠశాలలను 20 ఎకరాల స్థలంలో ఒకేచోట నిర్మిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్నిరకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం.

ఈసారి అప్పులు రూ.62,012 కోట్లు
ఈసారి బడ్జెట్‌లో అప్పుల పద్దు అదిరిపోయింది. గత ఏడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్లు ఎక్కువగా, మొత్తం రూ.62,012 కోట్లు రుణ సమీ కరణ జరగనుంది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదన గణాంకాలు ఈ మేరకు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సేకరించనున్నట్టు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 

TS Appulu

ఇక గతంలో తీసుకున్న అప్పులకు అసలు, వడ్డీల చెల్లింపు కోసం రూ.30 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. ఇందులో రుణం చెల్లింపుల కోసం రూ.13,117.60 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.17,729 కోట్లు ప్రతిపాదించారు. మొత్తం రూ.62 వేల కోట్ల రుణ సమీకరణ చేస్తే,అందులో దాదాపు సగం అంటే రూ.30,846 కోట్లు గతంలో తీసుకున్న అప్పులకు గాను అసలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతుందని కేటాయింపులు చెబుతున్నాయి. ఇవి పోగా మిగతా రూ.31,166 కోట్ల రుణాలను ఈ ఏడాది వినియోగించుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

పెరుగుతున్న అప్పులు, చెల్లింపులు
ఏటేటా అప్పుల చిట్టా పెరిగిపోతుందని గత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడుల్లో రూ.44,060 కోట్లు రుణాల కింద వస్తే, 2023–24లో రూ.52,576 కోట్లు తీసుకున్నారు. ఈ ఏడాది రూ.62 వేల కోట్లను అప్పుల పద్దు కింద ప్రతిపాదించడం గమనార్హం. అయితే తీసుకునే అప్పుల కంటేచెల్లింపులు ఎక్కువ చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరంఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూలై 24నాటికి రూ.35,118 కోట్లు అప్పుగాతీసుకుంటే.. గతంలో ఉన్న అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపుల కింద రూ.42,892 కోట్లు కట్టామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా రూ.6,050 కోట్లు అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాల్సి ఉండేదని, కానీ ఇప్పుడు నెలకు రూ.5,365 కోట్లు చెల్లిస్తున్నామని వివరించారు. 

ఆరు గ్యారంటీలకు ‘కోత’!
ఆరు గ్యారంటీల పేరుతో అమలు చేయాల్సిన 13 అంశాల్లో 8 అంశాలకు బడ్జెట్‌ కేటాయింపులు చూపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో 5 అంశాల గురించి ప్రస్తావించలేదు. 

TS Garentees

బడ్జెట్‌ కేటాయింపులు చేసిన 8 అంశాలకు కూడా ఏడాదికి సరిపోయే విధంగా నిధులు చూపెట్టలేదనే చర్చ ఆయా శాఖల్లో జరుగుతోంది. ఆరు గ్యారంటీల్లోని 8 అంశాలకు గాను రూ.47,166 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. దీనికి తోడు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, 2024–25 వార్షిక పూర్తి బడ్జెట్‌ కేటాయింపులకు వచ్చేసరికి రూ.6 వేల కోట్ల కోత విధించింది.  

కావాల్సిన దాని కంటే తక్కువగా..
ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతుబంధును రైతు భరోసాగా మార్చి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేసేందుకు గాను రూ.22,500 కోట్లు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఈ ఏడాది రూ.15,075 కోట్లు మాత్రమే కేటాయించారు. చేయూత పథకం కింద రాష్ట్రంలోని 43 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు పెంచాలంటే రూ.23 వేల కోట్లు కావాలి. కానీ ఈ పథకం కింద రూ.14,861 కోట్లే చూపెట్టారు. ఇక రాష్ట్రంలో 1.65 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారిలో దాదాపు 28 లక్షల మంది వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా, బీడీ కార్మికులుగా పెన్షన్లు పొందుతున్నారు. 

వీరు కాకుండా మరో 1.3 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తే రూ.39,900 కోట్లు కావాలి. కానీ ఈ పథకాన్ని ఈసారి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఈ ఏడాది నిర్మిస్తామని చెప్పిన 4.5 లక్షల ఇళ్లకు (ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున) రూ.22,500 కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో రూ.7,740 కోట్లే కేటాయించారు. భూమి లేని వ్యవసాయ కార్మికులకు రైతు భరోసా కింద రూ.3,600 కోట్లు కావాల్సి ఉండగా, రూ.1,200 కోట్లు చూపెట్టారు. 

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినా గతంలో లాగానే రూ.1,065 కోట్లు కేటాయించారు. వాస్తవంగా దీని అమలుకు రూ.2,500 కోట్లు అవుతుందని అంచనా. మరోవైపు యువ వికాసం లాంటి హామీని కూడా ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. మహాలక్ష్మి కింద అమలవుతున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఎల్‌పీజీ సిలిండర్లకు సబ్సిడీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌కు మాత్రం తగిన మేరకు నిధుల కేటాయింపు చూపెట్టారు. 

ఒకే ఏడాది రెండోసారి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒకే సంవత్సరంలో రెండుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రికార్డును ఆర్థిక మంత్రి హోదాలో భట్టి సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన భట్టి మళ్లీ జూలై 25వ తేదీ రెండోసారి అదేసంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ పెట్టారు. ఇక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు నేతృత్వంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది 13వ సారి కావడం గమనార్హం. వరుసగా 11 సంవత్సరాలు రెగ్యులర్‌ బడ్జెట్‌తో పాటు రెండు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లు పెట్టిన ఘనతదక్కించుకున్నారు.

ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధికి భారీ నిధి.. 
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.50,180.13 కోట్లు కేటాయించింది. గతేడాది చేపట్టిన కేటాయింపులతో పోలిస్తే కాస్త తగ్గి నట్లు కనిపించినప్పటికీ.. కార్యక్రమాల వారీగా పరిశీ లిస్తే భారీ కేటాయింపులే జరిగినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక అభివృద్ధి నిధి కేటాయింపులు 2023–2024 బడ్జెట్‌ కంటే రూ.1803 కోట్లు తగ్గాయి.
 
2024–25 బడ్జెట్‌లో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్‌డీఎఫ్‌) కింద రూ.33124.04 కోట్లు కేటాయించగా.. ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీఎస్‌డీఎఫ్‌) కింద రూ.17056.09 కోట్లు కేటాయించారు. 2023–24లో ఎస్సీఎస్‌డీఎఫ్‌లో దళితబంధు కింద రూ.17700 కోట్లు కేటాయించగా.. వాటిలో పైసా ఖర్చు చేయలేదు. తాజాగా దళితబంధు పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం.. ఆ స్థానంలో అంబేడ్కర్‌ అభయ హస్తం పేరిట కొత్త పథకాన్ని తీసుకొ స్తోంది. ఈ పథకం కింద ప్రస్తుత వార్షిక సంవత్సరానికి రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి గరిష్టంగా రూ.12 లక్షలు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు ఖరారు కాలేదు.

SC, ST

గత కేటాయింపుల్లో ఖర్చు 48 శాతమే.. 
2023–24 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ప్రభుత్వం రూ.51983.09 కోట్లు కేటాయించింది. కానీ ఇందులో ఖర్చు చేసింది రూ.25048కోట్లు మాత్రమే. గతబడ్జెట్‌లో ఎస్సీ నిధి కింద రూ.36750.48 కోట్లు కేటాయించగా.. రూ.14649 కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా ఎస్టీ నిధి కింద రూ.15232.61 కోట్లు కేటాయించగా.. రూ.10399 కోట్లు ఖర్చు చేశారు. గత బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో కేవలం 48 శాతం మాత్రమే ఖర్చు చేసింది.

పురపాలకశాఖకు.. రూ.15,594 కోట్లు 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో పురపాలక శాఖకు రూ.15,594 కోట్లు కేటాయించారు. 2023–24 బడ్జెట్‌లో కేటాయించింది రూ.11,372 కోట్లే. కాగా ఈసారి బడ్జెట్‌ కేటాయింపుల్లో హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా రూ.10 వేల కోట్లు ప్రకటించడం గమనార్హం. రానున్న మునిసిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ గ్రేటర్‌ హైదరాబాద్‌కు భారీగా నిధులు కేటాయించారన్న వాదన ఉంది.
 
హైదరాబాద్‌ అభివృద్ధిపై సీఎం స్పెషల్‌ ఫోకస్‌
ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిపాదనలు చేశారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీలను కలిపి జీహెచ్‌ ఎంసీ పరిధిలోకి తేవాలని సీఎం ఆలోచన. ఈ పరిధిలోనే రాబోయే పదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ప్రతిపాదించారు.

ఇందులో మూసీ రివర్‌ ఫ్రంట్, నాలాల అభివృద్ధి, మెరుగైన నీటిసరఫరా, మెట్రో విస్త రణ, ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా అభివృద్ధి, హైడ్రా ప్రాజె క్టుతో పాటు రీజినల్‌ రింగ్‌రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపో యినా, రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా ఈ అభివృద్ధి పనులు కొనసాగించాలని నిర్ణయించినట్టు రెండురోజుల క్రితం తన నివాసంలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇందులో భాగంగానే ఈ 2024–25 బడ్జెట్‌లో కేవలం హైదరాబాద్‌ అభివృద్ధికే రూ.10 వేల కోట్లు కేటాయించారు. వచ్చే జనవరినాటికి హైదరాబాద్‌ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ముగియనుంది. ఏడాదిన్న రలో జీహెచ్‌ఎంసీ పదవీకాలం కూడా ముగియనున్న నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న అన్ని పాలకమండళ్ల పరిధి నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు చేయాలనే అంశంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓఆర్‌ఆర్‌ లోపల అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఈ ఏడాదిలో వెచ్చించనున్నట్టు స్పష్టమవుతోంది.

Purapalaka

ఇతర జిల్లాల్లోని పురపాలికలకు.. 
హైదరాబాద్, రంగారెడ్డి పాత ఉమ్మడి జిల్లాలు మినహా మిగతా 8  ఉమ్మడి జిల్లాల్లోని పురపాలక సంస్థల్లో రూ.5,594 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోప్రధానమైన 100 మునిసిపాలి టీలతో పాటు పాత కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లపై ఫోకస్‌ పెట్టనున్నట్టు సమాచారం.  

పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పౌరసరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2022–23లో ఈ శాఖకు రూ.2,213 కోట్లు కేటాయించగా.. 2023–24లో రూ.3,001 కోట్లు కేటాయించారు. ఈ సారి గత సంవత్సరం కన్నా రూ.835 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం.

ఎల్పీజీ సబ్సిడీ కోసం..
రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం రూ.723 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 39.33 లక్షల కుటుంబాలకు ప్రతి గ్యాస్‌ సిలిండర్‌పై రూ.500 చొప్పున సబ్సిడీగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లకు రూ.500 చొప్పున సబ్సిడీ ఇస్తే రూ.590 కోట్లు ఖర్చవుతాయి. అదే 4 సిలిండర్లు ఇస్తే రూ.786 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

అటవీశాఖకు రూ.1,063 కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు సంబంధించి రూ.1,063.87 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో అటవీ, పర్యావరణ శాఖలోని వివిధ అంశాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. పీసీసీఎఫ్, హెచ్‌వోడీకి శాఖాపరంగా పలు విధుల నిర్వహణకు సంబంధించి రూ.876 కోట్లు (రూ.162.13 కోట్లు సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ స్కీమ్స్‌ కలిపి) ప్రతిపాదించారు. ములుగులోని ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.102.99 కోట్లు, జూపార్కులకు రూ.12 కోట్లు, అఫారెస్టేషన్‌ ఫండ్‌ రూ.5 కోట్లు, ప్రాజెక్ట్‌ టైగర్‌కు రూ.5.21 కోట్లు ప్రతిపాదించారు.

ఇంధన శాఖకు రూ.16,410 కోట్లు
రాష్ట్ర ఇంధన శాఖకు బడ్జెట్‌ కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2023–24లో శాఖకు రూ.12,727 కోట్లను కేటాయించగా, 2024–25 బడ్జెట్‌లో రూ.16,410 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇతర కేటగిరీలకు రాయితీపై విద్యుత్‌ సరఫరాకు గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ రూ.8,260 కోట్లను కేటాయించింది.

ఉదయ్‌ పథకం కింద రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల రుణాలను ప్రభుత్వం టేకోవర్‌ చేసుకోవడానికి గతేడాది రూ.500 కోట్లను కేటాయించగా, ఈసారి రూ.250 కోట్లకు తగ్గించింది. ప్రతి నెలా పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకు అమల్లోకి తెచ్చిన గృహ జ్యోతి పథకానికి మరో రూ.2418 కోట్లను కేటాయించింది. ట్రాన్స్‌కో, డిస్కంలకు ఆర్థిక సహాయం కింద రూ.1509.40 కోట్లను కేటాయించింది. గత ఐదు నెలల్లో గృహ జ్యోతి పథకం అమలుకు రూ.640 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే డిస్కంలకు చెల్లించింది. ఈ పథకం కింద 46,19,236 కనెక్షన్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ ఇస్తోంది.

విద్యారంగానికి రూ.21,292 కోట్లు  
విద్యారంగానికి 2024–25 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.21,292 కోట్లు కేటాయించింది. 2023–24లో కేటాయించిన రూ.19,093 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.2,199 కోట్లు ఎక్కువ కేటాయింపులు చేసింది. మొత్తం బడ్జెట్‌లో గతేడాది విద్యారంగం కేటాయింపులు 6.57 శాతం మేర ఉండగా తాజాగా అవి 7.31 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు. విశ్వవిద్యాలయాలకు గతంలో మాదిరిగానే రూ.500 కోట్లు కేటాయించారు. 

Study


 
విద్య పరిశోధన, శిక్షణ వ్యవహారాల రాష్ట్ర మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) నిధులు రూ.425.54 కోట్ల నుంచి రూ.705 కోట్లకు పెంచారు. సెకండరీ పాఠశాలలకు కేటాయింపులు రూ.390 కోట్ల నుంచి రూ.925 కోట్లకు పెంచారు. గురుకుల విద్యకు 2023లో రూ.662 కోట్లు కేటాయించగా ఈసారి రూ.694 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజనం వంటి కేంద్ర పథకాలకు కేటాయింపులు దాదాపు రూ.300 కోట్ల వరకూ పెరిగాయి. కళాశాల విద్యకు స్వల్పంగా రూ.60 కోట్లు పెంచారు.

Study Details

హోం శాఖకు 9,564 కోట్లు
రాష్ట్ర బడ్జెట్‌లో హోం శాఖకు నిధుల కేటాయుయింపు స్వల్పంగా తగ్గాయి. గత బడ్జెట్‌లో రూ.9,599 కోట్ల కేటాయించ‌గా.. ఈ సారి రూ.9,564 కోట్లు ప్ర‌భుత్వం కేటాయించింది. శాఖాధిపతికి రూ.374.48కోట్లు, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రూ.276.44 కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌కు రూ.20 కోట్లు కేటాయించారు. నిఘా విభాగానికి రూ.108.7 కోట్లకు పెంచారు. తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌)కు గతంలో రూ.8.5 కోట్లు ఇవ్వగా.. ఈ సారి రూ.20కోట్లకు పెంచారు. సైబర్‌ నేరాల కట్టడికి ఏర్పాటైన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు బడ్జెట్‌లో తొలిసారి రూ.15 కోట్లను కేటాయించారు.

నీటిపారుదల శాఖకు రూ.22,301 కోట్ల కేటాయింపు 
నీటిపారుదల శాఖకు నిధుల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది. 2023–24 బడ్జెట్‌లో రూ.26,885 కోట్లు ఇవ్వగా, 2024–25 బడ్జెట్‌లో రూ.22,301 కోట్లే కేటాయించారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన రుణాల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. మరోవైపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.10,829 కోట్లు కేటాయించింది. గతేడాది వీటికి రూ.9381 కోట్లు మాత్రమే ఇచ్చారు.

Water


 
ప్రాథమ్యాలకు నిధుల కరువే..
రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై 2024–25లో రూ.19,287 కోట్లు ఖర్చు చేయాలని నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసు కోగా, బడ్జెట్‌లో మాత్రం ప్రభుత్వం ఆశించిన మేరకు కేటాయింపులు జర పలేదు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.10,829 కోట్లు కేటాయించగా, మిగిలిన నిధులు కాళేశ్వరం, పాలమూరు –రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన రుణాల చెల్లింపులు, ఉద్యోగుల జీతభత్యాలకు వెళ్లనున్నాయి.

రుణాల చెల్లింపులకు నిధుల కోత..
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర జల వనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ డబ్ల్యూఆర్‌ఐడీసీ)తో పాటు ఇతర మార్గాల ద్వారా  రుణా లను సమీకరించింది. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి 2023–24 బడ్జెట్‌లో రూ.15,773 కోట్లు ప్రతి పాదించగా, తాజా బడ్జెట్‌లో రూ.9951 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం తగ్గించింది.

కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ.12,500 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.6914.54 కోట్లకు కేటాయింపులు తగ్గాయి. ఇక టీఎస్‌ డబ్ల్యూఆర్‌ ఐడీసీకి కేటాయింపులు రూ.3200కోట్ల నుంచి రూ.2962. 47 కోట్లకు తగ్గాయి. ఈ రుణాల తిరిగి చెల్లింపుల గడువును పొడిగించి వాటి కిస్తీల సంఖ్యను సైతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రుణా ల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను కోత పెట్టింది.

కేటగిరీల వారీగా ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..
భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు    రూ.8476.48 కోట్లు
మధ్య తరహా ప్రాజెక్టులకు    రూ.953.21
మైనర్‌ ఇరిగేషన్‌కు    రూ.857.73
వరదల నియంత్రణ, డ్రైనేజీ    రూ.282.24

Water Plant

ఆర్టీసీకి రూ.4,084 కోట్లు
బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఆర్టీసీకి రూ.4,084.43 కోట్లను ప్రకటించారు. ఈ మొత్తాన్ని మహాలక్ష్మి పథకానికి కేటాయిస్తున్నట్టుగానే చూపారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళల ఉచిత ప్రయాణ పథకానికి ఊతం ఇవ్వటానికే బడ్జెట్‌ కేటాయింపులు పరిమితమైనట్టు కనిపిస్తోంది. కేటాయింపుల్లో నేరుగా మహాలక్ష్మి పథకానికి కేటాయింపులుగా రూ.3,082.53 కోట్లను చూపారు. ఇక ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ.631.04 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద రూ.370.86 కోట్లు చూపారు. వీటిని కూడా మహాలక్ష్మికి కేటాయింపులుగానే పేర్కొన్నారు. దీంతో బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం ఆ పథకానికే ఖర్చు చేస్తారన్నట్టుగా ఉంది.

RTC

బకాయిలకు ఏం చేస్తారు?
ఆర్టీసీ ప్రస్తుతం భవిష్యనిధి సంస్థకు, ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి దాదాపు రూ.1,800 కోట్ల వరకు బకాయి పడింది. ఆ బకాయిలు చెల్లించటం లేదన్న ఆగ్రహంతో ఇటీవల భవిష్యనిధి సంస్థ ఆర్టీసీ ప్రధాన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ హైకోర్టును ఆశ్రయించి ఫ్రీజ్‌పై స్టే పొందింది. ఆ స్టే గడువు తీరితే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం పొంచి ఉంది. బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించటంతో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపైన విషయం తెలిసిందే. దీంతో బస్సులు సరిపోక కొత్తవి కొనాల్సి వస్తోంది.

అవసరమైనన్ని కొత్త బస్సులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వీటన్నింటికి చాలినన్ని నిధులు మాత్రం బడ్జెట్‌లో ప్రతిపాదించకపోవడంతో కార్మిక నేతలు పెదవి విరుస్తున్నారు. రాయితీ పాస్‌లకు సంబంధించి రూ.950 కోట్లు, ఇతరత్రా అవసరాలకు కావాల్సిన వాటితో కలుపుకొని రూ.1,782 కోట్లపై స్పష్టత లేకపోవటం ఆందోళకరమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1,500 కోట్లు ప్రతిపాదించింది. ఆ మొత్తానికి సంబంధించి రూ.వేయి కోట్ల వరకు బకాయిలు ఉండిపోయినట్టు సమాచారం. వాటిని ఎలా సర్దుబాటు చేస్తారని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

రోడ్లు బాగుపడేదెలా?
కొన్నేళ్లుగా రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ గాడి తప్పింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరసల రోడ్ల నిర్మాణ ప్రణాళికలో భాగంగా కొన్ని చోట్ల పనులు జరగటంతో కొత్త రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి చేపట్టాల్సిన రెన్యువల్స్‌ను గాలికొదిలేశారు. ఈ తరుణంలో తాజా బడ్జెట్‌లో పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తారన్న అంచనా ఏర్పడింది. కానీ దానిని తలకిందులు చేస్తూ రోడ్లకు అత్తెసరు నిధులే కేటాయించారు.

రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్ల నిర్వహణకు రూ.888 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.606 కోట్లు కేటాయించారు. ఇవి రోడ్లను బాగు చే యటం, అవసరమైన ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి ఎలా సరిపోతాయో ప్రభుత్వానికే తెలియాలని అంటున్నారు. ఇక రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు రూ.1,525 కోట్లు కేటాయించారు. ఇవి భూసేకరణ పద్దు కిందకే ఖర్చు కానున్నాయి.

బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు 
తాజా బడ్జెట్‌లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచింది. బీసీ సంక్షేమ శాఖకు గత బడ్జెట్‌లో రూ.6,229 కోట్లు ఇవ్వగా.. ఈసారి సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా రూ.9,200.32 కోట్లను కేటాయించింది. వాస్తవానికి కొన్నేళ్లుగా బీసీ కార్పొరేషన్‌తోపాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు బడ్జెట్‌ కేటాయింపులు ఆశాజనకంగా లేవని.. ఈసారి ఊరట కలిగించేలా కేటాయింపులు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

BC


 
➣ వడ్డెర, కృష్ణబలిజ పూసల, వాల్మీకి బోయ, భట్రాజ, కుమ్మరి, శాలివాహన, సగర కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్లకు, మేదర కో–ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్లకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.450 కోట్లు కేటాయించారు.
➣ తెలంగాణ తాడీ టాపర్స్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌కు రూ.68 కోట్లు.
➣ ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు, చేనేతకారుల సహాయానికి రూ.450 కోట్ల గ్రాంటు..

➣ నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌కు రూ.100 కోట్లు, వాషర్‌మెన్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌కు రూ.150 కోట్లు..
➣ ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర, ఈబీసీ వెల్ఫేర్‌ బోర్డులకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు.
➣ నీరా పాలసీకి రూ.25 కోట్ల గ్రాంటు ఇచ్చారు.

➣ మైనారిటీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,200 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.798 కోట్లు అదనంగా రూ.3,002.60 కోట్లు కేటాయించారు.
➣ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు ఈసారి రూ.2,736 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.2,131 కోట్లతో పోలిస్తే ఇది రూ.605 కోట్లు అదనం.
➣ ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ పథకాల కోసం అన్ని సంక్షేమశాఖలకు కలిపి రూ.2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.200 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాల కింద బీసీ సంక్షేమ శాఖకు అధికంగా రూ.1,650 కోట్లు కేటాయించారు.

సంక్షేమ శాఖలకు కేటాయింపులివీ..
శాఖ    నిధులు (రూ.కోట్లలో)
ఎస్సీ సంక్షేమం    28,724.53
గిరిజన సంక్షేమం    15,123.91
బీసీ సంక్షేమం    9,200.32
మైనారిటీ సంక్షేమం    3,002.60
మహిళా, శిశు సంక్షేమం    2,736.00
కార్మిక సంక్షేమం    881.86

పన్నుల ఆదాయంపై ఆశలు!
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పన్నుల ఆదాయంపైనే గంపెడాశలు పెట్టుకుంది. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల ద్వారా ఆదాయం రాబట్టుకోవడంపై కాంగ్రెస్‌ సర్కారు దృష్టిపెట్టినట్టు బడ్జెట్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం రూ.2.91లక్షల కోట్లతో బడ్జెట్‌ పెట్టిన ప్రభుత్వం.. అందులో ఏకంగా రూ.1.64 లక్షల కోట్లను (50 శాతానికిపైగా) పన్నుల రూపంలోనే సమీకరించుకుంటామని పేర్కొంది. ఇది గత ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే.. రూ.29 వేల కోట్లు (20 శాతం) అదనం కావడం గమనార్హం. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటా కింద వచ్చే రూ.26,216 కోట్లు పోను మిగతా రూ.1.38 లక్షల కోట్లను అమ్మకపు పన్ను, ఎక్సైజ్, ఇతర పన్నుల రూపంలో సమకూర్చుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.

TAX

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గత ఏడాది రూ.14,295.56 కోట్లురాగా.. ఈసారి రూ.18,228.82 కోట్లు వస్తాయని అంచనా వేశారు. దీన్ని బట్టి ఈ ఏడాదిలోనే భూముల విలువల సవరణ చేసే అవకాశం ఉంది. ఇక ఎక్సైజ్‌ ఆదాయాన్ని గత ఏడాది సవరించిన అంచనాల్లో రూ.20.298 కోట్లుగా చూపగా.. ఈసారి రూ.5వేల కోట్లు అదనంగా రూ.25,617 కోట్లు వస్తుందని ప్రతిపాదించారు. 
ఎక్సైజ్‌ ఆదాయ లక్ష్యం పెంపు నేపథ్యంలో.. ఈసారి మద్యం ధరలు పెరగొచ్చన్న చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద అమ్మకపు పన్ను ద్వారా గత ఏడాది రూ.57,394.46 కోట్లురాగా, ఈసారి 18శాతం అదనంగా రూ.68,273.73 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. జీఎస్టీ, ఎక్సైజ్, అమ్మకపు పన్ను, వాహనాలు, సరుకులు, ప్రయాణికుల రవాణా, ఇతర పన్నుల రూపంలో ఈ మొత్తం సమకూరనుంది.

భూముల అమ్మకంపై చర్చ!
ఈసారి పన్నేతర ఆదాయం ఏకంగా రూ.35,208.44 కోట్ల మేర వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. గత ఏడాది ఇది రూ.23,819.50 కోట్లుకాగా.. ఈసారి 50శాతం అదనంగా ప్రతిపాదించారు. అంతకుముందు 2022–23 ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.8,857.42 కోట్లు మాత్రమే. అప్పుడు పన్నేతర ఆదాయం పెంచిన తరహాలోనే ఇప్పుడూ పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 
ఈ క్రమంలో ప్రభుత్వ భూముల అమ్మకాలకు కాంగ్రెస్‌ సర్కారు సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టిని ప్రశ్నించగా.. భూములు అమ్ముతామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆదాయం పెంపు కోసం తమకు అనేక మార్గాలున్నాయని, అవన్నీ ఇప్పుడు వెల్లడించలేమని పేర్కొన్నారు.

ఆశల పల్లకి దిగని ‘గ్రాంట్లు’
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులపైనా రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకున్నట్టు బడ్జెట్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాంట్ల కింద ఈసారి రూ.21,636 కోట్లు వస్తాయని చూపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏడెనిమిదేళ్లుగా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను ఆశించడం, కేంద్రం మొండిచేయి చూపడం రివాజుగా మారింది. 
గత ఏడాది కేంద్రం రూ.13,179.21 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద ఇస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా.. రూ.9,729.91 కోట్లు మాత్రమే వచ్చాయి. అంతకు ముందు ఏడాది రూ,.8,619.26 కోట్లు మాత్రమే అందాయి. అయినా ఈసారి భారీగా అంచనా వేయడం గమనార్హం.    

Pannu

(నోట్‌: పన్నుల ఆదాయంతోపాటు పన్నేతర ఆదాయం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లను కలిపి మొత్తం రాబడుల కింద పరిగణిస్తారు. తాజా బడ్జెట్‌లో రూ.2,21,242.23 కోట్లు రాబడులు వస్తాయని ప్రతిపాదించారు. ఇది 2023–24లో రూ.1,69,089.59 కోట్లు, 2022–23లో రూ.1,27,468.63 కోట్లు మాత్రమే) 

Published date : 26 Jul 2024 02:45PM

Photo Stories