Shaktikanta Das: ఆర్‌బీఐ గవర్నర్ పదవికి వీడ్కోలు పలికిన శక్తికాంత దాస్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆరేళ్లలో ఆర్థిక–ద్రవ్య సమన్వయం అత్యుత్తమంగా ఉందని చెప్పారు. దేశ ద్రవ్య వ్యవస్థకు సంబంధించి కీలక అధికారాలకు సారథ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి గత ఆరేళ్లుగా తాను చేయాల్సిందంతా చేశానని పేర్కొన్నారు.
వృద్ధి మందగమనం రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు అధిక స్థాయిలో ఉండడం వల్ల సంభవించబోదని, ఇందుకు పలు కారణాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వృద్ధి పురోగతి– ద్రవ్యోల్బణం కట్టడి ఆర్‌బీఐ ముందు మున్ముందు ఉన్న సవాలని వివరించారు. ఉర్జిత్ పటేల్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత 2018 డిసెంబర్ 12న దాస్ ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా నియమితులయ్యారు.
మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు కేంద్రం పొడిగించింది. ఈ పొడిగించిన పదవీకాలం డిసెంబర్ 10వ తేదీతో ముగిసింది. ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా నియమితులైన రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11వ తేదీ బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్లు ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తారు.