Commonwealth Games 2022 : స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం PV సింధు.. ఇదే తొలి స్వర్ణం
Sakshi Education
కామన్‌వెల్త్ గేమ్స్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం సింధు అద్భుత విజయం సాధించింది. ప్రతిష్టాత్మక క్రీడల్లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది.
బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సత్తా చాటి పసిడి పతకం గెలిచి మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఆగస్టు 8వ తేదీన (సోమవారం) జరిగిన ఫైనల్లో కెనడా షట్లర్ మిచెల్లీ లీని సింధు మట్టికరిపించింది. ఆది నుంచి ఆధిపత్యం కనబరుస్తూ (21-15, 21-13) ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయింది. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ వరుస సెట్లలో పైచేయి సాధించి విజేతగా నిలిచింది.
ఇదే తొలి స్వర్ణం..
కామన్‌వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం, 2018లో రజత పతకాలను సింధు గెలిచింది. 2018లో సింధు ఫైనల్ చేరినా.. తుదిపోరులో మరో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Published date : 08 Aug 2022 03:59PM