Skip to main content

Copernicus Climate Change Service: అత్యంత ఉష్ణ ఏడాదిగా 2024.. ఎందుకింత వేడి?

జీవకోటికి ప్రాణాధారం సూర్యుడు. సూర్య కిరణాల ప్రసరణతో పుడమి పులకిస్తుంది.
2024 Will Be The Hottest Year On Record

అదే పుడమి నేడు భానుడి భగభగలతో అల్లాడుతుంది. గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌ వంటి విపరిణామాలే భూమిపై విపరీత ఉష్ణోగ్రతలకు ముఖ్య కారణాలు. గత కొన్ని నెలలుగా హీట్‌వేవ్‌లు, వాతావరణ మార్పుల కారణంగా ప్రతినెలా ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. వరుసగా గత 17 నెలల్లో చూస్తే 16 నెలల్లో సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతూ రావడం ఆందోళనకరం. 

ఇలా నెలల తరబడి సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవడంతో రాబోయే నెలల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లే ప్రమాదకర ధోరణి కొనసాగనుందని స్పష్టమవుతోంది. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌లోపునకు పరిమితం చేయాలన్న ప్రపంచ దేశాల ప్రతిజ్ఞ ఇప్పుడు నీరుగారిపోతోంది. 

ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్‌ దాటి నమోదైన తొలి ఏడాదిగా 2024 నిలవనుందని కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌(సీ3ఎస్‌) తాజాగా ప్రకటించింది. 1991–2020 సగటుతో పోలిస్తే ఈ ఏడాది జనవరి–నవంబర్‌ కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.72 డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువ నమోదైంది. నవంబర్‌లో సైతం గతంలో ఎన్నడూలేనంతటి ఉష్ణోగ్రత నమోదైంది. పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ఈ నవంబర్‌లో 1.62 డిగ్రీ సెల్సియస్‌ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 

Natural Disasters: ఈ ఏడాది భారత్‌ను వణికించిన ప్రకృతి విపత్తులు ఇవే..

2024 ఏడాది ఎందుకింత వేడి?
హరితవాయు ఉద్గారాలు అత్యధికంగా వెలువ డటంతోపాటు ఎన్నో కారణాలు ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణాలుగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక వేడిమిని సముద్రాల ఉపరితల జలాలు పీల్చుకో వడమూ దీనికి మరో కారణం. విచ్చలవిడి మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, ఎడారీకరణ తదితరాలు ఈ పరిస్థితిని మరింత ఉష్ణ మంటల్లోకి నెట్టేస్తున్నాయి. 

వాతావరణంలో కలుస్తున్న మీథేన్‌ స్థాయిలు సైతం గతంలో ఎన్నడూలేనంతగా పెరిగాయి. పారిశ్రామికీకరణ ముందునాటి కాలంతో పోలిస్తే 2023 చివరినాటికి వాతావరణంలో మీథేన్‌ గాఢత స్థాయి ఏకంగా 165 శాతం పైకెగసిందని, అధిక ఉష్ణోగ్రతకు ఇదీ ఒక కారణమని అధ్యయనకారులు విశ్లేషణ చేశారు. 

పారిశ్రామికీకరణ ముందునాటి కాలంతో పోలిస్తే ఉపరితల గాలి ఉష్ణోగ్రత ఈ ఏడాది జనవరి–నవంబర్‌ కాలంలో 1.54 డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువగా ఉంది. ‘మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కోసం సహజ ఎల్‌–నినో పరిస్థితులూ ఉష్ణోగ్రతల విజృంభణకు మరో కారణం’ అని సస్టేన్‌ ల్యాబ్‌ పారిస్‌ సీఈఓ డాక్టర్‌ మినియా ఛటర్జీ వ్యాఖ్యానించారు. 

Climate Change: భూగోళంపై ఉష్ణోగ్రత.. 3.1 డిగ్రీల పెరుగుదల.. కార‌ణం ఇదే..!

పరిస్థితి ఇలాగే ఉంటే ఏమౌతుంది?
అధిక ఉష్ణోగ్రత భరించలేని కష్టాలను మోసుకొస్తాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూ తాపోన్నతిలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్‌ దాటితే కరువు, అతి భారీ వర్షాలు, వరదలు సాధారణమవుతాయి. ఇది పర్యావరణానికి, మానవునికి హానికరం. మితిమీరిన వేడి కారణంగా పంటకు నష్టం వాటిల్లుతుంది. దిగుబడి దారుణంగా పడిపోతుంది. జీవజాతులకూ నష్టమే. సాధారణ ఉష్ణోగ్రతల్లో బతికే జీవులు మనుగడ సాధించడం కష్టం. 

చిన్న జీవుల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుంది. హీట్‌వేవ్‌ల కారణంగా హాలర్‌ కోతులు, చిన్న పక్షులు అంతరించిపోతాయి. ఉష్ణోగ్రతల్లో వైరుధ్యం కారణంగా జీవవైవిధ్యం దెబ్బతింటుంది. పక్షుల ఎదుగుదల తగ్గుతుంది. ‘ఉభయచర జీవులు పొదిగే క్రమంతోపాటు ఎండా, వానా, చలికాలాల మధ్య ఉన్న సరిహద్దు రేఖలు చెరిగిపోతాయి. అధిక వేడిమికి పాలిచ్చే జంతువుల మనుగడా కష్టమవుతుంది’ అని ది హ్యాబిటెంట్స్‌ ట్రస్ట్‌ సారథి రిషికేశ్‌ చవాన్‌ చెప్పారు. 
 
సముద్ర ఉష్ణోగ్రతలూ పైపైకి..
ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే పెరిగాయి. ఎక్కువ రోజుల పాటు సముద్ర ఉష్ణోగ్రతలు అధిక స్థాయిల్లో కొనసాగితే పగడపు దిబ్బల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వేడి పెరిగితే సముద్ర జీవావరణానికి సంబంధించిన ఆహారవల యంలో కీలక పాత్రపోషించే ఈ పగడపు దీవులు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంతర్థాన మవడం ఖాయం. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని 77 శాతం పగడపు దిబ్బల వద్ద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ధోరణికి అడ్డుకట్టవేయకపోతే మళ్లీ పూడ్చలేని నష్టం జరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది.

Climate Change: గతి తప్పుతున్న రుతుపవనాలు.. దీనికి కారణం ఇదే..

Published date : 12 Dec 2024 04:19PM

Photo Stories