Skip to main content

Climate Change: భూగోళంపై ఉష్ణోగ్రత.. 3.1 డిగ్రీల పెరుగుదల!

వాతావరణ మార్పులను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు చేపట్టిన చర్యలు సరిపోవడం లేదని ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్) తాజా నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
Global climate disaster inevitable if emissions aren't drastically reduced by 2035, UN warns

ఈ నివేదిక ప్రకారం.. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో దేశాలు విఫలమవుతున్నాయి, ఈ పరిస్థితి కొనసాగితే ఈ శతాబ్దం నాటికి సగటు ఉష్ణోగ్రత 3.1 డిగ్రీల సెల్సియస్(5.4 డిగ్రీల ఫారెన్‌హీట్‌) పెరగొచ్చని హెచ్చరించారు.

2015లో పారిస్‌లో జరిగిన కాప్-21 సదస్సులో 1.5 డిగ్రీల(2.7 ఫారెన్‌హీట్‌) పెరుగుదలను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ, దాని అమలు లోపం వల్ల సంతృప్తికరమైన మార్పులు రావడం లేదు. వాతావరణ మార్పుల కారణంగా భూగోళంపై జీవులు నాశనం అవ్వకుండా ఉండాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని, ఈ దిశగా సరైన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది.

➤ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వాస్తవ పరిస్థితిని చూస్తే 2100 నాటికల్లా ఉష్ణోగ్రతలు 3.1 డిగ్రీల దాకా పెరిగిపోనున్నాయి. అంటే లక్ష్యం కంటే రెండింతలు కావడం గమనార్హం. ప్రభుత్వాల చర్యలు ఎంత నాసిరకంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.  

➤ కర్బన ఉద్గారాలను అరికట్టడం, వాతావరణ మార్పులను నియంత్రించడం తక్షణావసరమని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ వెల్లడించారు. లేకపోతే మనమంతా మహావిపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  

Asteroid: భూమి సమీపంలోకి రాబోతున్న భారీ గ్రహశకలం..

➤ 2022 నుంచి 2023 దాకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలు 1.3 శాతం పెరిగినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది 57.1 గిగా టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌కు సమానం.  

➤ ఒకవేళ ఇప్పటినుంచి ఉద్గారాల నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసినప్పటికీ ఉష్ణోగ్రతలు 2100 కల్లా 2.6 డిగ్రీల నుంచి 2.8 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
  
➤ కర్బన ఉద్గారాల్లో అధిక వాటా జీ20 దేశాలదే. వాతావరణ మార్పులను అరికట్టడంతో ఆయా దేశాలు దారుణగా విఫలమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ లక్ష్యాల సాధనలో చాలా వెనుకంజలో ఉన్నాయని వెల్లడించింది.  

➤ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 42 శాతం, 2035 నాటికి 57 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమేనని నిపుణులు అంటున్నారు.  

➤ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌(కాప్‌–29) సదస్సు వచ్చే నెలలో అజర్‌బైజాన్‌లో జరుగనుంది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదిస్తారని పర్యావరణ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.  

Climate Change: గతి తప్పుతున్న రుతుపవనాలు.. దీనికి కారణం ఇదే..

Published date : 28 Oct 2024 04:23PM

Photo Stories