Skip to main content

Schools and Colleges Holidays Due to Heavy Rain 2024 : రానున్న మూడు రోజులు విద్యాసంస్థలకు సెల‌వులు.. అలాగే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ భారీ నుంచి అత్యంత భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే. రానున్న మూడు రోజులు అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
AP Schools and Colleges Holidays Due to Heavy Rain 2024

దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో అక్టోబ‌ర్ 15వ తేదీ నుంచి  అక్టోబ‌ర్ 17వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే చిత్తూరులో ఇవాళ, రేపు, అనంతపురంలో  బుధ, గురువారాలు ( అక్టోబ‌ర్ 16, 17వ తేదీల్లో) సెలవులు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.

రాయలసీమలో విస్తృతంగా వ‌ర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి రెండు రోజులలో పశ్చిమ-వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదలనుంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వ‌ర్షాల తీవ్ర‌త బ‌ట్టి వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్లు రేపు, ఎల్లుండి స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

ఈ జిల్లాల్లో భారీగా..
పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 35-55 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా..
అల్పపీడనం కారణంగా రెండో రోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెంకటగిరి, నెల్లూరులో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. కావలి, కొడవలూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు చెందినవారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉన్న కారణంగా.. రెండో రోజు కూడా విద్యా సంస్థలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా..
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కొనకలమెట్ల, పొదిలి, పొన్నలూరు, పామూరులో అధిక వర్షపాతం నమోదైంది. ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో తీరప్రాంత గ్రామాల్లో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నేడు జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

రేపు, ఎల్లుండి విద్యాసంస్థ‌ల‌కు...?
నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావ‌ర‌ణ శాఖ‌ పేర్కొంది. ముందు జాగ్రత్తగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అలాగే రేపు, ఎల్లుండి విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

Published date : 16 Oct 2024 08:36AM

Photo Stories