Skip to main content

Success Story : అమ్మ చెప్పిన ఆ మాట వ‌ల్లే క‌లెక్ట‌ర్ అయ్యానిలా..

‘చిన్నతనంలో నేను నడక రాక పడిపోయినప్పుడు అమ్మ నన్ను భుజం మీద వేసుకుని లాలించేది.. రాత్రి నిద్రలో భయపడి కలవరించినప్పుడు.. ప్రేమనంతా వేళ్లల్లో నింపి నా జుత్తు సవరించేది’’ అని అమ్మతో తన జ్ఞాపకాల్ని ఓ కవి చాలా హృద్యంగా వర్ణిస్తారు.
వినయ్‌చంద్, కలెక్టర్
వినయ్‌చంద్, కలెక్టర్

అలాగే మన కలెక్టర్ వినయ్‌చంద్ కూడా నాలుగు మాటలు చెబితే అందులో మూడు అమ్మ కోసమే మాట్లాడుతారు. అమ్మ ప్రభావం తన జీవితం మీద ఎలా ఉందో వివరిస్తారు.

అమ్మ మాట వల్లే..
ఐఏఎస్ అధికారిని చేయాలనేది నాన్న ఆశయం.. కానీ నా చిన్నప్పుడే ఆయన చనిపోయారు... నన్ను సమాజానికి సేవలందించే ప్రయోజకుడిగా తీర్చిదిద్దాలని ఆయన ఏ విధంగా కలలుగన్నారో అమ్మ చెప్పేది అంటూ గుర్తు చేసుకున్నారు. అమ్మ మాట వల్లే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పేశా... తదేక దీక్షతో ఐఏఎస్ సాధించా... పది మందికీ మంచి చేయడానికి ఇంతకు మించిన సర్వీసు మరొకటి లేదు... నాన్న ఆశయమేమిటో అమ్మ చెప్పకపోయుంటే ఆయనలాగే నేనూ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గానే ఉండిపోయేవాడిని...అని జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్‌చంద్తెలిపారు.

ఉద్యోగానికి రాజీనామ చేసి..

చదువులో చురుకుదనం.. అపారమైన విషయ పరిజ్ఞానం.. సమస్యను గుర్తించే నేర్పరితనం.. సవాళ్లను స్వీకరించడం.. వెరసి సమాజానికి తనవంతు కర్తవ్యంగా సేవ చేయాలన్న దృక్పథం వాడ్రేవు వినయ్‌చంద్‌ను సివిల్స్‌వైపు అడుగులు వేసేలా చేశాయి. కజిన్ స్ఫూర్తి.. ఐఏఎస్‌గా చూడాలన్న అతని నాన్న కలను నిజం చేసేందుకు ఎలక్ట్రికల్ ఇంజినీర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పేసి.. కలెక్టర్ అయ్యేందుకు దీక్షబూనారు. తొలి ప్రయత్నంలోనే ఐఆర్‌టీఎస్ వచ్చినా.. ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకుని నిరంతర శ్రమతో రెండో ప్రయత్నంలో సాధించారు. ఫలితంగా అఖిలభారత స్థాయిలో 18వ ర్యాంకు వచ్చింది.

అమ్మ చెప్పకపోయింటే....
సివిల్స్‌కు సిద్ధమయ్యే సమయంలోనే పరిపాలనపై అవగాహన, ఎదుట వ్యక్తులను అంచనా వేయడంలో పట్టు సాధించారు. శిక్షణ అనంతరం వివిధ హోదాల్లో పని చేసిన వినయ్‌చంద్ పనితనంలో తన ముద్రవేశారు.‘ ఆ రోజు నాన్న ఆశయమేమిటో అమ్మ చెప్పకపోయుంటే ఆయన లాగే నేనూ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గానే ఉండిపోయేవాడిని..

నా కుటుంబం :Family
మా పూర్వీకులది కృష్ణా జిల్లా, బందరు(మచిలీపట్నం)లో ఉండేవారు. మా నాన్న వాడ్రేవు పవన్ కిశోర్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పని చేశారు. అందువల్ల తొలుత ఖమ్మం జిల్లా పాల్వంచలో ఉండేవాళ్లం. ఒకటో తరగతి అక్కడే చదివాను. అదే సమయంలో మా నాన్న చనిపోయారు. తర్వాత మా అమ్మకు నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో ఉద్యోగం వచ్చింది. దీంతో విజయవాడకు మా కుటుంబ నివాసం మారింది. అక్కడి సత్యనారాయణపురంలోనే నా బాల్యం అంతా గడిచింది. 

చ‌దువు : 
రెండో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విజయవాడలోనే విద్యాభ్యాసం సాగింది. పదోతరగతి వరకు సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్‌లో చదివా. తర్వాత నలందా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాను. ఎంసెట్‌లో 414 ర్యాంకు సాధించాను. జైపూర్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ ఐటీ)లో సీటు వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ హానర్స్ చేశాను.

ఇంటర్వ్యూలోనే ఉద్యోగం.. కానీ
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సీఎస్‌సీ అనే మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే అమెరికాలోని అలబామా రాష్ట్రంలో బర్మింగ్‌హామ్‌కు ఆర్నెల్ల పాటు కంపెనీ విధుల నిమిత్తం వెళ్లొచ్చా.

ఐఆర్‌టీఎస్  వచ్చినా కూడా ...

IAS Interview


సివిల్ సర్వీస్ పరీక్షల్లో తొలి ప్రయత్నం (2006)లోనే 632 ర్యాంకు సాధించాను. రైల్వే ట్రాఫిక్ సర్వీస్(ఐఆర్‌టీఎస్) వచ్చింది. కానీ ఆ ఉద్యోగంలో చేరలేదు. నోయిడా నుంచి ఢిల్లీకి మకాం మార్చేశాను. ఏడాది పాటు తదేక దీక్షతో చదివాను. వాజీరామ్ అండ్ రవి ఇన్ స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాను. ఆంగ్లంపై పట్టు ఉండటం, చిన్నప్పటి నుంచి రైటింగ్ స్కిల్స్ పెంచుకోవడం ఇందుకెంతో ఉపకరించాయి. 2007లో రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్ రాశాను. తర్వాత మెయిన్ ్సలో విజయవంతమయ్యాను. 2008లో జరిగిన ఇంటర్వ్యూలో సంతృప్తిగా సమాధానాలు ఇచ్చాను. ఫలితంగా అఖిలభారత స్థాయిలో 18వ ర్యాంకు వచ్చింది. తర్వాత ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసిన తర్వాత కలిపిన మార్కులతో వేసే ఫైనల్ ర్యాకింగ్‌లో నేను ఏడో స్థానంలో నిలిచాను.

ఇలా చ‌దివా..
యూపీఎస్‌సీ పరీక్షలకు అప్పట్లో రెండు ఆప్షనల్ సబ్జెక్టులు ఉండేవి. నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ను అయినప్పటికీ కొత్త సబ్జెక్టులైన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (పాలనాశాస్త్రం), సైకాలజీ (మనస్తత్వ శాస్త్రం) ఆప్షనల్స్‌గా ఎంచుకున్నా. మానవ వనరులకు సంబంధించిన వీటిని ఎంతో మనసు పెట్టి చదివాను. ఈ రెండింటినీ పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో అధ్యయనం చేశాను. తక్కువ కాలంలోనే పట్టు సాధించడంతో డబుల్ ఎం.ఎ. చేసినట్లు అయి్యంది. వీటిపై అవగాహన వల్ల పరిపాలనలో, ఎదుటి వ్యక్తులను అంచనా వేయడంలో ఎంతగానే ఉపయోగపడుతోంది.

నా ఉద్యోగ ప్రస్థానం ...
ముస్సోరిలో రెండో దఫా శిక్షణ తర్వాత 2010 సెప్టెంబర్‌లో ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్ వచ్చింది. రాష్ట్రంలో 31 మండలాలున్న మదనపల్లి రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. తర్వాత 24 మండలాలతో రెండో స్థానంలో ఉన్న కందుకూరులో పనిచేయడం రెవెన్యూ పరమైన అంశాలపై ఎంతో అనుభవాన్ని ఇచ్చింది. ఏడాది తర్వాత మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు సబ్ కలెక్టరుగా బదిలీ అయి్యంది. విస్తీర్ణం చూస్తే విజయనగరం జిల్లా కన్నా పెద్దగా ఉండే డివిజన్ ఇది. బ్రిటిష్ వారి కాలం నుంచే కొనసాగుతున్న ఈ డివిజన్ కు నేను 149వ సబ్‌కలెక్టర్‌ను. అక్కడి చారిత్రాత్మకమైన పర్యాటక ప్రాంతం హార్సిలీ హిల్స్ అభివృద్ధికి కృషి చేశాను. రెండేళ్లలో రెండు అతిపెద్ద రెవెన్యూ డివిజన్ ల్లో పనిచేయడం ద్వారా నా ఐఏఎస్ ఉద్యోగ ప్రస్థానం ఆరంభమైంది.

ఈ ప‌ని చేసిన ఐఏఎస్ అధికారిని నేనే..
2012 మేలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. 2013 జనవరిలో తిరుపతిలో జరిగిన ప్రపంచ నాలుగో తెలుగు మహాసభలు విజయవంతం కావడానికి నా వంతు పాత్ర పోషించాను. పాడేరులో కోరి అడుగుపెట్టా సీనియర్ ఐఏఎస్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ తొలుత పాడేరు సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత ఆయన చిత్తూరు కలెక్టర్‌గా వచ్చిన సమయంలోనే నేను అక్కడ జాయింట్ కలెక్టరుగా ఉన్నా. పాడేరులో ఆయన ఎన్నో అనుభవాలను తరచుగా చెప్పేవారు. దీంతో పాడేరులో పనిచేయాలనే ఆసక్తి కలిగింది. సాధారణంగా జేసీ స్థాయిలో పనిచేసిన తర్వాత ఐటీడీఏ పీవోగా వెళ్లేవారు ఎవరూ ఉండరు.

కొద్ది సమయమే అయినా..
నేను కావాలని 2013 అక్టోబరులో పాడేరు ఐటీడీఏ పీవోగా వచ్చాను. ఈ పోస్టులోకి ఏడేళ్ల తర్వాత వచ్చిన ఐఏఎస్ అధికారిని నేనే. 2015 జనవరి వరకు పనిచేశాను. కొద్ది సమయమే అయినా అపురూపమైన అనుభవాలను మిగిల్చింది. అంగన్ వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, హాస్టళ్లు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఇలా ప్రాథమిక వసతులకు సంబంధించిన భవనాలు పెద్ద ఎత్తున నిర్మించడానికి చర్యలు తీసుకున్నాను. అప్పట్లో ఏజెన్సీ మొత్తానికి పాడేరులో మాత్రమే రెండు బ్యాంకులు ఉండేవి. రెండు మూడు వందల రూపాయలు తీసుకోవడానికి గిరిజనులు గంటల తరబడి బారులు తీరేవారు. బ్యాంకర్లను ఒప్పించి పాడేరులోనే మరో రెండు బ్యాంకులతో పాటు జి.మాడుగుల, ముంచంగిపుట్టు, చింతపల్లి తదితర మండల కేంద్రాల్లో మొత్తం ఏడు కొత్త బ్యాంకులను ఏర్పాటు చేయడంలో సఫలమయ్యాను.

హుద్‌హుద్ తుపాను..
విశాఖ జిల్లాను కుదుపేసిన హుద్‌హుద్ తుపాను ఏజెన్సీలో కాఫీ రైతులకూ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కాఫీ మొక్కలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లన్నీ కూలిపోయాయి. నష్టపరిహారం చెల్లించే విషయంలో అప్పటి వరకు కాఫీ మొక్కకు గుర్తింపే లేదు. కానీ వాటికి అత్యంత ముఖ్యమైన నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లు పడిపోయాయి. వీటి వల్ల కాఫీ మొక్కలకు నష్టం వాటిల్లుతుందని, అందుకు నష్టపరిహారం ఇవ్వాలనే కోణంలో మొట్టమొదటిగా నేనే అధికారులతో సర్వే చేయించాను. అలా ప్రభుత్వం నుంచి కాఫీ రైతులకు రూ.30 కోట్ల మేర నష్టపరిహారం ఇప్పించడం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది.

నా వివాహం :

Family


నేను వరంగల్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే 2010 ఏప్రిల్ 8న వివాహమైంది. నా భార్య సౌమ్య కీర్తి. కృష్ణా జిల్లా నేపథ్యమే అయినా ఆమె కుటుంబం హైదరాబాద్‌లో ఉండేవారు. మా బంధువుల ద్వారా పెద్దల కుదిర్చిన సంబంధమే మాది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలోనే ఎం.ఫార్మసీ చదివింది. మా పెళ్లి అయ్యే సమయానికి ఆమె హైదరాబాద్‌లోని థెరడోస్ ల్యాబ్స్ అనే ఔషధ పరిశోధన సంస్థలో యాంటీ క్యాన్సర్ డ్రగ్‌పై రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేసింది. సంగీతంలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. ఇటీవల విశాఖ ఉత్సవాల్లో వేదికపై ఆమె పాడిన ‘రాములో రాములో’ పాటతో నేనూ సరదాగా గొంతు కలిపా.

నా ఫస్ట్ టాస్క్ ఇదే..
వరంగల్‌జిల్లాలో రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తుంటారు. నేను అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ జాతర ఏర్పాట్లకు సమన్వయ అధికారిగా వ్యవహరించే అవకాశం వచ్చింది. అప్పటి వరంగల్ కలెక్టర్ ఎన్ .శ్రీధర్ ప్రోత్సాహంతో 40 శాఖల అధికారులను సమన్వయం చేస్తూ దిగ్విజయంగా జాతరను ముగించాం. నా కెరీర్‌లో ఫస్ట్‌టాస్క్‌ఇదే.

ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు..కానీ
నా ఐదేళ్ల వయసులోనే నాన్న చనిపోయారు. కానీ ఆయన ఆశయం అమ్మ లక్ష్మీ నాగ గిరిజ రూపంలో అలాగే ఉంది. ప్రజాసేవకు ఐఏఎస్‌ను మించిన సర్వీసు ఈ దేశంలోనే లేదని, నన్ను ఎలాగైనా ఐఏఎస్అధికారిని చేయాలని తరచుగా అమ్మతో అనేవారట. నాన్న అలా ఆశించేవారంటూ అమ్మ అప్పుడప్పుడూ చెప్పినా.. నేనెప్పుడూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇంజినీరింగ్‌పూర్తి చేయడంపైనే దృష్టిపెట్టాను. తర్వాత ఎంబీఏ చదవాలనుకున్నాను.

నా అదృష్టం ఇదే..
సొంత ప్రాంతమైన ఏపీ క్యాడర్‌రావడం నా అదృష్టం. 2008 ఆగస్టులో ముస్సోరిలోని లాల్ బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఐఏఎస్ శిక్షణ మొదలైంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థలో అడుగుపెట్టడం మరపురాని అనుభూతి. 2009 మే వరకు అక్కడే శిక్షణ. అదే సంవత్సరంలో శిక్షణలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. ఆ సమయంలోనే నాటి ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డిని స్వయంగా కలిసే అవకాశం వచ్చింది.

ఈయన స్పూర్తితోనే..
మా కజిన్ ఎల్.వెంకటేశ్వర్లు 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉత్తరప్రదేశ్ క్యాడర్. నేను నోయిడా ప్రాంతంలో పనిచేస్తున్నపుడే ఆయన గౌతమబుద్ధ జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. సెలవు వచ్చిదంటే ఆయన వద్దకు వెళ్తుండేవాణ్ని. పేదరికం ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో ప్రజల సంక్షేమం కోసం తాను చేస్తున్న పనుల గురించి మాటల సందర్భంలో చెబుతుండేవారు. ఉద్యోగంలో చేరింది మొదలుకుని ఉద్యోగ విరమణ వరకు ప్రజలకు చేరువగా ఉండి సేవ చేసే అవకాశం ఉన్న అత్యున్నత సర్వీసు ఐఏఎస్ మాత్రమేనని తెలుసుకున్నా. అదే సమయంలో నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలన్న మా నాన్న గారి ఆశయం నా మదిలో మెదిలింది. పది మంది సహాయం చేయాలనే భావనతో 2006లో ఇంజినీర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను. సివిల్ సర్వీసెస్‌ పరీక్షలపైనే పూర్తిగా దృష్టి పెట్టాను.

ప్రధానమంత్రి చేతుల మీదుగా...

PM Modi


పుణ్యక్షేత్రం తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా 2015 జనవరి నుంచి రెండున్నరేళ్ల పాటు పనిచేశాను. ఆ సమయంలో తిరుపతిలో కొత్త పార్కులను అభివృద్ధి చేయించాను. విమానాశ్రయం వద్ద సుందరీకరణకు ప్రాధాన్యం ఇచ్చాను. 2016లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. 2017లో తిరుపతిలో సైన్స్‌ కాంగ్రెస్ విజయవంతంగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేశాను. పేద‌ల‌కు వివిధ కార్య‌క్ర‌మాల ద్వారా సేవ‌లు చేసే వారు. ఈయ‌న‌కు ప్ర‌జా క‌లెక్ట‌ర్ అనేవారు కొంద‌రు. ఈయ‌న‌ పది మంది సహాయం చేయాలనే ల‌క్ష్యంతో ముందుకు వెళ్లుతున్నారు.

నా వ్యక్తిగతం జీవితం ఇలా..
పేరు: వాడ్రేవు వినయ్‌చంద్
తల్లిదండ్రులు: లక్ష్మీ నాగగిరిజ, వాడ్రేవు పవన్ కిశోర్
భార్య: సౌమ్య కీర్తి,
పిల్లలు: అమృత, అనీష్ భరద్వాజ్
ఇష్టమైన క్రీడ: టెన్నిస్
వినోదం: కొత్త సినిమా వస్తే చూడాల్సిందే
ఇష్టమైన పనులు: పుస్తక పఠనం. ఆర్థిక, చరిత్ర, ఫిలాసపీ పుస్తకాలు ఎక్కువగా చదువుతా. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం రాసిన పుస్తకాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి.
సమయం దొరికితే: కుటుంబానికే కేటాయిస్తా
అదృష్టం: ఏపీ క్యాడర్‌కి కేటాయించడం
ర్యాంకులు: ఎంసెట్:414 , సివిల్స్: 18

ఉద్యోగ పర్వం:
అసిస్టెంట్కలెక్టర్ వరంగల్: మేడారం జాతర నిర్వహణ క్షేత్ర స్థాయి పరిపాలన, సమన్వయాన్ని నేర్పింది.
కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్‌కలెక్టర్: రెవెన్యూ పరమైన అంశాలపై పట్టు సాధించేలా చేసింది.
చిత్తూరు జాయింట్ కలెక్టర్: తిరుపతిలో జరిగిన ప్రపంచ నాలుగో తెలుగు మహాసభలు విజయవంతమయ్యేలా కృషి చేశా. మాతృభాష రుణం తీర్చుకున్నా.
పాడేరు ఐటీడీఏ పీవో: గిరిజనుల సేవలో తరించే భాగ్యం లభించింది.
కలెక్టర్ పోస్టింగ్: ప్రకాశం, విశాఖపట్నం
మరిచిపోలేనిది: ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ఘటన విపత్తు నిర్వహణ నేర్పింది. సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడం మరచిపోలేని అనుభవం. ప్రాణనష్టం తగ్గించడం, సత్వరమే బాధితులకు నష్టపరిహారం ఇప్పించడం ఎంతో సంతృప్తినిచ్చే అంశాలు.

Manu Chowdary, IAS : అమ్మ కోసం..తొలి ప్రయత్నంలోనే

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Smita Sabharwal, IAS : స‌క్సెస్ జ‌ర్నీ...ఈమె భ‌ర్త కూడా..

Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచ‌ల‌న‌మే..

Published date : 14 Jan 2022 07:39PM

Photo Stories