Skip to main content

1,373 గ్రూప్‌–3 , 9,168 గ్రూప్‌–4 పోస్ట్‌లు: విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఇవే!!

APPSC&TSPSC Groups: group 3 4 notification and preparation tips, strategy
APPSC&TSPSC Groups: group 3 4 notification and preparation tips, strategy

గ్రూప్‌–3, గ్రూప్‌–4 పోస్ట్‌లు..రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో... సబార్డినేట్‌ సర్వీసుల్లో గ్రేడ్‌–3 హోదాలో ఉండే ఉద్యోగాలు! ఈ పోస్ట్‌ల భర్తీకి తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే నియామక పరీక్షలకు లక్షల సంఖ్యలో పోటీ ఉంటుంది! ఈ పోస్ట్‌లకు గ్రూప్‌–1,2 అభ్యర్థులు సైతం పోటీ పడుతుంటారు. ప్రభుత్వ కొలువుతో.. సుస్థిర కెరీర్‌ సాధ్యం చేసుకోవచ్చనే ఆలోచనే∙ఇందుకు కారణం. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. గ్రూప్‌–3,4 పోస్ట్‌లకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ పోస్ట్‌ల వివరాలు, రాత పరీక్షల విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ...

  • త్వరలో నోటిఫికేషన్‌కు అవకాశం
  • ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్షలు నిర్వహణ
  • సమకాలీన, సబ్జెక్ట్‌ అంశాల సమ్మిళితం  
  • ప్రాంతీయ అంశాలకు అధిక ప్రాధాన్యం

రాష్ట్ర స్థాయిలో పలు శాఖల్లో సబార్డినేట్‌ సర్వీసుల విభాగంలో గ్రూప్‌–3, 4 పోస్ట్‌ల భర్తీ చేపడతారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్‌–3, 4 ఉద్యోగ పరీక్షలకు విపరీతమైన పోటీ నెలకొంటోంది. ఇటీవల కాలంలో గ్రూప్‌–1,2 పోస్ట్‌లకు ప్రిపరేషన్‌ సాగించే వారు సైతం ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. కాబట్టి అభ్యర్థులు గ్రూప్‌–3, 4 పరీక్షలను ఆషామాషీగా తీసుకోకుండా.. పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

చ‌ద‌వండి: TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​ 

టీఎస్, ఏపీ గ్రూప్‌–3, 4 పోస్ట్‌లు

  • తెలంగాణలో 1,373 గ్రూప్‌–3 పోస్ట్‌లు, 9,168 గ్రూప్‌–4 పోస్ట్‌ల భర్తీ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 
  • ఏపీలోనూ మరికొద్ది రోజుల్లో పోస్ట్‌ల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్ట్‌లు, దేవాదాయ శాఖలో 60 ఎండోమెంట్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3 పోస్ట్‌లకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. 

ఆబ్జెక్టివ్‌ విధానంలోనే

గ్రూప్‌–3, గ్రూప్‌–4 సర్వీసులకు పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రిపరేషన్‌ను మాత్రం డిస్క్రిప్టివ్‌ విధానంలో సాగించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలు, ఉద్దేశాలు, నిర్వచనాలు, లక్ష్యాలు, సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. నిర్దిష్టంగా ఒక అంశం, దాని ఉద్దేశం తెలుసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అదే విధంగా ఆయా అంశాలకు సంబంధించి సమకాలీన పరిణామాలను సమ్మిళితం చేసుకుంటూ సాగాలి.

సొంత నోట్సు.. ఎంతో మేలు

గ్రూప్‌–3, 4 సర్వీసులకు ప్రిపరేషన్‌ సాగించే క్రమంలో సొంత నోట్స్‌ ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా నిర్వచనాలు, ముఖ్యాంశాలు, ముఖ్య సంఘటనలు, సంవత్సరాలు, సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలతో నోట్స్‌ రూపొందించుకోవాలి. దీనివల్ల ప్రిపరేషన్‌ పూర్తి చేశాక.. రివిజన్‌ సమయంలో వేగంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. గత ప్రశ్న పత్రాల సాధన, మోడల్‌ పేపర్ల ప్రాక్టీస్‌ వంటివి కూడా పరీక్ష శైలిని అవగాహన చేసుకునేందుకు ఉపయోగపడతాయి. 

అంశాల అనుసంధానం

  • గ్రూప్‌–3,4 అభ్యర్థులు అనుసరించాల్సిన మరో ముఖ్యమైన వ్యూహం.. ఆయా అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదవడం. ముఖ్యంగా జనరల్‌ స్టడీస్, ఎకానమీ, పాలిటీ వంటి సబ్జెక్ట్‌ల విషయంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. ఈ సర్వీసులకు దాదాపు 60 శాతం మేరకు ఒకే రీతిలో సిలబస్‌ ఉంటోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలి.

పోటీ చూసి ఆందోళన

గ్రూప్‌–3, గ్రూప్‌–4 సర్వీసు అభ్యర్థులు పోటీని చూసి ఆందోళన చెందకుండా మానసికంగా స్థిరంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ కొలువు అనగానే పీజీ, డిగ్రీ వంటి అర్హతలు ఉన్న వారు మొదలు సివిల్స్, గ్రూప్‌1కు హాజరయ్యే వారు సైతం పోటీ పడుతున్నారు. దీంతో గ్రూప్‌–3, 4లనే లక్ష్యంగా పెట్టుకున్న వారిలో ఆందోళన కనిపించడం సహజం. కానీ.. పరీక్షల్లో నెగ్గాలంటే ముందుగా ఆందోళనను వీడాలి. సాధించగలమనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. 

చ‌ద‌వండి: APPSC, TSPSC గ్రూప్స్ లో Mental Ability నుంచి 16-20 ప్రశ్నలు... టాప్‌ స్కోర్‌ సాధించడమెలా?

గ్రూప్‌–3 ఎంపిక విధానం

ఆయా శాఖల్లో సీనియర్‌ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్‌ ఆడిటర్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఆడిటర్, టైపిస్ట్‌ కమ్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్స్, జూనియర్‌ అకౌంటెంట్, పంచాయతీ సెక్రటరీలు, ఎండోమెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, పలు శాఖాధిపతుల ఆధ్వర్యంలో సబ్‌ సర్వీస్‌ పోస్ట్‌లుగా పేర్కొనే గ్రూప్‌–3 సర్వీసులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–3 పరీక్ష ఇలా

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–3 పరీక్ష మొత్తం మూడు పేపర్లుగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. మొత్తం 450 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

పేపర్‌ సబ్జెక్ట్‌ మార్కులు
1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ 150
2 హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ
1) తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర,తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం
2) భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం
3) సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు)
150
3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్
1. భారత ఆర్థిక వ్యవస్థ–అంశాలు, సవాళ్లు
2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
3. అభివృద్ధి, మార్పు అంశాలు
150
  • పేపర్‌–2, 3లలో ప్రతి పేపర్‌లోనూ మూడు టాపిక్స్‌ ఉంటాయి. ఒక్కో టాపిక్‌ నుంచి 50 ప్రశ్నలు చొప్పున 150 ప్రశ్నలతో పేపర్‌ ఉంటుంది. 

ఏపీపీఎస్సీ గ్రూప్‌–3 పరీక్ష విధానం

ఏపీపీఎస్సీ గ్రూప్‌–3 పరీక్ష కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు..

పేపర్‌ సబ్జెక్ట్‌ మార్కులు
1 జనరల్‌ స్టడీస్‌ మెంటల్‌ ఎబలిటీ అండ్‌ లాంగ్వేజ్‌ ఎబిలిటీ 150
2 ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యంగా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు 150


గ్రూప్‌–3, 4 దృష్టి పెట్టాల్సిన అంశాలు

  • జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు, ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు; సామాన్య శాస్త్రం, దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి; భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర; స్వాతంత్య్రానంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధి; తార్కిక విశ్లేషణా సామర్థ్యం,దత్తాంశ అనువర్తన, దత్తాంశ విశదీకరణ; విపత్తు నిర్వహణ–ప్రాథమిక భావనలు(సీబీఎస్‌ఈ 8, 9వ తరగతి స్థాయి); భారతదేశ భూగోళ శాస్త్రం; భారత రాజ్యాంగం–రాజకీయ వ్యవస్థ; సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి.


చ‌ద‌వండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

ప్రాంతాల వారీ అంశాలపై ప్రత్యేకంగా

  • అభ్యర్థులు తమ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ ప్రాధాన్య అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. 
  • ఏపీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, దాని పర్యవసానాలు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, లక్ష్యాలు–లక్షిత వర్గాలు, ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, సహజ వనరులు తదితర అంశాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక స్వరూపం ప్రత్యేకంగా చదవాలి.
  • తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ ఉద్యమ దశ,తెలంగాణ ఆవిర్భావం,తెలంగాణ చరిత్ర, కవులు, కళలు, సంస్కృతి, వారసత్వం, తెలంగాణ భౌగోళిక స్వరూపం, ముల్కీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలోని కీలక దశలు,ఒప్పందాలు గురించి తెలుసుకోవాలి. తెలంగాణ మలి దశ ఉద్యమంపై ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. 
  • రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి అంశాలు.. ఉదాహరణకు నదీ జలాల పంపిణీ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

సమకాలీన అంశాలకు ప్రాధాన్యం

  • గ్రూప్‌–3, 4 అభ్యర్థులు ప్రాంతాల వారీగా సమకాలీన అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి.
  • తెలంగాణ అభ్యర్థులు ఇటీవల కాలంలో తెలంగాణలో అమలవుతున్న కొత్త పథకాలు, బడ్జెట్, ఆర్థిక సర్వే వంటి వాటిని అధ్యయనం చేయాలి. 
  • ఏపీ అభ్యర్థులు కొత్త జిల్లాల ఏర్పాటు, ఐటీ పాలసీ వంటి తాజా పరిణామాల గురించి అధ్యయనం చేయాలి.
  • జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీలో.. రాణించేందుకు దత్తాంశాల విశదీకరణ, టేబుల్స్, గ్రాఫ్స్‌ను పరిశీలించి.. వాటిలోని ముఖ్యాంశాలను గుర్తించే విధంగా అధ్యయనం చేయాలి. 
  • అదే విధంగా పంచాయతీ రాజ్‌ వ్యవస్థ,సహకార సంఘాలు,స్థానిక సంస్థలు,సహకార ఉద్యమం తదితర అంశాలను ఔపోసన పట్టాలి. 


చ‌ద‌వండిGroup 1 & 2 : సిలబస్‌ దాదాపు ఒక్కటే.. ఈ చిన్న మార్పులను గమనిస్తే..: కె.సురేశ్‌ కుమార్‌ గ్రూప్‌–1 విజేత

గ్రూప్‌–4 ఆబ్జెక్టివ్‌ విధానంలోనే

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ.. అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్, టైపిస్ట్, జూనియర్‌ స్టెనోగ్రాఫర్స్‌ వంటి పోస్ట్‌లకు నిర్వహించే గ్రూప్‌–4 పరీక్షలు కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటాయి. ఆ వివరాలు..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–4 పరీక్ష ఇలా

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–4 పరీక్ష రెండు పేపర్లుగా 300 మార్కులకు ఉంటుంది. అవి.. పేపర్‌1 జనరల్‌ నాలెడ్జ్‌ 150 మార్కులకు, పేపర్‌ 2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు ఉంటాయి. 

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 రెండు విధాలుగా

ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌–4 పరీక్షను రెండు రకాలుగా నిర్వహిస్తున్నారు. 
ఆయా పోస్ట్‌లను అనుసరించి ఇంటర్మీడియెట్, పదో తరగతి అర్హతగా పేర్కొంటూ.. ఆ అర్హతలకు సరితూగే విధంగా రెండు రకాల పేపర్లను, సిలబస్‌ను నిర్దేశించారు. 

  • సాంఘిక సంక్షేమ శాఖ, ఇతర సంక్షేమ విభాగాల్లోని సబ్‌ సర్వీస్‌ పరిధిలో నియామకాలు చేపట్టే.. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు బీఈడీ అర్హతగా పేర్కొన్న నేపథ్యంలో ఈ పరీక్షకు ప్రత్యేక విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ 150 మార్కులకు, పేపర్‌ 2 సంబంధిత సబ్జెక్ట్‌ 150 మార్కులకు ఉంటాయి. 
  • పలు ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపట్టే జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు సంబంధించి పరీక్షలోనూ రెండు పేపర్లు ఉంటాయి. ఈ ప్రశ్న పత్రం దాదాపు పదో తరగతి స్థాయిలో ఉంటుంది. ఇందులో పేపర్‌ 1 జనరల్‌ నాలెడ్జ్‌ 150 మార్కులకు, పేపర్‌ 2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు ఉంటాయి.
  • ఏపీపీఎస్సీ పోస్ట్‌లకు సంబంధించి స్క్రీనింగ్‌ టెస్ట్‌లను రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆయా నోటిఫికేషన్లు, పోస్ట్‌ల సంఖ్యను బట్టి ఒక్కో పోస్ట్‌కు 200కు పైగా దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి.
  • కొన్ని గ్రూప్‌–4 పోస్ట్‌లకు సంబంధించి లాంగ్వేజ్‌ టెస్ట్‌లను కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల విడుదల చేసిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు ఇంగ్లిష్, తెలుగు లాంగ్వేజ్‌ టెస్ట్‌ పేపర్‌ను పేర్కొన్నారు.
     

చ‌ద‌వండి: APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!

Published date : 19 Apr 2022 05:09PM

Photo Stories