APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్–1, గ్రూప్–2, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ‘‘భారతదేశ చరిత్ర’’పై అవగాహన మాత్రమే ఉంటే సరిపోదు, అకడమిక్ అంశాలు వేరు, కాంపిటీటివ్(పోటీ) విధానాలు వేరు అని గుర్తించాల్సి ఉంటుంది. రెండూ భిన్న ధ్రువాలు, పోటీ ప్రపంచంలో చరిత్ర ప్రాధాన్యతను తెలుసుకొని.. దానిపై పట్టు సాధించేందుకు అభ్యర్థులు ఇష్టపడి చదవటానికి ప్రయత్నించాలి. టీఎస్‌పీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ గ్రూప్1, గ్రూప్2 వంటి పోటీ పరీక్షల్లో విజయానికి భారతదేశ చరిత్రపై పట్టు సాధించడం ఎలాగో తెలుసుకుందాం...
చాలామంది అభ్యర్థులు చరిత్ర ‘సముద్రం’ లాంటిదని భావిస్తుంటారు. వాస్తవానికి ప్రణాళికబద్దంగా, తులనాత్మకంగా, సమకాలిన అంశాలతో చదివితే చరిత్రను తేలికగా గుర్తుపెట్టుకోవచ్చు. పోటీ పరీక్షల అభ్యర్థులకు చరిత్ర, భారతీయ సంస్కృతి–సమాజ సాంప్రదాయాలపై అవగాహన తప్పనిసరి. ముఖ్యంగా భారతీయ స్వాతంత్రోద్యమ చరిత్ర, తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ చరిత్ర–సంస్కృతి మొదలైన అంశాలపై పట్టు సాధించాలి. ‘‘ఒకే టాపిక్‌ను పదే పదే చదవటం కాకుండా.. ఒక టాపిక్‌ను పలు ప్రమాణిక పుస్తకాలతో పోల్చి చూసి.. నోట్స్ రాసుకోవాలి. భారతదేశ రాజ్యాలు, రాజ వంశాలు వరుస క్రమంలో గుర్తుంచుకొని.. వారి రాజ్య స్థాపకులు–వాస్తు శిల్పకళ నైపుణ్యం, వారి నిర్మాణ శైలి, అనుసరించిన పద్ధతులు, సామాజిక, ఆర్థిక, సాహిత్య రంగాలపై దృష్టి సారించడం మంచిది.
చదవండి: AP History Practice Test
భారతదేశ చరిత్రను భాగాలుగా పరిశీలించాలి.. అవి..
1. ప్రాచీన భారతదేశ చరిత్ర(క్రీ..పూ.10,000 నుంచి క్రీ.శ.750 వరకు)
2. మధ్యయుగ భారతదేశ చరిత్ర(క్రీ.శ.750 నుంచి క్రీ.శ.1707 వరకు) (భూస్వామ్య వ్యవస్థ ప్రారంభం నుంచి ఔరంగజేబు మరణం వరకు)
ఎ. దక్షిణ భారతదేశ చరిత్ర(శాతవాహనుల నుంచి∙బహ్మని రాజ్యాల స్థాపన వరకు; క్రీ.పూ 225 నుంచి క్రీ.శ 1347 వరకు).
బి. ప్రాంతీయ రాజ్యాల స్థాపన–రాజపుత్రులు, రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజ్యాలు మొదలైనవి.
సి. విజయనగర–బహ్మని రాజ్యాల సాహిత్య, సాంస్కృతిక రంగాల అభివృద్ధి.
3. ఆధునిక భారతదేశ చరిత్ర(1707–1885వరకు)(జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం వరకు).
4. భారత స్వాతంత్య్రోద్యమం (1885–1947 వరకు); దీనిని తిరిగి నాలుగు దశలుగా విభజించాలి. అవి..
- మితవాదుల యుగం 1885–1905 వరకు
- అతివాదుల యుగం 1905–1920 వరకు
- గాంధీ యుగం(1920–1947)
ప్రాచీన భారతదేశ చరిత్రలో చదవాల్సిన అంశాలు
- ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహా.., మానవ జాతులను వర్గీకరించాడు. తమిళనాడులోని పల్లవరంలో తొలి మానవుని ‘రాతిగొడ్డలి’ లభించింది లాంటి అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది.
- ‘ప్రీ హిస్టరీ’ అనే పదం తొలిసారిగా డేనియల్ విల్సన్ ఉపయోగించాడు. ప్రాచీన శిలాయుగానికి ‘పాలియోలితిక్ ఏజ్’ అని, నవీన శిలాయుగానికి ‘నియోలితిక్ ఏజ్’ అని జాన్ ల్యూబెక్ పేరు పెట్టాడు.
- ప్రాచీన యుగంలో రాగులు,ఉలవలు పండించిన తొలి ప్రాంతాలుగా తమిళనాడులోని తిరుముయ్యుం, ఆర్యులు పదానికి మూలమైన ‘‘ఐరియిన్’’ పదం పర్షియా భాషకు చెందింది. ఇలాంటి పదాలను ప్రత్యేకమైనవిగా గుర్తించి రాసుకోవాలి.
- ప్రాచీన నాగరికతలోని ముఖ్యాంశాలను చదువుకునేప్పుడు జియోగ్రాఫికల్ అట్లాస్ ముందుంచుకుంటే చాలా ఉపయుక్తం. ఉదా: దశరాజగణ యుద్ధంలో విశ్వామిత్రుడు దారికోసం రెండుగా చీల్చిన నది.. విపాశ(బియాస్).. ఇలాంటి వాటిని గుర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రశ్నలకు అభ్యర్థులు తార్కికంగా ఆలోచించి సమాధానం గుర్తించాల్సి ఉంటుంది.
- వేదకాలం నాటి సాహిత్యం, మత పరిస్థితులు, నాటి సామాజిక వ్యవస్థ గురించి చదవడం చాలా అవసరం. క్రీ.పూ.6వ శతాబ్దం కాలం నాటి మత పరిస్థితులు, నూతన మత ఉద్యమాలు.. వాటి ఆవిర్భవానికి దోహదపడిన అంశాలు వివరణాత్మకంగా అధ్యయనం చేయాలి.
- ఉదాహరణకు: యముడితో పోరాడే నచికేతుడి కథ కల్గిన ఉపనిషత్ ఏది? (కఠోపనిషత్)..
- ఎర్రని గుర్రాలు గల రథాలపై విహరించిన ఆకాశదేవత ఎవరు?(ఉష)..
- సమితికి అధ్యక్షుడైన చక్రవర్తిని తొలి ఆర్యుల కాలంలో వత్సగా ఎందుకు పిలిచారు. –గార్గి, మైత్రేయ.. యజ్ఞవల్కరుషితో జరిగిన పండిత వివాదం గురించిన వివరాలు ఏ వేద సాహిత్యం(ఉపనిషత్)లో ఉన్నాయి (బృహదరాణ్యకోపనిషత్).. లాంటివి.
- మత ఉద్యమాలు, వాటి సిద్ధాంతాలు, వాటి ప్రభావం.. భారతదేశ సమాజంలో ఎలాంటి మార్పు తెచ్చింది? సమకాలీన రాజ వంశాలు.. వారి బౌద్ధ, జైన మత సేవలను గమనించాలి.
- గుణాడ్యుడి బృహత్‌కథకు ఏద్యోదనుడు, గంగాదుర్వినీతుడులకు గల సంబంధం ఏమిటి?(గుణాడ్యుడు పైశాచిక ప్రాకృత భాషలో బృహత్ కథను రచించాడు. దీనిలోని కొన్ని వ్యాఖ్యానాలను ‘కువలయమాల’ పేరుతో ఏద్యోదనుడు రాశాడు. బృహత్ కథను సంస్కృతంలో గంగాదుర్వినీతుడు రాశాడు).
- సాహిత్యంలో వచ్చిన మార్పులను అభ్యర్థులు ఎంత వరకు గ్రహించారో తెలుసుకునే కోణంలో ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది.
- బౌద్ధమత నినాదమైన బుద్ద:సంఘం: ధర్మ: శరణం గచ్చామి అని మొదట ఉచ్చరించిన బౌద్ధ బిక్షువు ఎవరు?(యశుడు, శ్రేష్టుడు).
- బుద్దుడి అంత్య దినాల గురించి.. అతని మహాపరి నిర్యాణం గురించి ఖచ్చితమైన సమాచారమిచ్చే బౌద్ధ రచన ఏది?(నిచ్చాన సూత్ర).. ఇలాంటి ప్రశ్నలపై తులనాత్మక, వివర ణాత్మకంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
- మౌర్యులు, గుప్తులు లాంటి గొప్ప రాజ వంశాల్లోని పరిపాలనాంశాలను, సాహిత్య, శిల్పకళలను గురించి చదవాలి. ఉదా: మౌర్యుల పాలన మొగలుల పాలన కంటే చాలా గొప్పదిగా వర్ణించి చరిత్రకారులు ఎవరు?(వి.ఎ. స్మిత్).
- సుదర్శన తటాకం.. పునర్ నిర్మాణంలో పాల్గొన్న రాజ్యవంశాలు ఎన్ని?
- అశోకుని చిన్న శిలా శాసనం జతింగ రామేశ్వరంలో లభించింది. ఇది ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది(కర్ణాటక)?
- ప్రతి సంవత్సరం జరిగే గ్రామ జాతరలలో.. స్త్రీలను ఒక దేవాలయం నుంచి మరో దేవాలయానికి అమ్మేవారు. ఈ వాస్తవ సంఘటనలు ఏ రాజ్య వంశానికి చెందినవి. (వేంగి చాళుక్యులు) లాంటివి ప్రధానాంశాలుగా గుర్తించాల్సి ఉంది.
- ఉత్తర భారతదేశంలో మౌర్యుల అనంతరం శుంగ, కణ్వ, ఇండో గ్రీకులు, శకులు, పార్ధియనులు, కుషాణులు మొదలైన రాజ్యవంశాల స్థాపన గురించి.. వారి సాంస్కృతిక సేవ గురించి ప్రత్యేకమైన నోట్స్ రాసుకోవాలి.
మధ్యయుగ భారతదేశం
- మధ్యయుగ భారత దేశ చరిత్ర నుంచి మత, సామాజిక, సాంస్కృతిక అంశాలు ఎక్కువగా రావొచ్చు. ఉదా: గుణసముందర్ అనే బిరుదు ఎవరికి ఉంది? (మిత్రసింహుడు).
- జ్యోతిష్య శాస్త్రాన్ని, కల్హణ రాజతరంగణి, లీలావతి అంకగణితాన్ని పర్షియా భాషలోకి అనువదించింది ఎవరు?(జోతిష్య శాస్త్రాన్ని–మఖ్‌మల్‌ఖాన్, కల్హణ రాజతరంగణి–మౌలానాషాబది, లీలావతి అంకగణితం–అబుల్‌ఫైజి).
- 1571 సంవత్సరంలో అక్బర్ కాలంలో మన్సబ్‌దారీ విధానం.. ముజఫర్‌ఖాన్, షామాన్ సూర్ ప్రవేశపెట్టడానికి గల కారణం?
- కబూలిమత్ రైతులకు భూమిపై యాజమాన్య హక్కులు ఎవరి ప్రభుత్వం గుర్తించింది?
- భంగు అనే మత్తు పానీయ పంటను ప్రోత్సహించిన మొగల్ రాజు ఎవరు?
- మొగల్ కాలంలో ఆగ్రా, ఫతేపూర్ సిక్రి మహానగరాలనీ, అవి లండన్ కంటే పెద్దవనీ తన రచనల్లో పేర్కొన్నది ఎవరు?(రాల్ఫ్‌పిచ్) లాంటి ప్రశ్నలు కీలకంగా భావించాలి.
- మొగల్‌ల మతవిధానం–దక్కన్ విధానం, రాజపుత్ర విధానం, నిర్మాణ శైలి, సాహిత్య రంగాలను గుర్తించాలి.
- మొగల్‌లు, సిక్కు సంబంధాలు–మరాఠా రాజ్య ఉత్థానం గురించి భిన్నమైన కోణంలో చదవాలి.
- జాఫర్ అనే కలం పేరుతో దివాని–ఇ–జాఫర్ పేరున నాల్గు సంపుటాలు స్వయంగా రాసి.. భారతదేశ స్వేచ్ఛ కోసం నూతన జెండా/పతాకం రూపొందించిన మొగల్ చక్రవర్తిగా బహాదూర్‌షా–2 ప్రాధాన్యతను తెలుసుకోవాలి.
- ఏ విజయనగర చక్రవర్తి సింహళం వంటి దేశాలతో వర్తక వ్యాపారాలు చేశారు. పెరిస్టా వంటి చరిత్రకారుల అభిప్రాయాలను పొందుపర్చుకోవాలి.
ఆధునిక భారతదేశ చరిత్ర
- ఐరోపా వారి రాక, వారి వలసవాదం, వాణిజ్యవాదం, సామ్రాజ్యవాదం లాంటి అంశాలపై వివరణాత్మకంగా నోట్స్ రాసుకోవాలి.
- కొలంబస్ అమెరికా ఖండాన్ని(1492) కనుగొనడం; వాస్కోడిగామ భారతదేశానికి గుడ్‌హోప్ ఆగ్రం(దక్షిణాఫ్రికా) ద్వారా నూతన సముద్ర మార్గాలు కనిపెట్టడం అనేవి మానవజాతి చరిత్రలో నమోదైన రెండు అత్యంత ప్రమాదమైన మహాత్తర సంఘటనలుగా వర్ణించిన మాటలు ఏ చరిత్రకారుని ఆలోచన ఇలాంటి వ్యాఖ్యానాలు, స్టేట్‌మెంట్స్ ఎక్కువగా ఆధునిక భారతదేశంలో రావడానికి ఆస్కారం ఉంది.
- బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన గిరిజన, రైతు, సామాన్య పౌర తిరుగుబాట్లు అత్యంత ప్రాముఖ్యత గల అంశాలు.
- సన్యాసుల అజరామర పోరాటాలను స్మరిస్తూ.. ఎవరు తమ రచనల్లో కీర్తించి.. భారతదేశం స్వాతంత్య్ర ఉద్యమానికి గొప్ప గ్రంథం అందించారు.
- హిందూ–ముస్లింల ఐక్యత గురించి, గొప్పతనం గురించి.. ‘‘భారతదేశంలోని గాలిని పీల్చి జీవిస్తున్నాం. పవిత్ర గంగా, యమున జలాల్ని తాగుతున్నాం. మన దేహాల్లో, రక్తంలో భారతీయత ఇమిడి ఉంది అన్న మాటలను ప్రత్యేకంగా రాసుకోవాలి.(సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఆధునిక ఇస్లాం పితామహుడుగా ప్రసిద్ధి చెందిన గొప్ప నాయకులు అన్న మాటలు అవి)
- 1857 సిపాయిల తిరుగుబాటులో కాన్పూర్ ప్రాంతంలో సామాన్య ప్రజలను సైనికులకు మద్దతుగా తన నాట్య ప్రదర్శన ద్వారా ప్రేరేపించిన గొప్ప నర్తకి ఎవరు? లాంటి లోతైన ప్రశ్నలను అభ్యర్థులు తెలుసుకోవాల్సి ఉంటుంది. (అజీజాన్ గొప్ప నాట్యకారిణి)
చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
స్వాతంత్రోద్యమ చరిత్ర
- చాలామంది అభ్యర్థులు.. చరిత్రలోని ఈ దశ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయనే ఆలోచనతో ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదు. చరిత్ర– సంస్కృతి, వారసత్వం, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, స్వాతంత్య్ర ఉద్యమం.. ఇలా అన్ని దశలు ప్రాధాన్యతగలవిగానే భావించాలి.
- పోటీ అనేది చాలా కీలక స్థాయిలో ఉంటుంది. కాబట్టి బట్టీ పట్టి వచ్చే అభ్యర్థులు విఫలం చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాన్సెప్ట్ ఒరియంటేడ్‌లో చదవాల్సిందే. ఉదా: గతంలో అడిగిన ఒక ప్రశ్నను గమనిద్దాం.. దేవసమాజ్, ప్రార్థనసమాజ్, వేద సమాజ్, రాదాసత్సంగ్.. అవి ఏర్పడిన ప్రాంతాలను ఉత్తరం నుండి దక్షిణం దిశగా వరుస క్రమంలో అమర్చుము. దీనికి అభ్యర్థులు సుమారు 2 నిమిషాల సమయం తీసుకోవాల్సి వస్తుంది. మొదట వాటి స్థాపకులు ఎవరు? అవి ఏయే సంవత్సరంలో ఏ ప్రాంతాల్లో ఏర్పడ్డాయో.. భౌగోళికంగా ఆయా ప్రాంతాలు ఉత్తరం నుండి దక్షిణ దిశలో వరుస క్రమంలో అమర్చాలి? ఒకే ప్రశ్నగా కనిపించినా.. దీనిలో 4ప్రశ్నలు అంతర్లీనంగా ఉన్నాయని గమనించాల్సి ఉంటుంది. పరీక్ష సమయంలో అభ్యర్థి వేగంగా స్పందించే స్వభావం అంచనా వేయడం కోసమే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు?
- బ్రిటీష్ వారి పాలనలో వచ్చిన మార్పులు.. అవి రాజకీయ, సామాజిక, ఆర్థిక, రంగాలపై అభ్యర్థులు ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఉదా: కెప్టెన్ బకిల్, మేజర్ బీట్సన్(ప్లాన్), మైఖేల్ టాపింగ్(ప్లాన్)ల ప్రకారం– దేశంలో ఏ నదిపై వీరు ఆనకట్టలు నిర్మించి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. రైతు శ్రేయోభిలాషులుగా ప్రజల మన్ననలు పొందిన వారు చాలా ప్రాధాన్యత గల అధికారులు. ఇలాంటి వారు, వివిధ ప్రాంతాల్లో ఆయా రంగాల్లో వారి సేవలు గుర్తించి చదవాల్సి ఉంటుంది(పై అధికారుల ప్లాన్ ప్రకారం– కెప్టెన్ ఓర్, కెప్టెన్ సర్ ఆర్దర్ కాటన్ ధవళేశ్వరం వద్ద(1848), గోదావరి బ్రిడ్జిను రాజమండ్రి వద్ద నిర్మించారు. 1852 మార్చి నెలలో పూర్తిచేశారు. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వద్ద (1852–54)లో కెప్టెన్ లేక్, కెప్టెన్ ఓర్, సర్ ఆర్దర్ కాటన్‌లు కలిసి నిర్మించారు.
- వరి బాగా పండే ప్రాంతం బర్మా(మయన్మార్). దీని కోసమే, ఆంగ్లేయులు బర్మాపై దృష్టి సారించారు. కాగా అప్పటి ఆంగ్ల గవర్నర్ జనరల్ లార్డ్ అమ్హరెస్ట్‌ను బంధించడానికి ప్రత్యేకంగా బంగారు సంకెళ్లు చేయించిన బర్మా సైన్యాధిపతి లాంటి వారిని నిజమైన దేశభక్తులుగా గుర్తించాల్సి ఉంటుంది.(బహాబందులా)
- కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌మహాత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్రోద్యమ పండుగను 75 వారాల పాటు నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఈ కోణంలో కూడా చదవాల్సి ఉంటుంది. మితవాదులు(దాదాబాయి నౌరోజి), అతివాదులు(తిలక్), గాంధీ యుగంలో గాంధీ వివిధ ఉద్యమాల నేపథ్యం అత్యంత కీలకాంశాలు. –గాంధీయిజం.. బోల్షివిక్‌యిజం కంటే అత్యంత ప్రమాదకరం అనే మాటలు ఏ వైశ్రాయివి లాంటి ప్రకటనలను సేకరించాల్సి ఉంటుంది. (సమాధానం: లార్డ్ వెల్లింగ్టన్).
- చివరిగా అభ్యర్థులకు ఒక సూచన . మీరు విభిన్న కోణలో నోట్స్ తయారుచేసుకొని ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, వినూత్న ప్రణాళికతో చదవండి. విజేతలుగా నిలవండి!!
డా.మురళి పగిడిమర్రి, సబ్జెక్ట్ నిపుణులు
చదవండి: TSPSC Group-1 Guidance: పోటీ తీవ్రం... సిలబస్‌పై సమగ్ర పట్టుతోనే విజయావకాశాలు!!