Jobs: 64పోస్టులు.. 45ఖాళీ
ఉన్నత పాఠశాలల నిర్వహణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బోధన చేసినా చేయకపోయినా ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించడం, విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడం డీఈఓ, ఎంఈఓ, అధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాలకు హాజరుకావడం, విద్యాకమిటీతో సమావేశాలను నిర్వహించడం చేసేవారు.
ఇలా పెద్దసార్లకు ఎన్నో బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. జిల్లాలో అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేసి ఏళ్ల తరబడి ఉన్నత పాఠశాలల నిర్వహణ వారి చేతిలో పెట్టారు. జిల్లావ్యాప్తంగా 64 ఉన్నత పాఠశాలలు ఉండగా.. గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులు 64 ఉన్నాయి. వీటిలో 19 పోస్టుల్లో మాత్రమే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పనిచేస్తుండగా.. మరో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
చదవండి: TSPSC: పరీక్షల నిర్వహణ పరీక్షే!.. వాయిదా వేస్తే ఈ పరీక్షలపైనా ప్రభావంపడే అవకాశం
పల్లెల్లోనే పోస్టులు ఖాళీ..
ప్రధానోపాధ్యాయుల పోస్టులు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనే ఖాళీగా ఉండడం గమనార్హం. గత ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులు లేవు. సర్వీస్ రూల్స్ అంశం కోర్టు కేసులో ఉండటంతో స్కూల్ అసిస్టెంట్లలో ఎంతో మందికి అర్హత ఉన్నా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభించడం లేదు.
చాలా కాలం నుంచి పదోన్నతలు లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ పొందారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండటంతో సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు అదనపు బాధ్యతలను అప్పగించారు. వారు తమ సబ్జెక్టును బోధిస్తుండటంతోపాటు పాఠశాల నిర్వహణ బాధ్యతలను మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అదనపు బాధ్యతలతో ఇబ్బందిగా ఉందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఉపాధ్యాయుడికి రెండు రకాల బాధ్యతలను అప్పగించడం విద్యాహక్కు చట్టానికి విరుద్ధం. అయినప్పటికీ గెజిటెడ్ హెచ్‌ఎంల పోస్టులు ఖాళీగా ఉండటంతో చట్టానికి విరుద్ధంగా వ్యవహరించడం తప్పడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పట్టణ ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలలతో పాటు, మండల కేంద్రాలు, సమీపంలో ఉన్న పాఠశాలలు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో నిండాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలలు మాత్రం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లేక బోసిపోతున్నాయి.