Skip to main content

TSPSC: పరీక్షల నిర్వహణ పరీక్షే!.. వాయిదా వేస్తే ఈ పరీక్షలపైనా ప్రభావంపడే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సతమతమవుతోంది.
TSPSC
పరీక్షల నిర్వహణ పరీక్షే!.. వాయిదా వేస్తే ఈ పరీక్షలపైనా ప్రభావంపడే అవకాశం

ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను వాయిదా వేయాలంటూ ఒకవైపు ఒత్తిడి పెరుగుతుండగా... మరోవైపు ఇప్పటివరకు తేదీలు ప్రకటించని పరీక్షల నిర్వహణ ఎలా అనే అంశం కమిషన్‌కు తలనొప్పిగా మారుతోంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముంచుకొస్తోంది. ఆ తర్వాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు, అనంతరం పార్లమెంటు ఎన్నికలతో ప్రభుత్వ యంత్రాంగం అత్యంత కీలక కార్యక్రమాల్లో బిజీ కానుంది. దీంతో ఆలోపు అర్హత పరీక్షలను నిర్వహించాలని మొదటినుంచి కార్యాచరణ సిద్ధం చేసుకున్న టీఎస్‌పీఎస్సీకి ప్రస్తుత పరిస్థితులు మింగుడుపడటం లేదు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

తాజాగా టీఎస్‌పీఎస్సీని గ్రూప్‌–2 వాయిదా డిమాండ్‌ అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ నాలుగు నెలల క్రితమే ప్రకటించింది. ఈ క్రమంలో సమయం తక్కువగా ఉన్నందున గ్రూప్‌–2కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయామని, మరికొంత సమయం ఇవ్వాలని, ఇందులో భాగంగా పరీక్షలను కొంతకాలం వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో పాటు కమిషన్‌ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం టీఎస్‌పీఎస్సీని ఇరకాటంలో పడేసినట్లయింది. 

‘లీకేజ్‌’తో గందరగోళ పరిస్థితులు.. 

గురుకుల విద్యా సంస్థల్లో దాదాపు 9వేలకు పైబడి ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రస్తుతం అర్హత పరీక్షలను నిర్వహిస్తోంది. అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్న టీఆర్‌ఈఐఆర్‌బీ ఆగస్టు 23వ తేదీ వరకు విరామం లేకుండా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి వేగంగా పరీక్షలను పూర్తి చేస్తోంది. మరోవైపు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సైతం ఎలాంటి ఆందోళనలకు తావులేకుండా పరీక్షల నిర్వహణలో బిజీ అయ్యింది. దాదాపు 45 వేల ఉద్యోగాల భర్తీతో వివిధ రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ... షెడ్యూల్‌ను రూపొందించి పరీక్షల నిర్వహణకు ఉపక్రమించింది.

కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్న కమిషన్‌... ఇదివరకే నిర్వహించిన నాలుగు రకాల పరీక్షలను రద్దు చేయడం... మరో రెండు పరీక్షలను వాయిదా వేయడం... మరికొన్నింటిని రీషెడ్యూల్‌ చేయడంతో రూపొందించుకున్న ప్ర­ణాళిక గాడి తప్పింది. ఆ తర్వాత పరిస్థితులను చక్కదిద్దుకుంటూ క్రమంగా పరీక్షలను నిర్వహిస్తూ ముందుకెళ్తుండగా... ఇప్పుడు గ్రూప్‌–2 
పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్‌తో ఇరకాటంలో పడింది. 

వాయిదా వేస్తే... 

మరో రెండు నెలల్లో ఎన్నికల సమయం ఆసన్నం కానుంది. వరుసగా ఎన్నికలుండటంతో కొంతకాలం పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగం, ఇతర పరిపాలనాధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీ అయితే, పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పరీక్షల వాయిదా ఒక డిమాండ్‌ అయితే... ఇంకా కొన్ని రకాల పరీక్షలకు తేదీలు ప్రకటించకపోవడం మరో అంశం.

గ్రూప్‌–3 పరీక్షతో పాటు డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓలతో పాటు డిగ్రీ లెక్చరర్స్, జూనియర్‌ లెక్చరర్స్‌ తదితర పోస్టులతో పాటు చిన్నాచితకా పోస్టులకు ఇంకా టీఎస్‌పీఎస్సీ తేదీలే ఖరారు చేయలేదు. ఇప్పుడున్న డిమాండ్‌ను పరిగణించి పరీక్షను వాయిదా వేస్తే ఆ ప్రభావం మిగతా పరీక్షల నిర్వహణపైన పడుతుంది.

ఎన్నికల సమయం నాటికి పరీక్షలు పూర్తిచేయకపోతే, ఆ తర్వాత కొంతకాలం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని కమిషన్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఎంతో శ్రద్ధతో పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులు అసహనానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఎస్‌పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.  

Published date : 11 Aug 2023 12:36PM

Photo Stories