Skip to main content

Medical Staff Transfers: మెడికల్‌ బదిలీల్లో గందరగోళం

సాక్షి, హైదరాబాద్‌: వైద్య సిబ్బంది బదిలీల్లో గందరగోళం నెలకొంది. బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారమే గడువు కావడంతో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది హడావుడి పడుతున్నారు.
Confusion in medical transfers

మరోవైపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారే కానీ, స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయలేదని కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై 11న‌ హైదరాబాద్‌ కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం, డీఎంఈ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయాల వద్ద డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వం ఇచ్చిన బదిలీల వ్యవహారం అస్తవ్యస్తంగా ఉందనీ.. సీనియార్టీ జాబితాలు తప్పుల తడకగా తయారు చేశారని వారు మండిపడ్డారు. అలాగే నర్సింగ్‌ ఆఫీసర్లు, ఎంపీహెచ్‌ఎస్‌లు కూడా తమ బదిలీలపై గందరగోళం నెలకొందని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం వద్ద నిరనసకు దిగారు.

ముందు ప్రమోషన్లు ఇస్తారా? లేదా బదిలీలు చేస్తారా? ఏవి ముందు జరుగుతాయని తెలంగాణ బోధన ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కిరణ్‌ మాదల నిలదీశారు. బదిలీలపై యంత్రాంగం గందరగోళాన్ని సృష్టించిందని ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు డాక్టర్‌ నరహరి, డాక్టర్‌ బొంగు రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: Staff Nurse Counselling : స్టాఫ్ న‌ర్స్‌ల కౌన్సెలింగ్ నిలిపివేతపై అభ్య‌ర్థుల ఆందోళ‌న‌..!

ఒకేచోట 25 ఏళ్లుగా పాతుకుపోయి.. 

ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో నాలుగేళ్లు దాటిన 188 మంది డాక్టర్ల జాబితాను ప్రకటించినప్పటికీ వారు దరఖాస్తు చేసుకోవాలా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదని అంటున్నారు. నాలుగేళ్లు దాటిన వారంతా దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన కూడా పెట్టలేదు. పైగా మొత్తం ఉద్యోగుల్లో 40 శాతం మందిని బదిలీ చేస్తామని అన్నారు. కానీ ఇది ఆప్షనా? లేక తప్పనిసరా? అన్న దానిపైనా స్పష్టత లేదు.

ఆప్షన్‌ అయితే లాంగ్‌ స్టాండింగ్‌ వారు ఎందుకు దరఖాస్తు చేసుకుంటారు? నగరా­లు, పట్టణాల్లో ఉండే వారెందుకు గ్రామాలకు వెళ్తారు? వాళ్లు వెళ్లకుంటే గ్రామాల్లో నుంచి పట్టణాలకు రావాలనుకునే వారికి అవకాశం ఎలా దక్కుతుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్య విభాగంలో ఉన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లలో నాలుగేళ్లు నిండిన వారి జాబితాను తయారు చేశారు.

ఆ ప్రకారం 188 మంది డాక్టర్లు బదిలీకి అర్హత కలిగి ఉన్నారు. విచిత్రమేంటంటే వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఏకంగా 25 ఏళ్ల నుంచీ బదిలీ కాకుండా ఒకేచోట పనిచేస్తుండటం గమనార్హం. అదే జిల్లాకు చెందిన ఓ డాక్టర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో డాక్టర్‌ 20 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. 10 ఏళ్లు.. అంతకుమించి ఒకేచోట పనిచేస్తున్నవారు 69 మంది ఉండటం విస్మయం కలిగిస్తోంది. వీరిని ఇప్పుడైనా కదిలించే పరిస్థితి ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. 

చదవండి: TGSRTC Fake Notification: అది ఫేక్‌ నోటిఫికేషన్‌: సజ్జనార్‌

పైరవీలు షురూ... 

మరోవైపు, తమకు ఇష్టమైన చోటకు బదిలీ చేయించుకునేందుకు పలువురు వైద్య సిబ్బంది పైరవీలు మొదలుపెట్టారు. ఈ విషయంలో కొందరు అధికారులు పనిచేసి పెడతామంటూ అడ్వాన్సులు పుచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు బదిలీ కావాలంటే రూ. 5 లక్షలు, తమకు ఇష్టమైన చోటకు కావాలంటే ఆరేడు లక్షలు, ఉన్నచోటనే కదలకుండా ఉండాలంటే అంతకుమించి డిమాండ్‌ చేస్తున్నారన్న వాదనలున్నాయి. ఇక బోధనాసుపత్రుల డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల నుంచి రూ. 10 లక్షలకు పైనే వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

సూపరింటెండెంట్‌ కేడర్‌లోనైతే ఇంకా ఎక్కువే డిమాండ్‌ ఉందని చెబుతున్నారు, కొందరు ప్రజా ప్రతినిధులు కూడా డాక్టర్ల వెనుక ఉండి పైరవీలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

Published date : 12 Jul 2024 01:34PM

Photo Stories