Skip to main content

AP ICET 2023 Notification: ఏపీ ఐసెట్‌-2023 నోటిఫికేషన్‌ వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు..

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌.. సంక్షిప్తంగా ఎంబీఏ! మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌.. సంక్షిప్తంగా ఎంసీఏ! ఇవి డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్లో.. ఎక్కువ మంది ఆసక్తి చూపే కోర్సులు! కారణం.. ఈ కోర్సులతో మేనేజ్‌మెంట్, ఐటీ రంగాల్లో కొలువు సొంతం చేసుకోవచ్చనే ధీమా! ఆంధ్రప్రదేశ్‌లో ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే.. ఏపీ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఏపీ ఐసెట్‌-2023 వివరాలు, పరీక్ష విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ..
AP ICET 2023 Notification
  • ఏపీ ఐసెట్‌-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
  • మే 24, 25 తేదీల్లో ఏపీ ఐసెట్‌ పరీక్ష
  • ఈ ర్యాంకుతో ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశం
  • మేనేజ్‌మెంట్, ఐటీ విభాగాల్లో కొలువులకు మార్గం

ఐసెట్‌గా సుపరిచితమైన ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌- 2023కు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, సీట్లు; ఐసెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు అందరికీ సీట్లు లభించే అవకాశముంది. కాని టాప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో సీటు సొంతం చేసుకోవాలంటే మాత్రం వేయి లోపు ర్యాంకుతోనే సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

AP ICET Mock Counselling

TS ICET Mock Counselling

అర్హతలు

  • ఎంబీఏ: 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • ఎంసీఏ: 50 శాతం మార్కులతో మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియెట్‌ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ గ్రూప్‌ సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. 
  • ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
  • ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

GAT-B & BET 2023 Notification: బయోటెక్నాలజీలో పీజీ చేస్తారా.. పూర్తి వివ‌రాలు ఇవే..

200 మార్కులు.. మూడు విభాగాలు

  • మొత్తం 200 మార్కులకు మూడు విభాగాల్లో ఏపీ ఐసెట్‌ ఉంటుంది. అభ్యర్థుల్లోని లాంగ్వేజ్, మ్యాథమెటికల్‌ స్కిల్స్, కాంప్రహెన్షన్‌ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ఆయా విభాగాలు, ప్రశ్నలు ఉంటాయి.
  • సెక్షన్‌ఏలో అనలిటికల్‌ ఎబిలిటీ(డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌) 75ప్రశ్నలు-75 మార్కులకు; సెక్షన్‌ బీలో కమ్యూనికేషన్‌ ఎబిలిటీ(వొకాబ్యులరీ, ఫంక్షనల్‌ గ్రామర్, బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెర్మినాలజీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌) 70 ప్రశ్నలు-70 మార్కులకు; సెక్షన్‌ సీలో మ్యాథమెటికల్‌ ఎబిలిటీ(అర్థమెటికల్‌ ఎబిలిటీ, అల్జీబ్రా అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ, స్టాటిస్టికల్‌ ఎబిలిటీ) 55 ప్రశ్నలు-55 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
  • పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు.
  • పరీక్షను రెండు సెషన్లుగా నిర్వహిస్తారు. రెండు సెషన్లలో హాజరైన అభ్యర్థులు పొందిన మార్కులను నిర్దిష్ట విధానంలో నార్మలైజేషన్‌ ప్రక్రియ ద్వారా గణించి ర్యాంకులు కేటాయిస్తారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 19, 2023
  • రూ.వేయి ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 26 వరకు; రూ.2000 ఆలస్య రుసుముతో: మే 3 వరకు; రూ.3000 ఆలస్య రుసుముతో మే 10 వరకు; రూ.5,000 ఆలస్య రుసుముతో మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: మే 16, 17 తేదీల్లో
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: మే 20 నుంచి
  • ఏపీ ఐసెట్‌ పరీక్ష తేదీ: మే 24, 25, 2023
  • వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in

AP PGECET 2023 Notification: ఏపీ పీజీఈసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

విజయానికి అడుగులు ఇలా

ఐసెట్‌ పరీక్షలో విజయం సాధించాలంటే..అభ్యర్థులు విశ్లేషణాత్మక దృక్పథం, అన్వయ నైపుణ్యాలను అలవర్చుకోవాలి. పరీక్ష తీరు, సిలబస్‌ స్థాయి­పై అవగాహన పొందాక విభాగాల వారీగా ప్రిపరేషన్‌తోపాటు ప్రతి రోజూ ప్రాక్టీస్‌ కొనసాగించాలి. 

డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

ఈ విభాగంలో ఉండే డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ అంశాల్లో రాణించాలంటే.. అభ్యర్థులు తమ విశ్లేషణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. 
ప్రశ్నలు డేటా ఇచ్చి దాని ఆధారంగా సమస్య సాధించేవిగా, స్టేట్‌మెంట్‌ ఆధారితంగా ఉంటాయి. బేసిక్‌ అర్థమెటిక్‌ అంశాల్లో పట్టు సాధించడం ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. గణితంపై ప్రాథమిక అవగాహన అవసరం. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ విభాగంలో రీజనింగ్‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు కోడింగ్, డీ-కోడింగ్, బ్లడ్‌ రిలేషన్, సిరీస్, సిలాజిజమ్, సీటింగ్‌ ఎరేంజ్‌మెంట్‌ వంటి అంశాల్లో పట్టు సాధించాలి. 

కమ్యూనికేషన్‌ ఎబిలిటీ 

  • కొంత సులభమైన విభాగంగా సెక్షన్‌-బి(కమ్యూనికేషన్‌ ఎబిలిటీ)ని పేర్కొనొచ్చు. కాసింత ప్రాక్టీస్, అనలిటికల్‌ ఎబిలిటీ, కంపేరిటివ్‌ అప్రోచ్‌ ఉంటే మొత్తం 70 ప్రశ్నల్లో 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించొచ్చు. 
  • వొకాబ్యులరీ కోసం బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వొకాబ్యులరీ పెంచుకునేందుకు ప్రతి రోజు కనీసం 20 కొత్త పదాలు నేర్చుకోవడంతోపాటు వాటిని వినియోగించే విధానాన్ని ప్రాక్టీస్‌ చేయాలి. 
  • ఫంక్షనల్‌ గ్రామర్‌లో మంచి మార్కుల కోసం సినానిమ్స్, యాంటానిమ్స్, కొశ్చన్‌ ట్యాగ్స్, డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. ఇందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్‌ గ్రామర్‌ బుక్స్‌ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. 
  • బిజినెస్‌ అండ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీలో వ్యాపార-వాణిజ్య అంశాలు, తాజా పరిణామాలు, కంప్యూటర్‌ బేసిక్స్‌పై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో రాణించాలంటే.. బిజినెస్‌ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు-వాటి క్యాప్షన్లు వంటివి తెలుసుకోవాలి. ఇక కంప్యూటర్‌ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్‌ ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ టూల్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌కు సంబంధించిన ముఖ్య భాగాలు, వాటి పనితీరుకు సంబంధించి ప్రాథమిక నైపుణ్యం కలిసొస్తుంది. 
  • రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో.. ప్యాసేజ్‌ల ఆధారంగా అడిగే 20 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ముందుగా అభ్యర్థులు అందులోని కీలక పదాలను, కీలక సారాంశాన్ని గ్రహించే నేర్పు అవసరం. ఇందుకోసం దినపత్రికల వ్యాసాలు, ఇంగ్లిష్‌ స్టోరీ బుక్స్‌ చదవడం మేలు చేస్తుంది. 

మ్యాథమెటికల్‌ ఎబిలిటీ

సెక్షన్‌-సిగా పేర్కొన్న మ్యాథమెటికల్‌ ఎబిలిటీలో రాణించేందుకు అర్థమెటిక్, జామెట్రికల్, స్టాటిస్టికల్‌ అంశాలపై పట్టు సాధించాలి. తొలుత మ్యాథమెటిక్స్‌లోని ప్రాథమిక సూత్రాలపై అవగాహన పొందాలి. ఇందుకోసం హైస్కూల్‌ స్థాయి మ్యాథమెటిక్స్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రశ్నల శైలి కొంత క్లిష్టంగా ఉండే స్టాటిస్టికల్‌ ఎబిలిటీ కోసం ఇంటర్మీడియెట్‌ స్థాయి పుస్తకాలను ప్రిపేరవ్వాలి. ముఖ్యంగా ప్రాబబిలిటీ, ఇనీక్వాలిటీస్‌ అంశాల కోసం ఇంటర్‌ పుస్తకాలను చదవాలి. అర్థమెటిక్‌ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు శాతాలు, లాభ నష్టాలు, నిష్పత్తులు, మెన్సురేషన్, పని-కాలం, పని-సమయం వంటి వాటిని అధ్యయనం చేయాలి. అల్జీబ్రా అండ్‌ జామెట్రికల్‌ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రీ,సెట్స్‌ అండ్‌ రిలేషన్స్, లీనియర్‌ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్‌లో నైపుణ్యం సాధించాలి. 

ప్రాక్టీస్‌.. సక్సెస్‌కు సాధనం

ఐసెట్‌లో మంచి ర్యాంకు సొంతం చేసుకోవడానికి ప్రధాన సాధనం..ప్రాక్టీస్‌. ఆయా అంశాల రీడింగ్‌కే పరిమితం కాకుండా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. నిరంతరం మాక్‌ టెస్ట్‌లకు హాజరవుతూ.. తమ సామర్థ్యాలను విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా క్యాట్, మ్యాట్, ఐసెట్‌ గత ప్రశ్న పత్రాలను సాధనం చేయాలి. ఫలితంగా పరీక్షలో ప్రశ్నల శైలిపై అవగాహన ఏర్పడుతుంది. 

Last Date

Photo Stories