Skip to main content

GAT-B & BET 2023 Notification: బయోటెక్నాలజీలో పీజీ చేస్తారా.. పూర్తి వివ‌రాలు ఇవే..

బయోటెక్నాలజీ, అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-బయోటెక్నాలజీ(జీఏటీ-బీ), అలాగే బయోటెక్నాలజీలో డాక్టోరల్‌ కోర్సుల్లో అడ్మిషన్స్‌ కోసం నిర్వహించే బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌(బీఈటీ)-2023 ప్రకటన విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)..జీఏటీబీ/బీఈటీ-2023 నిర్వహించనుంది. జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షల ద్వారా దేశవ్యాప్తంగా 63 ఇన్‌స్టిట్యూట్‌లు, విశ్వవిద్యాలయాల్లో బయోటెక్నాలజీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్, డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. ఈ పరీక్షల వివరాలు..
GAT-B & BET 2023 Notification
  • జీఏటీ-బీ/బీఈటీ ద్వారా బయోటెక్నాలజీ పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశం 
  • దేశవ్యాప్తంగా 63 యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్‌
  • ఎంపికైన విద్యార్థులకు డీబీటీ స్టయిపెండ్, ఫెలోషిప్‌లు

జీఏటీ-బీ కోర్సులు

జీఏటీ-బీలో అర్హత ద్వారా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ(డీబీటీ) గుర్తింపున్న పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌.. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ అండ్‌ అలైడ్‌ ఏరియాస్‌; ఎంటెక్‌ బయోటెక్నాలజీ అండ్‌ అలైడ్‌ ఏరియాస్‌; ఎమ్మెస్సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ, ఎంవీఎస్సీ యానిమల్‌ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

అర్హత

జీఏటీ-బీ 2023కు హాజరయ్యే విద్యార్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చు. అయితే సంబంధిత విద్యాసంస్థ జారీచేసిన అండర్‌ టేకింగ్‌/అటెస్టేషన్‌ ఫామ్‌ను సమర్పించాలి.

స్టయిఫండ్‌

  • జీఏటీ-బీ 2023లో అర్హత సాధించి, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి ప్రతినెల స్టయిఫండ్‌ అందుతుంది.
  • ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలు పొందినవారికి నెలకు రూ.5000 స్టయిఫండ్‌ లభిస్తుంది. 
  • ఎమ్మెస్సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ అభ్యర్థులకు నెలకు రూ.7500 స్టయిఫండ్‌ చెలిస్తారు. 
  • ఎంటెక్‌/ఎంవీఎస్‌సీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు నెలకు రూ.12000 స్టయిఫండ్‌ పొందొచ్చు.
  • కోర్సు మొదటి ఏడాదిలో విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగానే రెండో ఏడాది స్టయిఫండ్‌ కొనసాగిస్తారు.

చదవండి: AP PGECET 2023 Notification: ఏపీ పీజీఈసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

పరీక్ష విధానం

  • జీఏటీ-బీ ప్రశ్నపత్రం బహుౖâñ చ్ఛిక విధానంలో ఉంటుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో మొత్తం 240 మార్కులకు జరుగుతుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది. సెక్షన్‌-ఎలో 60 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 60 మార్కులుంటాయి. ఈ ప్రశ్నలన్నీ కూడా 12 తరగతి(10+2) స్థాయిలోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, బయాలజీల నుంచి ఉంటాయి.
  • సెక్షన్‌-బిలో 100 ప్రశ్నలుంటాయి. ఇందులో 60 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 180 మార్కులుంటాయి. పరీక్ష సమయం 3గంటలు.

బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌(బీఈటీ)

డాక్టోరల్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌ కోసం దేశవ్యాప్తంగా జరిగే అర్హత పరీక్ష ఇది. సీబీటీ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు కూడా ప్రకటన వెలువడింది. అభ్యర్థులు బీఈటీలో చూపిన ప్రతిభ ఆధారంగా కేటగిరి-1, కేటగిరి-2 అనే రెండు రకాల మెరిట్‌ లిస్ట్‌లను తయారు చేస్తారు. రిజర్వేషన్‌ నిబంధనలకు అనుగుణంగా తుది జాబితాను రూపొందిస్తారు. కేటగిరి-1లో స్థానం సంపాదించినవారు దేశంలో గుర్తింపు పొందిన ఏ విద్యాసంస్థలోనైనా పీహెచ్‌డీలో ప్రవేశం పొంది ఫెలోషిప్‌ అందుకోవచ్చు. కేటగిరీ-2 మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులు.. డీబీటీ స్పాన్సర్‌ చేసే ప్రాజెక్టుల్లో చేరి ఫెలోషిప్‌ పొందొచ్చు. వీరికి ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల ఎంపిక విధానాన్ని అనుసరించి పీహెచ్‌డీలో చేరే అవకాశం లభిస్తుంది. 

అర్హత

బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌(బీఈటీ) రాసే అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ (బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌) అండ్‌ మాస్టర్స్‌ (ఎంఎస్సీ/ ఎంటెక్‌/ ఎంవీఎస్‌సీ/ ఎం.ఫార్మ్‌/ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ/ఎంటెక్‌), బయోమెడికల్, బయోఇన్ఫర్‌మేటిక్స్, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటేషన్, బయాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, జువాలజీ లేదా బయాలజీ/లైఫ్‌-సైన్సెస్‌కు చెందిన అనుబంధ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనల్‌ సెమిస్టర్‌కు హాజరవుతున్న వారు, ఫైనల్‌ సెమిస్టర్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

చదవండి: AP EDCET 2023 Notification: ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌)-2023 నోటిఫికేషన్‌ను విడుదల..

వయసు

జనరల్‌ అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ మహిళలకు 5 ఏళ్ల వయోసడలింపు లభిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు(నాన్‌-క్రీమి లేయర్‌)3 ఏళ్ల సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం

  • ఈ ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లుంటాయి. సెక్షన్‌-ఎలో 50 ప్రశ్నలు, ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 150 మార్కులుంటాయి. దీంట్లో జనరల్‌సైన్స్, మ్యాథమేటిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ అనలిటికల్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ జనరల్‌ బయోటెక్నాలజీ ఉంటాయి.
  • సెక్షన్‌-బిలో సిలబస్‌ ప్రకారం-బయోటెక్నాలజీకి సంబంధించిన 150 ప్రశ్నలుంటాయి. వాటిలో 50 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. 
  • ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2023
  • దరఖాస్తు సవరణ తేదీలు: 03.04.2023 నుంచి 04.04.2023
  • జీఏటీ-బీ పరీక్ష తేదీ: 23.04.2023 ఉదయం 9-12 గంటల వరకు
  • బీఈటీ పరీక్ష తేదీ: 23.04.2023 మధ్యాహ్నం 3-6 గంటల వరకు
  • పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్‌/సికింద్రాబాద్‌.
  • వెబ్‌సైట్‌: http://dbt.nta.ac.in
Last Date

Photo Stories