Skip to main content

NEET 2023 Counselling: మెడికల్‌ కౌన్సెలింగ్‌కు సిద్ధమా... స్టేట్‌ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్!

నీట్‌-యూజీ.. ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఇటీవల ఈ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 85 వేలకు మందికిపైగా అర్హత సాధించారు. వీరందరికీ ఇప్పుడు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి.. ఎంత ర్యాంకు వరకు సీటు వచ్చే అవకాశం ఉంది.. ఆల్‌ ఇండియా కోటా అంటే ఏంటి? ఇలా అనేక సందేహాలు!! ఈ నేపథ్యంలో.. నీట్‌-యూజీ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉపయోగపడేలా కౌన్సెలింగ్‌ తీరుతెన్నుల వివరాలు..
NEET 2023 Counselling
  • త్వరలో ఎంబీబీఎస్, బీడీఎస్‌కు నీట్‌ యూజీ-2023 కౌన్సెలింగ్‌
  • డీజీహెచ్‌ఎస్‌ ద్వారా ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌
  • హెల్త్‌ యూనివర్సిటీల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌
     
  • 42,836: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి నీట్‌ యూ­జీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య.
  • 42,684: తెలంగాణ రాష్ట్రంలో నీట్‌ యూజీలో అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య. 
  • ఇప్పుడు ఈ విద్యార్థుల దృష్టి అంతా తదుపరి దశలో నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియపైనే.

కన్వీనర్‌ కోటా

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది నుంచి కొత్తగా అందుబాటులోకి రానున్న ఎంబీబీఎస్‌ కళాశాలలను దృష్టిలో పెట్టుకుంటే.. ఆల్‌ ఇండియా స్థాయిలో లక్షన్నర వరకు ర్యాంకు వచ్చిన వారికి కూడా కన్వీనర్‌ కోటాలో సీటు లభించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే విధంగా జాతీయ స్థాయిలో దాదాపు 8 లక్షల ర్యాంకు వరకు ఆల్‌ ఇండియా కోటాలో సీటు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీనికి కారణం.. ఈ ఏడాది జాతీయ స్థాయిలోనూ మెడికల్‌ సీట్లు పెరగడమే. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ తాజా గణాంకాల ప్రకారం-జాతీయ స్థాయిలో 695 మెడికల్‌ కళాశాలలు/ఇన్‌స్టిట్యూట్స్‌/డీమ్డ్‌ యూనివర్సిటీల్లో 1,06,333 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్‌ తేదీల ఖరారు నాటికి మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. 

చ‌ద‌వండి: Best Branches for EAMCET Counselling: బీటెక్‌లో బ్రాంచ్, కాలేజ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

ఏఐక్యూ, స్టేట్‌ కోటా

నీట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా రెండు రకాల విధానాలు అమలవుతున్నాయి. ఆల్‌ ఇండియా కోటా(ఏఐక్యూ) పేరుతో జాతీయ స్థాయిలో, స్టేట్‌ కోటా పేరుతో.. ఆయా రాష్ట్రాల్లోని హెల్త్‌ యూనివర్సిటీలు లేదా సంబంధిత అధికార వర్గాలు కౌన్సెలింగ్‌ జరుపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టేట్‌ కోటా కౌన్సెలింగ్‌ను తెలంగాణలో కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు నిర్వహించనున్నాయి.

ఆల్‌ ఇండియా కోటా

జాతీయ స్థాయిలోని మెడికల్‌ కళాశాలలను నేషనల్‌ పూల్‌లోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆల్‌ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం- జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్‌ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ జరుపుతారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్‌ఎస్‌కు చెందిన మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నిర్వహిస్తుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

స్టేట్‌ కోటా కౌన్సెలింగ్‌

జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తాయి. తెలంగాణలో కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. దీనిద్వారా ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్‌ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు),ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రైవేట్‌-బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లు అంటే ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా పోగా మిగిలే 50 శాతం సీట్లను కూడా హెల్త్‌ యూనివర్సిటీలే కౌన్సెలింగ్‌ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఇక మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్‌ యూనివర్సిటీలే చేపడతాయి. 

చ‌ద‌వండి: Medical Seats: సింగ‌రేణి కార్మికుల‌కు గుడ్ న్యూస్‌... వారి పిల్ల‌ల‌కు రిజ‌ర్వేష‌న్ల‌నిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు..!

ఏఐక్యు.. కౌన్సెలింగ్‌

  • విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నిర్వహించే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. 
  • ఇందుకోసం నోటిఫికేషన్‌  వెలువడిన తర్వాత ఎంసీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే క్యాండిడేట్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి.. ఆన్‌లైన్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌ చేసుకుని లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి.
  • అనంతరం ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. 
  • ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి.
  • వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ..ఆన్‌లైన్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్‌ అలాట్‌మెంట్‌ వివరాలను వెల్లడిస్తారు. 
  • తొలి రౌండ్‌లో సీట్‌ అలాట్‌మెంట్‌ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాలి. ఒకవేళ తొలి రౌండ్‌లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకపోతే.. ప్రీ ఎగ్జిట్‌ అవకాశం అందుబాటులో ఉంది. అలాంటి అభ్యర్థులు రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన విద్యార్థులు.. మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా అందుబాటులో ఉంది.

స్టేట్‌ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్‌

రాష్ట్రాల స్థాయిలో హెల్త్‌ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్‌ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు కూడా విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్‌ తొలి రౌండ్‌ ముగిసిన తర్వాత హెల్త్‌ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్‌ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్‌ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి, వారికి వచ్చిన ఆల్‌ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్‌ లిస్ట్‌లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్‌ ఫీజును చెల్లించి.. ఆన్‌లైన్‌లో జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. 

అంతా ఆన్‌లైన్‌లోనే

హెల్త్‌ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్‌సైట్‌లో లాగిన్‌ ఐడీ, పాస్ట్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవడం, ఆ తర్వాత నీట్‌ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్‌ వరకు అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్‌లైన్‌ ఛాయిస్‌ ఫిల్లింగ్‌ తప్పనిసరి.

చ‌ద‌వండి: Eight New Medical Colleges in Telangana : తెలంగాణ‌లో కొత్త‌గా 8 మెడికల్‌ కాలేజీలు మంజూరు.. దాదాపు 10000 వ‌ర‌కు సీట్లు..!

ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం

  • నీట్‌ ఉత్తీర్ణత సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధా­న్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఎంసీ-విశాఖపట్నం, జీఎంసీ-గుంటూరు, కాకినాడ మెడికల్‌ కాలేజ్, కర్నూలు మెడికల్‌ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి.
  • తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్‌ కళాశాలకు ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్‌ కళాశాల, కాకతీయ మెడికల్‌ కళాశాల, ఈఎస్‌ఐ మెడికల్‌ కళాశాలలు ఉంటున్నాయి. 

సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు

  • నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. 
  • నీట్‌ ఎంట్రన్స్‌ అడ్మిట్‌ కార్డ్, నీట్‌ ర్యాంక్‌ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు మార్క్‌ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్‌(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు ఎనిమిది తదితరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

చ‌ద‌వండి: Metamind Academy: నీట్‌ ఉచిత మెంటార్‌ షిప్‌ టెస్ట్‌

Published date : 06 Jul 2023 06:23PM

Photo Stories